ఫుడ్ డెలివరీ - మద్దూరి నరసింహమూర్తి

Food delivery

ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు చిన్న చినుకుతో ప్రారంభమైన వాన - రాత్రి ఏడు గంటల వరకూ ఉరుములు మెరుపులతో వడగళ్లతో పెద్దగా కురిసి, తెరిపివ్వనా మాననా అంటూ ఆలోచిస్తూ ఒక నిర్ణయంకి రాకపోవడంతో –

బ్రహ్మచారి మఠంలోని రాజూకి ఏమీ తోచక ---

"ఒరేయ్ రవీ ఈ వాతావరణంలో వేడి వేడిగా తినడానికి తాగడానికి ఏమేనా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదూ"

"నిజమే రాజూ కానీ ఈ వాతావరణంలో బయటకు వెళ్లాలంటే బద్ధకంగా ఉంది"

"నీ బద్ధకం మూటకట్టి నీ దగ్గరే పెట్టుకో. మనలాంటి వారి కోసం బోలెడు డెలివరీ సదుపాయాలున్నాయిగా"

"నిజమే. టొమాటోలో బుక్ చేసి వెజ్ మంచురియా తెప్పిద్దాం"

"అదొక్కటే ఏమిటి మైసూర్ బోండా కూడా తెప్పిద్దాం"

"మరి వేడిగా తాగడానికో"

"చాయ్ కూడా తెప్పిద్దాం"

టొమాటోలో ఆర్డర్ పెట్టేసరికి వాన కొద్దిగా పెద్దదైంది.

"రవీ, మనం ఆర్డర్ పెట్టేం కానీ, ఈ వానలో వస్తుందంటావా"

"ఎందుకు రాదు రాజూ, మామూలు సమయంలో కంటే ఈ వాతావరణంలో డెలివరీ బాయ్ కి కమిషన్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మన ఆర్డర్ తప్పకుండా వస్తుంది"

"అది కాదు రవీ, ఆ డెలివరీ బాయ్ కూడా ఈ వాతావరణంలో ఎలా వస్తాడంటావు ఎప్పుడు తెస్తాడంటావు"

"ఈ డెలివరీ బాయ్స్ ఎక్స్పర్ట్ డ్రైవర్స్. టైం ప్రకారం డెలివరీ చేయకపోతే వాళ్లకే నష్టం"

"ఆ యాప్ లో చూడు రవీ, ఇంకా ఎంత టైం చూపిస్తుందో"

"ఇంకా నలభై రెండు నిమిషాలు చూపిస్తోంది రాజూ"

"మనం ఈ వాన వాతావరణంలో వేడిగా తిందాం తాగుదాం అనుకుంటే, ఇంకా అంత టైం ఆగాలా"

"ఆగక మనం చేసేదేమి ఉంది. ఈ వానలో మనం వెళ్లలేం కదా"

"మరి ఈ వానలో ఆ డెలివరీ బాయ్ ఎలా వస్తాడు"

"వాళ్లకి ఈ పని బ్రతుకు తెరువు, వానా వరదా అని చూడరు. కాబట్టి తప్పకుండా వస్తాడు ఎవడో ఓ బకరా"

"మన ఆనందానికి వాడెవడినో బకరా చేసి మనం తప్పు చేసేమేమో అనిపిస్తోంది.

"ఎందుకు అలా అనిపిస్తూంది"

"చూడు ఉరుములు మెరుపులుతో వాన ఎలా కురుస్తుందో"

"చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని లాభం ఏమిటి? ఆ ఆలోచన ఆర్డర్ పెట్టేముందర ఉండాలి"

"అవుననుకో, ఈ వాన జోరు చూస్తూంటే ఆర్డర్ అసలు వస్తుందా అనిపిస్తోంది"

"రాకపోయినా, ఆలస్యం అయినా, మన సొమ్ము మనం వాపసు వసూలు చేసుకోవొచ్చులే"

"ఈ వానలో వాడెవడో మన ఆర్డర్ తెచ్చి ఇవ్వడమే గగనం. ఆలస్యం అయినా మనం ఊరుకుందాం"

"సరే ఆర్డర్ డెలివరీ అవనీ ముందు. ఏమి చేయాలి అన్నది అప్పుడు ఆలోచించవచ్చు"

అక్కడ హోటల్ లో వీళ్ళ ఆర్డర్ తీసుకొని బయలుదేరడానికి సిద్ధమైన విహారి మొబైల్ మ్రోగింది.

మరొక ఆర్డర్ గురించి కాబోలు అని చూస్తే - భార్య విమల చేస్తున్న ఫోన్ అది.

"ఆ విమలా చెప్పు"

"ఎక్కడ ఉన్నారండీ. వాన ఎంత జోరుగా పడుతోంది చూస్తున్నారా"

"ఇప్పుడే ఒక ఆర్డర్ తీసుకొని డెలివరీ చేయడానికి బయలుదేరుతుంటే నీ ఫోన్. నాకు ఆలస్యమైపోతుంది ఫోన్ పెట్టేయి"

"ఇంత వానలో డెలివరీ ఏమిటండీ, ఏమిటుంటే అదే పంచుకొని తిందాం. అమ్మాయి కూడా ‘నాన్న’ అంటూ ఏడుస్తూ ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడకి వెళ్లకుండా వాన తగ్గితే తిన్నగా ఇంటికి వచ్చేయండి. నాకు చాలా భయంగా ఉంది"

"సరేలే. ఈ ఆర్డర్ తీసుకున్నాను కనుక డెలివరీ ఇవ్వాలి. ఎలాగో అలాగ ఈ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తాను. భయపడకు. ఫోన్ ఉంచేస్తాను నాకు ఆలస్యమైపోతుంది" అని ఫోన్ లైన్ కట్ చేసి –

వర్షానికి తడవకుండా రెయిన్ కోటు, హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ మీద బయలుదేరేడు, విహారి.

‘వాన వాన వల్లప్పా’ అని పాడుకుంటూ వాయుదేవుడు ఆ వానని ఊపుతూ ఆడుకుంటూంటే రోడ్డు మీదకి వచ్చి మధ్యలో అడ్డు తగులుతున్నాడన్న కోపంతో అలిగిన వాయుదేవుడు –

మోటార్ సైకిల్ తో సహా విహారి ని అటూ ఇటూ చిన్నగా ఊపుతూ ఆడుకోనారంభించేడు.

డబ్బు అవసరం ముందర ఈ వాన అడ్డంకి ఏపాటి అనుకున్న విహారి ముందుకు సాగుతున్నాడు మెల్లిగా.

గాలి వాన ఉన్నచోట మేముండం అని అలిగిన వీధి లైట్లు ఎక్కడికో పోయేయి.

కొన్ని గంటలుగా పడుతూన్న వానతో రోడ్డు చిన్న కాలువలా మారింది.

డెలివరీ ఇవ్వవలసిన చోటు వెళ్లే దారి తెలుసును కాబట్టి మోటార్ సైకిల్ కి ఉన్న లైట్లో జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతున్న విహారి పెట్టుకున్న హెల్మెట్ అద్దం వాన నీటికి తడిసి దారి కనిపించడానికి కష్ట పెడుతూంది. ఇక లాభంలేదని హెల్మెట్ అద్దం తెరిచి బండి నడుపుతున్నాడు, విహారి.

హెల్మెట్ మీదున్న అద్దం తీసివేయడంతో - వాన చినుకులు ఏటవాలుగా కంట్లోకి సూటిగా పడుతూ విహారికి బండి నడపడం మరీ కష్టం అవుతూంది.

ఇంకో ఐదు ఆరు నిమిషాలలో ఆర్డర్ ఇవ్వవలసిన చోటుకి చేరుకోవలసిన విహారిని –

సర్కారు వారి నిర్లక్ష్యానికి ప్రతిబింబంగా రోడ్డు మధ్యలో సరిగ్గా కప్పబడని పెద్ద గోయి –

మోటార్ సైకిల్ తో సహా క్రింద పడేటట్టు చేసి –

'నా ఆకలి తీర్చుదువుగాని, రా' అని నీటి ప్రవాహంతో సహా తొందరగా లోపలికి లాక్కుంది.

"ఎక్కడ రవీ మన డెలివరీ, ఈ వానకి వాడేం వస్తాడు కానీ. ఆ యాప్ చూడు మన ఆర్డర్ కాన్సుల్ చేసేరేమో తెలుస్తుంది"

"లేదు రాజూ, ఆర్డర్ ఆన్ రోడ్ ఫర్ డెలివరీ అని చూపిస్తోంది యాప్"

"ఇప్పుడు 8.20 అయింది. ఇంకా రాలేదంటే, ఆ ఆర్డర్ పట్టుకొని వాడింటికి పోయుంటాడు దొంగ వెధవ"

"హాయిగా తిందామని మనం ఆర్డర్ పెట్టుకుంటే, అది కాస్తా వాడు హాయిగా ఎక్కడో తింటూ కూర్చొని ఉంటాడు, ఉండు కంప్లైన్ చేద్దాం" అని మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు అలిగిన రవి.

"అక్కడ విమల పదే పదే విహరికి ఫోన్ చేస్తుంది. ‘రింగ్ అవుతున్నా తీయడం లేదేమిటి’ అని భయపడుతూ ఈసారేనా తీస్తాడేమో అని అదే పనిగా ఫోన్ చేస్తోంది.

*****

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ