చక్షు.. - తటవర్తి రాజేష్

Chakshu

కన్నుల్లో ఏదో ఆత్రుత, కుతూహలం. తల్లి గర్భంలోేనుండి బయట పడిన క్షణం నుంచే... కనిపించిన ప్రతీదీ విస్తుపోయేంత వింత వస్తువే అయినా, ఇంతకు ముందెన్నడూ చూడనిదే అయినా తన స్మృతి పథంలో ఉన్నది, ఇంతవరకూ కనిపించకుండా దాక్కున్నది ఏదో దొరకబట్టాలి అన్నట్టుగా.. తీవ్ర కాంక్షతో మెదడులో నుంచీ, బయటకు పొడుచుకొని వచ్చిన కన్నుల తాపత్రయం నిత్యాన్వేషణ సాగించే, బాల నయనంలో కనిపిస్తుంది నాకు. గత జన్మ తాలూకూ బంధాలు, బంధువులు ఎవరైనా తన పునర్జన్మను వీక్షించడానికి వచ్చారేమో! చూద్దాం అన్నట్టుగా అందరినీ తేరిపార చూస్తూ పరీక్షిస్తున్నట్టుగా తోస్తాయి ఆ కళ్ళు. ఎందుకు కళ్ళ గురించి ఇంతటి ఉపన్యాసం అంటే, ఏమో.. కొన్ని కళ్ళు కళ్లారా నవ్వగలవ్, కనులవిందుగా నర్తించగలవ్. కొందరి కళ్ళు తమ అనుకున్నవారిని వారించగలవ్. తీవ్ర పరిణామాలను నివారించగలవ్. పెదవి విప్పకుండా ఎన్నో భావాలను పలికించే సామర్ధ్యం ఉన్న కళ్ళంటే ఎంతో ఇష్టం నాకు. నేను ఎదుటివారిలో కళ్లనే గమనిస్తాను. వాటిని గౌరవిస్తాను. కనుల అందం వాటి పరిమాణంలోనో, కనుబొమ్మల ఆకృతిలోనో ఉంటుంది అనుకుంటారు అంతా. కానీ కళ్ళ అందం చూసే చూపులలో, అవి సాగించే అన్వేషణలో ఉంటుంది అనే నిజం, అప్పుడే పుట్టిన శిశువు కళ్లని చూస్తే అర్ధం అవుతుంది. బహుశా సంతోష్ కళ్ళు కూడా ప్రారంభంలో ఇలానే ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అలా లేవు.. అతని కళ్ళు చాలా నిస్తేజంగా, నిర్లిప్తంగా ఉంటాయి. అతడు నా సహోద్యోగి. కానీ నా కన్నా చాలా పెద్ద. నేను ఇక్కడ జాయిన్ అయి 20 రోజులే అవుతోంది. కానీ అభావంగా ఉండే అతని కళ్ళు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి. అసలు ఏ కళ్లైనా అలా ఎందుకు మారతాయి! తెలుసుకునే ప్రయత్నం చేశాను. కారణాలు తెలిశాక, నీరు ఇంకిన సముద్రం సహారా ఎడారిగా మారింది అనడానికి అతని కళ్ళు నిలువెత్తు నిదర్శనంగా తోచాయి నాకు. అలా ఎందుకు మారతాయి అంటే... చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులను పోగొట్టుకుని, బంధువుల ఇంట్లో పనివాడిలా పెరగడం వల్ల. ఇష్టపడిన అమ్మాయికి వేరెవరితోనో పెళ్లి జరుగుతుంటే, ఒంటరిగా ఊరి చివరి శివాలయంలో వెక్కి వెక్కి ఏడవడం వల్ల. ఎవర్నో ఒకర్ని కట్టబెట్టాలి అనుకున్న బంధువులు, తెలిసో, తెలియకో మానసిక పరిస్థతి బాగాలేని ఒక అమ్మాయిని తెచ్చి, చేసుకోమంటే ఆ ఆజ్ఞకి తల వంచి తాళి కట్టడం వల్ల. ఎదైతేనేం! భర్తగా భాద్యతగా భార్యను సుఖపెట్టడానికి కొత్త కాపురం మొదలుపెడదాం. అనుకునేసరికి, నమ్మిన బంధువులు అంతా " ఇంకెక్కడి ఆస్తి నాయనా, నీ చదువులకి, బట్టలకి, పెళ్లికి అంతా ఖర్చు అయిపొగా, నువ్వే లక్షన్నర బాకీ పడ్డట్టు. అయినా కంగారు లేదులే, నీకు వీలు చూసుకుని ఇద్దుగాని" అని ఒక మోసపూరత జాలి చూపడం వల్ల. పూర్తిగా గవర్నమెంట్ చదువులకి, బొత్తిగా బొత్తాలు కూడా లేని అతుకుల బట్టలకి, కట్నం పుచ్చుకోని దండల పెళ్లికి 50 లక్షలు ఎలా ఖర్చు అయ్యాయో అర్థం చేసుకోలేని అమాయకపు లెక్కల మాస్టారు అవ్వటం వల్ల. తన చదువుని ఆస్తిగా చేసుకుని, పక్క ఊరు వెళ్లి ఉద్యోగం చూసుకుని, స్థిర పడ్డ ఆ కొత్త జంటకి ఫోన్ చేసిన ప్రతీ ఒక్కరూ "ఏమిటోయ్ విశేషమేమిటైనా చెప్తున్నవా ఇంకా ఏమీ లేదా" అంటూ చచ్చు ప్రశ్నలు వేసి వాళ్ళని మరింత కృంగదీయడం వల్ల. "ఇంకోసారి ఈ ప్రస్తావన తెచ్చావంటే పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపిస్తా" అని హెచ్చరించలేని సంతోష్ మొహమాటం వల్ల. ఇంతోటి ఆ బోడి వంశాన్ని వృద్ది చేయకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదనే కనీస ఇంగిత జ్ఞానం లేని సంకుచిత స్వభావం వల్ల పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు కలగట్లేదని, రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం విఫలం అయినా, మూడోసారి ప్రయత్నించి స్వర్గస్తురాలైన తన భార్యను తలుచుకుంటూ బతకడం వల్ల.... ఇవి నేను తెలుసుకున్న కారణాలు మాత్రమే.. తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో ఆ దేవుడికే ఎరుక. . కారణాలు ఏమైనా నిస్తేజంగా ఉన్న ఆ కళ్ళల్లో నూతనోత్తేజం నింపాలనుకున్నాను. నిష్కల్మషమైన ఒక స్నేహ హస్తాన్ని అందించడం ద్వారా అది సాధ్యం అవుతుంది అనుకున్నాను. ఆ మరుసటి రోజే ఒక చిన్న కుక్కపిల్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళాను. చిరుతని, సీతాకోక చిలుకని ఒకేలా చూసే అతని కళ్ళతో, ముద్దుగా మెడ తిప్పుతూ, తోక ఊపుతూ, చిన్నగా అరుస్తున్న ఆ కుక్కపిల్ల కళ్ళలోని కాంతిని చూసేసరికి మంత్ర ముగ్ధుడైపోయాడు. చిన్నపాటి చిరునవ్వుని తెప్పించిన ఆ కుక్కపిల్ల కళ్లని చూస్తే నమ్మకం కుదిరింది. అతనిలో ఇన్నేళ్ళుగా నెలకొన్న ఉన్న నిరాశను, కొన్ని నెలలలోనే పోగొట్టగలను అని. రేపు సాయంత్రం నేను, సంతోష్ దానిని వాకింగ్ కు తీసుకువెళ్లాలి అనుకుంటున్నాం. అన్నట్టు.. అందమైన కళ్లు ఉన్న ఆ కుక్కపిల్లకి మేము పెట్టిన పేరు .. చక్షు

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు