సాయంత్రం దాదాపు ఐదు కావస్తోంది..
పరమానందం టీ తాగగానే అలవాటు ప్రకారం అతని కాళ్ళు పార్కుకు దారి తీసాయి. దారిలో సహనడక మిత్రుడు ఆనందం కోసం వీధి చివరన నిలబడి కాసేపు వేచి చూసాడు. ఎలాగూ తాము రోజూ కూర్చోని ముచ్చటించుకునే బెంచీ వద్దకు రాకపోడని కాళ్ళకు సర్ది చెప్పాడు.
పార్కులో ప్రవేశించగానే అల్లంత దూరంలో చెట్టుకింద ఒక యువజంట చరవాణిలో నిమగ్నులవడం చూడగానే అతని పెదవులపై చిరునవ్వు మొలచింది. నిర్థారించుకుందామని పిల్లిలా చెట్టు వెనుకాలకు వెళ్లి తొంగి చూసాడు. మసక, మసగ్గా కనబడుతూందని.. లాల్చీ జేబులో నుండి కళ్ళద్దాలు తీయబోతుంటే చేతిలో నుండి జారి కింద గడ్డిలో పడ్డాయి. ఎక్కువగా శబ్దము రాని కారణమో! లేక వాళ్ళు ఆ నీలిచిత్రసీమలో మునిగి పోవడమో! గాని తాను వంగి కళ్ళద్దాలు తీసుకుంటున్నా.. వెనుతిరిగి చూడలేదు. అదీ ఆ చిత్రాలకున్న మహిమ.. అని చిరునవ్వులు పెదాలపై పూయిస్తూ.. బెంచీ వద్దకు వెళ్లి ఆసీనుడయ్యాడు.
ఇప్పుడంటే అలాంటి నగ్నీషిలు దొరుకుతున్నాయి గాని ఇదివరకెక్కడివి?. అది వారి వయసు మహిమ.. మరి తనకేమయ్యింది? ఆ వయసులో.. అని మనసులోకి రాగానే.. ఆనాటి అనుభవాల దొంతరలు కళ్ళకు కట్టినట్టు కదలాడసాగాయి.
***
ఆరోజు పరమానందం పదవీ విరమణ చేశాడే గానీ.. అతని మది నుండి ఒక ప్రగాఢమైన కోరిక ఇంకా విరమణ కాలేదు. అలాంటి కోరిక తీర్చుకోడానికి అవకాశమున్న ఉద్యోగమే. అయినా ‘మనసు స్వేచ్ఛా జీవి.. బుద్ధి నియంత’ అన్నట్టు బుద్ధికి లోబడి నడుచుకోవడం అతని మనసుకు శాపంలా మారింది.
బాలికల ప్రాధమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పదవిలో చేరి, బాలికల జూనియర్ కళాశాలలో పదవీ విరమణ చేశాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆడగాలులను ఆస్వాదించినా.. ఒక్క సారి అంటే ఒక్క సారైనా తన కోరిక తీరకుండానే పదవీ విరమణ కావడం.. అతని మనసు అల్లల్లాడుతోంది.
“ఏం.. బావా! ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?” నవ్వుతూ.. పరమానందం ఆలోచనా వలయాలలో చిన్న రాయి విసిరాడు ఆనందం.
అదేమీ విచిత్రమో గానీ! ఆనందం గూడా పరమానందంతో బాటు అదే రోజు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్.. సబ్ ఇనస్పెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. అది కాకతాళీయమైనా.. వారి స్నేహం మాత్రం కాకతాళీయం కాదు. ఇరువురి ఇండ్లు ఒకే వీధిలో ఉండడం.. బాల్యంలో ఒకే బడిలో చదవడం.. వారి స్నేహానికి గట్టి పునాది పడిన ఘన చరిత్ర కలిగి ఉంది. బావా..! బావా..! అని పిలుచుకునేంత అనుబంధమూ బలపడింది.
ఆనందం కుదుపుతో పరమానందం ఆలోచనలు అతని మనసును ఆపినా.. నోటికి కళ్ళెం పడనీయలేదు. ఠక్కున అతని మనసులోని మాటలను బయటకు ఊదేశాడు పరమానందం.
“నేనేం పాపం చేశానని..! నిత్యం చూసిందే చూడ్డమా! కొత్త, కొత్త రుచులు అనుభవించక పోయినా కనీసం కండ్ల చలువకు మరొక కొత్త ‘నగ్నీషి’ని చూడకపోవడం.. అంతా నా దురదృష్టం. నీది ఎక్సైజ్ డిపార్ట్ మెంటు కదా..!
ఎలాగైనా సాధిస్తావనుకున్నాను” పెదవులు వెనక్కి విరిచి బిక్కమొఖం పెట్టాడు.
‘నగ్నీషి’ అనే పదాన్ని పరమానందమే సృష్టించాడు. అలనాటి ‘మాయాబజార్’ సినిమాలో ఘటోత్కచుడు అన్నట్టు.. ‘పదాలను మనుషులు సృష్టించడం రివాజు గాని పదాలు మనుషులను సృష్టించలేవు కదా!..’ అని అతని వాదన.
“బావా! నీ బాధ.. నా బాధ కాదా! అర్థం చేసుకోగలను. అందుకోసం నేను గాలించని గడప లేదు. ఆరాతీయని ఆత్మీయుడూ లేడు. ఎలాగైతేనేం.. మొత్తానికి సాధించాను. నగ్నీషికి సంబంధించిన జన్మరహస్యం నీ చెవులో ఊదాలనే వచ్చాను. లేకుంటే నా కడుపు ఉబ్బిపోయి పగిలిపోయే ప్రమాదముంది” అంటూ కళ్ళెగరేసాడు ఆనందం.
చిన్నపిల్లవాడిలా ఎగిరి గంతులు వేయసాగాడు పరమానందం. పార్కులో ఎవరూ దగ్గరలో లేరు కాబట్టి సరిపోయింది గానీ.. అతని గంతులకు అంతా మూర్ఛ రోగుల్లా కింద పడి గిల, గిలా కొట్టుకునేవారే.
“చెప్పు బావా.. తొందరగా..” అంటూ గంతులు ఆపి.. ఆనందాన్ని లాక్కుంటూ వెళ్లి సిమెంటు బెంచీ మీద కూర్చోబెట్టాడు. తనూ పక్కనే ఆసీనుడవుతూ.. ఆనందం గదుమ పట్టుకొని దీనంగా చూడసాగాడు పరమానందం.
ఆనందం గొంతు సవరించుకొని.. “ఇంతకు ముందే నా స్నేహితుడు అమెరికా నుండి ఫోన్ చేశాడు. అతని ఇద్దరు మిత్రులు గత పదేండ్లుగా ఎంతో శ్రమకోర్చి తమ తెలివితేటలతో తయారు చేసారట. దానిని ఒక అద్దానికి బిగించి పరీక్షలు చేసి విజయం సాధించారట. తనూ చూసానన్నాడు. నీ భాషలోనే దాన్ని నగ్నీషి అనుకుందాం. ఎంతో నమ్మకమున్న వ్యక్తికి మాత్రమే అమ్ముతారట. నేను నీకోసం ఒక పీస్ కావాలని ఒప్పించాను. అయితే కాస్త ఖరీదు ఎక్కువ. ఇంకా..” అంటూ కళ్ళు సుతారముగా మూసి బుర్రగోక్కోసాగాడు ఆనందం.. సంశయిస్తున్న వాడిలా.
“బావా ఎంత ఖరీదైనా నేను కొంటాను. నీకా భయమే అక్కరలేదు. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉంటుంది. మరో కంటికి కనబడకుండా అత్యంత రహస్యంగా వాడుతాను. ఎవరు అమ్మారన్న ప్రసక్తే రాదు” అని అరచేతిని తలపై ఆన్చుకొని ప్రమాణం చేస్తూ.. భరోసా ఇచ్చాడు పరమానందం.
“అలాగే బావా.. నేనూ మా వాడికి అదే చెప్పాను. నా మాట మీద గురి ఎక్కువ వాడికి. నీ చిరునామా పంపుతాను. నీకు నగ్నీషి అద్దం ఖరీదు, డబ్బులిచ్చి అది పుచ్చుకోవడం.. మొదలగు వివరాలన్నీ కోడ్ భాషలో ఒక ఉత్తరం వస్తుంది” అంటూ కోడ్ భాష వివరించాడు ఆనందం. అది ఆంగ్లభాష అక్షరాల వరుస నంబర్లతో పదాల అమరిక అని తెలుసుకొని.. చాలా సులభమని తెగ సంబరపడి పోయాడు పరమానందం.
సూర్యుడు అస్తమిస్తూండడంతో తమతమ ఇండ్లకు బయలుదేరారు. ఆనందంతో కడుపు నిండిపోయిన పరమానందానికి మాటలు కరువయ్యాయి. కాళ్ళు గాలిలో తేలిపోతూ.. ఊహాలోకంలో సంచరించసాగాడు. ఆనందం ఇల్లు రాగానే..
“ఇక ఉంటాను బావా..” వీడ్కోలు పలుకులతో తేరుకున్నాడు పరమానందం.
“బావా ఈ రాత్రికే నీ మిత్రునితో చెప్పు.. అక్కడ పగలే కదా!” అని ముసి, ముసి నవ్వులు నవ్వాడు. తన ఇంటికి దారి తీస్తూ.. “ఫోన్ చార్జీలు గూడా చెల్లించుకుంటాను” అంటూ వెనుదిరిగి ఓమారు చూస్తూ.. నవ్వులను కొనసాగించాడు పరమానందం.
ఆనందం అన్నట్టుగానే అమెరికా నుండి ఉత్తరం వచ్చింది. కోడ్ భాషలో ఉన్న ఉత్తరాన్ని డీకోడ్ చేసుకొని
చదివేసరికి అప్రయత్నంగా నోరు తెరచుకుంది. ‘పది లక్షలా!..’ అని మనసులో అనుకుంటూ కనుగుడ్లు తేలేశాడు పరమానందం. తన వద్ద లేవని కాదు. పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బు దండిగానే ఉంది. కాకపోతే.. అది
చిన్నబ్బాయి పెళ్లి ఖర్చులకు కావాలని బ్యాంకులో భద్రపర్చాడు. అబ్బాయి పెళ్ళికి డబ్బు దాయడం ఎందుకు బావా..! కట్నం లాక్కోవడం చేతగాకనా! అంటూ ఆనందం దెప్పి పొడుపు మాటలు గుర్తుకు వచ్చాయి. కట్నం కానుకలు తన అభిమతం కాదు గానీ.. నగ్నీషి ముందు అది ఆవిరై పోయింది.
బ్యాంకు నుండి తీసుకున్న డబ్బులు బ్రీఫ్ కేసులో సర్దుకొని బయలుదేరాడు పరమానందం. అలా ప్రధాన రహదారికి వచ్చాడో! లేదో!.. రయ్యిమంటూ.. ఒక కారు వచ్చి వాలింది. కారు నంబర్ చూసి నిర్థారించుకున్నాడు. అయినా ఉత్తరంలో రాసినట్టు కారు డ్రైవర్ ఒక సంకేతం చూపాడు. దాన్ని చూడగానే పూర్తి నమ్మకం కుదిరి కారెక్కాడు పరమానందం. కారు వెనుకసీట్లో ఉన్న ఒకతను తన పేరు పాపారావని పరిచయ చేసుకుంటూ.. పక్కకే కూర్చున్న మరో ఆవిడ మాలిని అని పరిచయం చేసాడు. తనకు కనబడ బోయే నగ్నీషిని కన్నార్పకుండా కాసేపు చూసి పరమానందభరితుడయ్యాడు పరమానందం. కారు నడిపేది గూడా మా మిత్రబృందం లోని సభ్యుడే అంటూ పరమానందం కళ్ళకు గంతలు కట్టాడు. పరమానందం ఆశ్చర్యపోలేదు. ఇదంతా ఉత్తరంలో ఉన్న అంశమే.. దాదాపు ఒక గంటసేపు వేగంగా పరుగెత్తిన కారు అలసిపోయినట్టుగా ఆగిపోయింది.
కారు ఆగగానే పరమానందంలో ఉద్వేగం అధికమయ్యింది. ఇక నగ్నీషిని చూడడమే తరువాయి అని లొట్టలు వేయసాగాడు. కళ్ళ గంతలు విప్పగానే కండ్లు నలుముకుంటూ పరిసరాలు పరికించి చూసాడు పరమానందం. పార్కులాగానే కనబడుతోంది కాని ఏ ప్రాంతమో! పోల్చుకోలేక పోయాడు. నిర్మానుష్యంగా ఉంది. సరియైన చోటికే వచ్చామన్నట్టుగా కళ్ళు మిటకరిస్తున్న పరమానందం హావభావాలను చదువుతూ.. ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు పాపారావు. ఇరువురూ వెళ్లి చెట్టు నీడన పచ్చికబయల్లో కూర్చున్నారు.
పాపారావు సూచన మేరకు కారు డ్రైవరు అందాల పోటీలో పాల్గొనే అమ్మాయిలా వయ్యారంగా వారి ముందు కొద్ది దూరంలో నడువసాగాడు. పాపారావు బ్రీఫ్ కేసు నుండి అద్దం బయటకు తీసాడు. పరమానందం కండ్లు బండి గీరెలంత చేసుకొని అద్దం అందాలు చూడసాగాడు కన్నార్పకుండా.
పాపారావు అద్దం వెనుకాల ఏదో మీటను నొక్కి.. “ పరమానందం గారూ.. ఇటు చూడండి. మా కారు డ్రైవరు నీ భాషలో నగ్నీహి రూపంలో కనబడుతున్నాడు” అంటూ అద్దాన్ని పరమానందం వైపు తిప్పాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా మగవాళ్లను ఎక్కువ సేపు చూడ్డం కష్టమన్నట్టుగా..
“చాలు.. చాలు పాపారావు గారు నాకు కావాల్సింది.. నగ్నీషి” అంటూ భుజాలు ఎగురవేయసాగాడు. పరమానందం చేతిలో ఉన్న డబ్బుల బ్రీఫ్ కేసు చూపిస్తూ .. ముందు డబ్బులు ఇవ్వండి అన్నట్టు చేతి వేళ్ళతో నృత్యం చేయించాడు పాపారావు. అర్థం చేసుకున్న పరమానందం బ్రీఫ్ కేసు తెరచి డబ్బు చూపించి పాపారావు చేతికందించాడు. పాపారావు దాన్ని కారు డ్రైవర్ కిచ్చి జాగ్రత్తలు చెబూతూ.. మాలినిని పిలిచాడు. పరమానందం గుండె వేగంగా కొట్టుకోసాగింది. మాలిని హంస నడకతో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే పాపారావు అద్దాన్ని పరమానందానికి అందించాడు. అద్దం వెనుకాల ఏది నొక్కాలో చూపించాడు. పరమానందం స్వయంగా మీటను నొక్కి మూర్ఛపోయినంత పని చేసాడు. ఒక పరాయి స్త్రీని నగ్నీషి రూపంలో చూడ్డం అదే మొదటిసారి.. మాలిని పురి విప్పిన నెమలిలా నాట్యం చేస్తూ.. అందాలను ఒలికిస్తూ చూపిస్తోంది. పరమానందం ఈలోకం నుండి లిప్తకాలం అంతర్థానమయ్యాడు. ఇది కలయా!.. నిజమా..! అన్నట్టు మాలిని నిజస్వరూపం.. అద్దంలో నగ్నీషి రూపం.. తలను పెండ్యూలంలా ఆడిస్తూ చూడసాగాడు. అద్దంలో నగ్నీషి మాయమవడం.. పాపారావు అద్దం వెనుకాల చేతివాటమని గమనించి తేరుకున్నాడు పరమానందం. మాలిని వెళ్లి కార్లో కూర్చుంది. పరమానందం చేతిలో నుండి అద్దాన్ని తీసుకొని బ్రీఫ్ కేసులో సర్ది ఇస్తూ.. ఎలా ఉంది అన్నట్టు కనుబొమ్మలెగరేస్తూ అడిగాడు పాపారావు. మత్తుమందు దట్టించిన వాడిలా పరమానందం.. ‘మైకంలో ఉన్నాను మన్నించాలి..’ అన్నట్టు తనూ కళ్ళతోనే సమాధానమిస్తూ.. కారు వైపు నడుస్తున్న పాపారావును అనుసరించాడు.
పరమానందం కళ్ళగంతలు విప్పి తిరిగి యథాస్థానంలో బ్యాంకు ముందర రోడ్డు మీద దింపి వెళ్లి పోయాడు పాపారావు. పరమానందం ‘తనివి తీరలేదే..!’ అని మనసులో పాడుకుంటూ ఇంటిదారి పట్టాడు.
ఆరోజు ఆనందం పార్కులో అడుగు పెట్టగానే దూరంగా తాము నిత్యం కూర్చొనే బెంచీ మీద పరమానందం కనిబడేసరికి సంభ్రమాశ్చర్యాలతో వడి, వడిగా అడుగులు వేసాడు.
“బావా..! కుతి తీరిందా!.. వారం రోజులవుతుంది నిన్ను చూడక..” అంటూ ముసి, ముసి నవ్వులు విరబూస్తున్న ఆనందం ముఖం.. పరమానందం కంట నీరు చూసి చటుక్కున వాడి పోయింది. ఆనందాన్ని చూడగానే బోరుమన్నాడు పరమానందం.
“ఏమయ్యింది బావా!” అంటూ పరమానందం భుజాలు కుదుపుతూ ఆదుర్దాగా అడిగాడు.
పరమానందం కాస్త తమాయించుకుని.. “బావా.. మోసపోయాను” అంటూ తల సుతారముగా అరచేత్తో కొట్టుకోసాగాడు.
“నగ్నీషి.. అద్దంలో మోసం జరిగిందా?”
“అవును బావా..!” అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. “నగ్నీషి అద్దంలో కారు డ్రైవరు, మాలిని తప్ప మరెవ్వరూ కనబడ్డం లేదు. నీమీద నమ్మకంతో డబ్బంతా..” అంటూ గాలిలో చేతులు ఊపుతూ మరింత ఏడ్పు రాగం పెంచాడు పరమానందం.
నిండు నీటి కుండ కిదపడి పగులినట్టు భళ్ళున నవ్వాడు ఆనందం. బిత్తరపోయాడు పరమానందం.
“బావా!. ఎన్నో ఆదర్శభావాలు కలిగిన నువ్వు నగ్నీషి అసభ్యపు కాంక్షలో పడి అందరు అసహ్యించు కొనేలా పతనం కాగూడదని ఈనాటకం ఆడాను. పిల్లికళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరు చూడరిని అనుకోవడం పొరబాటు. కోరికలుండడం సహజం కాని అవి మనిషి మానమర్యాదలు, సంఘ కట్టుబాట్లను కాపాడేలా ఉండాలి. డబ్బు ఎక్కడికీ పోలేదు బావా..! నా వద్దకే చేరింది. దాంతో కొడుకు పెళ్లి కట్నకానుకలు ఆశించకుండా చేయి” అంటూ ఉపదేశిస్తుంటే.. సిగ్గుతో తలవంచి, కళ్ళు మూసుకున్నాడు పరమానందం.
***
“ఏం.. బావా మళ్ళీ నగ్నీషి కలలు గంటున్నావా?” అని నవ్వుతున్న ఆనందం రాకతో పరమానందం ఈ లోకానికి వచ్చాడు.
“ఇప్పుడా అవసరమేముంది బావా.. అటు చూడు. వారికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తున్నాను” అంటూ దూరంగా నీలిచిత్రాలు చూస్తున్న జంటను చూపిస్తూ.. ఆనందం నవ్వులో శృతి కలిపాడు పరమానందం. *