చాల్లే (స్వగతం) - మద్దూరి నరసింహమూర్తి

Chaalle

ఎన్నో రకాల జీవరాసులలో పుట్టి గిట్టి చాలా ఏళ్లయింది – చాల్లే – ‘వెళ్ళు మానవ జన్మ ఎత్తు’ అని భగవంతుడు పంపిస్తే --

ఈ భూమి మీద పడిన నన్ను అమ్మ అక్కున చేర్చుకొని తన గుండెలకు హత్తుకుంది.

అప్పుడు నా నోట్లోకి చేరుతున్న ద్రవపదార్ధం అమృతంలా తోచి, ఆరునెలలు దాటినా ఇంకా అదే త్రాగాలని తాపత్రయపడుతూంటే -- చాల్లే – ‘ఇంకా ఎన్ని రోజులు ఇలా నన్ను పీకుతావు’ అంటూ సీసా ఒకటి నా నోటిలో పెట్టేరు. అందులోంచి వస్తున్న ద్రవ పదార్ధం మొదట్లో కాస్త బాగులేకపోయినా, తరువాత అలవాటైపోయింది.

అన్నప్రాసన అని, తొలుతగా తీయటి మెత్తటి రెండు చిన్న పలుకులు (తరువాత తెలిసింది అది పరమాన్నం అని) నోట్లో ముందుగా పెట్టిన అమ్మకి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక, సంతోషంగా కాళ్ళు చేతులు ఆడించి నా ఆనందం తెలియచేస్తూంటే, ఒక్కొక్కరూ వచ్చి రెండేసి పలుకులు నా నోట్లో పెట్టసాగేరు.

ఇంకా తినాలని ఉన్నా, తిన్నది -- చాల్లే -- ఈ రోజుకి అని, నన్ను మరి తిననివ్వలేదు ఎవ్వరూ - ఆఖరికి నా కన్నతల్లి కూడా.

ఆ తరువాత ఎప్పుడూ గుజ్జుగా కలిపిన చారన్నం ముద్దలూ, ఎప్పుడో పప్పునీళ్లతో రెండు ముద్దలూ తప్ప, ఇంట్లో అందరూ పరమాన్నం తింటున్నా నాకు ఎవరూ పెట్టలేదు. ఎవరో పాపం జాలిగా అయ్యో చిన్న పిల్లాడికి పరమాన్నం పెట్టలేదు అంటే -- చాల్లే – ‘వీడు పరమాన్నం తింటే అరగొద్దూ’ అన్న మా అమ్మ మీద కోపం వచ్చి చారుఅన్నం కూడా తినడం మానేసేను.

రెండోరోజు కూడా కోపంతో చారుఅన్నం తినడం మానేసేసరికి -- చాల్లే – ‘రెండు రోజులు అన్నం తినడం మానేస్తే కడుపుకి మంచిది’ అని పాలసీసా నోట్లో పెట్టింది మా అమ్మ. నాకు కోపం వచ్చి ఆ సీసాని నోట్లోంచి తోసేస్తే -- చాల్లే – వీడికి అజీర్తి చేసి ఆకలి ఉన్నట్టులేదు అని ఊరుకుంది మా అమ్మ.

ఇక పంతంకి పొతే ఆకలితో మాడాలి అని - చాల్లే -- ఈరోజుకి హఠం అని, మరో గంట తరువాత వచ్చిన అమ్మ పాలసీసా అందిస్తే ఆతృతగా నోట్లో పెట్టుకొని పాలు త్రాగేసేను.

-2-

ఇంట్లో ఏదో చిన్న చిన్న అల్లర్లతో ముద్దుగా పెరిగి, మూడో ఏడు దాటుతూ ఉండగానే ఈ అల్లర్లు -- చాల్లే – ఇక బడికి పంపించేయాలి అంటూ ఆటలబడిలో నన్ను చేర్పించేరు.

మరునాడు ఉదయం నిద్రలో హాయిగా కలలు కంటున్న నన్ను ఇక నిద్ర -- చాల్లే – ‘లే, ఉదయమే సమయానికి వచ్చే మోటార్ బండిలో ఆటలబడికి వెళ్ళాలి’ అని నన్ను బలవంతంగా నిద్రలోంచి లేపేసేరు.

ఆటలబడిలో మంచిగా ఆటలు ఆడుకుంటూ ఉంటే -- చాల్లే -- ఇక ఇంటికి పోవాలి అని నన్ను బలవంతంగా లేపి మోటార్ బండిలో ఇంటికి పంపేసేరు.

సాయంత్రాలు చీకటి పడినవరకూ ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటూ ఉంటే -- చాల్లే – ‘ఇంట్లోకి పద, ఆటలలో ఒంటి మీద పడిన మన్ను అంతా శుభ్రంగా పోయేవరకూ స్నానం చేయించాలి’ అని ఇంట్లోకి తీసుకొచ్చేసారు.

పోనీ కొంచెం సేపు నీళ్లతో ఆడుకొందామంటే -- చాల్లే -- ఎక్కువ నీళ్లలో ఆడితే జలుబు చేస్తుంది అని నీళ్లతో ఆట మానిపించేసారు.

రాత్రి భోజనం చేసి టీవీ ఎదురుగుండా కూర్చొని నవ్వుకుంటూ ఉంటే – చాల్లే -- చూసింది వెళ్లి పడుకో అని బలవంతాన పక్క మీద చేర్చేరు.

అలా త్వరగా పడుకోవడంతో కాబోలు అర్ధరాత్రి తెలివి వచ్చి కదలగానే అటు అమ్మ పక్కన ఉన్న నాన్న ఇటు వచ్చి 'పడుకో పడుకో' అని నా వీపు మీద తెగ బాదసాగేరు. ఆ బాదుడికి నొప్పితో త్వరలోనే నిద్ర వచ్చేసింది.

అలా బాదుడులు సగం నిద్రలతో కాస్త పెద్దవాడినైన తరువాత, బడికి కొందరు స్నేహితులు సైకిలు మీద రావడం చూసి నాకు కూడా సైకిలు కావాలని అడిగితే -- చాల్లే – ‘నడకే సరిగ్గా రాదు కానీ సైకిలట’ అని రెండు తగిలించేరు. అయినా, మరి కొంచెం పెద్దైన తరువాత సైకిలు కొన్నారులెండి.

కాలేజీలో చేరే ముందర సైన్స్ లో చేరతానంటే -- చాల్లే – ‘పదవ తరగతి పరీక్షలో నీకు వచ్చిన మార్కులకు సైన్స్ ఒకటే తక్కువ. వెళ్లి దొరికితే కామర్సు లో చేరు. అదీ దొరకకపోతే, నీలాంటి వాళ్లకు ఉండనే ఉంది బోడి ఆర్ట్స్, అందులో చేరు’ అన్నారు.

-3-

అదృష్టం బాగుండి కామర్సు లో చేరేను. బి. కామ్. ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పుడు, బి. కామ్. అయిపోతే ఛార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతాను అంటే -- చాల్లే – ‘అదొక్కటే తక్కువ ఏదో ఉద్యోగం చూసుకో’ అని తేల్చేసేరు.

అదృష్టం బాగుండి ఉద్యోగం వచ్చింది. ఆరోజు ఎంతో ఉత్సాహంగా ఆ సంగతి ఇంట్లో చెప్తే -- చాల్లే – ‘నీ మొఖం చూసి ఎవరూ ఆ ఉద్యోగం ఇవ్వలేదు, నీకు ఆ ఉద్యోగం రావడానికి నేను ఎందరి కాళ్ళు పట్టుకున్నానో నీకేమి తెలుసు’ అని ఈసడించేరు మా నాన్నగారు.

మరో రెండేళ్లకు పెళ్లైంది. కానీ అందమైన భార్య దొరకలేదు అని బాధ పడితే -- చాల్లే – ‘నీ మొఖానికి ఆ అమ్మాయేనా నీకు భార్యగా వచ్చింది సంతోషించు’ అన్నారు కావలసిన వారందరూ.

'మనకి స్వంత ఇల్లు అంటూ ఒకటి ఉంటే ఎలా ఉంటుందంటావు' అని భార్యని అడిగితే -- చాల్లే – “మిమ్మల్ని చూసే ‘ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగిసిందట’ అని సామెత వచ్చింది కాబోలు. ఉన్న అద్దె ఇంటికి అద్దె కట్టడానికి నెలా రెండు నెలలు బాకీలు పడుతున్నాము, ఇక స్వంత ఇల్లొకటి మన మొఖానికి. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు నాలాంటి వారి కోసమే” అంటూ ముక్కు చీదింది భార్యామణి.

ఏమాత్రం ప్రోత్సాహం మెప్పు లేకుండా మూడు దశాబ్దాల పైగా ఉద్యోగం చేస్తే -- చాల్లే -- ఇక ఇంట్లో కూర్చో అంటూ ప్రభుత్వం వారు పదవీవిరమణ పత్రం ఇచ్చి, ఇంటికి పంపేసేరు.

జీతం లేకపోయినా వచ్చే పెన్షన్ తో కలో గంజో త్రాగి జీవితం లాగించేద్దాం కుటుంబం అంతా అని అనుకొని పక్షం రోజులు కూడా కాలేదు -- చాల్లే -- అరకొర పెన్షన్ తో నీ కుటుంబానికి ఒక వ్యక్తి భారం తగ్గినా తగ్గినట్టే కదా, నాతో వచ్చేయి’ అని ప్రేమగా మృత్యుదేవత ముద్దుపెట్టుకుంది.

*****

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు