కన్యక కళ్యాణం - తటవర్తి రాజేష్

Kanyaka kalyanam

'పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయాట. అది నిజం అయితే గంతకి తగ్గ బొంతలా నా చదువు, నా ఇష్టానికి అనుగుణంగా ఎవడో ఒకడు ఎక్కడో పుట్టే ఉంటాడు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనేవాళ్లు అవి వచ్చేవరకూ ఎదురుచూడచ్చుగా.. అహ. లేడికి లేచిందే పరుగు అన్నట్టు అనుకున్న వెంటనే ఆహ్వాన పత్రికలు కొట్టించాలి అనేసుకుంటారు. మొన్ననే "నీ ఇష్టం తల్లీ.. నువ్వెంతైనా చదువుకో" అన్నారు.. ఈరోజు ఉదయం పేరయ్య తెచ్చిన పెళ్లి కబురు అనే కత్తెరతో, నా ఆశల రెక్కలు కత్తిరించి పడేసారు.' అని నిరుత్సాహంగా కూర్చుంది కన్యక. "అక్కకి పెళ్లా.. ఆహా!" 'ఇంట్లోంచి ఎపుడు గెంటేస్తున్నారు.!' అన్నట్టే వినిపిస్తోంది తమ్ముడి గొంతు. షాపింగ్ మాల్ లో చీరల బేరంలా ఓచిన్న సైజ్ హడావిడి. "కుర్రాడి రంగు, ఎత్తు అన్నీ బావున్నాయి. పైగా కట్నం కూడా తక్కువ. ఇలాంటి సంబంధాలు మళ్లీ ఎప్పుడో కానీ దొరకవు. ఇంకేం ఆలోచించకుండా చేసేయండి." ఇవి చుట్టూ ఉండే చుట్టాల మాటలు. వీటన్నిటినీ చుట్ట చుట్టి చుట్టలా కాల్చిపారేయాలి అన్నంత కోపం వస్తోంది తనకి. "ఎలా అయినా ఈ గండం నుంచీ బయటపడేయ్ స్వామి. నెక్స్ట్ సెమిస్టర్ లో కష్టమైనా ఓ రెండు పాయింట్లు ఎక్కువ తెచ్చుకుంటాను." అని మొక్కుకుంది. పాపం దేవుడికి ఇవ్వాల్సిన లంచం ఎంటో కూడా తెలియని పసితనం తన మనసుది. ఇంతలో ఫోన్ కాల్.. "పెళ్లివారే అనుకుంట" అంటూ ఫోన్ తీసాడు ఆమె తండ్రి కళ్యాణ్. 'సంబంధం కేన్సిల్' అనే తీపి కబురు యావరేజ్ స్పీడ్ తోనే కన్యక చెవిని చేరింది. "దేవుడా నువ్వున్నావ్..." పైకే అనేసింది కన్యక. ఆ అమాయకురాలిని మరుసటి రోజే తండ్రి కళ్యాణ్ దగ్గరకి రమ్మని పిలిచి, "నువ్వేదయినా ఉద్యోగం చేయాలి తల్లి. ఈరోజుల్లో అబ్బాయిలు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అని అడుగుతున్నారు". అన్నాడు. 'రేపు బంద్. స్కూల్ కి సెలవు'. అనే నోటీస్ వచ్చిన పది నిమిషాల తర్వాత, "ఎళ్లుండి ఎక్జామ్ పెడతాను సిలబస్ రాసుకోండి!". అన్న టీచర్ ని స్టూడెంట్ చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయింది. 'పెళ్లి వద్దనుకుంటున్నదే పిజి టాప్ ర్యాంక్ తో కంప్లీట్ చేయాలని. నెట్ క్వాలిఫై అయి డాక్టరేట్ పొందాలని. ఇపుడు ఉద్యోగం చేస్తూ చదివితే పాస్ మార్కులైనా వస్తాయా...' ఆమె మనసంతా ఒక రచయితగా ఫీలయ్యే నేను కూడా వర్ణించలేని ఆందోళనతో నిండిపోయింది. "ఆ తర్వాత..." అంటూ సాగదీసాడు తండ్రి. 'ఇంకా అయిపోలేదా!!' అన్నట్టు అనుమానంగా చూసింది కన్యక. "ఎమ్ బి ఎ చేస్తే బావుండేది అని అభిప్రాయ పడుతున్నారు. "బాబాయ్ హోటల్ లో పెసరట్టు ఎలా కాల్చాలో కొత్త కస్టమర్ చెప్పినట్లు ఎన్ని కండీషన్లు చెప్పాడో ఆ కాకరకాయ గాడు." కన్యకకి తిట్టుకోవడం కూడా రాదు. అంత పద్దతిగల పిల్ల. ప్యూర్ వెజిటేరియన్. " సర్లే ఇవన్నీ వదిలేసేయ్. ప్రశాంతంగా చదువుకో. నీ లైఫ్ నీ ఇష్టం.. నీ ఉద్యోగం సంగతి నే చూసుకుంటాలే.. నీచేత ఈ పిజి అయిపోయాక ఎమ్.బి.ఏ చేయిస్తాను. ఒకే నా.." అపరిచితుడు సినిమా చూస్తున్నట్టే ఉంది. రెండు రోజులు గడిచాయొ లేదో పేరయ్య కొత్త కత్తెరతో మళ్లీ వచ్చి, సరికొత్త డిమాండ్ల చిట్టా విప్పాడు. తన జీవితానికి ఒక డిజైనర్ కమ్ డిస్టిబ్యూటర్ అయి సేవలందిస్తున్న పెళ్లికాని ఆ పెళ్లిళ్ల పేరయ్యని చూస్తే అర్ధమవుతోంది. పెళ్లిళ్లు నిర్ణయించేదీ, వారికి అనుగుణంగా తీర్చిదిద్దేది, తీర్మానించేది అన్నీ భూలోకంలోనే అని. సంతకాల కింద స్టాంప్ మాత్రమే స్వర్గానిది అని.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు