సుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది. దాని ప్రక్క నుండి చంపానది ప్రవహించేది. అక్కడకు దగ్గర్లో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి. అక్కడ నివసించే మునులలో దేవదత్తుడుకి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు. అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థులైన శిష్యులు దొరికినప్పుడు వారికా విద్యలను భోధించేవాడు.
ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలోకెల్లా సమర్ధుడైన శిష్యుడుని ముందర కూర్చుండ బెట్టుకుని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడే అక్కడకు వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది. తోడేలుకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండడాన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది. అప్పటికి ఆ వేట సంగతి మరచిపోయి అడవిలోకి పరుగు తీసింది.
వెళ్లిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది తోడేలుకి. అప్పుడే ఆ దారిలో వెళుతున్న ఏనుగు మీద ఆ మంత్రాన్ని ప్రయోగించి, అది తనకు దండం పెట్టాలని, తనమీద కూర్చుండబెట్టుకుని అడవంతా తిప్పాలని కోరుకుంది తోడేలు.
మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకి వశమైంది. అది కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి, తన మీద కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఏనుగు మీద తోడేలు వూరేగడం చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోయి చూశాయి.
అంతలో అటువైపు వచ్చిన మృగరాజుకి కూడా ఈ దృశ్యం కనబడింది. “ఏనుగు మీద కూర్చుని వూరేగడానికి నీకెంత ధైర్యం?” అని తోడేలుని, “తోడేలుని ఎక్కించుకుని తిప్పడానికి సిగ్గులేదా?” అని ఏనుగుని కోపంగా అడిగింది సింహం.
“తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు మృగరాజా”అని బదులిచ్చింది ఏనుగు.
తోడేలు ఏమాత్రం భయపడకుండా ‘ఏం ఊరేగితే తప్పా?’ అని ఎదురు ప్రశ్నించింది. మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవరికీ భయపడక్కర లేదనుకుంది తోడేలు. ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాశ పుట్టింది దానికి .
అనుకున్నదే తడవుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది. తనని అడవికి రాజుని చెయ్యమని, అడవిలోని జంతువులను సమావేశపరచి తన ఆజ్ఞలు పాటించేలా చెప్పమని సింహానికి ఆదేశించింది. ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్టల్లా చేసింది.
రాజైన తరువాత ఆ తోడేలు మరీ విర్రవీగింది. అప్పటివరకు పదవుల్లో ఉన్న జంతువులను తరిమేసి తనవారిని ఏరికోరి రెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది.
అంతవరకు ఎవ్వరూ కూర్చోని విధంగా కొత్తరకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి. అప్పటి నుండి రెండు సింహాలు చెరోవైపు నిలబడి ఉండగా వాటి మీద మంచె కట్టించి, అక్కడ వేసిన ఆసనం మీద కూర్చునేది తోడేలు.
అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తుండగా అడవంతా ఊరేగేది తోడేలు. తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడూ కొరడాతో కొట్టడం, కాలితో తన్నడం చేసేది. తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టించేది. తోడేళ్ళు నచ్చినన్ని జంతువులను చంపవచ్చునని, మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది. ఎవరు వేటాడినా సగభాగం తనకి పంపమని ఆజ్ఞలు జారీ చేసింది.
కొన్నాళ్ళకు అడవిలోని జంతువులకు దినదినగండం నూరేళ్ళాయిష్షు లా అయింది అక్కడి పరిస్థితి. తోడేళ్ల బెడద పెరగడంతో కంటి మీద కునుకు లేదు సాధుజంతువులకి.
ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోనికి పరుగెత్తి స్పృహతప్పి పడిపోయింది. ముని శిష్యులు దానిని రక్షించారు. ఆ జింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది. దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు. దుష్ట తోడేలుకి బుద్ధి చెప్పాలనుకుని ఉన్నపళంగా బయల్దేరాడు.
ముని వెళ్లేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చుని ఆహారం తింటోంది తోడేలు. రెండు ఏనుగులు ఆహారాన్ని తొండాలతో అందిస్తుంటే తింటోంది. అడగ్గానే అందివ్వడానికి నీరున్న కూజాతో నిల్చుంది మరో ఏనుగు. వెడల్పైన ఆకులతో గాలి తగిలేలా విసురుతున్నాయి రెండు ఏనుగులు.
అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు. ‘ ఓ తోడేలు . ఇటు చూడు’ అని పిలిచాడు ముని.
మునిని చూసి ”బ్రతకాలని లేదా? ఇక్కడ కెందుకు వచ్చావు” అని అడిగింది తోడేలు. “ మంత్రాన్ని దుర్వినియోగం చెయ్యడం తప్పని చెప్పేందుకే వచ్చాను” అన్నాడు ముని.
తన తప్పు అంగీకరించలేదు తోడేలు. సరికదా “మునివన్న జాలితో వదులుతున్నాను. పారిపోతే బ్రతుకుతావు. లేదంటే సింహాల చేత చంపిస్తాను” అని తిరిగి బెదిరించింది.
గర్వంతో ఉన్న తోడేలుకి బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తుడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. “నీకు పోయేకాలం దాపురించి నందుకే అలా విర్రవీగుతున్నావు. నీకు నచ్చినట్టే చెయ్యు” అన్నాడు దానిని రెచ్చగొడుతూ.
దేవదత్తుడి మాటలను సహించలేకపోయింది తోడేలు. దానికి పట్టరానంత కోపం వచ్చింది. “ఆ మునిని చంపి పడెయ్యండి” అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది. సింహాసనాన్ని మోస్తున్న సింహాలు రెండూ భయంకరంగా గర్జిస్తూ ఒకేసారి ముందుకి దూకాయి.
అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది. ఆసనం వాలిపోగానే అక్కడనుండి క్రింద పడింది తోడేలు. గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్లేసరికి ఏనుగులు బెదిరిపోయి అటూ ఇటూ పరుగులు తీశాయి.అప్పటికే క్రింద పడి మూలుగుతున్న తోడేలుని అవి తమ కాళ్లతో తొక్కి చంపేశాయి.
తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరచేయి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవదత్తుడు. సింహాలు రెండూ తోక ఊపుతూ నిలబడ్డాయి తప్ప ముందుకి అడుగెయ్యలేదు. అప్పటికే ఏనుగుల పాదాల క్రింద నలిగి తోడేలు చనిపోవడంతో అడవికి పట్టిన పీడ విరగడయ్యింది. తరువాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది. దేవదత్తుడు కూడా శిష్యులకు విద్యను, కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.
---***---