ఆనందరావు అందగాడేగానీ, మహా బద్ధకస్తుడు.అందుకే ఏపనీ సక్రమంగా చేసేవాడు కాదు.ఒళ్ళు వంచి పనిచేయడమంటే అతని దృష్టిలో గోహత్య చేసినంత పాపం.పైగా తాను అందగాడిననే ఒకింత గర్వం కూడానూ! ఇంతకుముందు ఆనందరావు ఓ జ్యూయలరీ షాపుకి నైట్ వాచ్ మెన్ గా ఉద్యోగంలో చేరాడు.చేరిన పది రోజులు తిరక్కుండానే ఉద్యోగం పోయింది.అందుకు కారణం కూడా ఉంది.రాత్రంతా మెలకువగా ఉండి ఆ షాపుకు కాపలా కాయాల్సిందిపోయి, డ్యూటీ టైం లో శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోయేవాడు ఆనందరావు.ఈ విషయం షాపు ఓనరుకు తెలిసి,నాలుగు చీవాట్లేసి అతన్ని ఆ ఉద్యోగంలోంచి పీకేశాడు. ఆ ఉద్యోగం పోయినందుకు ఆనందరావు ఏమాత్రం బాధపడలేదు సరికదా…'వీడిచ్చే ముష్టి అయిదు వేల జీతానికి రాత్రంతా మెలకువగా ఉండాలా! పోతే పోనీ వెధవ జాబ్…!' అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడా అతనికి నచ్చిన ఉద్యోగం దొరకకపోవడంతో…పగలంతా పనికిమాలిన పకోడీ బ్యాచ్ తో ఊరిమీద జులాయిగా తిరగడం, రాత్రి మాత్రం పడుకుని అందమైన కలలు కనడం అతని దినచర్య అయిపోయింది.ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు తన బాధ్యత తెలుసుకుని అతను మారతాడని అతనిపై చాలా నమ్మకం పెట్టుకుని, చివరకు అది జరిగే పని కాదని తెలుసుకుని, ఆనందరావుని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. అయితే ఆనందరావు తన ఆలోచనలకు తగ్గట్టు తరచూ ఓ అందమైన కల కనేవాడు.ఆ కల సారాంశం ఏంటంటే…'తను ఎలాగైనా ఓ అందమైన, జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తున్న అమ్మాయిని పటాయించాలి.ఆమెను ప్రేమించి…సారీ…ప్రేమిస్తున్నట్లు నటించి,ఆమె తెస్తున్న డబ్బును మాత్రమే ప్రేమించి ఆమెను పెళ్ళి చేసుకోవాలి.ఆమె నెలనెలా సంపాదించి తెచ్చే జీతం తన చేతికి ఇస్తుంటే,ఆ డబ్బుతో ఎటువంటి బాదరబందీ లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ జాలీగా గడిపేయాలి…' ఇది పరమ బద్ధకస్తుడైన ఆనందరావు ఎన్నాళ్ళనుంచో కంటున్న అందమైన కల. 'అసలు ఇలాంటి కల నెరవేరేనా?' అని మనం అనుకుంటే, 'డాల్'లో 'లెగ్గే'సినట్లే… ఎందుకంటే, ఆనందరావు కల సాకారం చేసేందుకు అతనికి ఓ అమ్మాయి తగిలింది మరి! ఆ కలల సుందరి పేరు స్వప్న. ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం వస్తోంది. ఆమెకు ఏం నచ్చిందోగానీ, ఆనందరావుని పిచ్చిపిచ్చిగా ప్రేమించేసింది. అతనితో పెళ్లికికూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొద్దిరోజులు సినిమాలు, షికార్లని ఎంజాయ్ చేశాక, స్వప్న మరీ పోరు పెడుతుండడంతో ఆమె మాట కాదనలేక అయిదు వేలుకు ఓ ఆఫీసులో గుమాస్తాగా జాయిన్ అయ్యాడు ఆనందరావు. అక్కడ స్వప్న ఇంట్లో… చేస్తున్నది గుమాస్తా ఉద్యోగమైనా కూతురు ఒత్తిడి చేయడంతో ఆనందరావుతో పెళ్ళికి ఒప్పుకోక తప్పిందికాదు స్వప్న తల్లిదండ్రులకి. ఇక్కడ… పెళ్లయితే తనే మారతాడని ఆనందరావు ఇంట్లో సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆనందరావు మనసు ఆనందంతో తుళ్ళిపడుతోంది. పడుదూ మరి…తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోతుంటేనూ! పాపం… స్వప్నకేం తెలుసు ఆనందరావు అంతరంగం. ఆరోజు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే తతంగమంతా పూర్తయింది. ఇక మిగిలింది పెళ్లే…! 'ఏమైనా, అబ్బాయి చాలా మంచోడులా ఉన్నాడు!' 'ఈరోజుల్లో పైసా కట్నం లేకుండా ఎవరు చేసుకుంటారు!' 'కట్నమేకాదు… లాంఛనాలు కూడా వద్దన్నాడట కదా! నిజంగా గ్రేట్!' 'బహుశా స్వప్న ఎప్పుడో బంగారు పూలతో పూజచేసి ఉంటుంది!' ఇలా… అక్కడున్నవారి నోటివెంట ఆ మాటలు ఆనందరావు చెవికి ఇంపుగా అనిపించాయి. అయితే మళ్ళీ అంతలోనే అనుమానం వచ్చిందతనికి. వీళ్ళంతా తన గురించి తెలిసే మాట్లాడుకుంటున్నారా? బహుశా తెలిసుండదు. తెలిస్తే, ఈవిధంగా ఎందుకు అంటారు! 'స్వప్న ఇంట్లో మ్యానేజ్ చేసి ఉంటారని' తనకితానే సర్దిచెప్పుకున్నాడు. ప్రస్తుతానికైతే అనుమానాలన్నీ పక్కనపెట్టి, ఒక్కసారి తనక్కాబోయే భార్య స్వప్న గురించి ఊహల్లోకి వెళ్లిపోయాడు. ఆ ఊహల్లోనే కులుమనాలి వెళ్లి స్వప్నతో సాంగేసుకొచ్చాడు. ఏదైతేనేం మొత్తానికి నెల తిరగకుండానే ఆనందరావు, స్వప్నల పెళ్లి జరిగిపోయింది. ********** శోభనం గది. గదిలో వెలిగించిన అగరబత్తీల పరిమళం గదంతా వ్యాపించి గమ్మత్తుగా అనిపించగా, పందిరి మంచానికి డెకరేట్ చేసిన మల్లె పూదండలు మత్తుగొల్పుతున్నాయి. స్వప్న పాలగ్లాసుతో గదిలోకి వచ్చింది. ఆ సమయంలో ఆనందరావు కంటికి స్వప్న బంగారు గుడ్లుపెట్టే బంగారు బాతులా కనిపించింది. తాను తెచ్చిన పాలగ్లాసు అతనికి అందించిందామె. ఇద్దరూ ఆ పాలని చెరి సగం షేర్ చేసుకున్నారు. కాసేపు అవీ, ఇవీ ముచ్చట్లాడుకున్నాక,"మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను!" అతని గుండెలకు తల ఆన్చి గోముగా అంది స్వప్న. "ఏంటీ! నీకు ప్రమోషన్ గానీ వచ్చిందా!?" ఉత్సాహంగా అడిగాడు ఆనందరావు. "అబ్బే… అదేం కాదు!" "కాదా! అయితే అదేంటో నువ్వే చెప్పు…" "అలాగే…" అంటూ ఆమె చెప్పడం ప్రారంభించింది. "నాకు ఎప్పటినుంచో ఓ కోరిక ఉంది. అదేంటంటే… గృహిణిగా ఉంటూ పతినే ప్రత్యక్ష దైవంగా కొలవాలని, అన్నివేళలా అతని అవసరాలకు అనుగుణంగా నడుచుకుని మంచి భార్యగా, అత్తమామలకు సేవలుచేసి తరించే గొప్ప కోడలిగా, వెరసి ఉత్తమ గృహిణిగా పేరు పొందాలన్నదే నా ఆశ, ఆశయమూనూ…!" మనసులో మాట చెప్పింది స్వప్న. "నీ ఇష్టం డియర్… అలాగే కానివ్వు!" మామూలుగానే అన్నాడు ఆనందరావు. కానీ అది తుఫాను ముందు ప్రశాంతత అని అతనికి అన్పటికి తెలియదు. "నాకు తెలుసు… మీరు చాలా మంచివారు. నామాటను ఎప్పుడూ కాదనరని నా నమ్మకం. అందుకే నా ఆశయానికి అడ్డొస్తుందని నేచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను!" చావు కబురు చల్లగా చెప్పింది. 'అయితే తన 'కల' ఇకపై కలగానే మిగిలిపోతుందా!?' "పైగా మీరు భార్య తెచ్చిన సంపాదనతో బ్రతుకుతున్నారని నలుగురూ అంటుంటే మీకెంత అవమానం. కాబట్టి నా ఆశయ సాధనకోసం మీరు సంపాదించినంతలోనే సర్దుకుపోదాం…" స్వప్న చెప్పుకుపోతోంది. కానీ ఆమె చెబుతున్న మాటలేవీ అతనికి వినిపించడంలేదు. పాపం… ఇప్పుడు ఆనందరావు మొహంలో కాగడాపెట్టి వెదికినా మచ్చుకైనా ఆనందం కనిపించడంలేదు. *** సమాప్తం ***