కళింగ రాజ్యాన్ని పరిపాలించే విక్రమసింహుడు చాలా తొందరపాటు స్వభావం గలవాడు. ఎప్పుడు, ఎందుకు తనకు కోపం వస్తుందో అతనే తెలుసుకోలేకపోయేవాడు. అయితే అతని ఆగ్రహమూ క్షణికమే. చాలాసార్లు, కోపంలో చిన్న పొరపాట్లు, తప్పులు చేసిన వారికి కూడా కఠినమైన శిక్షలు విధించి, ఆనక కోపం తగ్గిన తర్వాత తీరిగ్గా విచారించే సందర్భాలూ లేకపోలేదు. ఆ ఒక్క అవలక్షణం లేకపోతే అతనంత దయార్ద్ర హృదయడెవరూ లేరు. మంత్రి వివేకుడు చాలాసార్లు అనవసర ఆగ్రహం తగ్గించుకోమని హితవు చెప్పేవాడు కూడా. అయినా తన దురలవాటు అంత సులభంగా వదులుకోలేకపోయాడు విక్రమసింహుడు. ఆ విషయమై మనసులోనే మధనపడేవాడు కూడా.
ఒకరోజు ఆ రాజ్యానికి శివానందుడు అనే సాధువు దేశాటన చేస్తూ రాజధానీ నగరం పొలిమేరలో ఉన్న శివాలయంలో బస చేసినట్లు రాజు విక్రమసింహుడికి తెలిసింది. శివానందుడు తన అపారమైన అనుభవంతో తన వద్దకు వచ్చే భక్తుల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తున్నాడన్న విషయం తెలిసిన విక్రమసింహుడు అతన్ని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా అనుకున్నదే తడువు మంత్రి వివేకుణ్ణి పిలిచి తన మనసులో మాట చెప్పాడు. వివేకుడు ఆ మరుసటి రోజు శివానందుణ్ణి కలిసే ఏర్పాట్లు చేసాడు.
ఆ రోజు సాయంకాలం శివానందుణ్ణి కలిసాడు విక్రమసింహుడు తన పరివార సమేతంగా.
"స్వామీ! నన్నో సమస్య తీవ్రంగా బాధిస్తోంది. ఎప్పుడు నేను ఆగ్రహానికి గురౌతానో నాకే తెలియదు. ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయాల వల్ల తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని తమకు తెలియనిది కాదు కదా! నా కోపం తగ్గించుకోవడానికి ఏదైనా మార్గం సూచించండి స్వామీ!" అంటూ తన సమస్యని వివరించాడు విక్రమసింహుడు శివానందుడికి ప్రణమిల్లి.
అంతా శివానందుడు చిరునవ్వు నవ్వుతూ, "రాజా! నీ ఆగ్రహం తగ్గించుకోవడానికి ఓ మార్గం చెబుతాను. ఆ విధంగా ఆచరించు." అని తగిన విధంగా ఉపదేశం చేసాడు.
అక్కణ్ణుంచి తిరిగివచ్చిన తర్వాత ఓ వారం రోజుల వరకూ విక్రమసింహుడికి కోపం తెప్పించే సంఘటనలేవీ జరగలేదు.
వారం తర్వాత ఓ రోజు సాయంకాలం తన మంత్రితో మంతనాలు చేస్తూ ఉద్యానవనంలో విహరిస్తున్నాడు రాజు విక్రమసింహుడు. అందులో లీనమైపోయిన రాజు అనుకోకుండా కాలిబాటపై ఉన్న ఓ బండరాయి తగిలి తూలిపడబోయి తనని తాను నియంత్రించుకున్నాడు. నడిచే బాటని శుభ్రపరచకుండా బాధ్యతా రహితంగా అలా రాయిని మధ్యలో వదిలిసిన తోటమాలిపై చెప్పలేని ఆగ్రహం ముంచుకు వచ్చింది.
వెంటనే కొద్ది దూరంలో మొక్కలకు నీళ్ళు పెడుతున్న తోటమాలిని పిలిపించాడు. విషయం తెలిసిన తోటమాలి రామయ్య తన వల్ల జరిగిన పొరపాటుకి అమితంగా చింతించి పరుగుపరుగున వచ్చి వణుకుతూ చేతులు కట్టుకొని రాజుగారి ఎదుట నిలబడ్డాడు. రాజు విక్రమసింహుడి ఆగ్రహం గురించి బాగా తెలిసిన రామయ్య గజగజ వణికిపోసాగాడు తనకేమి శిక్ష పడబోతోందో అని భయపడుతూ.
"మహారాజా! నా పొరపాటు మన్నించండి. చెట్లలకి నీళ్ళు పెడుతున్న ధ్యాసలో పడి బాటని శుభ్రపరచడంలో ఆలసత్వం జరిగింది." అని విన్నవించుకున్నాడు.
తన ఎదుట అలా భయపడుతూ నిలుచున్న తోటమాలిని చూడగానే విక్రమసింహుడికి శివానందుడి ఉపదేశం గుర్తుకి వచ్చింది. ఎదుటివాడిపై తప్పు రుద్దేముందు, తన వల్ల కూడా ఏమైనా పొరపాటు జరిగిందా అని సమీక్ష చేసుకొనిగానీ నిర్ణయం తీసుకోరాదన్న అతని ఉపదేశం స్పురణకి వచ్చింది. కాలిబాటు శుభ్రపరచకపోవడం తోటమాలి తప్పే అయినా, పరిసరాలు సరిగ్గా గమనించకుండా నడవటం కూడా తన పొరపాటే. తన తప్పు తెలిసిన తర్వాత అతని కోపం ఎగిరిపోయింది. అప్పటివరకూ ఆగ్రహంతో ఎర్రబడిన అతని ముఖం వెంటనే ప్రసన్న రూపం దాల్చింది.
"నిజానికి తప్పు నీది కాదు, మాటల్లో పడి ముందు వెనుకలు చూడకుండా నడవడం నాదే తప్పు! ఇందులో నీ పొరపాటేమీ లేదు. నీ పని పూర్తి చేసుకొని నిదానంగా బాటని శుభ్రపరుచు!" అని శాంతంగా చెప్పి మంత్రితో కలిసి ముందుకు సాగిపోయాడు విక్రమసింహుడు.
అప్పటివరకూ భయంతో నిలబడ్డ రామయ్య ముందు ఆశ్చర్యపోయి, ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు.
శివానందుడి ఉపదేశం పాటించి విక్రమసింహుడు క్రమంగా తన కోపం పోగొట్టుకున్నాడు. అయితే దేశ రక్షణ విషయంలోనూ, కరుడు కట్టిన నేరస్థుల విషయంలోనూ రాజీ పడకుండా సరైన విచారణ జరపి, తగిన శిక్ష విధించాలన్న శివానందుడి ఉపదేశం కూడా బాగా గుర్తు పెట్టుకున్నాడు రాజు విక్రమసింహుడు.
……………………………