స్కెట్స్ పై బామ్మ - తాతా కామేశ్వరి

Scats pai Baamma

ఆనాడు నీరజ్ పన్నెండవ పుట్టినరోజు పండగ. ప్రొద్దుటే లేచి స్నానం చేసి, గుడికి వెళ్ళి వచ్చి బామ్మకి, అమ్మానాన్నకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. బామ్మ, నీరజ్ ని గుండెలకి హత్తుకొని, ముద్దు పెట్టుకుని వెయ్యి రూపాయలు ఇచ్చింది. నీరజ్ కి ఆనాడు చాలా గిఫ్ట్స్ వచ్చాయి, కానీ పెద్దనాన్న తను చాలా కాలంగా కోరుతున్న రోలర్ స్కేట్స్ ఒక అందమైన గిఫ్ట్ బాగ్ లో పెట్టి యివ్వడంతో ఎగిరి గంతు వేసి, పెద్దనాన్నని గట్టిగా ముద్దు పెట్టుకుని థాంక్స్ చెప్పాడు.

నీరజ్ కి కొద్ది రోజులుగా వాళ్ళ అపార్ట్మెంట్స్ లోనే కొత్తగా పెట్టిన రోలర్ స్కేట్స్ శిక్షణ కేంద్రంలో చేరాలని ఉంది, కానీ తల్లి జానకి ససేమిరా వద్దు అని పట్టు పట్టింది. ఆమెకు పిల్లాడు కింద పడి దెబ్బలు తగిలించుకుంటాడని ఒకటే భయం, ఎవరు ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు. కానీ పెద్దనాన్న రోలర్ స్కేట్స్ బహుమానంగా ఇవ్వడంతో, ఇంట్లో అందరూ, ముఖ్యంగా బామ్మ వనజమ్మ ప్రోద్బలంతో జానకి ఒప్పుకోక తప్పలేదు.

నీరజ్ మరునాడే తండ్రి రామారావుగారితోపాటు కోచ్ రఘు సార్ ని కలిసి శిక్షణ కేంద్రంలో చేరాడు. రోజూ పొద్దునే ఐదున్నర నుండి గంట సేపు క్లాస్, ఫీజు నెలకి వెయ్యి రూపాయలు. మొదటి నెల ఫీజు బామ్మ పుట్టినరోజు నాడు యిచ్చిన వెయ్యితో కట్టి ఆమె ఆశీస్సులు తీసుకున్నాడు నీరజ్.

నీరజ్ తొలిరోజు క్లాస్ కి ఎవరు లేపకుండానే నాలుగున్నరకల్లా అలారం పెట్టుకొని లేచి రెడీ అయ్యాడు. ఆయనతో పాటు బామ్మ కూడా రెడీ అవడం చూసి నీరజ్ అడిగాడు “ఏం బామ్మ, నువ్వు ఎక్కడికి తయారు అవుతున్నావు?”

వనజమ్మ ఉత్సాహంగా “నేనూ నీతో పాటు వచ్చి నువ్వు స్కేటింగ్ చేస్తూ ఉంటే చూస్తానురా బాబు” అన్నది.

ఇప్పటి వరకు ఆమె పొద్దునే పూజ, భగవద్గీత చదవడం మాని నీరజ్ వెంట ఇతర ఏ క్లాస్ కి తోడు వెళ్లలేదు. నీరజ్ కి ఆమె ప్రవర్తన కొంచం వింతగా తోచింనా “సరే” అన్నాడు.

బామ్మ, మనవడు క్లాస్ కి ఉత్సాహంగా బయలుదేరారు. ఆక్కడ కోచ్ రఘు సార్ కి బామ్మని పరిచయం చేశాడు నీరజ్.

వనజమ్మ మనవడితోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కేటింగ్ క్లాస్ కి వెళ్ళి, అక్కడ స్కేటింగ్ చేస్తున్న పిల్లలందరినీ చూసి మురిసిపోయేది.

ఓనాడు క్లాస్ కి వెళ్లుతూ నీరజ్ అడిగాడు, “బామ్మా! రోజూ నీ పూజ కూడా వెనక్కి పెట్టి నాతో క్లాస్ కి ఎందుకు వస్తావూ? అమ్మలాగే నీకు నేను కింద పడి దెబ్బలు తగులుచుకుంటానని భయమా?”

దానికి వనజమ్మ కొద్ది ఇబ్బందిగా “అదేం కాదురా బాబు.. నాకూ రోలర్ స్కేట్స్ షూస్ తొడుక్కుని మీ పిల్లలంతా స్కేటింగ్ చేస్తూ వుంటే చూడడం చాలా ఇష్టంరా” అంది.

“ఓ అదా! అవును బామ్మా, నీకు స్కేటింగ్ ఇష్టమన్నావు, అయితే నువ్వు నేర్చుకుంటావా?”

దానికి వనజమ్మ మెల్లిగా సిగ్గుపడుతూ ‘అవును’ అన్నట్టు తల ఊపి ఇలా అంది, “కానీ నేను నేర్చుకుంటా అంటే అంతా నవ్వుతారురా బాబూ, వద్దులే. చిన్నప్పుడు కూడా మా అమ్మానాన్న ఏ పని చేసినా నీకేం వస్తుంది అంటూ సణిగేవారు. మా స్కూల్లో చాలా అమ్మాయిలు ఎంచక్కా సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వచ్చేవారు. నేనో? డొక్కు హవాయి చెప్పులు, లంగా-జాకెట్, రిబ్బన్ వేసి కట్టిన రెండు జడలు. ఇప్పటిలా కాదురా బాబు, నేను సైకిల్ తొక్కడం నేర్చుకుంటానని అంటే, ఒసే! కాళ్లు చేతులు విరిగాయి అంటే పెళ్లి కాకుండా పడి ఉంటావు అంటూ చీవాట్లు పెట్టేవారు”.

ఈ మాటలు విన్న నీరజ్ జాలిగా చూశాడు బామ్మ వైపు. వనజమ్మ ఒక్క క్షణం ఆగి, నీరజ్ వేపు చూసి మళ్ళీ అందుకుంది, “నీరజ్, నాకు అరవై అయిదు ఏళ్లు వచ్చాయి కానీ చూడు యిప్పటికీ ఫిట్ గా వున్నాను. రోజూ సాయంత్రం ఫ్రెండ్స్ తో అపార్ట్మెంట్ చుట్టూ నాలుగు కిలోమీటర్లు నడుస్తాను, ఇప్పటికీ పదిమందికి వండి వార్చగలను, కానీ నామాట ఎవరు వింటారు. ఇప్పుడు స్కేటింగ్ నేర్చుకుంటాను అంటే అంతా ఎగతాళి చేసి, ముసలావిడకి ఈ వయసులో కొత్త సరదాలు ఏమిటో అంటారు” అన్నది ఆమె బాధపడుతూ.

ఆమె మాటలు విన్న నీరజ్ ఎలాగయినా బామ్మ కోరిక తీర్చాలని నిర్ణయించుకొని, “బామ్మ, డోంట్ వర్రీ. నేను నాన్నతో మాట్లాడతాను, నువ్వు తప్పకుండా స్కేటింగ్ నేర్చుకుంటావు” అన్నాడు ఆమెకు ధైర్యం యిస్తూ.

మరురోజు ఆదివారం మధ్యాహ్నం అంతా సరదాగా కలిసి భోజనాలు చేస్తుఉండగా నీరజ్ తండ్రితో ధైర్యంగా “నాన్నా, మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. నన్ను చూసి బామ్మకు చాలా రోజులుగా స్కేటింగ్ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది, కానీ ఆమె ఆసంగతి ఎవరికి చేప్పలేదు. నిన్న నేను అడిగితే తన మనసులో దాచుకున్న విషయం చెప్పింది. అందుకు బామ్మను రోలర్స్ స్కేటింగ్ క్లాసులో జాయిన్ చేద్దాం అని ఉంది. సో... ఈ సంగతి మీ అందరికీ చెపుతున్నాను” అన్నాడు అందరివైపు చూస్తూ. నీరజ్ మాటలు విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు.

అది గమనించిన నీరజ్ “అంత ఆశ్చర్యపోయేదేముంది? బామ్మ ఫిట్ గా ఉంది, ఆమెకు నేర్చుకోవాలన్న పట్టుదల ఉంది, ఏదైనా నెర్చుకొవడానికి అంతకన్నా ఏమి కావాలి” అన్నాడు.

నీరజ్ మాటలు విన్న జానకి “అదేం కాదురా నీరజ్, ఈ వయసులో ఆవిడ కానీ స్కేటింగ్ చేస్తూ కింద పడితే చాలా ప్రాబ్లం, యెక్కడైనా ఫ్రాక్చర్ అవుతే బోన్స్ కూడా అత్తుకోవడం కష్టం. పెద్దావిడ వింత వింత పోకడలేవీ పోక ఇంటి పట్టున ఉండి భాగవతం, రామాయణంలాంటివి చదువుకుంటే బాగుంటుంది” అంది ఆమె విసుగ్గా.

“అది కాదు అమ్మా, నాకు నేర్పిస్తున్న కోచ్ చాలా మంచాయన. అక్కడే బామ్మ కుడా నేర్చుకుంటారు. ఆవిడకి శ్రధ్ధతో పాటు ఆత్మవిశ్వాసము, ధైర్యం కూడా వున్నాయి. ఇదేం వింత విషయం కాదే, ఎంతో మంది వృద్ధులు తమ చిన్నప్పుడు మనసులో వున్న తీరని కోరికలు వయసు మళ్ళేక తీర్చుకుంటున్నారు. నువ్వు ‘షూటర్ దాదిస్’ గురించి వినలేదా. హరియాణాకి చెందిన ప్రకాశి తోమార్- చంద్రో తోమార్ యిద్దరు తోటికోడళ్లు, వారి భర్తలను ఎదిరించి, అరవై ఐదేళ్ల వయసులో పట్టుదలగా పిస్టల్ షూటింగ్ నేర్చుకోడం మొదలు పెట్టీ చాలా అవార్డ్స్, మెడల్స్ మరియు ట్రోఫీస్ అందుకున్నరు. వాళ్ళ మీద ఈ మధ్య ఓ సినిమా ‘సాంఢ్ కి ఆంఖ్’ కూడా తీశారు. అందుకు పిచ్చి అమ్మా, మనం ఏ వ్యక్తి లోనయినా చూడవల్సింది వయసు కాదు వారిలో ఉన్న ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక. అవి బామ్మలో పుష్కలంగా వున్నాయి” అని నీరజ్ అందరి వైపు ఆశగా చూశాడు.

రామారావుగారు నీరజ్ వద్దకు వచ్చి, భుజం తట్టి “నా అమ్మ మనసులో గూడుకట్టుకున్న కోరిక నువ్వు తెలుసుకుని అది తీర్చడానికి చేస్తున్న ప్రయత్నం చూసి చాలా సంతోషంగా వుందిరా. మనం అంతా తప్పకుండా బామ్మ కోరిక తీరుద్దాం” అన్నారు సంతోషంగా.

బామ్మ, నీరజ్ తన ఆశ నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నం, తన మీద చూపిన ప్రేమ, విశ్వాసం చూసి ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు చిమ్మేయి.

నీరజ్ మాటలు విన్న జానకి “సరే నీరజ్, మరి నువ్వే బామ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు ఆమెను తీసుకొని వెళ్లి కోచ్ ని ఈ సంగతి అడుగు.”

“థాంక్యూ అమ్మా” అంటూ బామ్మను రెండు చేతులతో గట్టిగా బిగించి “బామ్మా, కంగ్రాట్స్, ఇప్పుడు హ్యాపీనా?” అన్నాడు.

అనుకున్నట్టే మర్నాడు బామ్మను కోచ్ వద్దకి తీసుకువెళ్ళి “సర్, మీకు తెలుసుగా మా బామ్మ, రోజు నాతో క్లాస్ కి వస్తుంది. షి ఈజ్ సిక్స్టీ ఫైవ్. ఈమెకు రోలర్ స్కేటింగ్ నేర్చుకోవాలని కోరిక” అన్నాడు బామ్మని చూపిస్తూ. నీరజ్ మాటలకి రఘు సార్, “ఎస్.. ఐ నో హర్. గ్రేట్ బామ్మగారు, మీరు తప్పకుండా నేర్చుకోవచ్చు. మీ కాన్ఫిడెన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో పూజలు, వ్రతాలు అనకుండా మీ పేషన్ ఫాలో అవుతున్నారు” అంటూ “నీరజ్, ఆమె సైజ్ స్కేటింగ్ షూస్, హెల్మెట్, నీ గార్డ్, ఎల్బో గార్డ్ కొనాలి” అంటూ వనజమ్మని చూసి “బామ్మగారూ, చీరలో మీరు స్కేటింగ్ చేయలేరు. సొ, టైట్ గా ఉండే బట్టలు, సల్వార్ కుర్తా కానీ, పేంట్స్ షర్ట్ కానీ వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది” అన్నాడు.

దానికి వనజమ్మ “అయ్యో అది చాలా కష్టం సర్! స్కేటింగ్ నేర్చుకుంటానంటేనే రాద్ధాంతం చేశారు. ఇంకా డ్రెస్సులు అంటే ఇంటిలో ఓ మహాభారత యుద్ధమే జరుగుతుంది. అది అయ్యే పని కాదండి. పదరా నీరజ్ పోదాం, ముసల్ది మూల కూర్చోవాలి కానీ ఇలాంటివి చేయాలనుకోకూడదు” అన్నది బాధగా నీరజ్ తో. బామ్మకి పాపం ప్రతి అడుగులోనూ అడ్డంకులే.

నీరజ్ బామ్మ చెయ్యి పట్టుకుని ఓదారుస్తూ “డోంట్ వర్రీ బామ్మా, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నేను అమ్మని ఒప్పించి సార్ చెప్పిన డ్రెస్సులు కొనిపిస్తాగా” అని కోచ్ తో “ఓకె సర్.. మీరు చెప్పినట్టే డ్రస్, షూస్ అన్నీ మా పేరెంట్స్ కి చెప్పి కొనిపించి మీ క్లాస్ కి తీసుకోవస్తాను” అన్నాడు కొత్త వుత్సాహంతో.

ఇంటికి రాగానే నీరజ్ అమ్మకి కోచ్ చెప్పిన విషయం చెప్పాడు. అది విన్న జానకి “మరేం, ఇది ఇంకో వేషమా? బాగుంది” అంటూ వనజమ్మతో సూటిగా “అత్తా, మీరు యిప్పటి వరకు చీర తప్ప ఇంకేమి కట్టి ఎరుగరు. యిప్పుడు ఈ డ్రెస్సులు వేసుకుని రోలర్ స్కేటింగ్ చేస్తారా లేక డబ్బు అనవసరంగా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది” అన్నది చిరాకుగా.

వనజమ్మ మెల్లగా “అమ్మా, మరి నా స్కేటింగ్ నేర్చుకునే కల నెరవేరాలంటే డ్రస్ వేసుకునితీరాలి, తప్పదు” అంది.

మరి యింక తప్పదు అన్నట్టు జానకి “సరే అత్తా, సాయంత్రం రెడీమేడ్ షాపుకి వెళదాం” అని, సాయంత్రం ఇంటి పక్కనే ఉన్న రెడీమేడ్ షాపు కి వెళ్లారు యిద్దరు. జానకి రెండు మంచి కమ్ఫర్టబల్ గా ఉన్న డ్రస్సులు సెలెక్ట్ చేసి వనజమ్మని ఒకసారి వేసుకొని సైజు చూడమంది. వనజమ్మ పాపం ట్రయల్ రూములోకి వెళ్ళి ఎంత సేపటికి బయటికి రాదు. జానకి ఆమె బయటకు రాకపోవడం చూసి “అత్తా.. యెమైందండీ? డ్రస్ సైజ్ సరిపోలేదా” అని బైయటనుండి అడిగింది.

వనజమ్మ మెల్లగా సల్వార్ కుర్తా పైన దుపట్టా సదురుకుంటూ, సిగ్గుపడుతూ బయటకు వచ్చి నిలబడి “జానకీ, నాకు ఈ డ్రస్ వేసుకుని యిబ్బందిగా ఉందమ్మా. అంతా చూసి ఎగతాళి చెస్తారేమో” అన్నది మోహమాటంగా.

ఆమెను చూసిన జానకి “ఎందుకు చేస్తారు ఎగతాళి. నిజంగా మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు డ్రస్ లో” అంటూ ఆవిడకు ధైర్యం చెప్పింది. కోడలు మాటలు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఆనాడు వనజమ్మ చీకటినే లేచి స్నానం, పూజ ముగించి డ్రస్ వేసుకిని, బేగ్ లో ముందు రోజు కొడుకు తెచ్చిన రోలర్ స్కేట్స్, ఆక్సెసరీస్, నీళ్ళ బాటిల్ ఒక బేగ్ లో చిన్న స్కూల్ పిల్లలా ఉత్సాహంగా సదురుకొని, బాల్కనీలో కూర్చుంది. ఆమె జీవన సంధ్యలో కొత్త ఆశల కాంతి నిండినట్టే, తూర్పున ఉదయభానుడు చీకటీ తెరని తన లేత ఎర్రటి కిరణాలతో తొలగిస్తున్నాడు. ఎదురుగా ఉన్న మామిడిచెట్టు పైన ఓ కోయిల దాని తియ్యతియ్యటి పలుకులతో ఒక కొత్త ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టు ఉంది. ఇవాళ ఆమె కల నెరవేరుతున్న రోజు... ఓ మరువలేని రోజు. “రెడీనా బామ్మా? పోదామా” అన్న నీరజ్ మాటలకి ఆమె తన కల నెరవేర్చుకోవడానికి బేగ్ తీసుకొని తొలి అడుగు వేసింది.

***

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు