ఎలాంటి వరుడు కావాలంటే... - మద్దూరి నరసింహమూర్తి

Elaanti varudu kavalante-

ఆదివారం భోజనాలైన తరువాత - మోహనరావు, భార్య మోహినీ, కూతురు మోహన ముందర గదిలో కూర్చొని --

"తల్లీ, నీకు పెళ్లీడు వచ్చింది కాబట్టి, నేను అమ్మ మాకు తెలిసిన బంధువులు స్నేహితులు దగ్గర నీకోసం వరుడిని వెతకాలి అనుకుంటున్నాము. నీకేమేనా కోరికలు - అంటే, ఇలాటివాడు కావాలి అలాటివాడు కావాలి - ఉంటే చెప్తే, ఆ వెతుకులాటలో మాకు సహాయం చేసినదానివి అవుతావు. ఇంకొక మాట, నీకిప్పటికే ఎవరేనా నచ్చినవాడుంటే నిర్భయంగా చెప్పు. అతని సంగతి ఆరా తీసి మనం ముగ్గురూ చర్చించుకొని ఒక నిర్ణయానికి రావొచ్చు. నీ అభిప్రాయం చెప్పు తల్లీ"

"నాన్న నీకు పూర్తి స్వతంత్రం ఇచ్చేరు కదా అని వెర్రి వేషాలు వెయ్యకుండా గొంతెమ్మ కోర్కెలు కోరకుండా అలోచించి మాట్లాడు"

"మీరిద్దరూ ఏదో ఒక రోజు నన్ను ఇలా అడుగుతారని ఊహించేను. నేను ఇంతవరకూ ఎవరినీ నచ్చుకోలేదు ప్రేమించలేదు. ఏ వృత్తిలో ఉన్న మనిషిని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నాను"

"ఇంజనీర్ గురించి నీ ఆలోచన ఏమిటి? సర్కారువారి బండి, మంచి జీతం, హోదా మరియు సమాజంలో గౌరవం ఉంటుంది కదా"

"మనం నడిచే రోడ్లు, మనం ఉండే భవంతులు, మనకి కావలసిన వంతెనలు, ప్రాజెక్టులు నాలుగు కాలాల పాటు నిలబడేటట్టు నిర్మించే కనీస తెలివితేటలు లేని వాడి గురించి అసలు ఆలోచించడమే శుద్ధ దండగ. అందుకే, ఆ మనిషిని నా లిస్ట్ లోంచి ముందుగా తీసేసేను"

"అదేమిటే, ఇంజనీర్ ని కూరలో కరివేపాకులా అలా తీసిపారేస్తున్నావు"

"మరేమిటమ్మా, మన ఇంటి నుంచి మార్కెట్ కి దారి రెండు కిలోమీటర్ల కంటే కూడా తక్కువ. ఎన్ని గోతులున్నాయో నీకు తెలీదా? కడుపుతో ఉండే ఆడది ఇలాటి రోడ్డు మీద ప్రయాణం చేస్తే, నెలలు నిండకుండానే డెలివరీ అవడమో అబార్షన్ అవడమో గ్యారంటీ. స్కూటర్ కానీ మోటార్ సైకిల్ మీద కానీ వెళ్తే, నడుం నొప్పి రావడం వచ్చిన నడుం నొప్పి తగ్గకపోవడం ఖాయం. కార్లో వెళ్తే, నావలో వెళ్లినట్టు ఇటూ అటూ ఊగుతూ వెళ్ళాలి. ఆ ఊపులో బండి నడిపే అతని కాలు పొరపాటున బ్రేక్ మీంచి లేచిపోయి ఆక్సిలేటర్ మీద పడితే ఇక అంతే సంగతులు"

-2-

"పోనీ డాక్టర్ ఎలా ఉంటాడు తల్లీ"

"చిన్న చితక డాక్టర్ అయితే, ఆదాయం గొర్రె తోకే. ‘స్పెషలిస్ట్’ గా ఉన్న డాక్టర్ అయితే, ఆదాయం హోదా సమాజంలో గౌరవం ఎంత బాగున్నా, సూర్యోదయంతో ఇల్లు వదిలి తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తాడో అనే భర్తతో ఏమి సుఖం ఉంటుంది. ఎమర్జెన్సీ వస్తే, ఓ టైం అంటూ ఉండదు ఓ సెలవు రోజు అని కూడా ఉండదు. పైగా, ఎప్పుడేనా పొరపాటున చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయి పేషెంట్ చనిపోతే, ఆ పేషెంట్ బంధువులు చేత దెబ్బలు తిని అదే హాస్పిటల్ లో కట్లు కట్టించుకొని చావు తప్పి కన్ను లొట్టబోయి ఇంటికి వచ్చే భర్తని ఊహించుకుందుకే కష్టంగా ఉంది. అందుకే, డాక్టర్ ని కూడా నా ఆలోచనల్లోంచి తీసేసేను"

"పోనీ మీ మామయ్యలా లాయర్ ని చేసుకుంటావా"

"అమ్మా, ‘లాయర్’ ని ‘లాయర్’ అనడం కన్నా ‘లయ్యర్’ అనడం ఉచితం. తన కేసు గెలవడానికి తానూ కావలసినన్ని అబద్ధాలాడడమే కాక సాక్షుల చేత కూడా అబద్ధాలు ఆడిస్తాడు. అలాటి వాడు భార్య దగ్గర జీవితంలో ఎన్ని అబద్ధాలాడతాడో నువ్వే చెప్పమ్మా. పైగా, దావా వేయడానికి తన దగ్గరకి వచ్చిన క్లయింట్ ని, పాపం అని కూడా చూడకుండా, ఆ కేసు అయేసరికి ‘పాపర్’ గా మార్చిన లాయర్లని ఎంతమందిని మనం చూడడం లేదు. నేనిలా అన్నానని మామయ్య దగ్గర అనకు, పాపం బాధపడతాడు"

"నీ ఆలోచనలు మరీ విడ్డూరమే తల్లే, నీతో నేను మాట్లాడలేను. నువ్వు మీ నాన్నా మాట్లాడుకోండి. నేను ప్రేక్షకురాలిగా వింటూ ఉంటాను"

"తల్లీ, మీ బాబాయి లాగ ఛార్టర్డ్ అకౌంటెంట్ ని చేసుకుంటావా"

"నీకు తెలియంది ఏముంది నాన్నా. ఛార్టర్డ్ అకౌంటెంట్ తన క్లయింట్ కి లాభం చేయడం కోసం, ఆ విధంగా తాను పుష్కలంగా ఆదాయం సమకూర్చుకోవడం కోసం, దొంగ లెక్కలు వ్రాసో వ్రాయించో సర్కారుకి బాగా నష్టం సమకూర్చడం తప్ప, చేసే మంచి పని అంటూ ఒక్కటేనా ఉందా. అలాటివాడు భార్య దగ్గర మాత్రం నిజాయితీగా ఉంటాడని ఏమిటి గ్యారంటీ. నేనిలా అన్నానని బాబాయి దగ్గర అనకు నాన్నా, పాపం బాధపడతాడు"

"పోనీ నాలాగ గవర్నమెంట్ ఉద్యోగస్తుడయితే ఎలా ఉంటుందంటావు తల్లీ"

-3-

"నీలాంటి వాడు భూతద్దంతో వెదికినా దొరకడం కష్టం నాన్నా. నువ్వెలా నెట్టుకొస్తున్నావో నాకు తెలియదు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో అవినీతిపరులు నిండిపోయి ఉన్నారు నాన్నా. అలా అవినీతిగా ఉద్యోగం చేసే మనిషి ఎప్పుడు కటకటాల ఊచలు లెక్కపెడతాడో అన్న భయం అతనికి ఉన్నా మానినా, అతని కుటుంబానికి తప్పదు కదా నాన్నా"

"అందరికీ ఇన్ని వంకలు పెడితే నీకు వరుడు ఎలా దొరుకుతాడే"

"అమ్మా – ‘ఏమీ మాటలాడును’ -- అన్న నీ మాట నువ్వు తప్పుతున్నావు"

"మీ అమ్మ ఆత్రుత కూడా గమనించాలి తల్లీ నువ్వు. పోనీ I T ఉద్యోగస్తుడేలా ఉంటాడంటావు"

"ఆదాయం బాగా ఉంటుంది కానీ, పనికోసం రోజుకున్న 24 గంటలూ చాలక పూర్తిగా స్ట్రెస్ తో ఆరోగ్యం త్వరగా పాడైపోవడమే కాక, గట్టిగా తుమ్మితే ఆ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో అన్న భయం ఒకటి నెత్తి మీద కత్తి లాగా ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది నాన్నా. పేరుకే వారాంతపు రెండు సెలవలు. కానీ, వర్క్ లోడ్ ని బట్టి ఆ రెండు రోజులు కూడా లాప్టాప్ మాత్రమే అతని ఒళ్ళో ఉండేది"

"ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా తేల్చి చెప్పవే. అర్ధం పర్ధం లేని నీ ఆలోచనలతో టెన్షన్ వచ్చి నాకు తల తిరిగిపోతుంది"

"చూడు నాన్నా నావి అర్ధం పర్ధం ఆలోచనలంటోంది అమ్మ"

"మీ అమ్మ మాట అలా ఉన్నీ. ఇంతకీ నువ్వు ఫైనల్ గా ఎలాటి వరుడైతే బాగుంటందుకుంటున్నావో క్లియర్ గా చెప్పు తల్లీ"

"బ్యాంకు ఉద్యోగస్తుడైతే ఓకే నాన్నా. అలాగని బ్యాంకు ఆఫీసర్ కానీ క్లర్క్ కానీ వద్దు. బ్యాంకు క్యాషియర్ అయితే ముద్దు" అని చిరునవ్వుతో సిగ్గుపడుతున్న కూతురి తలమీద చేయి వేసి ఆనందంతో నిమిరి -- "పోనీ ఎవరినో ఒకరినేనా ఒప్పుకున్నావు అంతే చాలు"

"అదేమిటండీ మీరు మరీను. అదన్న ప్రతీ మాటకి తందానా అంటారు. చక్కగా బ్యాంకు ఆఫీసర్ నే చేసుకోవొచ్చుగా"

-4-

“నీకు తెలియదమ్మా.

బ్యాంకు ఆఫీసర్ అయితే -- ఉదయం తొమ్మిదికి, తినీ తినక ఆదరా బాదరా ఇంటి నుంచి పరిగెత్తి బ్యాంకుకి చేరుకున్నవాడు, పూర్తిగా అలిసి సొలసి నీరసంగా ఈసురోమని ఇంటికి వచ్చేది రాత్రి ఏ తొమ్మిదికో పదికో. అలాటివాడికి నాతో కాపరం చేయడానికి ఇక ఓపిక ఎక్కడ ఉంటుందంటావు. అలాటివాడిని కట్టుకొని నేనేమి సుఖపడాలి. ఏ మోసంలోనూ ఇరుక్కోకుండా, సేఫ్ గా రిటైర్ అవుతాడన్న గ్యారంటీ లేని జీవితమమ్మా అతనిది. పైగా, ప్రతీ మూడేళ్ళకీ బదిలీలతో సతమతం అవాలి. ఒక్కొక్కసారి మన భాష కాని మన ప్రాంతం కాని జాగాకి బదిలీ అవొచ్చు.

ఇంక బ్యాంకు క్లర్క్ అంటావా, బ్యాంకులో జరిగే మోసాలలో ఎక్కువగా చేసేది ఇరుక్కొనేది ఆ క్లర్క్ లే. అటువంటివాటిలో ఒకసారి ఇరుక్కుంటే, బయట పడేది ఎప్పుడో ఆ బ్రహ్మకే తెలియాలి. అంతవరకూ సరిగ్గా జీతం ఉండదు. పైగా, సమాజంలో తిరస్కరణ అగౌరవం.

సిన్సియర్ గా పనిచేసే క్లర్క్ అయితే, రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి చేరుకుంటాడో అన్నది అతని చేత పని చేయించుకుంటున్న పైఅధికారి మీద ఆధారపడి ఉంటుంది. సిన్సియర్ గా పనిచేస్తాడు కాబట్టి, ఆఫీసర్ ప్రమోషన్ అంటూ వస్తే ఏ మారుమూలకు బదిలీ అవుతుందో తెలియదు.

అందుకే, ప్రమోషన్ ఆశ లేని బ్యాంకు క్యాషియర్ అయితే - పదోగంటకి బ్యాంకు చేరుకొని సాయంత్రం అయిదు అయేసరికి బయలుదేరి, దూరాన్ని బట్టి కనీసం మరో గంట రెండు గంటల్లో ఇంటికి చేరుకుంటాడు. ఆదివారాలు బ్యాంకుకు వెళ్లే పనే లేదు. కాబట్టి అలాటివాడితో సంసారం హాయిగా సాగిపోతుంది అని నా నమ్మకం. కావలిస్తే ఒకరిద్దరు బ్యాంకు క్యాషియర్ల జీవితం మీరు పరిశీలించండి, నాతో ఏకీభవిస్తారు"

"ఏమో అమ్మా నీ ఇష్టం మీ నాన్న ఇష్టం. నేను చెప్పేది నువ్వు ఎప్పుడు విన్నావు కదా ఈరోజు వినడానికి"

"చూడు నాన్నా, అమ్మ ఎలా అంటుందో"

"అమ్మ కదమ్మా, నువ్వంటే ఉన్న అభిమానంతో అలాగే ఆలోచిస్తుంది. నువ్వన్నట్టు, నేను నాకు తెలిసినవారు కలిసి ఓ నలుగురి బ్యాంకు క్యాషియర్ల జీవితం పరిశీలించి, కొంత విచారించి చెప్తాను. అంతవరకూ మన సమావేశం వాయిదా వేస్తున్నాను"

*****

---మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు, Mob: 9164543253, e-mail: [email protected]

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు