శునక రాజం - భానుశ్రీ తిరుమల

Sunaka raaajam

మహేంద్ర కి కుక్కలంటే చాలా భయం, బహుశా అతను ఐదు,ఆరు తరగతులు చదువుతున్నప్పుడు ముద్దుగా ఉన్న అతని కాలి పిక్కలని రెండు మూడు సార్లు వేరు వేరు కుక్కలు కొరికి వదిలిన చేదు జ్ఞాపకం తనని వెంటాడుతూ ఉండడం వల్లనేమో! అప్పటి నుండే కుక్కలంటే భయం,అయిష్టం మొదలైంది. అంతకు ముందు కుక్కపిల్లని పెంచుకోవాలని ముచ్చట ఉండేది, అప్పుడు తన తమ్ముడితో ,స్నేహితులతో కలిసి కుక్కలు ఎక్కడ పిల్లలు పెట్టినా వెళ్లి,కాపు కాసి,వాటి తల్లి అక్కడ లేనప్పుడు మరీ ఆ కూనల కాలి గోళ్లను లెక్కపెట్టి,అదృష్ట సంఖ్యలో ఉన్న గోళ్లు కల కూనను ఇంటికి తీసుకు వచ్చేవాడు. కానీ పాపం వాళ్లమ్మ గారు నానా తిట్లు తిట్టి, "నీతోనే నేను వేగలేక పోతున్నాను,మళ్లీ నీతో ఓ కుక్కపిల్ల, నోరు మూసుకు వెళ్లి దాన్ని వదలేసిరా , లేదా ఇంటికి రాకు "..అని బెదిరించేది. పాపం!ఉక్రోశం తన్నుకొచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి, మళ్లీ ఆ కూనని తీసుకెళ్లి,తల్లి ఉందోలేదో చూసి , లేకపోతే దాన్ని మిగతా కూనలతో వదిలి వచ్చేవాడు. ఈ ప్రహసనం చాలా సార్లే జరిగింది. వాళ్లమ్మకు కుక్కలంటె ఎందుకు అయిష్టంమంటే , పాపం! ఆమెకూ గతంలో వాటితో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. మహేంద్ర నాన్నగారికి కూడా కుక్కలంటే ఇష్టం ,అతనూ ఇంట్లో కుక్కలను,ఓ ముల్ల పందిని పెంచేవాడట. పైగా వాటితో ఆ రోజుల్లో ఫోటోలు దిగే వాడట. ఆ కుక్కలైతే ఇళ్లు పీకి పందిరేసేవి. పక్కబట్టలు పాడుచేయడం,కొరికి పారేయడం వంటివి. మహేంద్ర తల్లి వాటినన్నింటినీ భరిస్తూవచ్చేది. కానీ పోను పోనూ ఇంట్లో వాటి బెడద తగ్గింది. అందుకే మహేంద్ర ని కుక్కలను ఇంటికి తీసుకు వస్తే వారించేది. అటు పైన మహేంద్ర కూడా తాను ఇష్ట పడ్డ జాతే తన మీద పగ బట్టి రెండు మూడు సార్లు దాడి చేయడం , దాని ఫలితంగా బొడ్డు చుట్టూ గునపం పోట్లులాంటి ఇంజక్షన్లను పొడిపించుకోవడంవంటివి జరగడం వల్ల శునక జాతంటేనే అయిష్టత పెంచుకున్నాడు. వాటినెవరైనా పెంచుకున్నా తనకు నచ్చదు. ఎందుకో వాటి రూపం కూడా అతనికి నచ్చదు. ఈ కుక్కలకన్నా పిల్లులే అందంగా ఉంటాయని అంటూ ఉంటాడు. అతను వీధిలో నడుస్తూన్నప్పడు రెండు మూడు కుక్కలు ఎదరుపడినా అవి తనకోసమే పనిగట్టుకు వస్తున్నాయని భయపడుతూ ఉంటాడు. అతనితో ఆ భయం , అయిష్టం అలాగే చాలా కాలం ఉండి పోయాయి. కాల ప్రవాహాంలో కొట్టకుంటూ నగరానికి వచ్చి పడిన మహేంద్ర ఓ చిన్న ఉద్యోగంలో కుదురుకున్నాడు. అద్దె ఇళ్లు మారుతూవున్న నేపథ్యంలో మరో అద్దింటికి మారాడు. ఆ ఇంట్లో చేరిన మొదటి రోజే మెట్లమీద పడుకున్న ఓ కుక్క కనిపించింది. చూడడానికైతే పొట్టిగా ,బుజ్జిగా గోదుమ వర్ణంలో ఉంది. అయినా అదేదో అపశకునంగా భావించాడు మహేంద్ర. అయితే మహేంద్ర పదహేనేళ్ల కూతురు మౌనికకి కుక్కలంటే చాలా ఇష్టం. అందుచేత దాన్ని చేరదీసేది. బిస్కెట్లు,పెరుగన్నంవంటివి పెట్టడం చేసేది. తనకి ఇష్టం లేకపోయినప్పటికి ఏమీ అనేవాడు కాదు మహేంద్ర. కానీ ఆ కుక్కని క్రీగంట కనిపడుతూ ఉండేవాడు. దాన్ని అందరూ పొట్టీ అనిపిలిచే వారు. దాన్ని ఆ వీధిలో ఎవరు పెంచుకుంటున్నారో తెలియదు గానీ మహేంద్ర ఇంటి చుట్టు పక్కల ఉన్న వారందరూ దాన్ని ఆదరించే వారు. కొంతమందైతే ఆ ఎదురింట్లో ఉన్న యమ్.యల్. ఏ గారు పెంచుకున్న కుక్క అనేవారు. ఎవరి అరుగు మీద,మెట్లమీద పడుకున్నా, తన పరిధిలో ఎవరింటికి కొత్తవారు వచ్చినా ఒక్క ఉదుటున లేచి అరుస్తూ అక్కడికి చేరేది. మహేంద్ర కి ఆ శునకంలో నచ్చిన విషయం ఏమిటంటే, తను రాత్రి కొంచెం లేట్ గా వచ్చినా అరిచేది కాదు. కానీ కొత్తవాళ్లు ఎవరైనా వస్తే మాత్రం తన సహజ లక్షణం ప్రదర్శించేది.ఓ సారి పాల పాకెట్లు అమ్ముకునే వాళ్లు వచ్చి గేట్ ముందు నిల్చొని ఉంటే అరుస్తోంది. బహుశా ఎవరో వచ్చారని చెప్పేందుకేమో! మహేంద్ర కూతురు వచ్చి "ఏ పొట్టి ఆగు" అన్న వెంటనే అరుపులు ఆపేసింది. మౌనిక "హమ్మయ్య నా పరువు కాపాడవే"..అంటు మురిసి పోయింది. పొట్టి అని పిలిస్తే చాలు వెంటనే పిలిచిన వ్యక్తి వైపు చూసేది. ఆకలి వేస్తే పెరటి వైపు వచ్చి అలా నిలుచునేది. దానికోసమని కేటాయించిన స్థలంలో పెరుగన్నం పెడితే తిని పోయేది. తలుపులు బార్లా తెరిచుంచినా ద్వారం దాటి లోపలికి వచ్చేది కాదు. ఒకసారి మహేంద్ర భార్య ఎవరో తలుపు తట్టారని ముందు గదికి వెళ్తూ ఏమరుపాటున పెరడులో ద్వారానికి దగ్గరగా చికెన్ వదిలేసింది. వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా, తాను చికెన్ కడుగుతూ పెరడులో వదిలేసిన సంగతి గుర్తుకి వచ్చి గాబారాగా వెళ్లి చూస్తే , ఆశ్చర్యం! ద్వారానికి అటు పక్కన పొట్టి తనదైన ఆసన భంగిమలో కూర్చొని ఉంది కానీ చికెన్ ఊసుకే పోలేదు. మహేంద్ర శ్రీమతికి ఆ విషయం చాలా ఆశ్చర్యంగా ముచ్చటగా అనిపించింది. ఈ విషయం మహేంద్ర ఇంటికి వచ్చిన వెంటనే చెప్పింది. "ఔనా, అని మహేంద్ర ఆశ్చర్యపోయాడు. "ఇది చాలామంచి కుక్కలా ఉంది "అని కితాబిచ్చాడు. అటుపైన ఎప్పుడు సూపర్ మార్కెట్ కు వెళ్లినా పొట్టి కోసం బిస్కెట్లు కొని తీసుకు వచ్చేవాడు. కుక్కలను చూస్తేనే బెదిరిపోయే శాల్తీ... దాన్ని వీపుపై నిమరడం, తోక లాగడం,చిన్నగా గుద్దడం చేసే వాడు,అయినా అదెప్పుడు అసలు కోపంగా ప్రతిస్పందించేది కాదు. ఈ తంతు చూసిన ప్రతిసారి మహేంద్ర కూతురు ,"నాన్నా!మీరేనా" అంటూ ఆశ్చర్యం ప్రకటించేది. పైగా ఆఫీసు నుండి వచ్చిన వెంటనే పొట్టి ఈ రోజు వచ్చిందా ,ఏమైనా పెట్టారా అని అడిగేవాడు. వచ్చింది,తింది అంటే చాలా సంతోషించే వాడు. కొంత కాలానికి మహేంద్ర తన కూతురు కాలేజీ కి దగ్గరగా ఉంటుందని వేరే ప్రాంతానికి మారవలసి వచ్చింది. పాపం!మహేంద్ర వాళ్లకు పొట్టిని వదిలి వెళ్లడం అంటే ఏదో బాధగా ఉంది. ఆరోజు రానే వచ్చింది . ట్రాన్స్పపోర్ట్ వాళ్లు వచ్చి సామానులన్ని వానులో సర్థి కొత్త ఇంటికి తీసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. పొట్టి మెట్లమీద దిగులుగా పడుకున్నట్టుంది. తన కంటినుండి నీరు కారుతున్నది. మరోవైపు మహేంద్ర వాళ్ల పరిస్థితి అలాగే ఉంది. సామాన్లతో వాన్ కదిలింది. మహేంద్ర వాళ్లు తమ చుట్టు పక్కలున్న వాళ్లందరికి వీడ్కోలు చెప్పి బయలు దేరారు. పొట్టి కోసమని చూసారు . అది అక్కడ కనిపించలేదు. అయ్యో,ఎక్కడికెళ్లిందో అనుకున్నారు . మహేంద్ర వాళ్లు ఆటోలో కొత్త ఇంటికి చేరారు,సామాన్లతో ఉన్న వాన్ ఇంకా అక్కడికి చేరలేదు. ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు, అప్పుడే మలుపు తిరుగుతూ కనిపించిన వాన్. ఒక్కసారిగా మౌనిక "నాన్నా పొట్టి "అని అరిచింది. ఆశ్చర్యం !పొట్టి వాన్ ని వెంబడిస్తూ వస్తోంది. మహేంద్ర ఆనందానికైతే అవధులు లేవు, " అమ్మా!మౌనికా మనం పొట్టికోసం ఈ రోజే ఓ కెన్నల్ కొనాలి, అంటూ పొట్టికి ఎదురుగా వెళ్లి స్వాగతం పలికాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు