అగస్త్యుని దక్షిణాపథ యాత్ర - కందుల నాగేశ్వరరావు

Agastuni dakshinapathan yatra

అగస్త్యుని దక్షిణాపథ యాత్ర

ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడైన నారదమహర్షి భూలోకంలో అన్ని తీర్థాలను దర్శిస్తూ నర్మదానదీ ప్రాంతానికి వచ్చాడు. నర్మదానదిలో స్నానంచేసి, శరీరమంతా భస్మాన్ని, మెడలో రుద్రాక్షమాలలు ధరించి ఓంకారంలో వెలసిన పరమేశ్వరుణ్ణి సేవించాడు. అంతలో వింధ్యగిరి జంగమరూపంలో అక్కడకు వచ్చి తన ఇంటికి అతిథిగా వచ్చిన నారదుడికి శిరస్సు వంచి నమస్కారం చేసింది. ఆయనకు తేనె, పళ్ళు, పువ్వులు మొదలైనవాటితో అర్ఘ్యం సమర్పించింది. చేతులు జోడించి ఇలా విన్నవించింది.

“స్వామీ! ఎంతో వైశాల్యంగల ఈ భూమండలంలో మీరు చూడని పర్వతం లేదు. అయితే అష్టదిగ్గజాలకూ దిక్కై, ఆదివరాహానికి తోడై, ఆదిశేషుడికి అండగా ఉండి ఈ భూప్రపంచాన్ని భరించగల పర్వతం నేనుతప్ప మరొక్కటి లేదు. ఇప్పుడు నాతో పోటీపడగలది ఒక్క మేరుపర్వతం మాత్రమే. అక్కడ దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు మొదలైన వారందరూ ఉంటారు. ఇప్పటికి కొన్ని రోజుల నుండి మా మధ్య పోటీ పెరుగుతూ ఉంది. మీరు మహాత్ములు. పక్షపాతం లేకుండా మా ఇద్దరిలో ఎవరు అధికులో చెప్పవలసింది”.

వింధ్యగిరి గర్వంతో అన్న మాటలకు నారదుడు మనస్సులో అసహ్యించుకున్నాడు. సహజంగా కలహప్రియుడైన నారదుడు కొంతసేపు మౌనం వహించి “పర్వతరాజా, నీశక్తి నీకు తెలుసు. మేరువు శక్తి మేరువుకు తెలుసు. మీ ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవడం ఎవ్వరి తరమూ కాదు. శ్రీశైలము, వెంకటాచలము, అహోబిలము, సాలగ్రామము మొదలైనవి నీకంటే మేరువు కంటే పవిత్రతలో గొప్పవి. మావంటి తీర్థయాత్రాభిలాషులైన మునులకు శక్తిసామర్థాలలో ఎవరు గొప్పో చెప్పడం కాని పని. నీకు శుభం కలుగుగాక” అని చెప్పి శలవు తీసుకున్నాడు.

నారదమహర్షి అన్న మాటలకు వింధ్యగిరి తనలోతాను ఇలా ఆలోచించసాగాడు. “లోకంలో తనకు ధీటైన శత్రువుండగా పౌరుషం ఉన్నవాడికి నిద్ర పడుతుందా? ఎన్ని వైభవాలున్నా మనస్సుకు సంతోషం కలిగిస్తాయా? మా కులంలో ఎవడో గర్వంతో విర్రవీగినందుకు దేవేంద్రుడు పర్వతాలన్నింటికీ రెక్కలు లేకుండా చేసాడు. లేకుంటే ఈ క్షణంలోనే ఎగిరి మేరువుపై కూర్చోనా? నా పాదాలతో నొక్కిపెట్టనా? ఎలాగైనా మేరువు గొప్పతనానికి భంగం కలిగించాలంటే సూర్యుడి రథం తిరగకుండా నా శిఖరాన్ని బ్రహ్మాండం పైపెంకు తాకేటట్టు పెంచుతాను”. ఇలా ఆలోచించిన వింధ్యగిరి పూర్వం శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని అణచినట్లు తన శిఖరాలను పెంచి, సూర్యుడి రథమార్గానికి అడ్డుగా నిలిచింది.

ప్రతిరోజులా ఉదయసంధ్యా సమయం కాగానే తూర్పున సూర్యసారథి అనూరుడు ఉదయించాడు. ఆ దక్షిణాయన వేళ సూర్యుని రథం మలయగిరిని దాటి, లంకాపట్టణం, కాంచీపురం, కృష్ణా సాగర సంగమం మీదుగా ప్రయాణిస్తూ వింధ్య పర్వత శిఖరాలు అడ్డు తగిలి ఆగిపోయింది. రెప్పపాటు సమయంలో నాలుగువేల నాలుగు వందల యోజనాల దూరం ప్రయాణం చేసే ఆ సూర్యుని రథం ఆగిపోయింది. ఇది పగలు, ఇది సంధ్య, ఇది రాత్రి అనే కాలవిభజన ఆగిపోయింది. యజ్ఞయాగాలు అంతరించాయి. ప్రపంచమంతటా ప్రళయం తాండవించింది. దేవతలు మొదలైనవారు దిక్కుతోచక బ్రహ్మదేవుని ఈ విపత్తు నుండి తప్పించుకొనే ఉపాయం చెప్పమని ప్రార్థించారు.

అప్పుడు బ్రహ్మదేవుడు వారితో “మహాముని అగస్త్యుడు అవిముక్త క్షేత్రమైన కాశీ నగరంలో విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఆ మహర్షి సామాన్యుడు కాదు. వాతాపి, ఇల్వలుడు అనే మాయావులైన రాక్షసులను వధించాడు. ఆ మహర్షి మీకు కలిగిన ఈ విపత్తును దాటించగలడు” అని ఉపాయం చెప్పాడు.

2

బ్రహ్మదేవుడు సెలవిచ్చిన విధంగా దేవతలు, మునులు కాశీనగరం వైపు బయలుదేరారు. “కాశీపురి ఎన్ని కల్పాలు గడిచినా చలనం ఎరగదు, దాని వన్నె మాయదు. కాశీలో ధర్మం నాలుగు పాదాల నడుస్తూ ఉంటుంది. మన అదృష్టం చేతనే వింధ్యగిరి ఆకాశాన్ని తాకి సూర్యుడి రథాన్ని ఆపింది. అందువలననే మనకు కాశీదర్శనం లభిస్తోంది. ఈ కాశీలో నివసించే కీటకాలు, పక్షులు కూడా మనకంటే గొప్పవి. త్రిలోకాలను పాలించే దేవేంద్రుడు కూడా కాశీనగరంలో నివసించే చండాలుడికైనా సాటిరాడు” అని వారు తమలో తాము తలపోస్తూ కాశీనగరం పొలిమేరలు చేరారు.

గంగానదియొక్క మణికర్ణికారేవులో స్నానం చేసి, విశ్వనాథుని దర్శించారు. ఉమాదేవిని బంగారు తామరలతో పూజించారు. భక్ష్యాలు సమర్పించి డుంఠి వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. కాలభైరవస్వామిని సంతృప్తి పరిచారు. కేశవస్వామి లోగిలి పరామర్శించారు. శ్రీవిశాలాక్షి కొలువు తిలకించారు. అక్కడ పెద్దలవల్ల జాడ తెలుసుకొని లోపాముద్రా మనోహరుడు, పరమశివభక్తుడూ అయిన అగస్త్య మునీంద్రుని ఆశ్రమం చేరారు. అక్కడ జాహ్నవీనది సమీపాన మారేడుచెట్ల తోపులో భస్మస్నానంతో పరిశుద్ధుడైన అగస్త్యమునిని దర్శించారు. ఆయన పంచాక్షరీ మంత్రం జపిస్తూ ధ్యానంలో మునిగి ఉన్నాడు.

కొద్దిసేపటికి యోగసమాధి నుండి లేచి, వారిని దీవించి, కుశలప్రశ్నలు వేసి, వచ్చిన కార్యం శలవియ్యమని అడిగాడు. అప్పుడు బృహస్పతి వింద్యగిరి లోకాలకు సృష్టించిన పెను ప్రమాదము, బ్రహ్మదేవుడు తమకిచ్చిన ఆదేశము వివరించాడు. బృహస్పతి చెప్పిన మాటలు విని అగస్త్యమహర్షి “నేను ఉపాయం ఆలోచించి, ఈ కార్యం చక్కపరచడానికి ప్రయత్నిస్తాను. మీరు మీ నివాసాలకు వెళ్ళండి. కాశీనాథుడు తప్పక మన కోరికలు తీరుస్తాడు” అని అన్నాడు. దేవతలు, మునులు శలవు తీసుకొని వారి నివాసాలకు వెళ్ళారు.

3

అగస్త్యుడు ఇలా ఆలోచిస్తున్నాడు. “కాశీవాసం కోరుకొనేవారికి ఎప్పుడూ ఏవో ఆటంకాలు కలుపుతూనే ఉంటాయి అని విన్నాను. నా విషయంలో ఇది సత్యమవుతోంది. విశ్వేశ్వరుడు ఎందుకనో నన్ను ఉపేక్షించాడు. సమస్త కైవల్య కల్యాణ భూమి అయిన ఈ కాశీక్షేత్రం నుండి వెళ్ళిపోవలసిన దుర్గతి నాకెందుకు కలుగుతోంది. నేను మతిలేక బృహస్పతి మాటలు విని ఇక్కడ నుండి వెడలడానికి అంగీకరించాను. విశ్వేశ్వరుడి దర్శనం లేకుండా ఎలా జీవించగలను! విశాలాక్షి చేతితో ప్రసాదించే బిక్షను ఎలా వదులుకోగలను!” అని విచారిస్తూ కాశీపురానికి నమస్కరించాడు.

లోపాముద్రాదేవితో కలిసి కాశీవియోగ బాధతో బరువెక్కిన హృదయంతో కాశీనగరం వదలి వింధ్యగిరి వైపు బయలుదేరాడు. వింధ్యారణ్యంలో నడుస్తూ “హరా! శంకరా! చంద్రశేఖరా! నీలకంఠా! కాశీనాథా” అంటూ మూర్చపోయాడు. కొద్ది సేపటికి తెలివి వచ్చి “పూర్వజన్మలో ఏ పాపం చేసానో! విశ్వనాథుడు నన్నిలా శిక్షించాడు” అని తనను తాను ఓదార్చుకున్నాడు.

అలా సతీ సమేతంగా వస్తున్న అగస్త్యమహర్షిని చూసిన వింధ్యగిరి తన శిఖరం వంచి ఆయనకు ప్రణామం చేసింది. తక్షణం సూర్యరథం ముందుకు కదిలింది. సమస్త ప్రపంచం ఎప్పటి మాదిరిగా అయ్యింది. కాల విభజన జరిగింది. కాశీనగరం విడిచి రావడం అనే అసంతృప్తితో పుట్టిన కోపంతో ఆయన మొహం ఉగ్రరూపం ధరించి ఉంది. అటువంటి అగస్త్యమహర్షినిని దగ్గరగా చూసిన వింధ్యగిరి కంపించింది. వెంటనే మానవరూపం ధరించి మహర్షికి ఫలపుష్పాలతో అతిథి సత్కారాలు చేసి చేతులు జోడించి “మహానుభావా! మీకు స్వాగతం. నేను చేయవలసిన కార్యం ఏమన్నా ఉంటే శలవీయండి. తప్పక నెరవేరుస్తాను” అని వినయంగా చెప్పింది.

ఆ మాటలకు ఎంతో సంతోషించిన మహర్షి “పర్వతరాజా! మేము దక్షిణాపథంలో తీర్థయాత్రలు చేయ తలపెట్టాము. వృద్ధాప్యము వల్ల మా శక్తి సన్నగిల్లింది. ఆకాశాన్ని అంటే నీ శిఖరాలు ఎక్కి దిగేటప్పుడు వచ్చే ఆయాసం భరించే శక్తి లేదు. కాబట్టి మేము తిరిగి వచ్చే వరకూ నీ శిఖరాలు ఇలా చిన్నవిగా చేసి నేలలో ఒదిగి ఉంచు. ఇది నాఆజ్ఞ. దీనిని పాలిస్తే నీకు శుభం కలుగుతుంది” అని చెప్పాడు.

ఆ మాటలకు వింధ్యాద్రి ఎదురు చెప్పలేదు. “మహాత్మా! మీ ఆజ్ఞ నాకు సమ్మతమే. మీరు తిరిగి వచ్చేవరకూ నేను నా శిఖరాలను ఇలాగే ఒదిగి ఉంచుతాను. మీరు దక్షిణాపథంలో మీ తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి రండి” అని వినయంగా తన అంగీకారం తెలిపాడు. మహర్షి అందుకు సంతోషించి చేయెత్తి పర్వతరాజును దీవించాడు. వింధ్యపర్వత శ్రేణిని దాటి దక్షిణ దిశలో ప్రయాణం సాగించాడు. వింధ్యపర్వతం అగస్త్యమహర్షికి ఇచ్చిన మాట ప్రకారం తన శిఖరాలను ఒదిగి ఉంచి మహర్షి ఎప్పుడు తిరిగి వస్తాడా అని నిరీక్షిస్తూ ఉంది. ఈ విధంగా వింధ్యాచల గర్వానికి అగస్త్యుడు ఆనకట్ట కట్టి, సూర్యరథ గమనానికి ఉన్న అవాంతరాన్ని తొలగించడంతో దేవతలు, మునులూ సంతోషించారు. ఇతరుల అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాడి కోరికలు ఎప్పుడూ నెరవేరవు కదా!

4

ఈ విధంగా లోకాలకు వచ్చిన ఉపద్రవాన్ని నిర్మూలించిన అగస్త్యమహర్షి దక్షిణాపథంలో కాలుపెట్టాడు. త్రోవలో కనిపించిన పుణ్యనదులలో మునకలు పెడుతూ, దండకారణ్యం దాటి పట్టిస క్షేత్రంలో వీరభద్రుణ్ణి, సోమనాథుణ్ణి, భోగీశ్వరుణ్ణి అర్చించాడు. మార్కండేయుణ్ణి, కోటిపల్లిలోని విరూపాక్షుణ్ణి భజించాడు. దక్షవాటికలోని సప్తగోదావరిలో స్నానం చేసి భీమేశ్వరుణ్ణి దర్శించాడు. దక్షిణకాశియైన ద్రాక్షారామంలో భీమేశ్వరస్వామిని దర్శించాక వారికి కాశీక్షేత్రాన్ని దర్శించినంత ఆనందం కలిగింది.

ద్రాక్షారామంలో కొంతకాలం గడిపిన పిదప వీరభద్రశైలానికి వెళ్ళి భద్రకాళీసమేత వీరభద్రుణ్ణి దర్శించాడు. అక్కడ నుండి వెళ్ళి పశ్చిమ సముద్ర తీరాన సౌరాష్ట్రంలోని సోమనాథస్వామిని దర్శించిన తరువాత అష్టాదశపీఠాలలో సుప్రసిద్ధమైన కొల్లాపురానికి వెళ్లాడు. అక్కడ జగన్మాతయైన శ్రీమహాలక్ష్మిని సందర్శించి స్తుతించాడు. ఆ స్తోత్రానికి ఎంతో సంతోషించిన మహాలక్ష్మీదేవి అగస్త్యుని ఇరవై తొమ్మిదవ ద్వాపరయుగంలో వ్యాసమహర్షిగా జన్మించి ధర్మశాస్త్రాలను ప్రవచిస్తావని దీవించింది.

అక్కడ నుండి పయనించి శ్రీశైలం సమీపించి పాతాళగంగలో స్నానం చేసాడు. తరువాత హాటకేశ్వరదేవుణ్ణి, వైకుంఠబిలమధ్యలోనున్న ఈశ్వరుణ్ణి, ఏకాంత రామేశ్వరుణ్ణి సందర్శించాడు. బ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామిని గంధపుష్పాక్షతలతోఆరాధించాడు. కోటిలింగాలను సేవించారు.

అప్పుడు లోపాముద్ర అగస్త్యునితో “ఈ శ్రీశైల దివ్యక్షేత్రం ఎనభై నాలుగు ఆమడల పొడవు, ముప్పై యోజనాల వెడల్పు, మూడున్నరకోట్ల తీర్థాలతో, మహా మహిమతో ప్రకాశిస్తూ ఉంటుంది. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది కాని ఈ శ్రీశైలం శిఖరం చూసినంత మాత్రాన మోక్షం లభిస్తుంది అని అంటారు కదా, మరి కాశీ వెళ్ళడం దేనికి? కొందరు తీర్థసేవ ప్రదానం అంటారు. కొందరు వ్రతాలు, యజ్ఞాలు, దానాలు గొప్పవంటారు. కొందరు వీటన్నింటా కంటే వేదాధ్యయనం, విజ్ఞానం గొప్పవంటారు. ఇవన్నీ వింటుంటే ఒక అభిప్రాయానికి రాలేకుండా ఉన్నాను. వీటిలో సులభమైన ముక్తిమార్గం తెలిపి నాకు సందేహనివృత్తి చేయండి” అని అడిగింది.

అగస్త్యుడు లోపాముద్రతో “దేవీ! సావధానంగా విను. ఉజ్జయిని, కాశీ, మాయా, అయోధ్య, కంచి, మధుర, ద్వారక అనే సప్త పట్టణాలూ మోక్షలక్ష్మీ మందిరాలుగా ప్రసిద్ధిపొంది ఉన్నాయి. అందులో కాశీక్షేత్రం సాక్షాత్తుగా ముక్తికి కారణం. కాశీక్షేత్రానికి అవిముక్తం, ఆనందకాననం, మహాశ్మశానం, రుద్రావాసం అనే పేర్లు వర్తిస్తాయని పెద్దలు చెబుతున్నారు. కాశీక్షేత్రంలో ఎప్పుడూ కృతయుగమే; ఎప్పుడూ ఉత్తరాయణమే. కాశీపురవాసులకు దేహత్యాగమే దానం. అదే తపస్సు. అదే మహాయోగం.

. శ్రీశైలం మొదలైన తీర్థాలు కూడా ప్రశస్తమైనవే. ప్రయాగ, నైమిశం, కురుక్షేత్రం, గంగాద్వారం, అవంతిక, సరస్వతి, సహ్యాద్రి, గంగాసాగర సంగమం, త్రయంబకం, సప్తగోదావరి, ప్రభాసం, బదరికాశ్రమం, మహాలయం, ఓంకారం, పురుషోత్తమం, గోకర్ణం, బృగుతీర్థం, జంబుపుష్కరం, శ్రీశైలం అనే ఇవన్నీ మోక్షకారకమైన తీర్థాలు. అసలు ఈశ్వరానుజ్ఞ ఉంటే తప్ప తీర్థయాత్ర చెయ్యాలనే భావన పుట్టదు. తీర్థయాత్రలు చేస్తే తప్ప పాపం తొలగిపోదు. పాపం తొలగిస్తే తప్ప కాశీకి వెళ్ళే పూనిక కలుగవు. కాశీక్షేత్ర నివాసం లేకపోతే విజ్ఞానం కలగదు. జ్ఞానం లేనిచో మోక్షం లభించదు.

. శ్రీశైలంలో శిఖరం చూస్తే ముక్తి కలుగుతుంది. కేదారం ఇంకా తొందరగా ముక్తిని ప్రసాదిస్తుంది. ప్రయాగ అంతకంటే తొందరగా అమృతదానం చేస్తుంది. అన్నింటికంటే అతి తొందరగా ముక్తిని ప్రసాదించే క్షేత్రం మహాశ్మశానం అని పిలువబడే కాశీతీర్థం. కాశీతీర్థం విడిచి లక్షతీర్థాలలో మునిగినా మోక్షలక్ష్మి దగ్గరకు రాదు” అని వివరించాడు.

ఈ విధంగా దక్షిణాపథంలో తీర్థయాత్ర సాగించిన అగస్త్యమహర్షి వింధ్యపర్వతానికి దక్షిణాన ఉన్న దండకారణ్యంలోని గోదావరీతీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తన శిష్యబృందంతో జీవించాడు.

*శుభం*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు