పనిమనిషి - టి. వి. యెల్. గాయత్రి.

Pani manishi

ఆ రోజు ఒకటో తారీఖు.సరసు కూతురు గీతకు జ్వరంగా ఉంది. నిన్నటి నుండి నలతగా ఉంది.ఈ రోజుకు జ్వరం ఎక్కువయ్యింది. పనికి వెళ్ళటానికి తయారవుతున్న భర్తను పిలిచింది సరసు. "ఇయ్యాల పనికి పోమాక!పిల్లదానికి జొరం. వొళ్ళు పెనంలా కాగిపోతాఉండది." బుర్ర గోక్కున్నాడు రమణ.అతడు తాపీ పని చేస్తాడు. బిల్డింగ్ పని ఇంకా అవలేదు. ఒకటో తారీఖు. మేస్త్రీ అందరికీ కూలి డబ్బులిస్తాడు. "ఇయ్యాల సాయంత్రం మేస్త్రి కూలి ఇస్తాడే!నా కెట్టా కుదురుద్ది? నువ్వే ఎట్టాగొట్టా చూడు!బేగి వస్తాలే!"అన్నాడు. సరసు నాలుగిళ్లల్లో పాచిపని చేసుకొని వస్తుంది. రమణ తాపీ పనికెళ్తాడు. ఆ వాడలో అందరు కూలీ నాలీ చేసుకొనే వాళ్ళే. ఒక పూట కూలీకెళ్ళకపోయినా గడపలేనట్టి బతుకులు. సరసు తొమ్మిదింటికి కల్పవల్లమ్మ ఇంట్లో పనికెళ్లాలి. అక్కడి నుండి ఇంకో మూడిళ్లలో పని. అంతా అయ్యేసరికి ఒంటిగంట. మళ్ళీ సాయంత్రం నాలుగింటికి పనికెళ్తే రాత్రి ఏడింటికి ఇల్లు చేరుతుంది. ఇద్దరు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్ లో చదువుకొంటున్నారు. పెద్ద పిల్లకు నిన్నటి నుండి బాగలేదు. ఈ రోజు జీతాలు వస్తాయి. జీతం డబ్బులు తీసుకొని వద్దామనుకొంది సరసు. ఎదురింట్లోకి చూసింది. మంగమ్మత్త చేటలో బియ్యం ఏరుకుంటూ కనిపించింది. 'ఈ దినం పనికెళ్ళదు కాబోలు 'అనుకొని "అత్తా!ఇయ్యాల నువ్వు పనికి పోలేదా?"అంది. "లేదే!మా అమ్మగారు ఊరెళ్లారు."బదులిచ్చింది మంగమ్మ. "హమ్మయ్య!"అనుకొని "అత్తా!నేను పనిలోకి పోవాల!పిల్లదానికి జొరం. కాస్త చూస్తూ వుంటావా!నేను బేగొస్తా!ఆస్పత్రికి తీసుకుపోతా!"అంది సరసు. "సరే!నువ్వు పో!పిల్లకు కాపీ తాపించేదా!" "అత్తా! బన్ను రొట్టె తెచ్చి పెడతా!మధ్యలో పెట్టు!"అంటూ మెడికల్ షాపుకు పరిగెత్తి మందుబిళ్ళ తెచ్చి పిల్ల చేత మింగించింది.బన్నురొట్టె మంగమ్మకు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పనిలోకి వెళ్ళింది సరసు. కల్పవల్లి ఇంట్లో పనిమనిషి సరసు. నిన్న కల్పవల్లి కూతురు వందన పెళ్ళి చూపులు. వచ్చినపెళ్ళి వాళ్లకు టిఫిన్లు పెట్టడానికి వెండి గ్లాసులు, వెండి పళ్ళాలు తీసింది కల్పవల్లి. కల్పవల్లికి హంగు ఆర్భాటం ఎక్కువ. తాను జమిందారీ కుటుంబంలో పుట్టానని అదే పద్ధతులు ఇప్పటికీ పాటిస్తూ ఉంటుంది. జమీలు లేకపోయినా ఆస్తులు కొంత కరిగిపోయినా అప్పటి దర్పం ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది.భర్త మురళీధర రావు,కొడుకు రఘురామ్, కోడలు సుజన, మనవడు ప్రభాస్, కూతురు వందన ఇదీ ఆమె కుటుంబం. పెళ్ళిచూపులయ్యాయి. సరసు అన్ని సామాన్లు తోమి, ఇల్లు శుభ్రం చేసి, కల్పవల్లి చెప్పిన పనులన్నీ చేసి పెట్టి ఇంటికెళ్ళింది. ఆ రాత్రిదాకా కల్పవల్లి కుటుంబసభ్యులంతా పెళ్ళివాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. రాత్రి భోజనాలయ్యాక వెండి సామాను లోపల పెడదామని అన్నీ లెక్క చూసింది కల్పవల్లి. వెండి గ్లాసొకటి తక్కువయ్యింది. "ఎక్కడికి పోతుందత్తయ్యా!ఇక్కడే ఉంటుంది."అంటూ ఇల్లంతా వెదికింది సుజన. పిల్లలు కూడా చూశారు. ఊహు!కనిపించలేదు. "ఒక వేళ తోమి పెట్టిన గిన్నెల్లో ఉందేమో!"అంటూ గిన్నెల రాక్ లో అంతా వెదికింది సుజన. కనిపించలేదు. "ఒక వేళ సరసు కొట్టేసిందేమో!"అనుమానంగా ఉంది కల్పవల్లికి. "ఛ ఛ!అరేళ్ళనుండి చేస్తోంది దానికి దొంగబుద్ది లేదత్తయ్యా!"అంది సుజన నమ్మకంగా. "ఏమో!తక్కువ వాళ్ళు!ఎవరినీ నమ్మలేం!మందంగా ఉండే వెండిగ్లాసు. మా పుట్టింటి వాళ్ళిచ్చింది. తోమడానికి వేసినప్పుడు కొట్టేసిందేమో!" "మీరు తొందర పడకండి!ఎంత మంది మనింటికి రాలేదు? ప్రతిసారీ వెండిసామాను సరిగ్గా తోమి పెట్టి వెళ్తుంది సరసు. అనవసరంగా దాన్ని అనుమానించకండి!"అంటూ ఇల్లంతా మళ్ళీ గాలించింది సుజన. రాత్రి పడుకున్నదన్నమాటేగానీ కల్పవల్లికి బాధగా ఉంది. "బంగారం లాంటి గ్లాసు. అన్నీ ఉన్నాయి. ఎంత నమ్మకంగా కొట్టేసిందో జాణ. ఎంతంత పెట్టిపోసినా, అప్పుడప్పుడూ అవసరానికి డబ్బులిస్తూ వున్నా నీచపు గుణం ఎక్కడికి పోతుంది? మొన్నటికి మొన్న కొత్తకారకం పోని చీరలు రెండు దాని మొహాన కొట్టాను. విశ్వాసం లేదు దొంగముండకి."అంటూ భర్త దగ్గర వాపోతూనే ఉంది కల్పవల్లి. తెల్లవారింది. కల్పవల్లి చిందులు తొక్కుతూ ఉంది. "ఆ ముదనష్టపది వస్తే నిలదీయాలి. దానికి జీతం ఇచ్చేది లేదు. అసలు వెంటనే పోలీసులను పిలిపించు!వాళ్ళు రెండు తగిలిస్తే గ్లాసు తెచ్చిస్తుంది!" "కాస్త నెమ్మదిగా ఉండమ్మా!వెనకటి రోజులు కావు!ఏదో ఒకటి పెట్టుకొని గొడవ. వెండి గ్లాసుకోసం రాద్దాంతం చెయ్యకు!ఇంట్లో ఎక్కడో ఒకచోట ఉంటుంది. పోలీసులెందుకు? ఇప్పుడు మనకు ఇంకో పనిమనిషి దొరకటం కూడా కష్టం!"విసుక్కున్నాడు రఘురామ్. కల్పవల్లి నోరుకు జడిసి 'గుండమ్మ 'అనుకుంటూ పనిమనుషులు కల్పవల్లి దగ్గర నిలిచి పనిచేయటం కష్టం.ఆ విషయం ఆమె కొడుక్కు, భర్తకు బాగా తెలుసు. వయసు మళ్ళి కల్పవల్లి కాస్త మెత్తబడింది కానీ రఘురామ్ చిన్నప్పుడు ఒక్క పనిమనిషి కూడా పట్టుమని రెండు నెలలు పనిచేస్తే ఒట్టు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టింది సరసు. "నిన్న వెండి సామాను తోమావు కదా!గ్లాసు గానీ తీసికెళ్ళావా?"చెప్పు!"అంటూ హుంకరించింది కల్పవల్లి. కల్పవల్లి అరుపు విని బిత్తరపోయింది సరసు. ఏమైందో అర్థం కాలేదు మొదట. కాసేపటికి విషయం బుర్ర కెక్కింది. "అమ్మగారూ!నాకు తెలియదమ్మా!ఇన్నేళ్లబట్టి చేస్తున్నా!అందరినీ కనుక్కోండమ్మా!పేట పేటంతా నా గురించి ఏమని చెప్తారో!అట్టాంటి దాన్ని కాదమ్మా!మా ఇంటా వంటా అట్టాంటి గుణమే లేదమ్మా!నేను వెదుకుతా!చూడండి!క్షణంలో దొరుకుద్ది!"అంటూ ఇల్లంతా వెదికింది. ఎక్కడా దొరకలేదు. "నిన్ను నమ్మినందుకు నాదే బుద్ధి తక్కువ!ఈ నెల జీతం ఇచ్చేది లేదు. దిక్కున్న చోటుకు ఫో!నీ లాంటి వాళ్ళను పోలీసు స్టేషన్ లో పెట్టించాలి..." కల్పవల్లి దుర్భాషలాడుతూనే ఉంది. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ గోడకానుకొని నిల్చుంది సరసు. ఒంట్లో ఉన్న సత్తువంతా తోడేసినట్లుంది. 'తనే పాపం ఎరుగదు. తను దొంగతనం చేసినట్లు ఎంతమందికి చెప్తుందో!అమ్మగారి నోటి దురుసుతనం తనకు తెలియంది కాదు. ఇంకో మూడిళ్ళుకూడా ఆ వీధిలోనే ఉంటాయి. వాళ్లకందరికీ చెప్పి పని ఎక్కడా దొరక్కుండా చేస్తే తన గతేమికాను?....' అలాగే నిల్చుని ఆవిడ చేత తిట్లు తిని తిని బయటకు కదిలింది సరసు. ఇంకో పనిమనిషిని పంపించమని తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి వంటపనిలో పడింది సుజన. మధ్యాహ్నం ఇంటికొచ్చింది సరసు. పిల్లను తీసికొని ఆస్పత్రికి వెళ్లొచ్చింది. పిల్లకు మందు వేసి బన్ను రొట్టె తినిపించి, మంగమ్మను చూస్తూ ఉండమని చెప్పి, రమణ పనిచేసే బిల్డింగ్ దగ్గరికి బస్సెక్కి వెళ్ళింది. భార్యను చూసి పనిచేస్తున్న వాడల్లా పని ఆపి గబగబా బిల్డింగ్ దిగి వచ్చాడు రమణ. "పిల్లదానికి ఎక్కువయిందా? ఏం జరమంట?"అన్నాడు ఆదుర్దాగా. భర్తను పట్టుకొని భోరుమంది సరసు. "ఏమైందమ్మీ?" ఏడుస్తూ విషయం చెప్పింది సరసు. "ఊరుకో అమ్మీ!ఆ దేవుడే ఉన్నాడు. నేనొచ్చి పెద్దయ్యగారితో మాట్లాడతాలే!"అంటూ భార్యను అనునయించి పంపించాడు రమణ. పనిపోయినందుకు కాదు. ఇంకెక్కడయినా దొరుకుతుంది. నిందపడటం ఎంత కష్టం. మధ్యాహ్నందాకా పని చేస్తూనే ఉంది సుజన.కొత్త పనిమనిషి దొరికేదాకా ఇంట్లో పని తప్పదు. అత్తగారిది జామిందారీ దర్పం.అటుపుల్ల ఇటు తీసిపెట్టదు.ఇంక ఆడబడుచు పెళ్ళి కావాల్సిన పిల్ల. ఆ అమ్మాయికి పని చెప్పకూడదు. వంటపనితోబాటు అదనంగా పనిమనిషి చేసే పనికూడా నెత్తిన పడ్డందుకు విసుగ్గా ఉంది సుజనకు. చిన్న బాబు ప్రభాస్ మూడేళ్ల వాడు. వాడు ఇల్లంతా బొమ్మలు, కాగితపు ముక్కలు పోస్తూ ఉంటాడు. రాత్రి రఘురామ్ కంప్యూటర్ చూసుకుంటూ ఉన్నాడు. వంటిల్లు సర్ది గదిలోకి వచ్చి బాబును పడుకోబెట్టింది. గదినిండా బొమ్మలు చిందరవందరగా... అన్నీ బుట్టలో పెడదామని బొమ్మల బుట్ట తీసికొచ్చింది. బుట్టలో బొమ్మల మధ్య మెరుస్తూ వెండి గ్లాసు.... "అత్తయ్యా!"కేక పెట్టింది సుజన సంతోషంగా. "వెండి గ్లాసు వెండి గ్లాసు "అంటూ ఎగురుతోంది సుజన. కోడలి చేతుల్లోంచి గ్లాసు తీసికొంది కల్పవల్లి. "భడవాకానా!వీడి బొమ్మల్లో పడేసుకున్నాడూ!మనం గమనించలేదే అమ్మాయ్!అయినా మా పుట్టింటివాళ్ళ సొమ్ము. ఎక్కడికీ పోదులేవే!మన వస్తువు మనకే తిరిగిస్తుందని అనుకుంటూనే ఉన్నానే!ఎంతయినా మీ తాతయ్య గుర్తురా!మొత్తానికి దొరికింది." "గ్లాసు మన దగ్గరే ఉంది కదమ్మా!అనవసరంగా పనిమనిషిని అనుమానించావు. రేపు సరసుని పిలువు!అలవాటయిన మనిషి. నమ్మకంగా చేస్తుంది. ఇంకెప్పుడూ ఇలా గొడవ చెయ్యకు!"అన్నాడు రఘురామ్.మెల్లగా చెప్పినా కూడా కొంత కఠినత్వం తొంగిచూసింది గొంతులో. మౌనంగా ఉంది కల్పవల్లి. రెండోరోజు సరసుకు పిలుపొచ్చింది. వెండిగ్లాసు దొరికిందని, మనసులో ఏమీ పెట్టుకోకుండా పనిలోకి రమ్మని పక్కింటి పనిమనిషి చేత చెప్పి పంపించింది సుజన. "నా మీద అంత నింద వేశారు. నేను వెళ్ళను. నాకు మాత్రం చీమూ నెత్తురూ లేదా?"అంది సరసు. "మనం చిన్నవాళ్ళమే!ఆళ్ళు పెద్దోళ్లు. మనల్ని ఒకమాట అన్నాకూడా తలొంచుకొని పోవాల!ఎప్పటాలనుంచో అదేగా నడస్తా ఉందీ లోకంలో. మనలాంటోళ్లకు చీమూ నెత్తురూ ఉండకూడదే!అగ్గి లాగా ఆకలొక్కటే ఉంటది. అదెట్టా తీరద్దా అనే దిగులొకటే ఉంటది. పెద్ద ఇల్లు. మిగిలింది తగిలింది పెడతారు. చీర సారె పడేస్తారు. చాకిరీ చేసి మన పిల్లగోళ్ళను పెంచుకునేటోళ్ళం. మనం ఆళ్ళను ఎగర్తించి మాట్లాడొచ్చా!మనమెంత? మన బతుకెంత? గడ్డిపరకంత చేస్తామా? పనిలోకి వెళ్ళమ్మా!"అంది మంగమ్మ. లోకజ్ఞానం నిండి ఉన్న మంగమ్మ చెప్పింది విని అవునన్నట్లు తల ఊపి భార్యవైపు చూశాడు రమణ. అవును నిజం!యుగాల నుండి జరుగుతున్నదే!ఈనాడు మారుతుందా? మనమేంటో మన తాహత్తేంటో చూసుకోవద్దూ! తలవంచుకొని మౌనంగా పనిలోకి వెళ్ళింది సరసు అనే 'పనిమనిషి.' ## సమాప్తం ##

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు