తానొకటి తలిస్తే! - బాలు కావలిపాటి

Taanokati taliste

“ఏంటయ్యా”! “నేను ఎంత ముఖ్యమైన పనిలో ఎవరికోసం వెయిట్ చేస్తున్నానో తెలుసుగా ఎందుకు ఫోన్ చేస్తున్నావ్” అని చిరాకు నిండిన స్వరంతో అన్నాడు హోంమినిస్టర్ నాగభూషణరావు. “తెలుసు సర్ కానీ ఒక ముఖ్యమైన, మీకు పనికివచ్చే అప్ డేట్ ఇద్దామని చేసాను” అన్నాడు అట్నుంచి P A శంకర్ కొంచం వణుకుతున్న స్వరంతో. “ఏంటో తొందరగా చెప్పు” అన్నాడు మరింత చిరాకుగా నాగభూషణరావు. “ఇప్పుడే తెలిసిన వార్త సర్, వచ్చే నెల 8వ తారీఖున మంత్రివర్గ విస్తరణ ముహూర్తం అంట సర్. దాన్నిబట్టి మీరు ప్లానింగ్ చేసుకోండి” అని ఫోన్ పెట్టేసాడు శంకర్.

వెయిటింగ్ రూమ్ లో సిద్ధాంతి కోసం వెయిట్ చేస్తున్న నాగభూషణరావు ఈ వార్త విన్న తర్వాత తాను అనుకున్న పధకం 8వ తారీఖు కన్నా ముందే అమలు చేయొచ్చేమో సిద్ధాంతిని కనుక్కుందాం అనుకున్నాడు. ఈలోగా లోపలి రమ్మని కబురు వచ్చింది. నాగభూషణరావు లోపలి వెళ్ళగానే సిద్ధాంతి "ఏమి అనుకోకండి సర్ ముందున్న వాళ్ళు కొంచం ఎక్కువ డౌట్స్ అడిగారు వాళ్ళ సమస్య అలాంటిది. అందుకే కొంచం ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది” అన్నాడు. “దానిదేముంది గురువుగారు పర్లేదులెండి” అంటూ డైరెక్ట్ గా తన మనసులో ఉన్నది చెప్పడం మొదలెట్టాడు నాగభూషణరావు.

"నా జీవితం మొత్తం తెరిచిన పుస్తకం అండి. చిన్నప్పుడు చాలా బీద కుటుంబంలో పుట్టి , సరిగ్గా చదువుకోక, బలాదూర్ గా తిరిగి తల్లిదండ్రుల వయసు అయిపోయాక కుటుంబ పోషణ కోసం చిన్నచిన్న పనులు, అబద్దపు సాక్ష్యాలు చెప్తూ మెల్లమెల్లగా ఒక లోకల్ లీడర్ ప్రాపకం పొంది ఆయన దగ్గర జాయిన్ అయిన నేను అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు హోమ్ మినిస్టర్ అయ్యాను. ఎలాంటి పరిస్థితులలో అయినా నేను భయపడకుండా నిర్ణయాలు తీసుకునేవాడిని ఎందుకంటే ఆ నిర్ణయాలు తప్పు అయినా కూడా నేను చిన్నప్పుడు అనుభవించిన దరిద్రం కన్నా ఇంకా దిగజారను అనే నమ్మకం. ఇప్పుడు నా వయసు 60 దాటింది. తరువాత ఎలక్షన్స్ కి ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఈలోగా నేను ఎలాగైనా ముఖ్యమంత్రి అయిపోవాలి ఎందుకంటే ఆ తరవాత రెండు టర్మ్స్ మా పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు. ఆ పై టర్మ్ అధికారంలోకి వచ్చినా కూడా నాకు ఓపిక ఉండదు. మీ గురించి చాలా రోజులుగా వింటున్నా. అందుకే మిమ్మల్ని కలిస్తే నా కోరిక తీరే ఉపాయం అందుకు కావాల్సిన విధానం చెప్తారు అని వచ్చాను” అని ముగించాడు.

అంతా సావధానంగా విన్న సిద్ధాంతి "నేను అంత నేను ఇంత, ఫలానా వాళ్ళకి అలా చేయించాను, ఫలానా హీరోకి నెం 1 స్థాయి వచ్చే హోమాలు చేయించాను, ఫలానా హీరోయిన్ కి సమస్యల నుండి బయటపడే యజ్ఞాలు చేయించాను, చాలామంది వ్యాపారస్తుల రుణబాధలు తీర్చే యాగాలు చేయించాను" అని తన స్వోత్కర్ష చెప్పుకుని సాలోచనగా నాగభూషణరావు వైపు చూస్తూ అడిగాడు "మీరు ఇప్పటిదాకా అన్నీ సొంతంగానే సాధించుకున్నారు కదా, ముఖ్యమంత్రి పదవి కూడా అలానే మీకు నచ్చిన సామ దాన బేధ దండోపాయాలు ద్వారా సాధించుకోవచ్చు కదా ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారు?" అని.


"మీరు అన్నది విన్నది నిజమే. నేను ఇప్పటిదాకా అన్ని అలానే సాధించుకున్నాను. రెండేళ్ల క్రితం జరిగిన ఎలక్షన్లలో కూడా నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని. కానీ సరిగ్గా ఎలక్షన్స్ ముందర మా అబ్బాయి ఒక అమ్మాయితో హోటల్ రూంలో అభ్యంతరకర పరిస్థితులలో మీడియాకి కంటపడ్డాడు. ఆ దెబ్బకి నాకు టికెట్ కూడా రాని పరిస్థితి. కానీ అప్పుడు ఆ అమ్మాయికి మా అబ్బాయికి ఒక గుడిలో నామమాత్రంగా పెళ్లి జరిపించి, ఆ వివాహాన్ని ఆదర్శ వివాహంగా చూపించి మరోవైపు సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించి టికెట్ మరియు హోమ్ మినిస్ట్రీ కూడా సాధించుకున్నాను. కానీ మీకు ముందే చెప్పినట్టు నాకు ఓపిక, టైము లేవు. అందులోనూ ఇది నా జీవిత ధ్యేయం కాబట్టి ఇందులో నేను ఛాన్స్ తీసుకోదల్చుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను ముఖ్యమంత్రి అవ్వగానే ఆ అమ్మాయిని చంపను కానీ పోర్న్ వెబ్ సైట్స్ లో ఆ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేయించి, అక్రమసంబంధం అంటగట్టి, బ్రోతల్ కేసులో ఇరికించి ఇంకా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఆ అమ్మాయి తనంత తానే ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాను" అన్నాడు. అప్పుడు నాగభూషణరావు అసలైన వికృతరూపం చూసిన సిద్ధాంతికి ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది. ఈయన గురించి విన్నది చాలా తక్కువ అనుకున్నాడు. ఆ అమ్మాయి గురించి మనసులోనే జాలిపడ్డాడు. కొంచం మంచినీళ్లు తాగి స్థిమితపడి నాగభూషణం జాతక చక్రం పరిశీలించి “వచ్చే నెల 7వ తారీఖు బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది ఆ రోజున నేను ఒక హోమం చేయిస్తాను. వెంటనే మీకు అధికారం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు.

అది విన్న నాగభూషణరావు ఆనందంతో "8వ తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉంది. అది జరగగానే అసంతృప్తుల్ని చేరదీసి నేను అనుకున్న పధకాన్ని అమలు చేస్తాను” అన్నాడు. “నీ ప్రయత్నంలో నువ్వుండు నాయనా. నేను ఎన్ని యజ్ఞ హోమ యాగాలు నిర్వహించినా కూడా కార్యసిద్ధికి మానవప్రయత్నం కూడా అవసరం” అన్నాడు సిద్ధాంతి. “అర్ధమైంది గురూజీ మా P A మీకు టచ్ లో ఉంటాడు. 7వ తారీఖున కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు. నేను మంత్రివర్గ విస్తరణ తదుపరి కార్యాచరణ చూసుకుంటాను” అని బయల్దేరాడు.

35 ఏళ్ళ రాజకీయ అనుభవంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ హోమ్ మినిస్టర్ స్థాయికి చేరుకున్న నాగభూషణరావుకి చిరకాలవాంఛ ముఖ్యమంత్రి అవ్వడమే. ఆ స్థాయి అందుకోవడానికి కొన్నిరకాల ప్రయత్నాలు చేసి ఎందులోనూ సక్సెస్ అవ్వక ఆఖరి ప్రయత్నంగా చాలారోజుల నుండి జనాల నోళ్ళల్లో నానుతున్న ఈ సిద్ధాంతి గురించి తెలుసుకొని తన కార్యాచరణ మొదలెట్టాడు.

వచ్చే నెల 7వ తారీఖుకి ఇంకా నెల రోజులు టైం ఉంది. ఆలోపల తనకు మద్దతు ఇచ్చే ఎం.ఎల్.ఏ.లు మరియు మినిస్టర్లు అందరినీ కలిసి భవిష్యత్తు ప్రణాళిక వాళ్ళతో చర్చించి ఎవరెవరికి మినిస్ట్రీ, నామినేటెడ్ పదవులు మరియు బోర్డు మెంబెర్ షిప్ లు ఇవ్వాలో ఒక మాట అనుకుని, మంత్రివర్గ విస్తరణ తర్వాత మిగిలిన అసంతృప్తులని కూడా కలుపుకొని గవర్నర్ దగ్గర అవిశ్వాస తీర్మానం పెట్టి అందలం ఎక్కుదామని ఆలోచనలో ఉన్నాడు నాగభూషణరావు.

అనుకున్నదే తడవుగా తన వర్గం ఎం.ఎల్.ఏ.లు మరియు మినిస్టర్లని మిగతా కావాల్సినవాళ్ళని తన ఫార్మ్ హౌస్ కి రప్పించుకున్నాడు. అందరు రాగానే తన పధకాన్ని వివరించి అందరి ఆమోదం పొందాడు. మరొకవైపు P A శంకర్ 7వ తారీఖు హోమానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకున్నాడు. ఆ హోమానికి తన పర బేధం లేకుండా ముందుజాగ్రత్త చర్యగా అందరిని పిలిచాడు వైరి వర్గంతో సహా. ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా అన్నీ ఒకటికి పదిసార్లు చూసుకున్నాడు. అంతా సవ్యంగానే ఉంది అనే భరోసాతో 7వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నాడు.

7వ తారీఖు తెల్లవారుఝామున 3 గంటలకల్లా సిద్ధాంతి లేచి తయారయి నాగభూషణరావు ఇంటికి తన సహాయకులతో సహా వెళ్ళాడు. అప్పటికే అక్కడ నాగభూషణరావు మనుషులు కావాల్సిన సరంజామాతో సిద్ధంగా ఉన్నారు. నాగభూషణరావు సిద్ధాంతి సాదరంగా ఆహ్వానించాడు. సిద్ధాంతి ఇల్లంతా కలియతిరుగుతూ "ఏంటి ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారు కొడుకు కోడలు ఎక్కడ" అని అడిగాడు. “ఇంకోసారి ఆ పిల్లని కోడలు అని పిలవకండి అసలు తన ప్రసక్తి నా ముందు తీసుకురాకండి” అని కటువుగా సమాధానం ఇచ్చాడు నాగభూషణరావు. వాతావరణం తేలికపరచడానికి నాగభూషణరావు భార్య "అదేమీ లేదండి ఈయనకి కోపం తగ్గేవరకూ పిల్లల్ని దూరంగా ఉండమని నేనే చెప్పానండి, ఈ హడావిడి అయిపోయిన తర్వాత ఆయనే పిల్లల్ని ఇంటికి రమ్మంటారు" అన్నాది. “అవునవును ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత నేను వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తాను. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయించాను” అని నర్మగర్భంగా అన్నాడు. అతను అలా అన్నప్పుడు అతని మొహంలో నెలరోజుల క్రితం కన్నా ఎక్కువ కరుకుదనం చూసాడు సిద్ధాంతి.

ఇంక ఆ టాపిక్ కొనసాగించే ఉద్దేశంలేక, "నేను మడి కట్టుకోవాలి కొంచం ఏ రూమ్ వాడుకోవచ్చో చెప్తారా" అని అడిగాడు. "కింద హాల్ పక్కనే పిల్లల రూమ్ ఉంది అది ఎలాగూ వాడడం లేదు ఆ గది వాడుకోండి" అన్నాది నాగభూషణరావు భార్య. "సరే" అని ఆ గదిలోకి వెళ్ళి పంచె మార్చుకుంటున్న సిద్ధాంతి గోడకి ఉన్న నాగభూషణరావు కొడుకు కోడలు ఫోటో చూసి షాక్ కొట్టినట్టు స్థాణువయ్యాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి మరెవరోకాదు. తన కూతురు.

ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించి గొంతు తడారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం బయట ఊర్లో చదువుకుంటున్న తన గారాలపట్టి సడన్ గా ఒక రాత్రి ఫోన్ చేసి "నేను ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు మన ఇంట్లో ఈ వివాహానికి ఒప్పుకోరు అని. కానీ నేను ఈ పరిస్థితులలో వెనక్కి తగ్గలేను. అందుకే ఆ అబ్బాయితో వెళిపోతున్నాను. దయచేసి నన్ను వెతకకండి. నేను ఒక అనాధ అని నా కాబోయే భర్తతో చెప్పాను. ఈ విషయం మన ఊరిలో తెలిస్తే మీ స్థాయి, మన కుటుంబ పరువు మంటకలిసిపోతాయని నేను ఇన్నిరోజులు మీకు చెప్పలేదు, కనీసం ఒప్పించే ప్రయత్నం చెయ్యలేదు. దయచేసి నన్ను వెతకడానికి ప్రయత్నించకండి" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఈ విషయం ఊరిలో పూర్తిగా తెలియదు కానీ సిద్ధాంతి అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయింది అని చూచాయగా అందరు అనుకోవడం మొదలెట్టారు. ఇంక ఆ ఊరిలో మొహం చెల్లదని అర్ధమైన సిద్ధాంతి సిటీ వచ్చేసి ఊరితో పూర్తిగా సంబంధం తెంచేసుకుని తన వృత్తిలో తను నిమగ్నమై ఈ రెండున్నరేళ్లలో చాలా మంచిపేరు సంపాదించాడు. కుటుంబం అంతా కొంచం ఆ దుఃఖం నుండి తేరుకుంటున్న సమయంలో ఇలా అనుకోకుండా తన కూతురి గురించి తెలుసుకోవడం జరిగింది.

తన సహాయకులని పిలిచి "నేను రెడీ అవ్వడానికి ఒక గంట పడుతుంది ఈ లోగా ఎవ్వరినీ లోపలి రానివ్వకండి" అని చెప్పి తలుపు వేసుకున్నాడు. తనలో తాను కుమిలి కుమిలి ఏడ్చాడు. తన బంగారుతల్లి భవిష్యత్తు తలుచుకోగానే ఒళ్ళు జలదరించింది. తన ముద్దుల కూతురిని ఈ నాగభూషణరావు ఏ రకంగా శారీరక, మానసిక ఇబ్బందులకు గురి చేస్తాడో ఊహించడానికే భయం వేసింది. ఈ అమ్మాయి తన కూతురు అనిచెప్పి నాగభూషణరావుని బతిమాలాడుదామనుకున్నాడు కానీ వాడి నిజస్వరూపం తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం వ్యర్థం అనిపించింది. పోనీ ఎలాగోలా అల్లుడిని కలిసి విషయం చెప్పి ఎక్కడైనా దూరంగా బతకడానికి ఉన్నంతలో ఏర్పాటు చేద్దామనుకున్నా కానీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా నాగభూషణరావు పడగ నుండి తప్పించలేడు.

ఇలా ఒక అరగంట తనలోతాను విపరీతమైన అంతర్మధనం చెంది దీర్ఘంగా శ్వాస తీసుకొని తన కూతురు భవిష్యత్తు కాపాడడానికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక్కసారి దేవుడిని తలచుకుని సెల్ఫీ వీడియో స్టార్ట్ చేసి జరిగినది అంతా ఆ వీడియోలో విపులంగా చెప్పి తన భార్యకి, చుట్టాలకి, తను గతంలో కార్యక్రమం నిర్వహించిన పాత్రికేయ మిత్రుడికి పంపించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తెల్లారి 6 గంటలకల్లా బ్రేకింగ్ న్యూస్ అన్ని TV ఛానెల్స్ లో టెలికాస్ట్ అయింది. "హోమ్ మినిస్టర్ ఇంట్లో ప్రముఖ సిద్ధాంతి ఆత్మహత్య. కీలక ఆధారాలు సంపాదించిన పోలీసులు". తదనంతర పరిణామాలలో నాగభూషణరావు పదవి పోయింది.

తండ్రి నిజస్వరూపం తెలుసుకున్న కొడుకు వేరుకాపురం పెట్టి అత్తగారి బాధ్యత కూడా తానే తీసుకున్నాడు.
బతికుండగా కూతురు కాపురం చెక్కబెట్టలేకపోయిన సిద్ధాంతి, ఆత్మార్పణం ద్వారా తాను అనుకున్నది సాధించాడు.
ఏమి లేని స్థితి నుండి ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగిన నాగభూషణరావు అత్యాశ వలన పరువు,మర్యాద,పదవి కోల్పోయి ఆఖరికి కుటుంబసభ్యుల ఆప్యాయతకి కూడా నోచుకోలేని స్థితిలో ఊచలు లెక్కెడుతున్నాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు