ఫలించిన అస్త్రం! - బోగా పురుషోత్తం.

Phalinchina astram
రత్నగిరిని రత్నాకరుడు పాలించేవాడు. రత్నగిరి రాజ్యంలో రత్నాల వ్యాపారులు అధికంగా వుండేవారు. వారు పట్టపగలే రత్నగిరి వీధుల్లో రత్నాలు పోసి విక్రయించేవారు.
మనుషులు లేకున్నా వాటిని కొనేవారు తగిన ధర చెల్లించి నిజాయతీగా తీసుకెళ్లేవారు. ఇలా వారికి లాభాలు బాగా రాసాగాయి. ఇది వ్యాపారుల మధ్య అసూయ పెంచింది. వారి మధ్య కలహాలు పెరిగాయి. నిర్ణీత ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించ సాగారు..పేద వ్యాపారులకు వ్యాపారం కుంటుపడిoది. కొనుగోళ్లు లేక వారికి తీవ్ర నష్టాలు వచ్చి ఆందోళనలో పడ్డారు.
పెద్ద వ్యాపారుల ధాటికి చిరు వ్యాపారులు వణికిపోయి చితికిపోయి వ్యాపారాలు మానుకున్నారు.
ఒకప్పుడు మూడుపూలు ఆరు కాయలుగా సాగిన వ్యాపారం భయాందోళనల మధ్య సాగింది. రత్నాలు అమ్మడం ఎలా? అని ఆలోచించడానికే వారికి సమయం సరిపోయింది.
ఈ విషయం రాజుగారి వద్దకు వెళ్లింది.
మంత్రి మల్లన్నను పిలిచి ‘‘ వ్యాపారుల మధ్య అంతరాలు తొలగి చిరు వ్యాపారులకు లాభాలు వచ్చే మార్గం కనుక్కో..’’ అని ఆజ్ఞాపించాడు.
ఆ రాత్రి మల్లన్నకు దిక్కుతోచక నిద్రపట్టలేదు. ‘‘ వ్యాపారుల మధ్యపేద, ధనిక వ్యత్యాసం తగ్గించడం ఎలా?’’ అని ఆలోచించసాగాడు.
మరుసటి రోజు భటులను పంపి ‘‘ నిర్ణయించిన ధరకే రత్నాలు విక్రయించండి..!’’ అని ఆజ్ఞాపించి రత్నాల విక్రయాలను నియంత్రించాడు. అయినా పెద్ద వ్యాపారులు మరో ప్రాంతానికి వెళ్లి అధిక ధరలకు రత్నాలను విక్రయించసాగారు.
ఈ వ్యాజ్యం మళ్లీ రాజు వద్దకు వచ్చింది.
ఈ సారి మంత్రిని పిలిచి ‘‘ నా పాలనలో ఇలాంటి అన్యాయం జరగకూడదు..చట్టాన్ని కఠినంగా అమలు చేయండి’’ అని ఆదేశించాడు.
మంత్రి మల్లన్నకు చట్టాన్ని అమలు చేయడం కొరకరాని కొయ్యగా మారింది. ఆ రాత్రి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు.
మరుసటి ఉదయం ముసుగు దొంగలు బయలుదేరారు. రత్నాల వ్యాపారుల కళ్లు గప్పి రత్నాలు దోచుకెళ్లసాగారు. ఇది రోజురోజుకు అధికమైంది.
పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఈ సారి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాజు గారి వద్దకు వెళ్లారు. ‘‘ మా రత్నాలతో పాటూ మా ప్రాణాలకు కూడా రక్షణ కరువైంది ప్రభూ..!’’ అని తమ గోడును విన్నవించుకున్నారు.
అది వింటున్న మంత్రి మల్లన్న నవ్వి ‘‘ ప్రభూ ఆందోళన వద్దు..పరిస్థితి త్వరలో చక్కబడుతుంది..’’ అని భరోసా ఇచ్చాడు.
రాజుకు మంత్రిపై ఆగ్రహం వేసింది. ‘‘ ఇదేమిటయ్యా? ఒక సమస్య పరిష్కరించమంటే మరో సమస్యను తెచ్చిపెట్టావు?’’ కళ్లెర్రజేశాడు.
‘‘ సరే ప్రభూ..మీరు నిశ్చింతగా నిదురపోండి..సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది..’’ అన్నాడు.
రెండు వారాలు గడిచాయి. రత్నాల దొంగతనాలు మళ్లీ అధికమయ్యాయి. దొంగలు తమకు ఇష్టం వచ్చినట్లు రత్నాలు దోచుకుపోసాగారు. భయాందోళనతో రత్నాల వ్యాపారులు తమ వ్యాపారాలు మానివేశారు.
ఈ సారి రాజు కళ్లు చింత నిప్పుల్లా మండాయి. మంత్రి మల్లన్నను తన వద్దకు రావాలని ఆదేశించాడు.
మంత్రి మల్లన్న రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని ముఖంలో ఆందోళన లేదు. ప్రశాంతత కనిపిస్తోంది.
‘‘ ఏం మంత్రివయ్యా.. సమస్యను పరిష్కరించమంటే జఠిలం చేశావు..నిన్ను ఇప్పుడే తొలగిస్తున్నాను..’’ హుంకరించాడు రత్నాకరుడు.
‘‘ ప్రభూ పరిస్థితి అంతా చక్కబడిo ది.. చట్టానికి భయపడని వ్యాపారులు ఈ ప్రయోగంతో దారికొచ్చారు. వ్యాపారులు భయపడాలని ఈ దొంగతనం అస్త్రం ప్రయోగించాను.. వ్యాపారుల రత్నాలు ఎక్కడికీ పోలేదు..! ఇదిగోండి.. ఎవరి రత్నాలు వారు తీసుకెళ్లండి.. ఇక నుంచి చట్టప్రకారం నిర్ణీత ధరలకే రత్నాలు విక్రయించండి..పోటీ వద్దు..గొడవలొద్దు.. ప్రశాంతత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..’’ అని హెచ్చరించి ఎవరి రత్నాలు వారికి అప్పగించాడు మంత్రి.
తమతమ రత్నాలు తమకు వచ్చినందుకు వ్యాపారులు ఆనందంతో వెనుదిరిగారు వ్యాపారులు.
మరుసటి రోజు రత్నాల వ్యాపారం మళ్లీ మొదలైంది. ఈ సారి వ్యాపారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అతికష్టమైన సమస్యను సులభంగా పరిష్కరించినందుకు మంత్రిని అభినందించి ఘనంగా సత్కరించాడు రత్నాకరుడు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు