రాజమ్మ తెలివి - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Rajamma telivi

ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలందరూ దొంగా పోలీస్ ఆడుకుంటున్నారు. రుద్ర మాత్రం గుమ్మం మీద కూర్చుని బూరె తింటూ వాళ్ళ ఆటని చూస్తున్నాడు. ఇంతలో ఇంట్లోంచి బయటికి వచ్చిన పెద్దమ్మ రుద్రని పిలిచి "నాకు బూరె ఇవ్వవా?" అని అడిగింది పెద్దమ్మ. "అబ్బా నేనివ్వను మా అమ్మ నాకిచ్చింది" అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. "సరే కథ చెప్తాను ఇస్తావా?" అని అడిగింది. "ఔననక, కాదనక" అలా చూస్తూ ఉండిపోయాడు రుద్ర. "నువ్వు నాకు ఏమీ ఇవ్వొద్దులే కథ చెప్తాను. రా!" అని దగ్గరకి తీసుకుని ముద్దులాడింది. పెద్దమ్మను చూడగానే చుట్టుపక్కల పిల్లలందరూ చుట్టూ చేరిపోయారు. కథ చెప్పడం ప్రారంభించింది పెద్దమ్మ.

"అనగా అనగా నర్సిపురం అనే గ్రామం. నిత్యం ఆ గ్రామంలో దొంగతనాలు జరుగుతూ ఉండేవి. అదే గ్రామంలో నరసయ్య, రాజమ్మ దంపతులు నివసిస్తూ ఉండే వారు. వారికి పిల్లలు లేరు. తాతల కాలం నాటి పెద్ద పెంకుటిల్లు. బోలెడంత ఆస్తి ఉంది అయినా పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు నరసయ్య." "అంటే ఏంటి పెద్దమ్మా?" అని అడిగింది కాత్యాయని. "అంటే ఎవ్వరికీ ఏ సహాయం చేయడని దాని అర్ధం. రాజమ్మకి మాత్రం అందరిలాగే మంచి ఇంట్లో అన్ని సౌకర్యాలతో దర్జాగా బతకాలని ఉండేది. ఎంత మొరపెట్టుకున్నా నర్సయ్య ఆమె మాటను పెడచెవిని పెట్టేవాడు. డబ్బు, బంగారం మంచం కింద పెట్టి రోజూ వాటిని చూసుకుని మురిసిపోయేవాడు. ఎంత ఉన్నా ఏం లాభం? ఇతరులకు సాయం చెయ్యడు, దానం చెయ్యడు, అలాగని రాజమ్మని సుఖపడనివ్వడని ఊళ్ళో జనమంతా తిట్టుకునేవారు. రాజమ్మ తన భర్త వైఖరిని సోదరులకు చెప్పి ఎంతగానో బాధపడింది. కొద్దిరోజుల తర్వాత ఒక అర్ధరాత్రి వేళ నర్సయ్య ఇంటి పైకప్పు పెంకును తొలగించి దొంగ ఇంట్లోకి జొరబడ్డాడు. సరాసరి డబ్బులు బంగారం ఉన్న మంచం దగ్గరికి చేరుకున్నాడు. ఆ మంచం మీద నర్సయ్య గురక పెడుతూ నిద్రపోతున్నాడు. మంచం కింద ఉన్న డబ్బుల పెట్టెను నెమ్మదిగా బయటికి లాగాడు దొంగ. అక్కడే ఉన్న మంచినీళ్లు చెంబు పెట్టెకి తగిలి తిరగబడి చప్పుడయ్యింది. ఆ అలికిడికి నర్సయ్యకి మెలకువ వచ్చింది. చీకట్లో ముసుగు ఆకారాన్ని చూసి బెంబేలెత్తిపోయి 'దొంగా దొంగా' అని గట్టిగా అరిచాడు నర్సయ్య. "ఏయ్ నోర్ముయ్ గట్టిగా అరిచావంటే చంపేస్తా" అన్నాడు దొంగ. రాజమ్మ వణికి పోతూ దొంగకి దండం పెట్టి విడిచిపెట్టమని ప్రాధేయపడింది. ఈ అరుపులు విని చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. ఇళ్లల్లో దీపాలు వెలగడంతో దొంగ వచ్చిన దారినే పలాయనం చిత్తగించాడు. ఇక ఆ రాత్రంతా నరసయ్య దంపతులకు నిద్రలేదు. భయం భయం గా కూర్చున్నారు. తెల్లారింది "నాకు భయంగా ఉంది ఈ ఇంట్లో ఇక ఉండలేను " అని చెప్పి రాజమ్మ పెట్టే బేడ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నర్సయ్య ఒంటరివాడైపోయాడు. ఏం చెయ్యాలో తోచలేదు. రెండురోజులపాటు తిండి, నిద్ర లేదు. రాజమ్మని బ్రతిమాలినా ఉపయోగం లేకపోయింది. చేసేదేమీ లేక ఒంటరిగా బ్రతకలేక, సుఖాలు అనుభవించని జీవితం వృధా అనుకున్నాడు. అన్ని సౌకర్యాలు ఉన్న కొత్త ఇంటిని కొనుగోలు చేసాడు. రాజమ్మను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంటిని చూసి పొంగిపోయింది రాజమ్మ. భర్తలోని మార్పుకు పథకం వేసిన అన్నదమ్ములకు మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది రాజమ్మ. నాటి నుంచి వారు హాయిగా జీవించసాగారు. విన్నారా పిల్లలూ మనకి ఉన్నదాంట్లో కొంత అనుభవించాలి అలాగే దానం ధర్మం చేయాలి". అని కథ ముగించింది పెద్దమ్మ. "కథ బాగుంది పెద్దమ్మా! కథ వింటూ బూరె తినేసాను. అమ్మనడిగి నీకొకటి పట్టుకు వస్తా ఉండు." అని ఇంట్లోకి పరుగెత్తాడు రుద్ర.

"నాకు కూడా తీసుకురా రుద్ర బావా!" అంది కాత్యాయని.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు