పాపం.. పాపారావు - తాత మోహనకృష్ణ

Paapam paparao


పాపారావు చాలా మంచి వాడు. అందమైన, తెలివైన పెళ్ళాం కోసం చెయ్యని పూజలు లేవు..మెట్టని గుడి లేదు. కాలనీ లో కూడా మంచి పేరు ఉన్న పాపారావు.. అందరికీ కావలసిన సహాయం చేసేవాడు. పేరు పాపారావు అయినా...చాలా గొప్పవాడని అందరూ పొగిడేవారు.

ఒక ప్రైవేటు ఉద్యోగి అయిన పాపారావు...తనకి ఎవరూ లేకపోవడం తో...కాలనీ లో అందరూ కలసి ఒక మంచి అమ్మాయి చూసి పెళ్ళి చేయాలని అనుకుంటారు. ఒక మంచి అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపులలో పాపారావు కు అమ్మాయి బాగా నచ్చింది. అమ్మాయి పేరు రూప. పేరుకు తగ్గట్టే అందంగా ఉంది...కానీ కొంచం కోపం ఎక్కువనే చెప్పాలి.

పెళ్ళైన కొత్తలో.. ఇద్దరూ చాలా ఆనందంగానే ఉన్నారు. తర్వాత మెల్లగా...రూప ప్రతిదానికీ భర్తను సాధించడం మొదలు పెట్టింది. నాకు చీరలు కావాలి, నగలు కావాలని, అవి కావాలి, ఇవి కావాలని. ఒకసారి ఉగాది పండుగ కి పాపారావు కొత్త చీర తెచ్చి.. రూప ముందు పెట్టాడు. ఆ చీర చూడగానే, కోపం తో...ఈ చీర నేను కట్టుకోను...పట్టుచీర కావాలని...గొడవ పెట్టింది. పెళ్ళాం గోల భరించలేక, అప్పు చేసి మరీ పట్టు చీర కొన్నాడు పాపారావు. ఇలా ప్రతీ చిన్న విషయం ...పెద్దదిగా చేసి గోల చేసేది. తనకి ఎవరూ లేకపోవడం తో...భార్య అడిగిన వన్నీ చేసేవాడు...చెప్పినవన్నీ వినేవాడు.

ఇలాగే నలభై ఏళ్ళు వచ్చేసాయి.. ఒంటరిగా చాలా అలసిపోయాడు పాపారావు. పాపం! పిల్లలు కుడా లేరు..

"రూపా! మనకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో..నా మీద నీ అభిప్రాయం ఏమిటి?"
"అదేంటి! అలాగంటారు! నేను ఏది అడిగితే అది ఇస్తారు. ఏది చెబితే అది చేస్తారు...మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంతలాగ భార్య మాట విని, చెప్పేవి చేసే భర్త దొరకడం నా అదృష్టం. జన్మ జన్మలకు మీరే నా భర్తగా రావాలి.. అంటుండగా...తీవ్రమైన గుండె పోటు వచ్చింది....అంతా రెప్పపాటులో జరిగిపోయింది.

ఏమండీ! నాకు చివరి క్షణాలు వచ్చేసాయి...నేను ఇంక బతకను...మీ కోసం స్వర్గంలో వెయిట్ చేస్తుంటాను...అక్కడ నన్ను కలవండి...అంది రూప. నేను చేసిన నోములు...పూజలే...నన్ను ఆ స్వర్గానికి చేరుస్తాయి...అంటూ ఆఖరి శ్వాస విడిచింది రూప.

పాపారావు కు ఏడవాలో..నవ్వాలో అర్ధం కాలేదు. ఒక పక్క భార్య పోయినందుకు ఏడుస్తూ...ఇంకో పక్క..స్వర్గం లో వెయిట్ చేస్తుంటాను.. అన్నందుకు నవ్వు వచ్చింది...భయం కుడా వేసింది.

భార్య పోయిన దిగులు నుంచి బయట పడిన తర్వాత...ఆఫీస్ కు వెళ్ళాడు పాపారావు. భార్య చివర చెప్పిన మాటలే మనసులో మెదులుతున్నాయి...వెంటనే తన ఫ్రెండ్ సుబ్బారావు తో మాట్లాడాలని బయటకు రమ్మనాడు.

"నీకు జరిగిన దానికి సారీ పాపారావు! ఎలా ఉన్నావు? ఇప్పుడు చెప్పు ఎందుకు రమ్మన్నావు?"

"తన భార్య చివర చెప్పిన మాటలు చెప్పాడు పాపారావు. అది విని సుబ్బారావు చిన్నగా నవ్వి..ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నావు?"
"ఏమో రా! మా ఆవిడ కు దైవ భక్తి ఎక్కువ..అందుకే అంత నమ్మకం..స్వర్గానికే వెళ్తుందని. నాకు స్వర్గానికి వెళ్ళాలని లేదు.."
"అయితే ఒక పని చెయ్యి! ..బతికున్నంత కాలం నువ్వు లెక్కలేనన్ని పాపాలు చెయ్యి..స్వర్గం మిస్ అవుతుంది.."

******

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు