వంశీకి నచ్చిన కథ - పొయ్యిలో పిల్లి - తనికెళ్ళ భరణి

poyyilo pilli telugu story

తెల్లారకపోతే బావుణ్ణు!

గుమస్తా... తెల్లారగట్ట నాలుగ్గంటల నించీ ఇది నలభయ్యోసారి అనుకోవటం... చచ్చినట్టు తెల్లారుతుందని.,. .,. .,. గూడా అలా గొణుక్కుంటూనే వున్నాడు.

గోడగడియారం నిముషాల కప్పల్ని టక్... టకా మింగేస్తోంది! భళ్ళున తెల్లారింది...

గుమస్తా గుండె ఒక్కక్షణం ఆగి మళ్లీ కొట్టుకోవటం ప్రారంభించింది... వొళ్ళంతా జ్వరం వొచ్చెసినట్టు... వొచ్చేస్తుంది! చిరతపులి... అవును... ఇవాళ ఆఖరి రోజు - ఇవాళ తెల్లారేసరికి మూడు వందలూ వడ్డీతో సహా కట్టక పోతే... చిరతపులి... కర్... కరా... కర్... కరా నమిలి పారేస్తుంది!

దుప్పటి మొహంమీదకి లాక్కుని వొణికి పోతున్నాడు. గుమస్తా పెళ్ళాం లేచింది పెద్ద కడుపుతో... పసుపు కొమ్మని కళ్ళకద్దుకుంది. గబగబా వాకిలి వూడ్చి... పేన్నీళ్ళు చల్లి... స్టౌ వెలిగించి కాఫీ నీళ్ళు పడేసింది...

పక్కన పొయ్యిలో పిల్లి! అది వారం రోజులుగా అక్కడే తిష్ట వేసింది... కుంపటి లేచింది(ఈ విడ గుమస్తాగారి కూతరు) రాత్రంతా తల కింద నలిగిపోయిన ప్రేమ నవలని ఎవరూ చూడకుండా సొరుగులోకి తోసేసి... బొగ్గు ముక్కని బుగ్గనెట్టుకుని పెరట్లోకి వెళ్ళింది.

గ్రాడ్యుయేట్ టోపీ... (గుమస్తాగారి... పుత్రుడు) బొంత కింద కలలు నేస్తున్నాడు... ఉద్యోగం... మొదటి జీతం... మందుపార్టీ... స్కూటర్... వెనక్కాల... అమ్మాయి... అమ్మాయి... మెడ మీద నల్లి కుట్టింది.

కలల పట్టు కుచ్చులన్నీ... అలా... అలా... గాల్లో తేలిపోయాయ్... మళ్ళీ రాత్రి కళ్ళల్లో గానీ తేలవ్!... గుమస్తా మెల్లిగా లేచాడు...

మొహం చెక్కతో చేసినట్టుంది... కళ్ళు గాజుగోళాల్లా వుంటాయ్... కళ్ళ వెనక్కాల గ్యాలన్లకొద్దీ కన్నీరు!... పెదాల మీద నవ్వు తెంపేసుకుని కొన్నేళ్ళయింది... అందుకే ఎప్పుడైనా నవ్వు దామని ప్రయత్నించినా నవ్వురాదు... వచ్చినా అది నవ్వు కాదు! వొచ్చేస్తుంది ఇంకో గంటలో... అవును వొచ్చేస్తుంది చి... ర... త... పు... లి!

"కాఫీ!" అంది... భార్య భారంగా.

గుమస్తాకి "అమృతం" అన్నట్టు వినిపించి చెయ్యిజూపాడు... ఇత్తడి గ్లాసులో... గోధుమరంగు కాఫీ... దాన్నిండా నల్లని పంచదార... పసుప్పచ్చ రేషన్ కారు... రెండు కిలోమీటర్ల పొడుగు క్యూ... తన నెత్తు... కళ్ళు మూసుకో! అంతా అంధకారం... ఎంత బావుందో... ఏమీ తెలీట్లేదు... వెచ్చటి కాఫీ గొంతులోకి పోతోంటే... భలే బావుంది...

గుమస్తా తన్మయత్వంలో వున్నాడు... ఏవీ వినపడటం లేదు... ఏమీ కనపట్టం లేదు.

బాత్ రూమ్ లో బూతుపాట!... పైకి వినపడకుండా గుండెల్లో గట్టిగా పాడేసుకుంటే కళ్ళు మూసుకుని నీళ్ళోస్కుంటోంది కుంపటి... కమ్మటి కలలు... ముద్ధులు... కావలింతలు, సెక్సూ అన్నీ సబ్బునురగతో కలిసి మోరిలోకి పోతున్నాయ్...

ఎంత చక్కటి వొళ్ళు తనది... ఎంత పెద్ద కళ్ళు తనవి... ఎంత మంది చూస్తుంటారు తన్ను... కానీ ఒక్క వెధవా పెళ్ళి చేసుకోడేం... ప్రతీవాడు ముట్టుకుంటాననేవాడేగానీ కట్టుకుంటాననేవాడేడీ!... తన అందం... తన వయసు... అంతా ఇలా కరిగి... కరిగి పోవల్సిందేనా...

గ్రాడ్యుయేట్ టోపీ లేచాడు... ఆవలించి బైటకొచ్చి ఎండలో కూర్చున్నాడు... వేళ్ళని వెచ్చటి ఇసకలో దొనిపి ఆలోచిస్తున్నాడు... వాడి మొహం అచ్చం... నలిగిపోయిన ఎంప్లాయ్ మెంట్ కార్డులాగుంది...

వాడి నవ్వు అచ్చం వెర్రాడి నవ్వులా వుంది!

ఇంటిల్లాలు స్నానంజేసి... పూజ్జేసుకుంటోంది... (వొంట ఎలాగా చెయ్యట్లేదు గనక)...

అక్కడ ఎంతమంది దేవుళ్ళు...

చాలా వెరైటీ దేవుళ్ళు...

దైవంశ గలవాళ్ళ మనుకునేవాళ్ళు...

అందరి మొహాల మీదా... ఎర్రగా కుంకం...

డేంజర్... డేంజర్ ని... సూచిస్తొన్నట్టు...

గుమస్తా గుండెల్లో ముక్కోటి (లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమందో వాడికి తెలీదు). దేవతలకీ... శతకోటి నమస్కారాలు పారేస్తున్నాడు -

బాబూ చిరతపులిని రాకుండా చెయ్యండి!

ఎదేవుడూ రెస్పాన్సివ్వలేదు!

ఏదో జంతువొస్తున్న శబ్దం!... గర్... కర్ కర్... అంటో... గుమస్తా గుండె గిలగిలా గిల్ గిలా... కొట్టుకుంటోంది!

వొచ్చేసింది... చీటా... చీటా... వొచ్చేసింది... తనని తినేస్తుంది!... బాబోయ్ రక్షించండి!

గజేంద్ర మోక్షంలో ఏనుక్కన్నా గొప్పగా గట్టిగా... బాధగా కసిగా... అరిచాడు...

అల వైకుంఠ పురంబులో... ఏ మూల సౌధంబో తెలీక ఆ కేక వెతుక్కుంటోంది...

అంతా నిశ్శబ్దం... ఊపిరి పీల్చని మౌనం...

వొచ్చింది!... చిరతపులి కాదు!... పందికొక్కు...

"ఏవయ్యా... ఇంటద్దె కట్టి ఎన్ని రోజులయిందిరా..." (దానికి వ్యాకరణంరాదు)

పందికొక్కు - అరుస్తోంది!

గుమస్తా... నరాల్లో రక్తం స్థంభించింది!

కడుపులో పిండం... గిర... గిరా... తిరుగుతోంది!

కుంపటి జడేసుకుంటోంది...

టోపీ... గడ్డం గోక్కుంటున్నాడు.

కడుపుతల్లి - తరుక్కుపోయేలా ఏడుస్తోంది...

పందికొక్కు... అరుస్తొనేవుంది...

"సాయంత్రం లోపల అద్దెకట్తే సరే లేదా (కలుగు) ఖాళీ చెయ్యండి" అని పెంకులు ఎగిరేలా అరిచాడు...

ఇంటికప్పు మీదున్న రెండుపెంకులూ కాలి కింద పడ్డాయ్...

కుంపటికేసి వోరగా... టోపీకేసి కోరగా చూసి -

రయ్! న వెళ్ళిపోయింది పందికొక్కు...

పొయ్యిలో పిల్లి... మూత్తుడుచుకుంది!

గుమస్తా హాపీగా ఫీలయ్యాడు...

అమ్మయ్య!... ఎంత రిలీఫ్... సాయంత్రానిక్కదా... చూద్దాం...

కుంపటికేసి చూశాడు గుమస్తా!

కన్నెగంపలో కుంపటి...

'ఏమిసేతురాలింగా... ఏమిసేతూ...' రేడియో... గోలెడ్తోంది పాపం!...

"అమ్మా కాలేజీకి టైమయ్యిందే" కుంపటి కేక.

"అంతారండి వొడ్డించేస్తాను" (అలవాటు ప్రకారం అనేసి నాలిక్కర్చుకుంది ఇల్లాలు).

"ఏం వొడ్డించనూ... పాపిష్టి దాన్ని... కట్టుకున్న మొగుడికీ కన్న పిల్లలకీ కడుపునిండా ఇంత తిండి కూడా పెట్టుకోలేకపోతున్నాను..." కొంగు అంచులు కన్నీళ్ళు కారుస్తున్నాయి. ఒక్కసారి కలయ జూసింది కొంపని.

అంతా పాడుబడ్డ గుడిలావుంది... గిన్నెలనిండా దుమ్ము. గూట్లో పూజా పునస్కారంలేని దేవుడి విగ్రహంలా ఊరగాయజాడీ!...

పొయ్యిలో మెరుస్తున్న కళ్ళతో పిల్లి!

"సరే నేను కాలేజీ కెళ్తున్నా..." కుంపటి బయల్దేరింది. నిజానికి కుంపటికి ఆకలి వేయట్లేదు... ఎందుకంటే బైటకు రాగానే ఒక్కసారి కళ్ళు మూసుకుంటుంది... కలల్లో పూలపడవల్లో... ప్రియుడి వొళ్ళో...

వెన్నెల తింటో... తేనె తాగుతో... మెల్లిగా వూగుతో వెళ్తుంది కాలేజికి.
(పాపం! జాకెట్టు వెనకాల చిరుగుందనీ దానికి కొన్ని వందల కళ్ళు అతికున్నాయనీ తెలీని పిచ్చిపిల్ల)

గుమస్తాకి దడ కొంచెం తగ్గింది!

అమ్మయ్య... చిరతపులి ఇవాళ రాలేదు...

బహుశా రేపొస్తుందేమో... రేపు గదా...

ఇంకా ఒక్కరోజు టైముంది.

టింగ్... టింగ్... ఫలానా వారి సమయం...

"వొస్తానే ఆఫీసుకి వేళయింది"

వీపుమీద ఫైళ్ళు కట్టుకున్నాడు... ఎర్రటి ఫైళ్ళు... అర్జెంట్ ఫైళ్ళు... ఫైళ్ళ నిండా ఆలస్యం వాసన... ఫైళ్ళ మధ్య ఎంతమందోరిటైరయినగుమస్తాల గుండెలు... గుండు సూదుల్లా తప్పుపట్టి...

మెల్లిగా కదిలాడు గుమస్తా.

ఎదురుగుండా ఖాళీ అరచేత్తో నల్లటోపీ!

"ఏమిట్రా"

"ఏదో లీవ్ వేకెన్సీ వుందిట...

బస్సుకి డబ్బులు..." జేబులోంచి రెండు బిళ్ళలు తీసి నల్లటోపీ చేతిలో పెట్టాడు.
(ఆ డబ్బుతో బస్సెక్కనివ్వరు. ఎం చేతంటే మళ్ళీ ఇప్పుడే రేట్టు పెరిగాయ్)

బైటపడ్డాడు గుమస్తా.

ఒక నరకంలోంచి మరో నరకానికి ప్రయాణం - పగిలిన కళ్ళద్దాలలోంచి పరిగెత్తుతున్న ప్రపంచాన్ని పరీక్షిస్తున్నాడు... ఏం హడావిడీ!... కొంపలు మునిగిపొతున్నట్టు, తగలబడిపోతున్నట్టు... పదండీ తోసుకుపదండి ముందుకు... దాంపో... దాంపో... పై... పైకి రేకు ఏనుగుల్లాంటి బస్సులనిండా వెలగపళ్ళ తలకాయల్తో జనం... గవిడి గేదెల్లాంటి మోటారుసైకిళ్ళు... జన ప్రవాహం... ఎలా పుట్టుకొస్తున్నారబ్బా... ఇంతమంది జనం!... దరిద్రులకి పిల్లలెక్కువ గావాల్నునాకు మల్లే... కడుపునిండా తిండెల్లాగా తినలేక పోతున్నాం... కనీసం కరువు దీరా పిల్లల్నేనా కందాం...

స్టాఫ్... కుటుంబ నియంత్రణ బోర్డు.

మంత్రిగారి సందేశం... మినిష్టర్లు కనొచ్చు... ఎందుకంటే మళ్లీ సంతానం లేకపోతే ఆ సీటు వేరేవాడు కొట్టేస్తే... అమ్మో!... మంత్రులారా అంతా ఏకంగా కనుడు... నడుస్తున్నాడు గుమస్తా...

కడుపులో సెగలు... ఎలకలు...

ఇంట్లో... పొయ్యిలో... పిల్లి

ఆహా! ఏం పరిమళం... మలయాళీ హోటల్లోంచి మలబారీ ఊదొత్తుల పరిమళం కలిసిన మలయాళీ పాట... ఆహా! ఏం పరిమళిస్తోంది పాట... కాఫీ తాగుతేనో... నో... డబ్బు వేస్ట్... (లేవుగా) ఛలో... టైమవుతోంది... పరిగెత్తరా... బాబూ...

మణి అయ్యర్ కిళ్లీ బడ్డీలో వేలాడదీయబడ్డ 'ఆనంద వికటన్' పుస్తకాల వెనక్కాల అడ్డబొట్టుతో అడ్డపంచెతో 'వణక్కం సామీ' అంటోన్న మణి అయ్యర్ మనవడు... ఏమి భాషాభిమానమో వాళ్ళకి...

ఒక్క చవక రకం సిగరెట్ కొనుక్కున్నాడు గుమస్తా అంటించుకోడానికి అటూ ఇటూ చూస్తే... నోట కప్ప కరుచుకుని స్తంభానికి తలకిందులుగా వేలాడుతున్న పాములాంటి కొబ్బరితాడు - సిగరెట్ తల తగలడింది!...

గఫ్...! గఫ్!... ఖగపతి అమృతము తేగా... బుగ భుగభుగమని పొంగి. ఆహా! సిగరెట్ కాల్చటంలోని మజా ఇన్నాళ్ళకి బోధ పడిందోయ్ గిరీశం... ఊ... టైమ్ అవుతోంది!...

"వెధవది అయిన లేటు ఎల్లాగా అయ్యింది... కనీసం సిగరెట్టన్నా తృప్తిగా కాల్చుకుని పోతేనేం!"

ఓహ్! రంగు రంగుల అమ్మాయిలు... నెమళ్ళంటి అమ్మాయిలు... కుందేళ్ళంటి అమ్మాయిలు... జింకలంటి అమ్మాయిలు... వారి వెనక్కాల... నక్కలు... కుక్కలు... తోడేళ్ళు... ఛ ఛ దొంగవెధవలు... వెకిలిచూపులూ వీళ్ళూనూ... కానీ అమ్మాయి ఎంత ముద్దొస్తోంది!... తప్పు... తప్పు... ఈ వయస్సులో నా కూతుర్ని ఎవడైనా ఇల్లా చూస్తే... ఆహా!... వాడు చూసినా... నా కూతురు చూస్తుంది...

అదేం పద్యం? త్రిపురాంతక దేవుడి దేనా!

చూసిన చూడ డుత్తముడు
చూసిన చూచును మధ్యముండు
తా చూసిన చూడకున్నను చూచు కనిష్టుడు.

బ్యూటిఫుల్... ప్రాంచ ద్భూషణ బాహూమూల రుచితో... ఏం రుచి ఈ తెలుగు పద్యాల్లో... పద్యంతో కలిపి పొగ పీలుస్తూ క్షణికానందాన్ని అనుభవిస్తున్నాడు గుమస్తా...

అదిగో! దూరంగా... ఇరానీ హోటల్ లో... టీకప్పు వెనక్కాల చూపుల్ని గుమస్తాకేసి గురిచూపి చిరతపులి!... మూతి ముడుచుకుంది!...

ఒళ్ళు విరుచుకుంది... మె...ల్లి... గా

అడుగులో అడుగు...

ఠపా!... పెట్టేసింది గుమస్తాని...

గిజగిజ... గిలగిల...

సిగరెట్టుపొగ ఊపిరితిత్తుల్లో గడ్డ కట్టేసింది...

కళ్ళనిండా నెత్తురుతో కూడిన భయం చిమ్మింది.

నాలిక తెగిపోయి జారిపోయి ఎక్కడో కడుపులోయలో ఎక్కడో పడిపోయింది...

చిరతపులి కళ్ళు దివిటీల్లా వెలుగుతున్నాయ్!

గుమస్తా జుట్టు... చిరత పులినోట్లో.

"ఇంటికొస్తే ఇంట్లో వుండవ్... ఆఫీసుకొస్తే ఆఫీసులో వుండవ్... నాకే ఢోకా ఇద్దామనుకున్నావ్...

తే... డబ్బుతే! మాట్లాడవేమిటి?"

కొడవలి లాంటి కొశ్చన్ మార్కు!

గుమస్తా పొట్టలో నాలిక మెల్లిగా పాక్కుంటూ వొచ్చి నోట్లో ఆగింది...

"సాయంత్రం... ఇస్తా"

"ఓసారి పొద్దున్నంటావ్... ఓసారి సాయంత్రం అంటావ్ తమాషాగావుందా?"

"ఒట్టు సాయంత్రం తప్పకుండా..." గుమస్తా చేతులు చిరతపులి కాళ్ళకింద!

సాయంత్రానికి నీ పెళ్ళాంవి... అయినాసరే నా డబ్బు నాకివ్వాలి..."

ఎంతమాట... ఎంతమాటన్నాడు...

తన రక్తం పొంగదే?... తనలో అస్సలు రియాక్షన్ లేదే...

కోపంకూడాలేదు... ఒక్కటే వుంది. నరనరాల్లో

కన్నీళ్ళు... ఠాప్... ఏడుపు...

అర్ధమయిందా?

తలూపాడు ఎద్దులాగ గుమస్తా!

ఒక్కసారి గట్టిగా అరచి దర్జాగా... పొదల్లోకి వెళ్ళిపోయింది చిరుతపులి.

ఒక చిన్న నిట్టూర్పు... కొంచెం మనశ్శాంతి... అప్పులాడికీ అప్పులాడికీ మధ్య...

ఆఫీసుకి పరుగెత్తాడు గుమస్తా!

అయిదు నిమిషాలు తక్కువ పన్నెండయింది... ఆఫీస్! మిగతాస్టాఫంతా కాంటీన్ లో పేకాడుకుంటున్నారు.

రిజిస్టర్!... లోపలికెళ్ళిపోయింది...

మడుగు మధ్య పెద్ద టేబుల్ మీద మొసలి నోట్లో పైపుతో...

"ఏవిటంతలేటు?" పళ్ళ మధ్య నిరుక్కున్న పచ్చి మాంసంముక్కల్ని టూత్ పిక్ తో షోగ్గా తీసుకుంటూ అడిగింది మొసలి.

పరమ పాత కథ చెప్పాడు గుమస్తా.

మొసలి పెద్దగా ఆవలించి... కొన్ని బూతులు తిట్టి కొత్త ఫైళ్ళకట్ట అందించి... "గెటౌట్" అంది... నిద్రకుపక్రమిస్తూ...

గుమస్తా తన సీటు దగ్గరికొచ్చాడు.

గబగబా బుర్ర పగలగొట్టుకున్నాడు... మెదడు తీసి ఫైళ్ళ నిండా పూయడం ప్రారంభించాడు. ఏదీ తోచట్లేదు... ఎలాగ - సాయంత్రానికి డబ్బెలాగ... సాయంత్రం అవ్వకపోతే బావుణ్ణు... సాయంత్రం అవ్వకపోతే బావుణ్ణు...

సాయంత్రం అయింది!

గబగబా బైటపడ్డాడు. రెండ్రూపాయలప్పుచేశాడు.

"ఎలకల మందెంత?"

"ఇంత!"

"ఇవ్వండి"

జాగర్తగా... అమృతాన్ని కొన్నట్టు... జేబులో పెట్టుకున్నాడు. ఇంటికొచ్చాడు.

"ఏమే! కాఫీ కలుపు"

"పంచదార లేదు"

"పక్కింటివాళ్ళ దగ్గిర బదులుచేస్తే"

"ఇప్పటికే వాళ్ళకి బోల్డు ఇవ్వాలి"

"రేపిచ్చేద్దాం"

"రేపా? ఏం బోనసొస్తోందా"

"రేపట్నుంచి మన పొజిషనే మారిపోతుంది"

"ఆ... ఆనందం... అప్పు... ఆనందం... కాఫీ

ఇదిగో ఆచేత్తోటే బియ్యంగూడా అడుగు"

సాయంత్రం అయిపోయింది...

చిరతపులి రాలేదు!

రాదా!... రాత్రొస్తుందేమో... రాదేమో రాదేమో ఇంక...

ఎలకల మందుని అన్నంలో కలిపేసాడు గుమస్తా.

అంతే... అంటే అందరూ... కడుపునిండా తిన్నారు -

అంతా పడుకున్నారు.

గుమస్తాకి నిద్రపట్టట్లేదు... ఎందుకు వెధవ బతుకు...

కానీ అదేదో తనొక్కడే తింటే బాగుండేది.

కట్టుకున్న పెళ్ళానికి... కన్నబిడ్డలకి... విషం పెట్టాడు తను... ఛీ... ఛీ...

ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో... ఇలా ఇక్కడ అప్పులమధ్య విషం మింగి... అసలు తను పెళ్ళెందుకు చేసుకున్నట్టు... పోనీ పెళ్ళి పర్లేదు... పిల్లలెందుకూ...

పెళ్ళాన్ని చూస్తే జాలేస్తోంది... రేపు తీసుకురాబోయే బోనస్ కోసం అప్పుడే కలల్లో ఏవేం కొనాలో లిస్టు రాస్తోంది.

తన కూతురు పెళ్ళి ఇంక భయం లేదు...

కొడుక్కి ఉద్యోగం నో ప్రాబ్లమ్...

వొణుకు... వొణుకు... దడ... భయం...

కళ్లవెంట నీళ్లు... నరాలు మెలికలు తిరిగిపోతున్నాయ్... బుర్ర పేలిపోతోంది.

వొళ్ళు చల్లబడిపోతోంది... ఊపిరి ఆడట్లేదు... గుండె మెల్లగా కొట్టుకోడం... ఆ శబ్దం వినిపించటంలేదు... గుమస్తా... నిద్ర... పోయాడు. పొయ్యిలో పిల్లి!!

***

తెల్లారింది...

తలుపు శబ్దం!... తలుపవతల... తలుపవతల...

గుమస్తా లేచాడు...

చిరతపులి!

"నాన్నా పొయ్యిలో పిల్లి(మాత్రం) చచ్చింది!"

...

శ్మశాన ప్రపంచంలో ఈ శవాలు మహా మామూలుగా నడుస్తూనేవున్నాయి - కొత్తపిల్లి పాత పొయ్యిల మళ్ళీ ఆవలిస్తూనే పడుకుని ఉంది...

- - - - -

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు