"ఈరోజు బకరా అదిగో'' అంటూ వాణి స్నేహితురాళ్లయిన రాణి, గీత లని వదలి –
కాలేజీ కాంటీన్ లో మూలగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో "ఎక్క్యూస్ మి మిస్టర్, నేను ఇక్కడ కూర్చోవొచ్చా" అని నెమ్మదిగా నవ్వుతూ అడగగానే,
ఆ అబ్బాయి కూడా నవ్వుతూ "ష్యుర్ కూర్చోండి" అన్నాడు.
"సారీ. మీ పేరు తెలీదు. అందుకే మిస్టర్ అన్నాను. నా పేరు వాణి"
"నా పేరు మదన్"
"అసూయపడేటంత అందంగా పేరుకు తగ్గట్టు ఉన్నారు మీరు" అని వాణి ముగ్ధ మనోహరంగా నవ్వేసరికి -
మెలికలు తిరిగి పోయిన మదన్, "మీ అందం మీ అందమైన నవ్వు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి."
"మీలాంటి అందమైన వ్యక్తితో కలిసి ఏదేనా సినిమా చూడాలనిపిస్తోంది" అని మరొక్కసారి నవ్వులు వెదజల్లింది వాణి.
"నా మనసులో మాట మీరే అన్నారు. ఎప్పుడు వెళదామంటారు"
"అనుకున్నది వెంటనే అయిపోవాలి, పోస్ట్ పోన్ చేయకూడదంటాను.” అని వాణి మరొకసారి నవ్వేసరికి -
"అలా అయితే ఇప్పుడే వెళదాం. నా బైక్ మీద వెళదామా లేక క్యాబ్ బుక్ చేయమంటారా"
"మీరెలాగంటే అలాగే"
"పదండి, నా బైక్ మీదే వెళదాం. ‘ఫాషన్’ మాల్ లో జంటలు జంటగా కూర్చుందికి సోఫా సీట్లతో పెద్ద స్క్రీన్ తో హై సౌండ్ సిస్టంతో కొత్త సినిమా హాల్ నెల క్రిందట ఓపెన్ చేసేరు." అని వాణి చేయి అందుకుని బైక్ దగ్గరకి బయలుదేరేడు.
అతను చూడకుండా వాణి స్నేహితురాళ్లకి చేయి ఊపి బై చెప్పింది.
-2-
ఆ హాల్లో సినిమా టిక్కెట్లకి వేయి రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించిన మదన్ ని ఆరాధన పూర్వకంగా చూసి వాణి నవ్వేసరికి, ఆ ఖర్చు ఆవగింజంత అనిపించి, పాప్ కార్న్ కూల్ డ్రింక్స్ కోసం మరో ఐదు వందల రూపాయలు కార్డు ద్వారానే చెల్లించేడు మదన్.
తరువాత స్నాక్స్ ఐస్ క్రీం కోసం ఐదు వందల రూపాయలు కార్డు ద్వారానే సునాయాసంగా చెల్లించేడు మదన్, వాణి చిరుదరహాస సమ్మోహనంతో.
ఆ మాల్ లో తిరుగుతూ ఒక షాప్ లో వాణి ఎంచుకున్న బట్టలకి అయిన 2000 రూపాయల బిల్ చెల్లించడానికి వాణి కురిపిస్తున్న నవ్వుల వానజల్లులో తడిసి కౌంటర్ లో స్టైల్ గా కార్డు ఇచ్చిన మదన్ కి రెండు నిమిషాల తరువాత --
"సారీ సర్. మీ కార్డు మీద ‘రోజువారీ పరిమితి’ డైలీ లిమిట్ దాటింది అని చూపిస్తూ ఈ బిల్ పేమెంట్ ని యాక్సెప్ట్ చేయడం లేదు" అని కార్డు వాపసు చేసి, “కాష్ ఇస్తారా” అని అడిగింది కౌంటర్ అమ్మాయి.
కార్డు మీద తానే ‘రోజువారీ పరిమితి’ 2000 రూపాయలు పెట్టుకున్న సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చి జేబులో 500 రూపాయలు మాత్రమే ఉండడంతో సిగ్గు అవమానం కలగలిపి తల దించుకున్న మదన్ వేపు చూసిన వాణి –
తన బాగ్ లోంచి కార్డు తీసి కౌంటర్ లో ఇచ్చి మదన్ ని చూసి నవ్విన నవ్వులో అర్ధాలు కోకొల్లలు.
*****