మాటకి మాట తెగులు..నీటికి నాచు తెగులు - ఎం bindumaadhavi

Maataki maata tegulu-Neetiki naachu tegulu

"మాటకి మాట తెగులు.. నీటికి నాచు తెగులు"

ఏదయినా విషయం గురించి ఒకళ్ళు ఒక మాట అంటే..ఇక అక్కడి నించి పుంఖాను పుంఖాలుగాఅభిప్రాయాలు..విమర్శలు..ఆక్షేపణలు వస్తూనే ఉంటాయి. ఇక సంభాషణ..చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ప్రారంభమైనప్పుడు మాటలో సహృదయతే ఉండచ్చు. కానీ నలుగురి నోళ్ళల్లో పడేసరికి మాట కి మొదట ఉన్నముఖ్యమైన కోణం పోతుంది. అంటే మాట పుట్టి కొనసాగటానికి మాటే ఆధారం.

అలాగే నిలవ ఉండే నీటిలో నాచు బయలుదేరుతుంది. నాచు వల్ల నీటి స్వచ్ఛత దెబ్బ తింటుంది.

ఒకరి మాటకి ఇంకొకరి మాట కలిసి అలా పక్క దారులు తొక్కుతూ ఎటో వెళ్ళిపోతుంటే సామెతవాడతారు.

@@@@

"ఎందుకనో నిను చూస్తుంటే కవ్వించాలనిపిస్తుంది..కవ్వించి నువ్వు కలహమాడితే నవ్వుకునాలనిఉంటుంది..ఎందుకనో" (సి డి చిత్రం లోని పాట)

అనే పాట హం చేసుకుంటూ ఆఫీసుకి రెడీ అవుతున్నాడు శ్యాం.

"మీరు ఎప్పుడూ చేసే పని అదే కదా! నాతో కలహమాడటానికి పాట కూడా ఎందుకు" అని మూతి మూడువంకర్లు తిప్పుతూ వచ్చింది రాధ.

"ఇంతకీ రేపు ఉపనయానికి వస్తున్నావా లేదా?"

"అక్కడ నాకెవరూ తెలియదు..రాను అని ఇందాకే చెప్పాను కదా"

"నువ్వు తీసుకెళ్ళే ఫంక్షన్స్ అన్నిటికీ నేను తోకూపుకుంటూ రావట్లేదా?"

"..మీకు తోక కూడా ఉందా?"

"అంటే యజమాని వెనకాల తోక ఊపుకుంటూ తిరిగే కుక్క లాగా...నీ వెనకాల వినయంగా అని నాఉదేశ్యం"

":( మరే... మీకు ఇష్టమైతేనే వస్తున్నారు కానీ ఇలా తెలియని చోటికి రమ్మని నేనెప్పుడూ మిమ్మల్నిబలవంత పెట్టలేదు. పైగా అక్కడికొచ్చి..వాళ్ళు మీకు చాలా ముఖ్యమైన వాళ్ళయినట్టు...మీరే నన్ను తీసుకొచ్చినట్టు.. వాళ్ళ ముందు బిల్డప్పులొకటి"

"ఇదిగో ఇదే..నీతో 'మాటకి మాట తెగులు నీటికి నాచు తెగులు' అని నువ్వు చెబుతూ ఉంటావే సామెత.."

"ఇంతకీ ఉపనయనం చేసే వాళ్ళు మీకు బాగా తెలుసా"

"తెలుసా అంటే అంత బాగా తెలియదు కానీ..మా ఊరి వాళ్ళు. మా చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండేవాళ్ళుట. నేను ఎక్కువగా వాళ్ళింట్లోనే ఆడుకునే వాడినిట. అమ్మ చెబుతూ ఉంటుంది. మొన్న సూపర్ బజార్లోకనిపించారు. అమ్మే వాళ్ళని గుర్తు పట్టి పలకరించింది. నేను పెద్దయ్యాక వాళ్ళని చూడలేదు"

"ఓరిని మాత్రం చుట్టరికం.. పరిచయానికా నన్ను సెలవు పెట్టి మరీ రమ్మని గొడవ చేస్తున్నారు? మీకేవాళ్ళు సరిగ్గా తెలియదు. సూపర్ బజార్లో చూసినప్పుడు కూడా వాళ్ళు గుర్తు పట్టలేదు. అత్తయ్యగారుపలకరిస్తే..ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మొహమాటానికి వాళ్ళింట్లో ఫంక్షన్ ఉందని ఆహ్వానించారు."

"మాకు ఇవ్వాళ్ళ ఇన్స్పెక్షన్ ఉంటుంది... సెలవు పెట్టద్దని మా బాస్ నెల రోజుల నించి మమ్మల్నిహెచ్చరిస్తున్నారు అని చెప్పాను కదా! ఏదో నాతో గొడవ పడాలని కాకపోతే..మీకే సరిగ్గా తెలియని వాళ్ళింట్లోఉపనయానికి వెళ్ళటానికి ఇంత సీనా. అసలు మీరెళ్ళటమే ఒక దండగ"

"అదిగో నా వాళ్ళకి సంబంధించినది ఏదయినా దండగే అని నీ ఉద్దేశ్యం. మొన్న మీ పెదనాన్నగారింట్లో వారిముని మనవరాలి పుట్టిన రోజుకి వెళ్ళటం అంత అవసరమా? వాళ్ళు ఇంకా నిద్ర లేచారో..లేదో...ఉదయం ఏడింటికేపట్టు చీర సింగారించి బయలుదేరావు. పైగా ఖరీదైన గిఫ్ట్ పుచ్చుకు మరీ!"

" మధ్య మీరు మీ బావ వాళ్ళ తమ్ముడి బావమరిది ఇంటి గృహ ప్రవేశానికి రెండు రోజులు ముందేరిజర్వేషన్ చేసుకుని మరీ వైజాగ్ వెళ్ళి రాలేదా?"

"వాడు చుట్టరికమే కాదు..నా బాల్య స్నేహితుడు కూడా! అందుకే వెళ్ళాను."

"మీరు ఫంక్షన్ కి వెళ్ళటం... నేను మా స్వంత పెదనాన్నగారి కొడుకు ..మా అన్నయ్య మనవరాలి పుట్టినరోజుకి వెళ్ళటం ఒకటేనా? పైగా మా అన్నయ్య మన పెళ్ళిలో స్నాతకం లో మిమ్మల్ని గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిబతిమాలిన బావమరిది కూడాను"

"ఇంక మీ వాళ్ళని చూస్తే నీకు ఒళ్ళు తెలియదు. భూకైలాశ్ సినిమాలో రావణాసురుడి లాగా చుట్టూ పాముపుట్టలు పెరిగినా కూర్చున్న చోటి నించి జిగురు పూసి అతికించినట్టు కదలవు! కబుర్లే కబుర్లు...!"

":( మరే... మీ సంగతే చెప్పాలి. శుక బ్రహ్మ లాగా ఎక్కడా ఒక్క నిముషం నిలవరు కదా!"

"మధ్యలో ఆయనెవరు? నన్ను తిట్టటానికి ఎవరెవరి పేర్లో వాడుతావ్!"

":( ఆయన మా మేనత్త కొడుకులెండి! అయినా మీ ముందు పురాణ పురుషుల గురించి చెప్పటం నాదిబుద్ధి తక్కువ. శుక బ్రహ్మ అంటే వ్యాస మహర్షి కుమారుడు. ఆవు పాలు పితికినంత సేపు కూడా ఆయన ప్రదేశంలోను నిలవడుట."

"ఎందుకనో? ఆయనకి కూడా...నాలాగా కుదురు తక్కువా ఏంటి?"

"కాదు..ఎక్కువ సేపు ఒక చోట ఉంటే మనుషులతో కానీ.. ప్రదేశంతో కానీ సంగం ఏర్పడుతుందనిభయం"

"ఓహో ఇలా కూడా ఉంటారన్నమాట. ఇక నించి ఆయనే నాకు ఆదర్శం"

"అని అనిపించుకోవటం అత్తగారి స్వభావం" అనే సామెత చెప్పి ఊరికే అత్తగారిని విలన్ని చేశారుకానీ..అసలు మీలాంటి మొగుళ్ళకి "అని అనిపించుకోవటం సరదా" అంటే బాగుండేదేమో"

"ఇంతకీ ఉపనయనానికి రానంటావ్! సరే హాఫ్ డే లీవ్ పెట్టి నేనే వెళ్ళొస్తాను. భిక్షగా ఎంతేస్తే బావుంటుందోచెప్పు. . ఐదొందలు వేస్తే ఎక్కువంటావు! పరిచయం తక్కువ కదా అని నూట పదహార్లేస్తే నాకు కక్కుర్తి అంటావు!"

"మూడొందలు వెయ్యండి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అక్కడున్న వాళ్ళందరిని మనింటికి రమ్మని చెప్పిలాక్కొచేసెయ్యకండి. ఆఫీసు నించి వచ్చి అలా బంధువులని ఎంగేజ్ చెయ్యటం కష్టం" అని "రేపటి ఫంక్షన్ గురించికూడా ఇవ్వాళ్ళే ..అదీ ఆఫీస్ కి బయలుదేరే హడావుడి టైం లో నాతో గంట వాదించగలరు. ఏం మనిషండి"

"అసలు మీరు ఉద్యోగం కాదు కానీ.. సుప్రీం కోర్ట్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తే క్లయింట్లకి బోలెడు లాభం"

ఇలా వాద ప్రతివాదాలయ్యాక.. పూటకి మన చర్చకి ఫుల్స్టాప్ అన్నట్టు ఇద్దరు ఎవరి చెవులకి వాళ్ళు ఫోన్లు అతికించుకుని ఒకే కార్లో ఆఫీసుకి బయలుదేరారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు