స్కూలు నుండి విహాన్ ఇంటికి వచ్చాడు. విహాన్ ఒక కార్పొరేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. విహాన్ తల్లి తండ్రులిద్దరూ ఉద్యోగస్తులు. ఇంట్లో ఆయా ఉంటుంది. సోఫాలో బ్యాగ్ పడేసి కూర్చున్నాడు. ఆయా టిఫిన్ తెచ్చి పెట్టింది. విహాన్ చాలా కోపంగా ఉన్నాడు. "నాకు టిఫిన్ అక్కర్లేదు. నేను తినను."అన్నాడు చికాగ్గా. "పాలు తాగుతావా బాబూ!"అంది ఆయా. "నువ్వు నోరు మూసుకొని వెళ్ళు!"అన్నాడు విహాన్ విసురుగా. ఆయా మెల్లగా లోపలికి వెళ్ళింది. విహాన్ కు అసలే మంటగా ఉంది. కారణం ఈ రోజు వాడిని టీచర్ కోప్పడింది. హోమ్ వర్క్ చెయ్యలేదనో, పాఠం వినలేదనో కాదు. ఆడపిల్లల బాడీ పార్ట్స్ అసభ్యంగా చిత్రాలు నోట్సులో గీసి వాటి మీద ఫ్రెండ్సుతో చెత్తగా జోకులు వేస్తున్నాడు. బోర్డు మీద లెక్కలు వేసి చూపిస్తున్న శాలిని టీచర్ తిరిగి చూసింది. విహాన్ తోపాటు బెంచ్ మేట్స్ కూడా కలిసి తలవంచి నవ్వుకుంటూ ఉన్నారు. పిల్లల దగ్గరికి వచ్చింది శాలిని టీచర్. ఆవిడను పిల్లలు గమనించలేదు. ఆవిడ వచ్చి విహాన్ దగ్గర్నుండి నోట్స్ తీసికొంది. "ఈ నోట్సులో డ్రాయింగ్స్ నువ్వు వేసావా?" బదులివ్వలేదు విహాన్.మౌనంగా నిల్చున్నాడు. టీచర్ ముగ్గురు పిల్లల్ని బయటకు పంపించింది. క్లాసు అయ్యేదాకా క్లాసు బయటే ఉన్నారు ముగ్గురు పిల్లలు. టీచర్ క్లాసు బయటకు వచ్చింది. "ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే స్కూల్ నుండి పంపించేస్తాను. ఇంకోసారి ఇలాటి చెత్త పనులు చెయ్యకండి!" గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చాలా అవమానంగా అనిపించింది విహానుకు.టీచర్ మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంటికొచ్చి ఆయా మీద చూపించాడు. సాయంత్రం ఆరింటికి తల్లి సుష్మ ఇంటికి వచ్చింది. అప్పటికి ఆయా వంట చేసిపెట్టి రెండోరోజుకు దోసె పిండి మిక్సీలో వేస్తూ ఉంది. సుష్మ రాగానే టీ కలిపి తెచ్చింది. "అమ్మా!విహాన్ బాబు స్కూల్ నుండి వచ్చాక టిఫిన్ చెయ్యలేదమ్మా!పాలు కూడా తాగలేదు."అంది ఆయా. "సరే!నువ్వు నీ పని చేసుకొని వెళ్ళు!"అంది సుష్మ. విహాన్ దగ్గరికి వచ్చింది. విహాన్ కంప్యూటరులో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. "ఏం నాన్నా!టిఫిన్ తినలేదా? పాలు కూడా తాగలేదు. నీరసం రాదూ!కొంచెం తిందువు గాని రా!నేను తినిపించనా!"అంది సుష్మ విహాన్ తలనిమురుతూ. తల్లితో ఏమీ చెప్పలేదు విహాన్. ఒకవేళ స్కూల్లో టీచర్ తిట్టిందని చెప్తే తల్లి 'ఎందుకు?ఏమిటీ?'అంటూ ఆరా తీస్తుందని భయం వేసింది. తల్లి కొంగులో తల దాచుకొన్నాడు. "ఆయా చేసిన టిఫిన్లు అంత టేస్టుగా వుండవు. బోర్ కొడుతోంది. కాస్త వెరైటీగా ఏమన్నా తెప్పించు!"అన్నాడు గారాబంగా. "పిజ్జా తెప్పించనా!" "ఒకే ఒకే!ఐస్ క్రీమ్ కూడా!" సుష్మ స్విగ్గీలో విహానుకు కావాల్సినవి ఆర్డర్ చేసి కంప్యూటర్ ముందు కూర్చుంది.ఆమెకు ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగానే ఉంటుంది. చెయ్యాల్సిన అసైన్మెంట్లు చాలానే ఉన్నాయి. పైన మేనేజర్ వెంటనే చేసి చూపించమన్నాడు. ఆఫీసులోనే కాకుండా ఇంటికొచ్చాక కూడా పని చేసుకుంటూ ఉంటుంది.విహానుకు ఆన్ లైన్ ట్యూషన్ పెట్టింది. వాడి చేత హోమ్ వర్క్ చేయించే బాధ్యత ట్యూషన్ టీచరుదే. విహాన్ తండ్రి విజయ్ రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వచ్చాడు.అప్పటికి విహాన్ ట్యూషన్ కూడా పూర్తయ్యింది.రాత్రి ముగ్గురూ భోజనాలు చేసేసరికి ఆయా మరోసారి వచ్చింది. అన్నీ సర్దిపెట్టి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి ఆయా ఇంటికి వెళ్ళింది. రెండోరోజు విహాన్ నిద్రలేవలేదు. పిల్లవాడిని లేపింది సుష్మ. "కాస్త నీరసంగా ఉంది అమ్మా!స్కూలుకు వెళ్ళలేను."అన్నాడు విహాన్. సుష్మ పిల్లవాడి నుదురు తాకి చూసింది.వేడిగా లేదు. అప్పటికే విజయ్ లేచి తయారవుతున్నాడు. "వీడికి కొంచెం నీరసంగా ఉంది. చూడండి!" పిల్లవాడి దగ్గరికి వచ్చాడు విజయ్. "ఏం నాన్నా!ఈ రోజుకు రెస్ట్ తీసికొంటావా!కాస్త బత్తాయి రసం తాగు! ఈ రోజుకు స్కూలుకు వెళ్ళక పొతే ఏమీ కాదు. నేను మీ క్లాసు టీచరుకు లీవ్ లెటర్ రాసి మెయిల్ చేస్తాను. యు టేక్ రెస్ట్!"అంటూ పిల్లవాడి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తల్లీ తండ్రి ఆఫీసుకు వెళ్లారు. విహాన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆయా పొద్దున ఆరింటికి వస్తుంది. వీళ్లకు టిఫిన్, వంట చేసి, లంచ్ బాక్సులు పెట్టి వెళ్తుంది. ఇంక సాయంత్రం వస్తుంది. విహాన్ రోజంతా కంప్యూటరుతో, ఫోనుతో కాలక్షేపం చేశాడు. అతడి అభిరుచికి తగ్గ ఫ్రెండ్స్ తోడయ్యారు. పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం, ఫ్రెండ్సుకు షేర్ చెయ్యటం అతడికి సరదా.అతడిని పట్టించుకునే తీరిక తల్లి తండ్రులకు లేదు. స్కూల్లోమాత్రం క్లాసు టీచర్ భయానికి విహాన్ కొద్దిగా బుద్దిగా ఉన్నా, అతడి ప్రవర్తనలో తేడాని శాలిని టీచర్ కనిపెట్టింది. విహాన్ కొంచెం దారి తప్పుతున్నాడని ఆమెకు అర్థం అయ్యింది. ఆర్నెల్ల పరీక్షల్లో విహానుకు ఎనభై శాతం కంటే తక్కువ మార్క్స్ వచ్చాయి. కార్పొరేట్ స్కూళ్లల్లో అటువంటి మార్కులు వస్తే అథమస్థాయి అని అర్థం. తొంభైశాతం మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసే పిల్లలని మంచి స్టూడెంట్స్ అనీ, తొంభైశాతం కంటే తక్కువ మార్కులు తెచ్చుకొనే స్టూడెంట్సుది మధ్యమస్థాయి అనీ, ఎనభై శాతంకంటే తక్కువ మార్కులు తెచ్చుకొనే స్టూడెంట్సుది అథమస్థాయి అని విభజిస్తారు. తొమ్మిదో తరగతిలో అన్ని సెక్షన్ల నుండి మంచి స్టూడెంట్సులను తీసి ఒక సెక్షనులో వేస్తారు. దానిని 'ఎ 'సెక్షనుగా పిలుస్తారు. మధ్యస్థ స్టూడెంట్లను 'బి 'సెక్షనులో వేస్తారు. అథమస్థాయి స్టూడెంట్లు 'సి 'సెక్షనులో ఉంటారు.'ఎ 'సెక్షను పిల్లలకు కోచింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూలుకు ర్యాంకుల పంట పండిస్తారు కాబట్టి . కార్పొరేట్ స్కూళ్ల సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. లక్షల్లో ఫీజులు అందరూ కడతారు. కానీ ప్రత్యేకమైన శ్రద్ధ బాగా చదివే విద్యార్థులపైనే ఉంటుంది. శాలిని టీచరు ఈ కార్పొరేట్ యాజమాన్య మనస్తత్వానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆమె వెనుకబడిన విద్యార్థుల విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ద చూపిస్తూ, వాళ్ళను చదువులో పైకి తీసికొని రావాలనుకుంటూ ఉంటుంది. ఒక రోజు ప్రిన్సిపాల్ వందన శాలిని టీచరును పిలిచింది. "చూడు శాలినీ!మన స్కూల్ లక్ష్యం మంచి రాంకులు తెచ్చుకోవటం. నీ టైం అంతా ఈ పూర్ స్టూడెంట్ల కోసం వృధా చెయ్యకు!వాళ్లకు ఎలాగూ ర్యాంకులు రావు. మన టార్గెట్ అందరూ పాస్ అవటం. ఎక్కువ మందికి ఫస్ట్ క్లాసు రావాలి. స్టేట్ రాంకు తెచ్చే పిల్లల మీద ఫోకస్ చెయ్యి. స్టేట్ రాంకులు రాకపొతే మన స్కూలు నిలబడటం కష్టం! నువ్వు అర్థం చేసుకో!వెనుక బడిన పిల్లల్ని కొంతవరకూ మాత్రమే పట్టించుకోవాలి. వాళ్ళు పాస్ అయితే చాలు.'సి 'సెక్షను మీద అంత శ్రద్ద అనవసరం. రాంకులు రాకపొతే మన ఉద్యోగాలు ఉండవు. మేనేజ్మెంటుకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు!" వందన చెప్పింది నచ్చలేదు శాలిని టీచరుకు "మేడం!ర్యాంకులు, మార్కుల గురించి కాదు నా బాధ. పిల్లల నైతిక ప్రవర్తన గురించి.'ఎ' సెక్షను పిల్లలు చాలా బాగా చదువుతారు. వాళ్లకు ర్యాంకులే ధ్యేయం. వాళ్ళను కొంచెం పుష్ చేస్తే అద్భుతమైన ఫలితాలు తెచ్చి చూపిస్తారు. వీళ్ళు రేప్పొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి అమెరికాలు, అస్త్రలియాలు వెళ్లి పోతారు. కనీసం వాళ్ళ తల్లి తండ్రులను చూస్తారనే నమ్మకం లేదు. వీళ్ళు భవిష్యత్తును జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే బుద్దిజీవులు. ఇక' బి 'సెక్షను వాళ్ళు ఫస్ట్ క్లాసులు తెచ్చుకుంటారు. ఎలాగోలా ఢక్కామొక్కీలు తిని జీవితంలో సెటిల్ అవుతారు.ఇక ఆఖరికి 'సి 'సెక్షను పిల్లలు. వాళ్లకు చదువులో ఎక్కువ మార్కులు రావు.మార్కులు రాకపోయినా ఫర్వాలేదు కానీ వాళ్ళ నైతిక ప్రవర్తన గురించి ఎవరు పట్టించుకొంటారు? స్కూల్లో చదివే అందరూ మన స్టూడెంట్లే కదా!వాళ్ళ వాళ్ళ తెలివిని బట్టి ర్యాంకులు ఉంటాయి. అసలు విద్యార్థులకు నీతి నియమాలు ఎప్పుడు, ఎక్కడ నేర్చుకుంటారు? వాళ్ళను మంచి సిటిజెన్స్ లాగా తీర్చిదిద్దటమెలా? సంఘానికి కీడు చేసే మనస్తత్వం పిల్లలకు అలవడుతోంది. దానిని అరికట్టాలి. గురువులుగా మంచి బోధించాలి. అది మన కర్తవ్యం. వారానికి రెండు మోరల్ క్లాసులు పెట్టండి మేడం!పిల్లలకు కథల ద్వారా నీతి బోధ చేస్తూ ఉంటే కొందరైనా మంచి దారిలోకి వస్తారు. విద్యాలయాలు దేవాలయాలు మేడం!మన బాధ్యతను మనం మరిచిపోతున్నాము. పిల్లలు తల్లి తండ్రుల కంటే ఎక్కువ సేపు మనతోనే గడుపుతారు...." "స్టాప్ శాలినీ!నువ్వు మరీ ఓల్డ్ జమానాలో ఉన్నావు. ఈ సమయంలో రెండు మోరల్ క్లాసులు అంటే చాలా కష్టం.స్పోర్ట్స్ క్లాసులు కూడా తీసేసి ట్యూషన్ క్లాసులు పెట్టాలనుకొంటున్నాను. అసలు నీ మైండ్ సెట్ మార్చుకో!స్కూల్ ఆధారిటీ వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఆలోచించకూడదు. వాళ్ళు చెప్పిందే వినాలి. పిల్లలకు ర్యాంకులు వస్తున్నాయా లేదా అన్నదే మన ధ్యేయం. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే మనకెందుకు? అది తల్లి తండ్రుల బాధ్యత. పనికి మాలిన సిద్ధాంతాలు నాకు చెప్పకు!నౌ యు కెన్ గో!" గట్టిగా చెప్పింది వందన. చేసేదేమీ లేక ప్రిన్సిపాల్ రూము నుండి బయటికి వచ్చింది శాలిని టీచర్. 'ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి 'అనుకుంటూ ప్రతి క్లాసులో అల్లరి పిల్లల జాబితా తయారు చేసింది. ఆమెకు సహాయంగా మరో ఇద్దరు టీచర్లు వచ్చారు. ముగ్గురూ కలిసి చదువు మీద శ్రద్ద పెట్టకుండా, అల్లరి చేసే వాళ్ళను ఏరి పెట్టుకున్నారు. ప్రతి సెక్షనులో కనీసం ఎనిమిది నుండి పదిమంది దాకా అల్లరి పిల్లలు తేలారు. వారిలో కూడా ఎటువంటి అల్లరి చేస్తున్నారు అని విచారించింది శాలిని టీచర్ కొంత మంది మామూలుగా కొంచెం దుడుకుగా మాత్రం ఉంటారు..కొంతమంది అల్లరితో పాటు ప్రక్క వాళ్ళని ఏడిపిస్తారు. కొంతమంది మరీ విపరీతంగా అమ్మాయిలను ఏడిపించటం, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడటం చేస్తారు. కొంతమంది తొందరగా దుర్వ్యసనాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ జాబితాలో విహాన్ కూడా ఉన్నాడు. ఇలా నైతిక ప్రవర్తన సరిగ్గాలేని పిల్లల తల్లితండ్రుల ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసింది శాలిని టీచర్ వచ్చే శనివారం స్కూల్ అయ్యాక స్కూల్ ప్రక్కన ఉన్న శివాలయానికి పేరెంట్సుని రమ్మని మెసేజులు పెట్టింది. పేరెంట్సుకు అర్థం కాలేదు. శాలిని టీచర్ ప్రత్యేకంగా ఎందుకు రమ్మందో!ఇది స్కూలుకు సంబంధించిన మెసేజ్ అయితే కాదు.అయితే ఆవిడ చెప్పినట్లు కొంతమంది పేరెంట్సు శివాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. అందరికీ అక్కడ జంపకానాలు పరిచి ఉన్నాయి.వచ్చిన వాళ్లకు మంచినీళ్లు, బిస్కట్స్ సర్వ్ చేస్తున్నారు భవాని, మానస టీచర్లు. మైక్ తీసికొంది శాలిని టీచర్ "డియర్ పేరెంట్స్!నా అభ్యర్థనను మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరూ వినండి! మీ పిల్లల్ని బాగా చదివించాలని మన స్కూల్లో లక్షల్లో ఫీజులు కట్టి చేర్పించారు. ఇళ్లల్లో మీరు, ఇక్కడ మేము పిల్లల్ని ఎంత బాగా చదివించాలనుకున్నా వాళ్ళ వాళ్ళ 'ఐక్యూ 'ని బట్టి మార్కులు వస్తాయి. ఒక కోడెదూడ స్వతస్సిద్ధంగా తనకు ఉన్న శక్తిని బట్టి బరువు మోస్తుంది. దాని శక్తికి మించిన బరువును దాని నెత్తి మీద వేస్తే ఎక్కువ దూరం లాగలేదు. తెలివితేటలు అందరి పిల్లలకూ ఒకే రకంగా ఉండవు. టీచర్ పాఠం క్లాసులో అందరికీ ఒకేరకంగా చెప్పినా కూడా పిల్లల్లో కొంత మందికే ఫస్ట్ క్లాసు ఎందుకు వస్తోంది? పిల్లలు వాళ్ళల్లో ఉండే మేధస్సును బట్టి అర్థం చేసుకుంటారు. మార్కుల గురించి, చేరే కోర్సుల గురించి మనం పిల్లల్ని డిజైన్ చేద్దామనుకోవటం బుద్ధి తక్కువ అవుతుంది. పిల్లల్ని జిరాక్స్ కాపీలు తీసినట్లు స్కూళ్లల్లోనుండి ప్రింటవుట్లు తీయలేము. వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని వెలికితీసి, మంచి భవిష్యత్తునందించాలి. దానితో పాటు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే డాక్టర్లతోనో, ఇంజనీర్లతోనో మాత్రమే సాధ్యం అవదు. అన్ని వృత్తుల వాళ్లూ కావాలి. దురదృష్టవశాత్తూ మనకు ఈ విషయం అర్థం కావటం లేదు. మనం రోజూ తినే అన్నంలో చారు, మజ్జిగ మాత్రమే పోసుకొని తింటున్నామా ? అన్ని కూరలూ, పప్పులు కలిపి తినటంలేదూ!అన్నీ కలిపి తింటేనే మంచి పౌష్టికాహారం శరీరానికి అందుతుంది. అలాగే దేశానికి కూడా!మంచి పౌరులు మనదేశానికి కావాలి. మరబొమ్మలు కాదు. ఇక రెండో విషయం! పిల్లల నైతికప్రవర్తన గురించి. మీ పిల్లల నైతికప్రవర్తన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ విషయం చెప్పటానికే నేను ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీరు మీ పిల్లల్ని గమనించండి!వాళ్ళల్లో ఉన్న లోపాలను సరిదిద్దండి!ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ దాదాపుగా ఉన్నత వర్గాలకు చెందినవాళ్ళే. పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నవాళ్ళే. మీరు మీ పిల్లలకు మంచిభవిష్యత్తును ఇవ్వగలిగినవాళ్ళే. అయినా కూడా నేను చెప్పేది వింటారనే నమ్మకంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాను.... " శాలిని టీచర్ ఒక నిమిషం ఊపిరి పీల్చుకొంది. అంతటా నిశ్శబ్దం.. అందరూ విభ్రాంతిగా వింటున్నారు. కొనసాగించింది శాలిని టీచర్ "మంచి భవిష్యత్తు అంటే బ్యాంకు బ్యాలెన్సు, ఆస్తులు, షేర్లు, భద్రమైన ఉద్యోగం అంతేనా!అంతేకాదు!తల్లితండ్రులను, కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే బాధ్యతాయుతమైన మనస్తత్వం ఉండటం. ప్రక్కవాళ్లకు హాని చెయ్యని వ్యక్తిత్వం. ఇతరులకు మేలు చేసే సజ్జనత్వం. సంఘానికి చీడపురుగుల్లా కాకుండా నీతినియమాలతో జీవించే హుందాతనం. మీ పిల్లలు ఎంతో చదివినా , ఇంకెంతో సంపాదించినా మంచిగుణాలు లేకపొతే ఆ సంపాదన నిలుస్తుందా? ఆ చదువు అక్కరకు వస్తుందా? మిమ్మల్ని ప్రేమగా చూడకుండా మీ చరమదశలో మిమ్మల్ని అనాధల్లాగా వదిలేస్తే మీకు సంతోషం కలుగుతుందా? ఆలోచించండి!కొద్దిగా మనసుపెట్టి మీ పిల్లల్ని మీరు బాగుచేసుకోండి!" ఆగింది శాలిని టీచర్ ఎదురుగ్గా ఉన్న పేరెంట్సులో చలనం లేదు. అందరూ బిగుసుకొని వింటున్నారు. మళ్ళీ కొనసాగించింది శాలిని టీచర్ "మీ పిల్లల ప్రవర్తన గురించి ప్రతి ఒక్కరికి నేను పరిశీలించిన విషయాలు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నాను. మీ పిల్లల బాగుకోరి ఒక టీచరుగా నేను చెయ్యగలిగినంత సాయం స్కూలుకు సంబంధం లేకుండా చేస్తాను. నాకు ప్రతిఫలం ఏమీ ఇవ్వనవసరం లేదు. వీళ్ళు నా పిల్లలు అని భావించి మీతో ఇంతసేపు మాట్లాడాను. నన్ను అర్థం చేసుకుంటారో లేదో అది మీ మీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక గురువుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాననే తృప్తి నాకు మిగులుతుంది." శాలిని టీచరు ఉపన్యాసం అయిపోయిందన్నట్లు మైక్ తీసి ప్రక్కన పెట్టి కూర్చుంది. సమావేశం అయిపోయింది. ** ** ** ** ** ** ** ** రాత్రి సుష్మ భర్త దగ్గరికి వచ్చింది. విహాన్ నిద్రపోతున్నాడు. వాడు నిద్రపోయాక వాడి ఫోనులో,కంప్యూటర్లో హిస్టరీ చెక్ చేసాడు విజయ్. ఘోరంగా అనిపించింది. వాడు చూసే అశ్లీల వీడియోలు, వాడి ఛాట్స్ చూస్తే మతిపోయింది. ఎలా బాగుచేసుకోవాలి? విహాన్ మీద శ్రద్ద పెట్టటం అవసరం. ఇద్దరూ ఉద్యోగస్తులవటం, పనివత్తిడి, బాబుతో సమయం గడపకపోవటం వలన వాడు ప్రక్కదారి పడుతున్నాడని అర్థం అవుతోంది. విహానుకు మార్కులు తక్కువ వస్తున్నాయనే ఆందోళనకంటే వాడి క్యారెక్టర్ గురించిన బెంగ ఎక్కువయింది. "మనం ఇద్దరం పట్టించుకోకపోవటం వలన వాడిలా తయారవుతున్నాడు. నువ్వు ఉద్యోగం మానివేయరాదూ!"ఆలోచనగా అన్నాడు విజయ్. "మీ ఒక్కరి జీతంతో ఎలా జరుగుతుంది? ఇల్లు లోను కూడా ఉంది." "మనం లగ్జరీస్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. వాడికి కూడా డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడే మనస్తత్వం రావాలి. మా నాన్నకు మేము ముగ్గురం పిల్లలం. మా నాన్న ఒక్కడి జీతంతో మమ్మల్ని పెంచలేదా!అప్పుడు మాకు ఈ సౌకర్యాలు లేవు. మేము చదివింది ప్రైవేటు స్కూల్ అయినా ఇంతింత డబ్బు పోసింది లేదు. నువ్వూ అంతే కదా!కష్టపడి చదివి వచ్చావు. డబ్బు విలువ, కష్టం విలువ మనకు తెలిసినంతగా వీడికి తెలియదు. మనం ప్రతిదీ సమకూర్చి పెడుతున్నాము. వీడికి స్పూన్ ఫీడింగ్ మానెయ్యాలి. వీడిని ఈ వయసులో బాగుచేసుకోకపొతే శాలిని టీచర్ చెప్పిందే నిజమవుతుంది. మన బ్రతుకు వృద్దాశ్రమంలో తెల్లవారుతుంది." భర్త చెప్పింది విని మౌనంగా తలఊపింది సుష్మ. ఆ తర్వాత ఇంట్లో కొన్ని మార్పులు జరిగాయి. సుష్మ ఆయాను మాన్పించింది. "నాకు ఉద్యోగం పోయింది. రెండు నెలలు మాత్రమే ఈ కంపెనీలో చెయ్యాలి. అంతటా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇంకో ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు. మనకు క్రొత్త ఇంటి లోన్ కూడా ఉంది. నాకు మళ్ళీ ఇంతమంచి ఉద్యోగం దొరికేదాకా కొంచెం సర్దుకోవాలి. దేశంలో సాఫ్ట్ వేర్ జాబ్స్ పరిస్థితి అంతగా బాగలేదు... కొంతకాలం తప్పదు."కొడుకుకు వివరించింది సుష్మ. అంతకు ముందులా లేదు పరిస్థితి.విహాన్ పొద్దున్నే లేచి తయారయ్యి, తన బాక్స్ పెట్టుకొని కాస్త తల్లికి సహాయం చెయ్యాలి. వంట మనిషి లేదు. పనిమనిషి వస్తోంది కానీ అన్ని పనులు చెయ్యదు. విహాన్, విజయ్ కలిసి సుష్మకు సహాయం చేస్తున్నారు. సుష్మ కారు అమ్మేశాడు విజయ్. రోజూ స్కూల్ నుండి ఇంటికి రాగానే వాషింగ్ మిషన్ లోంచి బట్టలు తీసిఆరవేయటం, ఆరిన బట్టలు మడతలు పెట్టడం, పూల కుండీల్లో నీరు పొయ్యటం విహాన్ వంతు. ఆకలి వేస్తే దోసె పోసుకోవటం, బ్రేడ్ కాల్చుకొని తినటం, పాలు వేడిచేసుకొని త్రాగటం లాంటివి చేస్తున్నాడు.కాసేపటికి సుష్మ ఇంటికి వచ్చి పని చేసుకుంటూ పిల్లవాడిచేత హోమ్ వర్క్ చేయిస్తుంది. ఇంతకు ముందులా కంప్యూటర్ గేమ్సుకి టైమ్ లేదు. సాయంత్రం ప్రక్కన ఉన్న షాపుకు వెళ్లి కూరలు తేవాలి. బిగ్ బాస్కెట్లు, అమెజాన్లు, స్వీగ్గీలలో ఆర్డర్లు ఇవ్వటం లేదిప్పుడు. రెండు నెలల తర్వాత జాబ్ మానేసింది సుష్మ. ఇంట్లో ఖాళీగా ఉండటం సుష్మకు ఇష్టం లేదు. ఇంట్లోనే పచ్చళ్ళు, స్వీట్స్, హాట్స్ చేస్తూ, సహాయానికి ఇద్దరు పనివాళ్ళను పెట్టుకొంది. వాటిని కాలనీలోనే అమ్మటం మొదలు పెట్టింది. 'విహాన్ ఫుడ్స్ 'అనే యాప్ క్రియేట్ చేసాడు విజయ్. విహాన్ స్కూల్ నుండి వచ్చేసరికి సుష్మ పనివాళ్ళను పంపించి, వాడికోసం టిఫిన్ చేసి రెడీగా ఉంటోంది. స్వీట్ల డబ్బాలకు లేబుల్స్ అంటించడం, అట్ట పెట్టెల్లో పెట్టడం విహాన్ వంతు. ఆ తర్వాత సుష్మ వాడి చదువు దగ్గరుండి చూసుకోవటంతో చదువులో కాస్త మెరుగయ్యాడు విహాన్. విజయ్ రాత్రిపూట విహాన్ పక్కనే పడుకొని ఏదో ఒక పుస్తకం గురించి చెప్పి దానిని చదివించేవాడు. కొద్ది కొద్దిగా విహానులో మార్పు ప్రారంభం అయింది. ప్రక్కన ఇంట్లో, ఎదురింట్లో ఉన్న ఆడపిల్లల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని విజయ్ హెచ్చరించటంతో ఇప్పుడిప్పుడే అతడి ప్రవర్తనలో కొంచెం సంస్కారం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు స్కూల్లో కొడుకు ప్రవర్తన గురించి శాలిని టీచరుతో మాట్లాడుతూ, ఆమె సలహాలు తీసికొంటూ చదివిస్తోంది సుష్మ. టెన్త్ క్లాసు పరీక్షలు అయ్యాయి. విహానుకు తొంభై శాతం మార్కులు వచ్చాయి. "తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు?" కొడుకును ప్రశ్నించాడు విజయ్. "బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేద్దామనుకొంటున్నాను. మామూలు కాలేజీ అయినా ఫర్వాలేదు. నా చదువుకు ఎక్కువ డబ్బు పెట్టకండి!అమ్మ ఫుడ్స్ బిజినెస్ పెంచుకుంటే సరిపోతుంది." సంతోషంతో కొడుకును దగ్గరికి తీసికొన్నాడు విజయ్. మెల్లగా కాలం గడిచింది. 'విహాన్ ఫుడ్స్ 'పెట్టి పదేళ్లయింది. క్రొత్త ఇల్లు కొన్నాడు విహాన్. వ్యాపారాన్ని లాభాల బాటలో పరిగెత్తించాడు. ఈరోజు విహాన్ చక్కని వ్యక్తిత్వం కలిగిన నవ యువకుడు. తల్లి తండ్రులను ప్రేమతో సేవించే తనయుడు, సంఘమర్యాదను పాటించే సజ్జనుడు, పరులకు సహాయపడే ఉత్తముడు. గృహప్రవేశనికి బంధువులందరు వచ్చారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ విహాన్ ప్రయోజకత్వాన్ని పొగిడేవాళ్ళే. అప్పుడే కారులోంచి దిగింది శాలిని టీచరు. పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్లారు విజయ్, సుష్మ. ఆమెను చెరోచెయ్యి పట్టుకొని తీసికొని వచ్చారు. సోఫాలో కూర్చుంది శాలిని టీచర్ టీచర్ని చూసి విహాన్ చాలా సంతోషించాడు. వచ్చిన అతిథుల్లో విహాన్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ వచ్చి టీచర్ని పలకరించారు. లోపల నుంచి సుష్మ పెద్ద వెండి పళ్లెం తెచ్చింది. వెండి చెంబుతో నీళ్లు తెచ్చాడు విజయ్. "టీచర్!ఈ శుభసందర్భంలో మీకు పాదపూజ చెయ్యాలనుకుంటున్నాము "అంటూ టీచర్ పాదాల దగ్గర కూర్చున్నారు భార్యాభర్తలిద్దరు. "అయ్యో!అదేమీ వద్దు!.. పాదపూజ లేమిటి? ఫూలిష్ గా...." అంది శాలిని టీచర్ మోహమాటంగా. "లేదు టీచర్!మీరు మాకు మార్గదర్శకులు. మీరు మాకు చేసిన సహాయానికి మీ ఋణం మేము ఏవిధంగానూ తీర్చుకోలేము. మా చేతులమీదుగా మీకు ఈ చిరుసత్కారం చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది."అంటూ సుష్మ శాలిని టీచర్ పాదాలను మృదువుగా పట్టుకొని పళ్లెంలో పెట్టింది. "విహాన్!ఇలా రా!"అంటూ వాడి చేత టీచరు కాళ్ళు కడిగించింది. శాలిని టీచర్ కళ్లల్లోంచి జలజలా ఆనంద బాష్పాలు రాలాయి. సుష్మ ఆమె మెడలో పూలమాల వేసి పట్టుచీర పెట్టింది. "ఈ రోజు మా బిడ్డ ప్రయోజకుడయ్యాడంటే తల్లితండ్రులుగా మా గొప్పదనం ఏ మాత్రం కాదు. మా వెనుక శాలిని టీచర్ శ్రద్ధ, నిబద్ధత ఉన్నాయి. ప్రతి స్కూల్లో శాలిని టీచర్ లాంటి గురువులు ఇద్దరు ఉన్నా చాలు బిడ్డలందరికి బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఒక మంచి గురువు బిడ్డలను ప్రభావితం చేసినట్లు ఇంకెవ్వరూ చెయ్యలేరు. అందుకే గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు పెద్దలు. శాలిని టీచర్ కంటే ఆత్మీయులు ఎవరున్నారు?"అంటూ కళ్ల నీళ్లు తుడుచుకొన్నాడు విజయ్. నిజమే కదా మరి!గురువే దైవం. *********************