పూర్వం సరయు నది తీరాన సదానందుడు అనే మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ మహర్షి మిక్కిలి దయగలవాడు. యజ్ఞయాగాది క్రతువులను సక్రమంగా నిర్వహిస్తూ అమితమైన సత్ప్రవర్తనతో జీవించేవాడు.
ఒక రోజు అర్ధరాత్రి తన ఆశ్రమం తలుపులు ఎవరో దబదబ కొడుతున్న శబ్దం వినిపించింది. గాఢనిద్రలో వున్న సదానందుడు ఉలిక్కిపడి లేచాడు. కళ్లు నులుముకుంటూ లేచి వెళ్లి తలుపులు తెరిచాడు.
ఎదురుగా ఆయాశంతో రొప్పుతూ చెమటలు కక్కుతున్న ఓ వ్యక్తి నిల్చొని వున్నాడు. అతడి ముఖంలో ఏదో భయాందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గొంతు సవరించుకుంటూ ‘‘ ఎవరు నాయనా నువ్వు? నీకేం కావాలి.?’’ అని ప్రశ్నించాడు సదానందుడు.
‘‘ స్వామీ! నా పేరు గంగులు..ఈ పట్టణంలో పేరుమోసిన గజదొంగను..నా దురదృష్టం కొద్దీ ఈ రోజు ఒక దుకాణంలో దొంగతనం చేస్తుండగా పోలీసుల కంట పడ్డాను. వారు నన్ను చూసి నా వెంట పడ్డారు. ‘‘ దయచేసి నన్ను రక్షించండి..’’ అంటూ మహర్షి కాళ్లపై పడ్డాడు గజదొంగ గంగులు.
సదానందుడు ఏమీ ఆలోచించలేదు. అతడిని తన దివ్య శక్తితో ఓ మూషికంగా మార్చివేశాడు.
అంతలో గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. ‘‘ స్వామీ ఓ దొంగ ఇటు పరిగెత్తాడు..మీ ఆశ్రమంలోకి ఏమైనా వచ్చాడా?’’ ప్రశ్నించారు పోలీసులు.
‘‘ లేదు నాయనా ఈ ఆశ్రమంలో నేను..నా ఇద్దరు శిష్యులు తప్ప ఎవరూ లేరు..’’ అన్నాడు మహర్షి.
మహర్షి సమాధానం విని అక్కడి నుండి పోలీసులు వెళ్లిపోయారు.
అదే సమయానికి అక్కడే తిరుగుతున్న ఎలుకను ఓ పిల్లి చూసి ఎగిరి దూకింది. ఈ హఠాత్పరిణామానికి ఎలుక రూపంలో వున్న గజదొంగ గంగులు భయంతో వణికిపోయాడు.
ఈ సారి ఎలుకను ఓ శునకంగా మార్చాడు సదానందుడు. అక్కడే వున్న పిల్లి కుక్కను చూసి ఆశ్రమంలో ఇటు అటు పరుగులు తీసింది. ఈ శబ్దానికి నిద్రిస్తున్న ఓ భక్తుడు నిద్రాభంగంతో కోపోద్రిక్తుడై పెద్ద కర్రను కుక్కపైకి విసిరాడు.
ఇది చూసిన సదానందుడు శునకం రూపంలో వున్న గజదొంగ గంగులును ఓ కుందేలుగా మార్చాడు. ఈ సారి ఆ కుందేలు ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం ప్రహరీ వెలుపలకు వచ్చింది. వీధిలో వెళుతున్న ఓ వ్యక్తి కుందేలును చూసి జిహ్వరుచి ఆపుకోలేక ఓ కత్తి తీసి విసిరాడు. తనపైకి కత్తి దూసుకురావడం చూసిన కుందేలు భయాందోళనతో పరిగెత్తి ఆశ్రమంలో దాక్కుంది. దానిపైకి కత్తి దూసుకురాకముందే గజదొంగ గంగులును మనిషి రూపంలోకి మార్చాడు మహర్షి.
‘‘ చూశావా నాయనా! కేవలం ఓ రెండు గంటల లోపు నీకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో..అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు కదా?.. వివిధ రూపాలలో వివిధ జన్మల లక్షణాలతో క్షణ కాలంలో నువ్వు మృత్యువు నుండి తప్పించుకుని బయట పడ్డావు కదా..అన్ని జన్మలలోకెళ్లా ఉత్తమోత్తమైనది మానవ జన్మ..ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మలో జన్మించి కూడా మానవత్వం విలువ తెలుసుకోలేక ఇంత కాలం ఇతరులనుదోచుకుంటూ అన్యాయంగా వారిని హతమారుస్తూ జీవనం సాగించావు.. ఇకనైనా మానవ జన్మ విలువను గ్రహించి జీవిస్తావని ఆశిస్తాను..!’’ అన్నాడు మహర్షి సదానందుడు.
ఆ మాటలు విన్న గజదొంగ గంగులుకు జ్ఞానోదయమై తన తప్పుకు క్షమించమని కోరి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మానవత్వం వున్న మనిషిగా జీవించడానికి ముందుకు నడిచాడు.