అనామిక - తటవర్తి రాజేష్

Anaamika

రాత్రి 10 గంటలు కావొస్తోంది. బైపాస్ మీద ఒంటరిగా వెళ్తున్నాడు తరుణ్. దూరంగా ఒక వ్యక్తి లిఫ్ట్ కావాలని అడగడం కనిపిస్తూనే ఉంది. ఈ టైంలో ఆపడం మంచిదా, కాదా అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. అతని భయానికి అర్ధం ఉంది. ఆ రోడ్ చాలా ప్రమాదకరమైనది. నెలకి కనీసం నాలుగైదు నేరాలైనా నమోదు అయ్యే ప్రదేశం అది. అతిమంచితనం, అత్యంత మానవత్వం వలన బండి ఆపి లిఫ్ట్ ఆఫర్ చేసాడు. ఆ వ్యక్తి కూడా తేడాగా కనిపిస్తున్నాడు. కారణం అతను వేసుకున్న బట్టలే. ఇలాంటి వారు చేస్తున్న దోపిడీల గురించి తరచూ పేపర్ లో చదువుతూ ఉండటం వలన తరుణ్ లోలోపల భయపడుతూనే ఉన్నాడు. పెరిగిన వేగంతో బండి, గుండె రెండూ ఆ చీకట్లో పరిగెడుతున్నాయి. తనకి తెలిసిన వారెవరైనా దారిలో లిఫ్ట్ అడిగితే బావుణ్ణు అని మనసులో అనుకుంటూ, "ఎక్కడి వరకూ వెళ్లాలి" అని అడిగాడు. "మీరెంతవరకూ వెళ్తారు!!" ప్రశ్న, గొంతూ రెండూ తేడాగానే తోచాయి తనకి. "సత్రం దగ్గర లెఫ్ట్ తీసుకుంటాను" నిజానికి తను ఇంకా ముందుకు వెళ్ళాలి. కొంచెం లాంగ్ అయినా ఫర్వాలేదు, ఆ వ్యక్తిని తొందరగా దింపేయాలి అనుకుంటున్నాడు. "సరే.. అయితే అక్కడే దిగుతాను." అంటూ.. ఫోన్లో తనవాళ్లతో "సత్రం దగ్గరకే అట. వచ్చాక మళ్లీ కాల్ చేస్తా" అని ఫోన్ పెట్టేసాడు. అనుమానం రెట్టించింది. ఆ సత్రం చేరేసరికి ఎలా అయినా 10:30 అవుతుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయింది పరిస్థితి. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండరు. అదో పల్లెటూరికి వెళ్లేదారి. ఎలా అయినా తప్పించుకోవాలి అనే ఉద్ధేశ్యంతో "ఫర్వాలేదు. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. అక్కడ దింపేస్తా" అన్నాడు "లేదు. మావాళ్లకి కాల్ చేసాను. వాళ్లు సత్రం దగ్గరకి వచ్చేస్తున్నారు." ఊహించని సమాధానం. ఒంటరినని తన పథకాన్ని చెప్పేస్తున్నాడా.. (మనోగతం). తరుణ్ ఒళ్లు జలదరించింది. తను సన్నగా నాజూగ్గా ఉండే పాతికేళ్ల కుర్రాడు. వెనుక కూర్చున్న ఆ వ్యక్తి వయసు35-40 మధ్య ఉంటుంది. ఒక్క దెబ్బతో మట్టి కరిపించగల శరీరదారుఢ్యం అతనిది. ఇవన్నీ తలుచుకుంటుంటే అంత చలిలోనూ చెమట పడుతోంది. ఇంకో పది నిమిషాలలో తన జీవితం తలక్రిం దులైపోతోంది. అసలెందుకు ఈరోజు ఇంత లేట్ అయ్యింది. ఎవ్వరూ ఆపకుండా వెళిపోతుంటే, నేనెందుకు ఈ తలనొప్పి తగిలించుకున్నాను. అంతటితో ఆగకుండా 'ఎక్కడివరకు' అని ఎందుకు అడిగాను. ఆ సత్రం మలుపే ఎందుకు చెప్పాను. అని మనసులో తనని తానే నిందించుకుంటున్నాడు. కేవలం దొంగతనమేనా, హత్య కూడానా.. 'పోలీసులు పెట్రోలింగ్ కోసం వస్తే బావుణ్ణు..' ఈ ఆలోచన బైక్ స్పీడ్ ని తగ్గించింది. పల్స్ రేట్ మాత్రం అదే వేగంతో ఉంది. మరో 200 మీటర్ల దూరంలో సత్రం. బండి హెడ్ లైట్, పక్కన పొదలలో మిణుగురు పురుగుల కాంతి తప్ప మరో వెలుగు లేని మార్గం. ప్రకృతి కూడా పగ పట్టినట్టు, చందమామని కప్పేస్తూ నల్లని మబ్బులు. తన మనసంతా ఒకటే ఆందోళన. ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్న భార్య.. పైగా ఇపుడు గర్భవతి. తనతో కలలు కన్న జీవితం.. ఎలా దక్కించుకోవాలి... "ఆపెయ్ బాబు.. దాటేస్తున్నాం" అనే గొంతుతో బండికి బ్రేక్ పడింది. ఆ వ్యక్తి వెంటనే దిగి, తన అరచేతిని పైకెత్తి, వేళ్లని వెనక్కి పెట్టి, తరుణ్ నెత్తిమీద గట్టగా ఒత్తుతూ. "చల్లగా ఉండు బాబు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలెేదు. వచ్చినా పట్టించుకోలేదు. సమయానికి దేవుడిలా వచ్చావ్. బంగారుకొండ" అంటూ మరోసారి దీవించి వెళిపోయాడు. నిజానికి ఆ వ్యక్తి ఒక హిజ్రా. తనకేమీ అర్ధం కావడంలేదు. అసలేమయింది.. తన పర్స్ కొట్టేసిందా అనుకుని చెక్ చేసుకున్నాడు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. మరేంటి తన ఉద్దేశ్యం.. అలా ఆలోచిస్తూ ఇల్లు చేరాడు. భార్యచేతి భోజనం చేసిన కాసేపటికి తేరుకున్నాడు. అపరిచిత వ్యక్తితో ఒక అరగంట ప్రయాణం అతనిలో ఎన్ని భయాలు కలిగించింది. ప్రతికూల భావాల రైళ్ళను పరిగెట్టించింది. అవన్నీ గుర్తుచేసుకుంటుంటే అతనిలో ఒకరకమైన పశ్చాత్తాపం. "నన్ను, దేవుడిలా భావిస్తే తనని దొంగ అనుకున్నాను. దీవించి వెలిపోయాక కూడా, పర్స్ కొట్టేసింది అనుకున్నాను.. ఎంత చీప్ గా ఆలోచించాను!" తలుచుకుంటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కన్నీరు లోపలకి జారి మనసును శుభ్రం చేస్తోందనుకుంట. మాలిన్యపు మరకలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. "హిజ్రా అయితే ఏంటి! తనేమీ ఏలియన్ కాదుగా, సాటి మనిషి. తనకీ ఓ గమ్యం ఉంటుంది. అది చేరే ప్రయత్నం తనూ చెేస్తుంది. సహాయం కోరుతుంది. ఇంత చదువుకుని నేనెందుకు ఆ సమయంలో అందరిలా ఆలోచించాను." తన ఆత్మసాక్షి తననే నిలదీస్తుంటే, తప్పుచేసిన భావంతో తలదించుకున్నాడు. పేరు కూడా తెలియని ఆ వ్యక్తికి తనలో తానే క్షమాపణలు చెప్పుకున్నాడు...

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు