పిండి కొద్దీ రొట్టె - ఎం బిందుమాధవి

Pindi kodde rotte

"సుజాతా మన ఫ్లాట్స్ లో ముందు వైపు ఉండే రజని వాళ్ళు..పిల్లాడిని రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నారు. వాడు ఇంచక్కా ఇంగ్లిష్ లో దంచి మాట్లాడతాడు. మన వాడిని కూడా అలా చదివిస్తే బావుంటుంది కదా" అంది అత్తగారు జయలక్ష్మి కోడలితో! "ఆ పిల్లాడి ఫీజు చాలా ఎక్కువ అత్తయ్యా. వాళ్ళతో మనకేం పోలిక." "ఆయనది పెద్ద ఉద్యోగం. సంపాదనా ఎక్కువే. ఒక్కడే కొడుకు. వాళ్ళు చేసినవన్నీ మనం చెయ్యాలంటే కుదరదు. "పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంటుంది". నాదేమో ఊరికి దూరంగా ఉండే స్కూల్లో చిన్న టీచర్ ఉద్యోగం. మీ అబ్బాయిది కూడా చాలా పెద్ద ఉద్యోగమేమీ కాదు." "మాకొచ్చే సంపాదనలో ఈ సిటీ లో ఆరుగురం బతకటం కష్టం. అంటే మీ అందరిని పోషించటం కష్టం అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. కానీ వాస్తవం ఆలోచించాలి కదా!" అన్నది. "ఇప్పుడు వాడు చదివేది కూడా..పేరుకి ప్రభుత్వ పాఠశాల లాంటిదే కానీ..మంచి విలువలతో కూడిన చదువు నేర్పుతారు. పెద్ద క్లాసులకొచ్చేసరికి భాష మీద మంచి పట్టూ వస్తుంది. ఇతర సబ్జక్ట్స్ నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది. అవసరం అనుకుంటే మన సందు చివర ఉండే వివేకా నంద కోచింగ్ సెంటర్ కి ఇంగ్లిష్ లో స్పెషల్ కోచింగ్ కి పంపచ్చు. ముందు ముందు మంచి కాలేజిలో ఎడ్మిషన్ కూడా సంపాదించగలడు" అన్నది. "అవునులే నా మనవడి చదువు గురించి ఏదో ఆశ పడ్డాను" అన్నది..పూజ గదిలోకి వెళుతూ! @@@@ "అమ్మా ఈ సారి పుట్టిన రోజుకి బ్రాండెడ్ షర్ట్ 'లూయీ ఫిలిప్' కానీ 'పీటర్ ఇంగ్లండ్' కానీ కొనవా? మా నిఖిల్..మొన్న వేసుకొచ్చాడు. కలర్ చాలా బావుంది" అన్నాడు అనిరుధ్ తల్లితో. "అలాగే నాన్నా..కానీ ఇప్పుడే కాదు. నీకు యాన్యుయల్ ఎగ్జామ్స్ లో 90% కంటే ఎక్కువ వస్తే అప్పుడు కొంటాను. అప్పుడు నాన్నకి చేతికి డబ్బు వచ్చేది ఉందిట." అన్నది అప్పటికి కొడుకు కోరికని అటకెక్కిస్తూ! "వదినా మా మరిది పెళ్ళి కుదిరింది. వచ్చే నెల పదిహేనో తారీకు. మీరందరూ తప్పక రావాలి. ఆయన అన్నయ్యకి ఫోన్ చేసి ఆహ్వానించి కార్డ్స్ వచ్చాక పంపిస్తారు" అని ఆడపడుచు సువర్ణ ఫోన్ చేసింది. "అత్తయ్యా వచ్చే నెల మీకు ప్రయాణం ఉంది" అన్నది. "ఎక్కడికీ" అన్న అత్తగారితో "ఇందాక సువర్ణ ఫోన్ చేసింది. తన మరిది పెళ్ళి కుదిరిందిట. నాకు స్కూల్లో హాఫ్ ఇయర్ పరీక్షలు ఉన్నాయి..రావటం కుదరదు. మీ అబ్బాయికి సెలవు దొరుకుతుందో లేదో తెలియదు. టికెట్ కొని మిమ్మల్ని బస్సెక్కిస్తాము. వాళ్ళు వచ్చి దింపుకుంటారు" అన్నది. "అవునులే అమ్మా..అందరం వెళ్ళాలంటే ఈ కాలంలో మాటలా? వేల రూపాయలతో వ్యవహారం. పెళ్ళి కొడుకు చేతిలో ఏదో ఒకటి పెట్టాలి. పిల్ల దగ్గరకి వెళుతున్నాం. దానికీ, అల్లుడికీ, పిల్లలకీ ఏమైనా తీసుకెళ్ళాలి. మధ్య తరగతి సర్దుబాట్లు తప్పవు కదా" అన్నది జయలక్ష్మి. "ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా.. సిటీల్లో కాపారాలు అంటే మాటలా? 'ఏటి ఈత లంక మేత లాగా' .. ఒక పక్క ఫ్లాట్ వాయిదాలు కట్టుకోవటం. ఇంకా ఎన్ని చూసుకోవాలి. మధ్య మధ్యలో వచ్చే ఈ పై ఖర్చులొకటి!" అని నిట్టుర్చింది సుజాత. @@@@

"శనివారం స్కూల్ సగం పూటే. నేను వచ్చాక బజార్ వెళదాం అత్తయ్యా. సువర్ణ వాళ్ళింటి పెళ్ళికి సంబంధించిన వస్తువులు, బట్టలు కొనచ్చు" అన్నది. క్లుప్తంగా కావలసినవి కొన్నాక..ఒక చీర జయలక్ష్మికి చాలా నచ్చి "ఆ చీర పుచ్చుకుందాం సుజాతా... చాలా బావుంది. దసరా పండగ వస్తోంది. ఎప్పుడూ నీకంటూ ఏమి కొనుక్కోవు...పిచ్చిపిల్లా..ఎప్పుడూ ఇంట్లో వాళ్ళ గురించే ఆలోచిస్తావ్" అన్నది జయలక్ష్మి కోడలితో.. అభిమానంగా. "ఈ సంవత్సరం మిమ్మల్ని కేదార్నాధ్ యాత్ర కి పంపాలనుకుంటున్నారు మీ అబ్బాయి. ఆ ఏటికాఏడు మీకూ ఓపిక తగ్గుతోంది. ముందు ముందు ఇలాంటి ప్రయాణాలు చెయ్యలేరు. నాదేముంది...ఉన్న చీరలతో నడిపించేస్తాను. వచ్చే ఏడు చూద్దాం లెండి. ఈ సారి పండక్కి మొన్న మా అమ్మ పెట్టిన చీర కట్టుకుంటాలెండి. " అన్నది

సుజాత అత్త గారి పట్ల బాధ్యతతో. షాపు లోంచి బయటికొచ్చి, ఆటో పిలిచింది. "బస్సులో వెళదాం" అన్న అత్తగారితో "ఈ టైం లో బస్సులు రష్ గా ఉంటాయి అత్తయ్యా. మీరు వేళ్ళాడుకుంటూ ప్రయాణం చెయ్యలేరు. అదీ కాక చేతిలో సామాను కూడా ఉంది. త్వరగా ఇంటికి చేరి మళ్ళీ వంట పని చూసుకోవాలి కదా" అన్నది సుజాత. "అన్నీ కావాలంటే ఎలా వస్తాయి అత్తయ్యా.."పిండి కొద్దీ రొట్టె"... మన మధ్య తరగతి జీవులకి. అయినా మనమేమీ నాలిక మీద వాత పెట్టుకుని బతకట్లేదు కదా! ఉన్నంతలో అనవసరపు ఖర్చులు మానుకుని..అవసరమైనవి ఘనంగా చేసుకుంటున్నాము." "పిల్లలకి కూడా ఆ విచక్షణ నేర్పితే..ఫ్రెండ్స్ తో చేరి దుబారా ఖర్చులు చెయ్యకుండా జాగ్రత్తగా బతుకుతారు" అన్నది. భర్తని గొంతెమ్మ కోరికలు కోరి..విసిగించే తన చెల్లెలి కోడలు లాగా కాకుండా...తన కోడలి ఆలోచనా విధానం, ముందు చూపు, ఖర్చు పెట్టటంలో వివరం చూసి జయలక్ష్మి సంతోషించింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు