ముక్కు పుడక - తటవర్తి భద్రిరాజు

Mukkupudaka

శివాలయం వెనుక ఉన్న మట్టిదారి వర్షాలు పడితే బురద బురద గా ఉంటుంది. కానీ అన్ని కాలలలో ఆ రోడ్ కి ఇరువైపులా ఉండే కొబ్బరి చెట్లు ఎప్పుడూ తలలు ఊపుతూ ఆ దారి లో వెళ్లే వారికి ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంటాయి. ఆ దారిలో కొంచం ముందుకు వెళ్ళగానే కుడివైపు ఉన్న స్థలం దొరబాబు ది. తాత ల నుండి వారసత్వం గా వచ్చిన ఆ స్థలం అమ్మేద్దామని చూస్తున్నా, ఆ స్థలం లో తన ముత్తాత సమాధి ఒక పక్కగా ఉండడం తో ఎవరూ ఆ స్థలం కొనడం లేదు. మరికొంచం ముందుకు వెళ్తే ఏదో ఊరు నుండి ఈ గ్రామానికి వలస వచ్చి కిరాణా వ్యాపారం ప్రారంభించిన సత్యనారాయణ రాజు ఇల్లు ఉంది. వ్యాపారం బాగా సాగుతుంటే, దానికన్నా ఇంకా బావుంటుంది అని ఈ మధ్యే మతం మారి చర్చి ఫాదర్ అవతారం ఎత్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇల్లు కూడా పాడగొట్టేద్దామని అనుకుంటున్నాడు. భక్తి తో ఒక చర్చి కట్టడం కోసం, దానికోసం ఇప్పటికీ చందాలు కూడా సేకరించాడు. ఇంకా ముందుకు వెళ్తే కుడి వైపు సుబ్బారావు మాస్టరి ఇల్లు ఉంది. ఆయన తాతల కాలం నుండి అందరూ టీచర్లే. సుబ్బారావు మాస్టర్ కి తండ్రి నుండి వచ్చిన ఇల్లు తో పాటు, ఆయన సంపాదించుకున్న కొన్ని పొలాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ వ్యవసాయం చేయలేదు. ఆ పొలాలని ఊళ్ళో ఉన్న కొంత మంది పేద వారికి తక్కువ కె కౌలు చేసుకోవడానికి ఇచ్చి ఆయన మనసు చాటుకున్నారు. కానీ వారిలో కొంత మంది కొన్ని భూములు ఆక్రమించుకుని వారి సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సుబ్బారావు మాష్టారు భూముల ఆక్రమణ విషయం తెలుసుకుని కూడా ఒక్క నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఊళ్ళో కొంతమంది ఆయన మంచితనం అంటే, మరికొంత మంది చేతకాని తనం అన్నారు. కానీ ఆయన అవేవి పట్టించుకోకుండా పిల్లలకి పాఠాలు చెప్తూనే ఉన్నారు. సుబ్బారావు మాస్టర్ కి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు కామాక్షి. చిన్న కూతురు వనజాక్షి. సుబ్బారావు మాస్టారు కి ఆడపిల్లలు అంటే ఇష్టం. ఆ ఇష్టానికి తగ్గట్టుగానే ఆ భగవంతుడు ఇద్దరూ ఆడపిల్లలను ఇచ్చాడు. చిన్నప్పటి నుండి సంస్కృతి సంప్రదాయాలు ను నేర్పించి పెద్ద చేశారు తల్లి చిన్నతనం లోనే దూరమయిన ఆ పిల్లల్ని . కాళ్ళకి పట్టీలు, చెవులకి చెంప స్వరాలు, ముక్కు కి ముక్కు పుడక ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనేవారు సుబ్బారావు మాష్టారు. తన తండ్రి ఇష్టాలను తమ ఇష్టాలుగా చేసుకుని పిల్లలు ఇద్దరూ పెరిగారు. పెద్ద అమ్మాయి కామాక్షి కి ఐతే ఆ ముక్కుపుడక అంటే ప్రాణం. ఎందుకో తెలియదు. బహుశా తన తండ్రి అంటే ఉన్న ఇష్టం వలన ఏమో! ఆయన ఇష్టాలను తన సొంతం చేసుకుంది. పిల్లలని ఇద్దరినీ అల్లారు ముద్దుగా పెంచిన సుబ్బారావు మాస్టారు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ మధ్యనే పాలకొల్లు పక్కన ఉండే రామేశ్వర అగ్రహారం నుండి ఒక సంబంధం వచ్చింది పెద్ద కూతురు కామాక్షి కి. అబ్బాయి షణ్ముఖ శర్మ. పెద్ద రచయత. ఎన్నో కథలు, పత్రికలలో ప్రచురించబడ్డాయి. స్త్రీల హక్కుల గురించి, వారి చదువు గురించి అద్భుతమైన కథల ను తన ఆలోచనల నుండి పుట్టించాడు. అబ్బాయి గురించి తండ్రి చెప్పగానే మీ ఇష్టం నాన్న అంది కామాక్షి. అబ్బాయిని చూడకుండానే. ఇంతటి అభ్యుదయ భావాలు కల వ్యక్తి భర్త గా వస్తున్నాడు అని తెలిసి మురిసిపోయింది. భార్య అంటే బానిస గా చూసే మగవాళ్లే ఎక్కువ గా ఈ రోజులలో తనకు అలాంటి భర్త దొరకడం తన అదృష్టం గా భావించింది. ****** ఇల్లంతా బంధువులు. ఎవరి హడావిడి లో వాళ్ళు ఉన్నారు. గదిలో ఒంటరిగా పెళ్లికూతురు గా ముస్తాబు అయ్యి న కామాక్షి అద్దం లో చూసుకుంటూ ఉంది. తన కళ్ళలో నుండి నీళ్లు తనకు తెలియకుండానే చెంపలను చేరుకున్నాయి. అవి ఆనంద భాష్పాలు కాదు. ఇష్టమైనవి దూరమవుతున్నప్పుడు మనసు పడే బాధ. ****** పెళ్లి లో అందరూ సందడిగా ఉన్నారు. ఒక్క కామాక్షి తప్ప. పెళ్లి పీటలపై కూర్చున్న తన కళ్ళ వెంబడి నీళ్లు వస్తూనే ఉన్నాయి. కామాక్షి ని చూసిన వారు ఎవరి బాష్యం వాళ్ళు చెప్పుకున్నారు. కొంత మంది బంధువులు ఆనంద భాష్పాలు అన్నారు. మరికొంత మంది తండ్రి ని వదిలి దూరంగా వెళ్లలేక బాధ అన్నారు. కానీ ఆ కన్నీటి వెనుక ఉన్న బాధ కామాక్షి కి మాత్రమే తెలుసు. ****** పెళ్లి అయ్యి అత్తవారింటి లో అడుగుపెట్టిన కామాక్షి కి పెద్ద కోడలు హోదా లో ఎన్నో బాధ్యతలు భుజాన పడ్డాయి. రోజులు అలా గడుస్తూనే ఉన్నాయి. భర్త లోని అభ్యుదయ భావాలు నిజ జీవితం లో కి తొంగి చూడకుండా నే అక్షరాలలో అలంకరించుకుంటున్నాయి. ****** ఓరోజు గదిలో ఒంటరిగా ఉన్న కామాక్షి తన పెట్టె లోనుండి ముక్క పుడక తీసి పెట్టుకుంది. అప్పుడే వచ్చిన షణ్ముఖ శర్మ " నీకు పెళ్లి చూపులలోనే చెప్పాను. నాకు ముక్కు పుడక ఇష్టం ఉండదు అని. దానిని తీసి అవతల పాడేయ్ " అని గట్టిగా అరిచి చెప్పాడు. కామాక్షి కి కూడా గట్టిగా అరచి చెప్పాలని అనిపించింది. నా ఇష్టం. నేను ముక్కుపుడక పెట్టుకుంటాను అని. కానీ చెప్పలేదు. చెప్పేదే అయితే అప్పుడు పెళ్లి చూపులనాడు తనతో మాట్లాడినప్పుడు "నాకు ముక్కు పుడక ఇష్టం ఉండదు పెట్టుకోకు" అని చెప్పినప్పుడే చెప్పి ఉండేది. పెళ్ళిలో అద్దం లో చూసికుని వేదన పడినప్పుడే చెప్పి ఉండేది. కామాక్షి కి మాటలు రాలేదు. పెళ్లి అయ్యాక భర్త ను ఏదోలా ఒప్పించ వచ్చు అని తనుకు తానే సర్ది చెప్పుకుని తాళి కట్టించుకుంది. మరోసారి మళ్ళీ ముక్కుపుడక పెట్టుకుంటే షణ్ముఖ శర్మ ప్రేమ గా చెప్పాడు కామాక్షి కి. ఆ ప్రేమ కు సాక్షి గా కామాక్షి చెంప ఎర్రగా కందిపోయింది. "నువ్వు మళ్ళీకానీ ఆ ముక్కు పుడక పెట్టుకుంటే నేను చచ్చి పోయినట్టే " అని షణ్ముఖ శర్మ అన్న మాటలు మరోసారి తాను ముక్కు పుడక పెట్టుకునే ధైర్యం చేయలేక పోయింది. మరోసారి ముక్కుపుడక మొ్నం గా తన పెట్టె లోకి వెళ్ళిపోయింది. స్త్రీ ల గురించి తన కలం తో అభ్యుదయ భావాలు వ్యక్త పరిచే భర్త నిజజీవితం లో తన మనసుని అర్ధం చేసుకోలేక పోవడం కామాక్షి కి ఎప్పటికీ అర్ధం కాని విషయం. ****** ఇల్లంతా బంధువులు తో హడావిడి గా ఉంది. తనగదిలో కామాక్షి ఒంటరిగా 60 ఏళ్ల వయసు లో అద్దం ముందర నుంచుని ముక్కు పుడక పెట్టుకుని అద్దం లోకి చూస్తూ ఉంది. తన కళ్ళ వెంట నీళ్లు చెంపల మీద మూద్ధడుతున్నాయి. అవి ఆనంద భాష్పాలు. ******* బయట షణ్ముఖ శర్మ అంతిమ యాత్ర కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు