స్టేడియంలో ఇసుకేస్తే రాలని జనం. ఇంతమంది వస్తారని తెలిసే చిన్న చిన్న ఆడిటోరియంలలో ఈ సభ నిర్వహించలేదు. నగరంలో సగం బెటాలియన్ పోలీసులు అక్కడే బందోబస్తు డ్యూటీ లో ఉన్నారు. ఆరోజు సన్మానం మరెవరికో కాదు అభిమానులు ముద్దుగా పిల్చుకునే ఇండియన్ చీతా, 100 మీటర్స్ స్ప్రింటులో వరుసగా 4 ఒలింపిక్స్ స్వర్ణాలు, ప్రతీ రెండేళ్లకోసారి జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వరుసగా 5 స్వర్ణాలు సాధించి ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ని ఒకటిన్నర దశాబ్దం ఏకచక్రాధిపత్యంగా ఏలిన పవన్ కుమార్ కి. అభిమానుల నిరీక్షణకి తెరదించుతూ వాళ్ళ కోలాహలం, కేరింతల నడుమ స్టేజ్ ఎక్కి అభివాదం చేసాడు. ఒక్కసారిగా కరతాళధ్వనులు మిన్నంటాయి. ఒక 2 నిమిషాలపాటు వాళ్ళ కేరింతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంక వాళ్ళని ఆపడం అసాధ్యం అని అర్థమయి ఒకసారి గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలెట్టాడు పవన్.
“ఇక్కడికి వచ్చిన లక్షలాది అభిమానులకి టీవీల్లో చూస్తున్న కోట్లాదిమందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను జనసమూహంలోకి రావడం ఇదే తొలిసారి. ఎందుకంటే దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను, చిన్నప్పటినుండి నిరంతరం ఏదో సాధించాలి అన్న తపనతో ఉండే నాకు, అరకొర సదుపాయాలు, చాలీచాలని మా నాన్న జీతం ప్రధాన శత్రువులు. కానీ నాకున్న గొప్ప మనోబలంతో అందరికన్నా భిన్నంగా ఉండాలి, జీవితంలో గొప్ప పేరు, ఖ్యాతి సంపాదించాలి, నా తరవాత తరం డబ్బులకి ఇబ్బందిపడకూడదు అని గొప్ప గొప్ప కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి నేను ఎంచుకున్న మార్గం ఈ 100 మీటర్స్ స్ప్రింట్. ఈ రంగంలో మనదేశం నుండి ఎవ్వరు కూడా చెప్పుకోతగ్గ విజయాలు సాధించలేదు కాబట్టి నేను ఈ రంగంలో మునుపెన్నడూ ఎవ్వరూ సాధించలేని శిఖరాలు అందుకోవాలని చాలా త్యాగాలు చేసి ఈ స్థాయి కి వచ్చాను. సరైన తిండి ఉండేది కాదు. తతిమా దేశాల ఆటగాళ్లతో పోలిస్తే నా స్టామినా సరిపోయేది కాదు. దానికితోడు మనదేశం లో రాజకీయాలు. ఈ ఫీల్డ్ లో రాణించకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోతుంది అనే మానసిక ఒత్తిడి. ఇలాంటి పరిస్థితులలో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాల అఖుంటిత దీక్షతో ఈ స్థాయికి చేరుకున్నాను.
ఇప్పుడు నాకు డబ్బుకి, పరపతి కి లోటు లేదు కాబట్టి నాలో ఇంకా ఆడగలిగే సత్తా ఉన్న కూడా నేను నా దేశ భావి పౌరులకోసం ఒక నిర్ణయం తీసుకున్నాను”. అని దీర్ఘంగా శ్వాస తీసుకొని మళ్ళీ కొనసాగించాడు. “ఈ దేశం లో ప్రతిభకి లోటు లేదు. చాలామంది క్రీడాకారులు ఉన్నారు. అందులో 90% మంది కనీస సౌకర్యాలు లేక స్థోమత లేక క్రీడా రాజకీయాలతో వేగలేక కనుమరుగైపోతున్నారు. వాళ్లందరికోసం నేను తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, ఈ రోజు నుండి నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. రేపటినుండి నా టైము,డబ్బు,పరపతి,యావదాస్థి అన్నీ కూడా ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా దేశంలో ఉన్న ప్రతిభగల క్రీడాకారులను వెలికితీయడానికి ఉపయోగిస్తాను. చిన్న వయసునుండే ఆసక్తి ఉన్న పిల్లలకి నా సొంత నిధులతో పూర్తిస్థాయిలో శిక్షణ మరియు మౌలికసదుపాయాలు కల్పిస్తాను. ఇక మీదట ప్రపంచ క్రీడా యవనిక మీద భారతదేశ ముఖచిత్రం రెపరెపలాడుతుంది". అని ముగించాడు.
ఆ స్టేడియం మొత్తం పవన నామస్మరణతో ఊగిపోతూండగా, అభిమానులకి ఆటోగ్రాఫ్ స్ ఇస్తూ ముందుకి వెళుతున్న పవన్ కి ఒక్కసారిగా ఎడమ చెంప చెళ్ళుమంది. ఆ నొప్పినుండి తేరుకునే లోపల మొహం మీద చెంబుడు చల్లని నీళ్ళు పడ్డాయి. ఆ వెంటనే "ఎంతసేపు పగటి కలలు కంటూ పడుకుంటావురా. బారెడు పొద్దెక్కింది. లేచి ఇంటి పనిలో అమ్మకి నాకు సహాయం చెయ్యి. ఈ సారి అయినా బ్యాక్ లాగ్స్ క్లియర్ చెయ్యకపోతే నా విశ్వరూపం చూస్తావు" అని తిడుతున్న తండ్రి మాటలు విని ఉలిక్కిపడి లేచాడు పవన్. తెల్లారి వచ్చే కలలు నిజమవుతాయి కానీ ఇలా బారెడు పొద్దెక్కాక వచ్చిన కలలు నిజం అవ్వవు అని నిట్టూరుస్తూ బాత్రూ లోకి వెళ్ళాడు పవన్.