ఊరంతా సంక్రాంతి పండగ హడావిడి లో ఉంది. ఇళ్ల ముందు ముగ్గులు రంగు రంగు కొత్త బట్టలు తొడుకున్నట్టు చూడ ముచ్చటగా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ బయట గోడపై " పోలీసు వారి హెచ్చరిక - కోడిపందాలు ఆడడం నేరం " అని పోస్టర్ అంటించి ఉంది. ఎప్పుడూ పెద్దగా జన సంచారం లేని పోస్ట్ ఆఫీస్ రోడ్ వచ్చే పోయే వాహనాలతో కొంచం బిజీ బిజీ గా ఉంది. చెరువు గట్టు అవతలి వైపు కరణం గారి పొలాలు దాటి ముందుకు వెళ్తే వచ్చే మామిడి తోటలో ప్రతీ సవంత్సరం లానే కోడి పందాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగకి ఒక నెల రోజుల ముందు నుండే ఇక్కడ కోడి పందాలు జరుగుతుంటాయి. అందుకే పోలీసులు నెల రోజుల ముందుగానే గ్రామంలో పోస్టర్ లు అంటిస్తారు. మళ్ళీ కోడి పందాలు అయ్యే వరకు అటు వైపు రారు. జిల్లా లో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు ఈ కోడి పందాలు మా సాంప్రదాయం అంటూ పోలీసులు అటు రాకుండా చేస్తూ ఉంటారు. బండారు కోటేశ్వరరావు ఉదయం నుండి ఆ కోడి పందాలు దగ్గరే ఉండి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. స్నానం చేసి భోజనం చేస్తుంటే కొడుకు గోపాలం రైస్ మిల్ లో పనిచేసే సాంబడు ఆయాసపడుతూ తలుపు కొట్టాడు. అయ్యగారు అయ్యగారు అంటూ....! తలుపు తీసిన కోటేశ్వరరావు సాంబడు చెప్పిన మాట విని అక్కడే హటాత్తుగా కూలబడ్డాడు. సాంబడు వెంటనే మొహం మీద నీళ్లు కొట్టి, మంచి నీళ్లు పట్టించాడు. వెంటనే లేచిన కోటేశ్వరరావు హడావిడిగా... "పద వెళ్దాం" అని ఒంటి మీద చొక్కా కూడా లేకుండా సాంబడు తో రైస్ మిల్ దగ్గరకి బయలుదేరాడు. గ్రామంలో వచ్చే రోడ్ కి ఒక వైపు చెరువు మరో వైపు పచ్చటి వరి పొలాలు ఉంటాయి. ఆ చెరువు గట్టుపై కొబ్బరి చెట్లు మధ్య మధ్య లో మర్రి చెట్లు పెద్ద పెద్ద ఊడలు తో ఉంటాయి. ఆ మర్రి చెట్ల పై గబ్బిలాలు ల ఉండే పక్షులు ఉంటాయి. వాటిని తలకింద పక్షులు అని పిలిచే వారు. వాటి కాళ్ళు చెట్టు కొమ్మలకి, తల కిందకి ఉండి చెట్టు కొమ్మలకి వేలాడుతూ ఉండేవి. ఈ పక్షులు రాత్రి వేళలో ఎగురుతూ పగలు ఆ చెట్టు కొమ్మల పై ఉండేవి. రాత్రి వేళలో ఒంటరిగా ఈ చెరువు గట్టు పై ఉన్న రోడ్ పై నడిచి రావాలంటే చాలా భయం గా ఉండేది. రాత్రి పూట చెట్ల పై ఉండే తలకింద పక్షులు ఎగిరేటప్పుడు వాటి అరుపులు, చుట్టూ ఉండే చీకటి, దూరంగా కనపడుతున్న స్మశానం, ఆ చీకట్లో వెలుగులు విరజిమ్ముతూ మిణుగురు పురుగులు ఆ భయాన్ని మరింత పెంచేవి. ఊళ్ళో ఉండే వాళ్ళు బయటి ప్రదేశాలకు వెళ్తే చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. అసలే గ్రామానికి బస్ కూడా లేదు. చీకటి పడితే ఆ చీకట్లో నడిచి రావాలి అంటే అదొక హారర్ సినిమానే. అలాంటి రోడ్ పై ఆ చిమ్మ చీకట్లో చెరువు గట్టు మీద నడుస్తూ ఊరికి అవతలి వైపు ఉన్న రైస్ మిల్ దగ్గరకి పరుగులాంటి నడకతో చేరుకున్నాడు కోటేశ్వరరావు. ఆ రైస్ మిల్ వెనుక వైపు ఉండే రూమ్ లో నేలపై విగత జీవి గా పడి ఉన్నాడు గోపాలం . గోపాలం, కోటేశ్వరరావు ముద్దుల కొడుకు. గోపాలం తలవైపు పొలాలకు కొట్టే పురుగుల మందు డబ్బా ఖాళీ గా పడి ఉంది. ఆ మందు తాగి గోపాలం ఆత్మ హత్య చేసుకున్నాడని ఆ డబ్బా మవునం గా చెప్తూ ఉంది. ఆ మందు తాగిన తర్వాత ఊపిరి ఆడక తలను నేలపై కొట్టుకున్నట్లు గా తల పై రక్తపు చారలు కనపడుతున్నాయి. గోపాలం ను అలా చూసిన కోటేశ్వరరావు కళ్ళ వెంట నీళ్లు రాలేదు. కొడుకు లేని జీవితం ఊహించడం కూడా కష్టం గా ఉంది కోటేశ్వరరావు కు. చిన్న తనం లోనే భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తల్లి, తండ్రి అన్నీ తానై పెంచాడు కొడుకును. ఎంతో ఆస్తి సంపాందించాడు. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొడుకు లేకపోవడం తో ఈ ప్రపంచం అంతా సూన్యం గా కనపడుతూ ఉంది. *****
వసంత్ ఈ ఊరు లోకి కొత్త గా వచ్చిన ఆర్ ఏం ఎంపీ డాక్టర్. వచ్చి కొన్ని రోజులే అయినా అందరికీ బాగా నచ్చేశాడు. ఐదు అడుగుల పొడవు ఉండే వసంత్ మెళ్ళో ఒక శతస్స్కోప్ వేసుకుని లూనా పై ఊరంతా తిరిగే వాడు. పరిచయం అయిన అందరినీ వరుసలు కలుపుతూ పరిచయాలు మరింత పెంచుకునే వాడు. మంచి మందులు ఇస్తున్నాడు అని ఊళ్ళో మంచి పేరు రావడం తో ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని ఉండిపోయాడు. పక్కనే ఉండే గ్రామాలలో కూడా ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా వసంత్ నే పిలిచేవారు. కాకినాడలో ఏదో హాస్పిటల్ లో కాంపౌండర్ గా పని చేసి, కొన్ని మందుల పేర్లు తెలుసుకుని ఈ ఊర్లో డాక్టర్ అయిపోయాడు వసంత్. ఎవరికైనా తను ఇచ్చే మందులు తగ్గకపోతే కాకినాడ లో పెద్ద హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళేవాడు. ఆ హాస్పిటల్ వాళ్ళు పేషంట్ లను తీసుకొని వచ్చినందుకు వసంత్ కు కమిషన్ కూడా చెల్లించేవారు. ఇంకా పెళ్లి కాని వసంత్ ని రామాలయం వెనుక ఉండే పెద్ద రెడ్డి గారు ఓరోజు మా ఊళ్ళో ఓ అమ్మాయి ని చూస్తాం పెళ్లి చేసుకోండి డాక్టర్ గారు అంటే, సిగ్గుపడుతూ 'ఆబ్బె ఇంకా కాదండి' అని తప్పించుకున్నాడు. గొల్లపేట దాటి ముందుకు వెళ్తే వచ్చే నీళ్ల ట్యాంక్ పక్కన ఉండే సూరమ్మ కి జ్వరం వస్తే వైద్యం చేయడానికి వెళ్లిన వసంత్ మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పాడు. "నువ్వు దేవుడివి బాబు అని సూరమ్మ అంటూ ఉంటే, నేను కూడా మీలో ఒకడినే" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు వసంత్. ఆలా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ అందరితో కలిసిపోయేవాడు వసంత్. రైస్ మిల్ నడిపే గోపాలం తో వసంత్ కి స్నేహం కుదిరింది. రోజులో ఏదో ఒక సమయం లో రైస్ మిల్ దగ్గరికి వెళ్లే వసంత్, గోపాలం తో మాట్లాడుతుంటే టైం తెలిసేదే కాదు. అప్పుడప్పుడు ఆ రైస్ మిల్ దగ్గర ఉండే రూమ్ లో పేకాట కూడా కూడా ఆడుతూ కాలం గడిపేవాడు వసంత్. గోపాలం కి తండ్రి నుండి వారసత్వం గా వచ్చిన ఈ రైస్ మిల్ తో పాటు, మేడపాడు లో ఉండే అత్తగారు ఇచ్చిన చాలా ఆస్థులు ఉన్నాయి. మర్రిపూడి లో 10 ఎకరాల మెట్ట భూమితో పాటు, సామర్లకోట వెళ్లే దారిలో పిఠాపురం కి దగ్గర లో చెరుకుతోట, వడ్లమూరు లో కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్, చెరువుకింద రెండుపంటలు పండే భూములు, అమలాపురం దగ్గర బండారు లంక లో ఓ రెండు ఎకరాల కొబ్బరి తోట గోపాలానికి ఉన్నాయి. గోపాలం తండ్రి కోటేశ్వరరావు ఎప్పటికైనా ఏం ఎల్. ఏ అవ్వాలని ఆశపడుతూ అందరికి తనకు చేతనైయినంత సహాయం చేస్తూ ఉన్నాడు. పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నియోజక వర్గం లో మంచిపేరే సంపాదించుకున్నాడు. వసంత్ గోపాలం స్నేహం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పేకాట ఆడడం దగ్గర నుండి కలిపి రోజూ మందు కొట్టడం వరకు స్నేహం పెరిగింది. రోజూ గంటలు గంటలు ఎన్నో విషయాలు మాట్లాడుకునే వారు. వసంత్ ఓ రోజు గోపాలం తో మాట్లాడుతూ వచ్చే నీ పుట్టినరోజు ను మనం ఎప్పటికీ మర్చిపోకుండా చేసుకోవాలి అన్నాడు. గోపాలం సరే అన్నాడు. సాయంత్రం 5 గంటలు అవుతోంది పాండవులు మెట్ట దాటి రాజమండ్రి వైపు వెళ్లే తారు రోడ్ కు రిపేర్ లు చేస్తున్నారు. అక్కడక్కడా రోడ్ పక్కగా తారు డబ్బాలు పెట్టి ఉన్నాయి. కొంచం ముందుకు వెళ్తే ఎడమ వైపు మూత పడిన సూపర్ గ్యాస్ కంపెనీ ఫ్యాక్టరీ ఉంది. కొన్నేళ్లు గా ఈ కంపెనీ మూత పడే ఉంది. అక్కడే ఆ రాత్రి కి పార్టీ కి ఏర్పాటు చేశాడు గోపాలం . ఆ పార్టీ కి వసంత్, మేరీ అనే మరో స్నేహాతురాలు ని తీసుకుని వచ్చాడు. కేరళ లో అలెప్పి లో ఉండే మేరీ కాకినాడ లో ఓ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తూ ఉంది. వసంత్ అదే హాస్పిటల్ లో కాంపౌండర్ పని చేసే వాడు. ఆలా పరిచయం అయిన మేరీ వసంత్ కు మంచి స్నేహితురాలు అయింది. ఆ పార్టీ లో మేరీ ని గోపాలం కి పరిచయం చేశాడు వసంత్. ఆ తర్వాత గోపాలం , మేరీ స్నేహం చాలా చాలా పెరిగింది.
కాకినాడ బీచ్ లోను, రాజమండ్రి శ్యామల టాకీస్ పక్కన ఉండే కనకదుర్గ లాడ్జి లోను, బండారులంక లో ఉన్న గోపాల్ స్నేహితుడి గెస్ట్ హౌస్ లోను చాలా సార్లు వసంత్ లేకుండానే కలుసుకున్నారు. ఓరోజు మేరీ గోపాలం కి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ అ వార్త గోపాలం కి బ్యాడ్ న్యూస్ అయ్యింది. వసంత్ అన్ని టెస్ట్ లు చేసి మేరీ నెల తప్పింది అని చెప్పాడు. గోపాల్ మేరీ ని అబార్షన్ చేయించుకోమన్నాడు. కానీ మేరీ అందుకు ఒప్పుకోలేదు. వసంత్ నేను మాట్లాడి ఒప్పిస్తా అన్నాడు. పిఠాపురం లో ఉన్న గోపాల్ చెరుకుతోట మేరీ పేరు మీదకి మారింది.
ఆ చెరుకు తోట చెరుకులు రుచి చూసిన మేరీ, బండారులంక దగ్గర కొబ్బరి తోట లో ఉన్న కొబ్బరి నీళ్లు కూడా రుచి చూడాలి అనుకుంది. గోపాల్ అందుకు ఒప్పుకోలేదు. చెరుకు తోట ఇవ్వడమే ఎక్కువ... ఇంకేమీ ఇవ్వను అని తెగేసి చెప్పాడు. ఓరోజు ఉదయమే ఊళ్ళో పెద్దల దగ్గర మేరీ తనకు అన్యాయం జరిగింది అని గోపాలం తనను పెళ్లి చేసుకునేలా చూడాలి అని మొరపెట్టుకుంది. లేదంటే తనకు ఆత్మ హత్యే శరణ్యం అని కూడా చెప్పింది. తనకు న్యాయం జరగకపోతే ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటా అని, ఆ ఉత్తరం లో గ్రామ పెద్దల పేర్లు కూడా రాస్తానని బయపెట్టింది. వెంటనే కోటేశ్వరరావు ను రచ్చబండ దగ్గరకి పిలిచిన పెద్ద మనుషులు మేరీ కి న్యాయం జరిగేలా చూశారు.
ఆ న్యాయం విలువ చెరువుకింద వరి పండే రెండు ఎకరాల పొలం ! పరువుకోసం పరితపించే కోటేశ్వరరావు కు తన పరువు ముందు రెండు ఎకరాలు పెద్దగా కనపడలేదు. కానీ ఆ రోజు రాత్రి గోపాలం ని బాగా మందలించాడు. "పెళ్లి అయ్యి కూడా ఇలాంటి చెత్త పనులు చేసి నా పరువు తీస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే నాకు వచ్చే ఎన్నికలలో ఏం ల్ ఏ టికెట్ కూడా రాదు. ఒకవేళ నాకు ఆ టికెట్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా " అంటూ తండ్రి నోటి వెంట వస్తున్న మాటలు గోపాలం మనసులో కత్తుల్లా గుచ్చుకున్నాయి. ఆరాత్రి అంతా ఒంటరిగా రైస్ మిల్ లో మేరీ చేసిన అల్లరి గురించి ఆలోచించిన గోపాలం, తెల్లారే సరికి గోపాలం భార్య పిల్లల గురించి ఆలోచించకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ****
కొద్దిరోజులకే మేరీ చెరుకు తోట, వరి పొలం మంచి రేటు కి అమ్మేసింది. మేరీ, వసంత్ కత్తిపూడి దగ్గర ఉన్న శంఖవరం అనే ఊరి కి బయలుదేరారు. మరో గోపాలం దొరకక పోతాడా అని !