టికెట్ ప్లీజ్! - ఎం వి రమణారావు

Ticket Please

అవి నేను విశాఖలో ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు.. అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు. మా అక్కను చూసి రావాలనిపించి ఓ ఆదివారం ఉదయం బయల్దే్రాను.

అక్క కశింకోట గ్రామంలో ఉంది. నేను ఆటో ఎక్కి ద్వారకా కాంప్లెక్సు దగ్గర దిగాను.అప్పట్లో రైలు ఎక్కే అలవాటు ఇంకా ఉండేది కాదు. ఛార్జీ కాస్త ఎక్కువైనా బస్సులో మెత్తని కుషను సీటులో కూర్చుని కాసేపు కునుకు తీయవచ్చని నా ఆశ. అనకాపల్లి వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్నాను. అక్కడినుంచి కశింకోట చాలా దగ్గర. ఆటోలో వెళ్లిపోవచ్చు.

బస్సు బయల్దేరింది. కిటికీలో నుండి చల్లని గాలి వీస్తోంది. చెట్లు, చేమలు, పుట్టలు, ఇళ్లు అన్నీ వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్న నాకు ఒక్కసారిగా తెలివి వచ్చింది. బస్సు NAD జంక్షన్ దగ్గర ఒక్క జెర్కుతో ఆగింది. ఎవరో కొందరు ప్రయా ణీకులు ఎక్కారు. ఒకాయన వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు. తీరా చూస్తే అతను మరెవరో కాదు. నేను ఏ ఊరు వెళ్తున్నానో ఆ బావగారే!

నన్ను చూసి అతను కంగు తిన్నారు. మళ్లా సర్దుకువ్నారు. గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టు ముఖం పెట్టారు. ఇంతకీ అతని బాధ ఏమిటో నాకెప్పుడో అర్ధమైపోయింది. నాకూ టికెట్ తీయాలేమోనని అతను అలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఇక్కడ మా బావ గురించి కాస్త చెప్పాలి.

అతను మహా పిసినారి. ఒంటినిండా సుగరే. కాని ఇన్సులిన్ తీసుకోడు. డాక్టరు వంద అడిగితే యాభై మాత్రమే ఇస్తాడు. ఇంట్లో ఫ్యాను వేసుకోనివ్వడు. కూరలు కొనే ప్రసక్తే లేదు. ఇంట్లో కొబ్బరి చెట్ల నుండి రాలిన కాయలతోనే రోజూ కూరా, పచ్చడీ చేసుకుని తినమంటాడు. పోనీ డబ్బు లేదా అంటే పౌరోహిత్యంతో బాగానే కూడబెట్టాడు. ‘వాడిది గ్రేట్ ఎర్నింగ్ హ్యాండ్ అండీ’ అని అతని తమ్ముడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ‘అవునవును. అవతలివాళ్ల నెత్తి మీద పెట్టే హ్యాండ్’ అని నాకు అనిపించేది.

తన పిసినారితనంతో మా అక్కని ఎప్పుడూ కాల్చుకు తినేవాడు. పిల్లలతో సహా పుట్టింటికి తగిలేసేవాడు. ఇక మా అక్క అత్తగారూ,విధవ ఆడపడుచూ కలిసి మా అక్క చేత బండెడు చాకిరీ చేయించి నానా బాధలూ పెట్టేవారు. మహా ఇల్లాలు మా అక్క కిక్కురుమనకుండా అన్ని బాధలూ సహించేది. గయ్యాళి వంశంలో పడినందుకు జీవితమంతా చేదు అనుభవాలు రుచి చూస్తూనే గడిపింది.
‘టికెట్ ప్లీజ్’ అంటూ వస్తున్న కండక్టరు పిలుపుతో ఆలోచనల్లో నుండి ఒక్కసారిగా బయటపడి ఈ లోకంలోకి వచ్చాను. ప్రక్కన చూస్తే మా బావగారి ముఖకవళికలు క్షణక్షణానికీ మారిపోతున్నాయి. కళ్లు మూసుకుని తనలో తనే గొణుక్కుంటూ తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. జేబులో చెయ్యి మాత్రం పెట్టే ప్రయత్నం ఏమీ చెయ్యడం లేదు.

కండక్టర్ మా దగ్గరకు వచ్చేశాడు. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన ఘడియ వచ్చేసింది. నేను జేబులోంచి వంద కాగితం తీసేను. అది చూస్తూనే బావ ముఖం వెలిగిపోయింది. ‘అనకాపల్లి ఒక టిక్కెట్ ఇవ్వండి’ అన్నాను. కండక్టరు ఇరవై కూపాయలు తీసుకుని టికెట్ పంచ్ చేసి ఇచ్చాడు. మా బావవైపు చూస్తూ ‘టికెట్ ప్లీజ్’ అన్నాడు. అప్పుడు చూడాలి మా బావ ముఖం. అవమానంతోను, కోపంతోను ఎర్రబడిపోయింది. చేసేది లేక తన టికెట్ తీసుకున్నాడు.అతను అక్కడితో ఊరుకోలేదు.

‘చూడండి. బావమరిది ఎలా చేశాడో’ అని తోడల్లుడికి ఫిర్యాదు చేశాడు. ‘ఏం అబ్బాయ్. ఎందుకలా చేశావ్’ అని అడిగారు మా చిన్న బావ. అప్పుడు నేను జవాబిచ్చాను.—’చూడు బావా. ఇరవై రూపాయలు నాకో పెద్ద లెక్కలోనిది కాదు. అతను నాకన్న పెద్దవాడు. హుందాగా ఇద్దరికీ టికెట్ తియ్యడానికి సిద్ధమైతే వారించి నేనే ఇద్దరికీ టిక్కెట్లు తీసేవాడిని. కాని అతని ప్రవర్తనకు నాకు ఒళ్లు మండింది. అతనికి తగిన గుణపాఠం నేర్పాలంటే ఇదే సమయం అనుకున్నాను. అతను నేర్పిన విద్య అతనికే అప్పజెప్పాను. ఇందులో నా తప్పు ఉందంటారా!’ అన్నాను. అతను అంగీకార సూచకంగా ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

+++++++++++++++++++++
అంకితం : పిసినారి భర్తల బారిన పడి దేశవ్యాప్తంగా కష్టాలు అనుభవిస్తున్న అక్క చెల్లెళ్లకు ఇది అంకితం.
++++++++++++++++++++++

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు