“ఏమండీ! ఈఏడాది కుంభమేళా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారట, మనము కూడా అలహాబాదు వెళ్దామా? అందులోను, ఇది మహా కుంభామేళాట కూడాను. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందట. ఎలాగు మీరు రిటైర్ అయ్యాక మనం కాశి, ప్రయాగ వెళదామని అనుకున్నాము కదా, ఈ కుంభమేళా రూపేణా ముందే వెళదాము. ఆ త్రివేణి సంగమంలో ‘వేణి దానం’ చేసి చక్కగా స్నానాలు చేద్దాము; ఎంతో పవిత్రమైన ప్రదేశం, మళ్ళీ ఈ జన్మలో ఈ భాగ్యం దక్కదు మనకి” అని అంటూ అప్పుడే అక్కడికి వెళ్ళిపోయినట్లు, ఈస్ట్ మన్ కలరులో ఊహించుకుంటూ నేను ఎంతో ఉత్సహంగా చెప్పేస్తుంటే దానికి ఆయన తాడి ఎత్తంత యెగిరి “ఠఠ్! ససేమిరావద్దు అంటేవద్దు” అని అరిచారు.
“ఏం? ఎందుకు?” అని నేను కూడా గట్టిగానే అడిగాను.
“ఎందుకా? అక్కడ అసలు జనం ఎలావున్నరో తెలుసా? ఒక్కసారి టీవీ లో చూడు ప్రపంచంలో వున్న మనుషులందరూ అక్కడే వున్నట్లు వున్నారు. ఆ కిక్కిరిసిన జనం మధ్య ఒక్క స్నానమైనా చెయ్యగలమా? చక్కగా హాయిగా ఇంట్లో కూచుని టీవీ లో చూడు” అంటూ హితోపదేశం చేసారు.
అంతే వెంటనే నా ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. నాకు ఉక్రోషం వచ్చి “ఇదిగో పెద్దమీరు ఎక్కడికన్నా వెళ్దామంటే ఇంట్రెస్ట్ వుండదు. అదే మాఆర్మీ బావ, అదే మాకృష్ణ బావ చక్కగా పెళ్ళాన్ని తీసుకొని అన్ని ఊళ్ళు, అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతాడు” అని అన్నాను.
“అదే నాకు మండుతుంది. వేరే వాళ్ళతో నన్ను పోల్చద్దు. ఇప్పుడు కుంభమేళా గురించి మాటలాడుతూ మీ బావని ఎందుకు తీసుకువస్తావు? ఆయన రిటైర్ అయ్యి జమానా అయ్యింది. ఎక్కడికక్కడే అన్నీ జరిపించుకొంటూ, పైగా నాకు ఇంట్రెస్ట్ లేదన్న మాట మాత్రం పైకి వస్తుంది. అని రుసరుసలాడుతూ చదువుతున్న న్యూస్ పేపరిని అక్కడ పారేసి విసవిసా బయటికి వెళ్లిపోయారు.
ఆయనకి కొంచెం ప్రధమ కోపం, తరువాత నెమ్మదిగా చెబితే వింటారు. చితుకుల మంటలా కొంత సేపే ఉంటుంది. తరువాత నిజంగా శ్రీ రామ చంద్రమూర్తే!
‘ఈ మనిషితో ఇన్నేళ్ళుగా ఎలా వేగావే రాజ్యలక్ష్మి’ అని నాకు నేనే భుజం తట్టుకున్నాను. ఇంతలో మనసు లోకి ఒక అద్భుతమయిన ఆలోచన వచ్చింది. అది కార్యరూపం దాల్చాలంటే నేను కొంత శ్రమపడాలి. సరే మరి! కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలి కదా! ఆయనకు ఇష్టమైన సొజ్జప్పాలు, కజ్జి కాయలు చెయ్యడానికి వంటింటిలోకి వెళ్ళాను. అవును దీన్ని లంచమే అంటారు! ఏం చెయ్యమంటారు మరి నాపని కావాలంటే ఇలాంటి ముడుపు చెల్లించాల్సిందే. నా పనంతా అయ్యేసరికి భోజనాల వేళ అయింది. నేను వంటింట్లోంచి ఆయనను గమనిస్తూనే వున్నాను. బయటనుంచి వస్తూనే “రాజి కాఫీ ఇయ్యి” అని గట్టిగా అడిగారు. వెంటనే “ఎట్ యువర్ సర్వీస్” టైపు లో తెలుగు సీరియల్స్ లో అమాయకపు కోడలులాగా తీసికెళ్ళి ఇచ్చాను. అదే మాములుగా అయితే ఇప్పడు అన్నం తినే టైములో ఏమిటండి అంటూ కయ్యిమనే దాన్ని. కాని ఇప్పుడు నేను శాంతి మంత్రం పఠిస్తున్నాను. అందులో కార్యం సానుకూలం చేసుకోవాలంటే కొంత సహనం తో వుండాలి. భోజనం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని కుంభమేళా కి వెళ్ళడానికి కావలిసిన సమాచారం మా ఇంటి ఎదురు ఫ్లాట్ లో వుండే శ్యామల గారి దగ్గర తీసుకున్నాను. వాళ్ళు కూడా వెళదామని అనుకొంటున్నారు. ఆవిడ సరదాగా మనం కలిసివెళ్దామని అన్నారు. నేను ఈ రోజు రాత్రికల్లా మీకు ఏ సంగతో చెప్పేస్తాను అని పరుగున ఇంట్లోకి వెళ్లి ఐ పాడ్ లో ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమాలు చూస్తున్న శ్రీవారిదగ్గరే కూచున్నాను. ఒకప్పటి వర్దమాన హీరోయిన్లా ఆయా చిత్రాలలో తమ భర్తల దగ్గర ఎంతోఅణుకువగా, ఎంతో భక్తిగా, ఆరాధనగా వుండి తమకి కావలిసిన పనులు చేయించుకున్నారో గుర్తు తెచ్చుకొని.
“ఏమండీ” అని ఎంతో ఇదిగా పిలిచాను.
“ఏమిటిసంగతి చెప్పు” అన్నారు ఐ పాడ్ నుంచి కళ్ళు తిప్పకుండానే.
“మరేమీ లేదు, మీరు నేను చెప్పినది విని ఊ అనాలి” అన్నాను.
“ఊ”
“మనఎదురింటి శ్యామలగారు, కృష్ణమూర్తి గారు కూడా మహాకుంభమేళా కి వస్తారట. మనం అందరం కలిసి వెళదాం” అని భయం, భయంగా చెప్పాను.
“ఎవరు? మన యోగ కృష్ణమూర్తి గారా? అవునూ కొంచెం ఆయనకి చెవుడు కూడా కదా! సరేలే టికెట్స్ బుక్ చేయమని అయనకు చెప్పు, హోటల్ అది నేను చూస్తాను. ఇదిగో ఇంకో మాట ‘ఏసి’ కోచ్ లోనే బుక్ చెయ్యమను” అన్నారు.
అమ్మయ్య వో పని అయింది అనుకుంటూ వెంటనే వార్తాహరి లాగా శ్యామల గారికి చెప్పి వచ్చాను.
ఉత్సహంగా చకచకా పనులన్నీ చేస్తున్నాను. అది చూసి ఈయన ఒకటే ఆట పట్టిస్తున్నారు. అంటే మనసు లో ఎక్కడో టికెట్లు దొరకవని రాక్షసానందం. దానికి విరుగుడుగా నేను చక్రం అడ్డు వేస్తూనే వున్నాను సుమా! మొత్తానికి మేము వెళ్ళే రోజు వచ్చేసింది. ఇంక చూసుకోండి హడావుడి! ట్రైన్ లోకి నేను కొంచెము పులిహోర, దద్దోజనం చేశాను. శ్యామల గారు పూరి కూర చేసారు. మొత్తము రెండు పూటలు. అసలే ఈ రైలు కుంభమేళా స్పెషల్, ఇది ఆలస్యంగా కూడా వెళుతోందని కూడా తెలిసింది. ఇంక అన్నిరకాల చిరుతిళ్ళు కూడా కొని పెట్టుకొన్నాము. పాపం కృష్ణమూర్తిగారికి ఎదటి వాళ్ళు చెప్పేది తొందరగా వినపడదు. అడిగినదే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. స్టేషన్ కి ఒక గంటముందే వెళ్లి కూచున్నాము. అప్పుడు చూసుకొంటే తెలిసింది మేము వెళ్ళేది ఎసి లో కాదు మామూలు స్లీపర్ క్లాసు లో అని. ఇంక మా వారు అయితే నరసింహావతారం ఎత్తేసారు. పాపం కృష్ణమూర్తి గారు “ఇలా జరగుతుందని అనుకోలేదు రామంగారు. ఆ ట్రావెల్ ఏజెంట్ కి ఫోన్ చేస్తే వాడు సొంత పైత్యంతో ఎసి లేకపోయినా, స్లీపర్ లో కన్ఫర్మ్డ్ సీట్స్ వున్నాయని చేసాడుట” అని ఎంతో నొచ్చుకుంటూ చెప్పారు. నా వైపు కోపంగా చూసి గంటుపెట్టుకొన్న మొహంతో ఈయన రైలెక్కారు. రైలు ఎక్కినప్పటినుంచి కృష్ణమూర్తి గారికి తెగ ఫోన్లు, ఈయనకి వినపడక గట్టిగ మాట్లాడటం, అది చూసి మా వారు గొణుక్కోవడం “ఈ చెవిటి మనిషికి అన్ని ఫోన్లు రావడం ఏమిటో? వస్తేవచ్చాయి కాస్త నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు కదా” అని తెగ విసుక్కు పోతున్నారు. కృష్ణమూర్తి గారు భజన చేస్తూ ఎంతో భక్తిపారవశ్యం లో ములిగిపోయారు. ఆయన చుట్టూ కొంత మంది కూచుని భాష తెలియక పోయినా తలూపుతున్నారు. రాత్రికి తెచ్చుకున్న పూరీలు తినేసి నిద్రకి ఉపక్రమించాము. ఉదయాన్నే నిద్ర లేచి చూద్దుము కదా! బెర్త్ నుంచి కాలు కదపలేని స్థితి. ఎక్కడచూసినా జనమే, విసుక్కొంటు టాయిలెట్ వైపుకి వెళ్లారు. నేను కూడా ఎలాగో వాళ్ళని తప్పించుకొని టాయిలెట్ కి వెళ్లి రావడం పెద్ద అడ్వెంచర్ చేసినట్లయింది. మా వారి కళ్ళలో, కోపం, అసహనం ఏ క్షణాన అయినా కట్టలు తెచ్చుకోనేలావుంది. “అందుకే ఎసి లో వెళ్దామని అన్నాను” అంటూ మళ్ళీ మొదలుపెట్టారు.
మొత్తానికి మేము అలహాబాదు చేరేసరికి ఇంచుమించుగా మధ్యాన్నం 12 గంటలైంది. స్టేషన్ కి ఈయనకి తెలిసున్న వాళ్ళు ఒక మనిషిని పంపిచారు. త్రివేణి సంగమం కి తిన్నగా వెళ్ళిపోదామని అన్నాడు అతను. మేము కూడాసరే అని అతనితో బయల్దేరి, ఆ రేవుకి చేరుకున్నాము. అక్కడ పడవ నడిపే కుర్రాళ్ళు చాలా స్పీడ్ గా ‘సంగమం’కి తీసుకొని వెళ్లారు. మా వారికి నీళ్ళు అంటే భయం. అందుకే ఏమి మాట్లాడకుండా బిక్క మొహం వేసుకొని కూర్చొన్నారు. చక్కగా గంగపూజ చేసుకొని నది మధ్యలోకి వెళ్లి, ఒక్కొకళ్ళ పేరు చెప్పి బోలెడు ములకలు ములిగాను. ఆయన మాత్రం ఎలాగో మూడు ములకలు ములికేసి అది కుడా నన్ను పట్టుకొని, వెంటనే పడవ ఎక్కి నిలబడ్డారు. వస్తున్ననవ్వుని బిగ పెట్టాను... లేకపోతే ఇంకా ఉడుక్కుంటారు. మా తిరుగు రైలు రేపు రాత్రి పది గంటలకి. అంటే ఇంచుమించుగా రేపు సాయంత్రం వరకు ఈ అలహాబాదు లోనే ఉంటాము.
మరునాడు తెల్లవారుఝామునే లేచి 2.30 గంటలకి బయలుదేరి ఘాట్ దగ్గరకి ముందేచెప్పివుంచుకొన్న ఆటోలో నలుగురం బయలుదేరాము. డ్రైవర్స్ పక్కన కృష్ణమూర్తి గారు కూచున్నారు. అక్కడ ఒక చోటుకి వెళ్ళాక ఏదో సివిల్ లైన్స్ అన్నాడు. అక్కడనుంచి దగ్గరే, వో 2 కి.మి ఉంటుందని చెప్పి దింపేసాడు. అలా అక్కడ మా నడక మొదలైంది. యెంత దూరం నడిచినా ఘాట్ కనిపిస్తేనా? కాని ఎక్కడపడితే అక్కడ డైరక్షన్స్ వుండటంతో అవి చదువుకొంటూ మధ్యమధ్యలో మా శ్రీవారి చూపుల బాణాలకి తట్టుకొంటు నిజంగా వాటికే కనక శక్తివుంటే అక్కడికక్కడే నేనుమాడి మసైపోయేదాన్ని. రెండు మూడుచోట్ల ఆగి వేడివేడి టీ తాగి శక్తి పుంజుకొంటూ నడుస్తున్నాము. ఎక్కడ చూసినా జనం! జనం పుట్టలు పుట్టలుగా అలా ఆ జనప్రవాహంలోపడి కొట్టుకు పోతూ ఇంకొక నాలుగు గంటలు నడిచాక ఘాట్ కి చేరుకొన్నాము.
అమ్మయ్యా! బతుకు జీవుడా అనుకొంటూ స్నానాలు కానిచ్చిబయలుదేరాము. ఈ లోపల కృష్ణమూర్తి గారు వచ్చిఇక్కడ దగ్గరలోనే శక్తిపీఠం వుంది అదిచూసుకొని వెళ్దాము అన్నారు. కాని అప్పటికే శ్రీవారు కోపంతో ఆకలితో మండిపోతున్నారు. ఇంక ఆ గుడికి వెళ్లడమా? ఇంకేమన్నా వుందా? ఇంతలో దేవుడులా అక్కడ ఒక పోలీస్ చెప్పాడు, ఆగుడికి వెళ్ళేదారి క్లోజ్ చేశారు అని. అమ్మయ్య అనుకొన్నాను. ఇంక అక్కడనుంచి స్టేషన్ కి వెళ్ళడానికి మాపాట్లు చూడాలి కొంత దూరము రిక్షాలోవెళ్లి అక్కడనుంచి మళ్ళీ నడిచి వెళ్లేసరికి అందరికాళ్ళు రోళ్ళులా తయారయ్యాయి. అందరం కూడా అలవాటు లేనినడకతో అలసిపోయాము. నేను అసలు మావారివైపు చూడకుండా శ్యామలగారి వెంటే వున్నాను. నా లోంచి నాఅంతరాత్మ నన్నుఇలాతిట్టిపోస్తోంది". ముందువుందే ముసళ్ళపండగ రాజ్యలక్ష్మి! ఆయను ఎలాగు దూర్వాస రూపం ఎత్తుతారు అది తప్పదు ఆ కోపాగ్నికి నీ పని సరి. నువ్వు, నీ కుంభ మేళా యాత్ర అనవసరంగ వచ్చావుకదే! అసలు నీకు ఈబుద్ధి ఎందుకుపుట్టిందే, పుట్టినది పో, నీవేల శ్రీవారిని అడుగువలె, అడిగితివి పో, నీఎదుటవారిని ఎందుకుపిలువవలె? అనుభవించు".
మేము స్టేషన్ కి వెళ్లేసరికి మధ్యాన్నం 3 గంటలు అయింది. “బోలెడు టైం వుంది కదా నేను వో గంట యోగ చేసుకొంటాను” అని కృష్ణమూర్తి గారు ఓ పక్కకి వెళ్లి అక్కడ ఎవరో పడుకొంటే, వాళ్ళను పక్కకు జరగమని చెప్పి ఎంచెక్కా ఆసనాలు వేసుకుంటున్నారు. బోలెడు మంది ఆయన చుట్టురా చేరి వాటిగురుంచి అడుగుతున్నారు. అప్పుడే ఆయన వాళ్ళకి ‘ఇన్స్టంట్ గురువు’ కూడా అయిపోయారు. ఇంక మా వారి అవస్థ చూడాలి, అసలే చిరాకు మనిషి, “ఈ కృష్ణమూర్తికి అస్సలు తెలివి వుందా ఎక్కడ పడితే అక్కడ చేస్తారా?” అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. మొత్తానికి, ఆరుద్రగారన్నట్లు జీవితకాలం కాదు కాని మారైలు ఓ గంట లేటుగా వచ్చింది. హాయ్ గా ఎసి లోకి ఎక్కి శుభ్రంగా గుర్రుకొట్టి నిద్రపోయారు మావారు. మేము కూడా అందరం ఒళ్లెరగకుండా పడుకోన్నాము.
రైలు మా ఊరు చేరుకొన్నాక స్టేషన్ లో దిగేసరికి కృష్ణమూర్తి గారి అబ్బాయి అందరికి మెళ్ళో పూలదండలు వేసి కాళ్ళకు నమస్కారం చేసాడు. 'భళా భళా! జయహో మాకుంభమేళా యాత్రా’ అని అంటూ మావారు “కృష్ణమూర్తి గారు! వచ్చే ఏడాది అర్ధకుంభమేళ కదా! ఉజ్జయిని లోనూ, నాసిక్ లోనూ. మనం మళ్ళీ కలిసి వెళ్దాము ఇప్పటినుంచే ఏర్పాట్లు చెయ్యండి” అన్నారు.
“హ” అంటూ నేను ఉలుకు పలుకు లేకుండా, ఆయన వైపు చూస్తూ అలా ఉండిపోయాను. ఇది కలా! నిజమా! “రాజి వున్నావా? పోయావా? అనందం తట్టుకోలేక షాక్ లో వున్నట్టుంది” అన్న శ్రీవారి మాటలు లీలగా వినిపించాయి.
************