‘జ్ఞాపకాల దొంతర’ - మద్దూరి నరసింహమూర్తి

Jnapakala dontara

నాకు ఎప్పటినుంచో నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక డైరీలో వ్రాసుకోవాలని కోరిక.

శనివారం సెలవు, మధ్యలో ఆదివారం, తరువాత రెండు పండగలు కలిసి వరుసగా నాలుగు రోజులు సెలవలు వచ్చేసరికి, ఆ ముచ్చట తీర్చుకోవాలని, మొదటి రోజే ఉదయం ఫలహారం చేసిన తరువాత పెన్ను పట్టుకొని డైరీ తెరిచి ఏమిటి వ్రాయాలా అని ఆలోచిస్తూంటే –

ప్రస్తుతం భౌతికంగా లేని నాన్నగారికి నాకు మధ్యలో గతంలో గడిచిన సన్నివేశాలు సంభాషణలు వెనకనుంచి నాన్నగారే గుర్తు చేస్తున్నట్టు చెవిలో మూగగా వినిపిస్తూంటే, జ్ఞాపకాల దొంతరలో మనసు తిరుగాడుతూ కలం అలవోకగా కదలసాగింది.

నేను ఆరో తరగతిలో చదువుతున్నప్పుడు, కొత్తగా కొన్న చెప్పులతో ఇంట్లో అటూ ఇటూ చప్పుడు చేస్తూ ఆనందంగా తిరుగుతూంటే నన్ను పిలిచిన నాన్నగారు -

"వీధిలోకి వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి చెప్పులు వేసుకోవాలి, కానీ ఇంట్లో చెప్పులతో అసలు నడవకూడదు. పైగా చెప్పులతో భూమాతని అలా తన్నకూడదు, తప్పు"

"ఎందుకు తప్పు"

"భూమాత మనకు తల్లిలాంటిది"

"అయితే"

"నీ అమ్మని ఎవరేనా చెప్పులతో కొడితే నువ్వు ఊరుకుంటావా"

"అలా ఎవరేనా చేస్తే వాళ్ళని గట్టిగా కొడతాను"

" అలాగే, మనకు తల్లివంటి భూమాతను చెప్పులతో కొట్టకూడదు, ఇంట్లో చెప్పులతో నడవకూడదు"

"మరి వీధిలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకుంటాము, అది తప్పు కాదా"

"నిజానికి ఇంట్లో అయినా వీధిలో అయినా నేలతల్లి మీద కాలు పెట్టకూడదు. పైగా ఆరోగ్యశాస్త్ర ప్రకారం, ఉత్తి కాళ్లతో నేల మీద నడుస్తే, నేలకి మన కాళ్ళకి మధ్యన ఘర్షణ ఏర్పడి మన కాలి నరాలలో రక్త ప్రసారం పెరుగుతుంది. కానీ, వీధిలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్యరీత్యా చెప్పులు వేసుకోక తప్పదు. అందుకే, ఉదయం పక్క మీంచి లేచి నేల మీద కాలు పెట్టేటప్పుడు రెండు చేతులు జోడించి –

'సముద్రవసనేదేవీ పర్వతస్తనమండలీ

విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్తుమే'

అనగా – ‘వేరే దారి లేక నీమీద కాళ్ళు పెడుతున్న నన్ను క్షమించు తల్లీ’

అంటూ భూమాతని ప్రార్ధన చేసి, కాలు నేల మీద పెట్టాలి.

ఇక మీదట నువ్వు అలా చేస్తానని నా చేతిలో చేయి వేసి నాకు మాటియ్యి"

-2-

"తప్పకుండా అలా చేస్తాను నాన్నగారూ" అంటూ నాన్న చేతిలో చేయి వేసి ఆరోజు నాన్నకు ఇచ్చిన మాట ఈరోజు వరకూ పాటిస్తున్నాను.

జ్ఞాపకాల దొంతరలోనుంచి చెవిలో మూగగా మరి కొన్ని మాటలు వినిపించసాగేయి.

మేము ఉండే వీధిలో శ్రీరామాలయం దగ్గర ప్రతీ ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలో పౌరాణిక కథల ఆధారంగా శ్రీమతి హరిప్రియ చెప్పే హరికథలు వినడానికి ఊరిలోని పిల్లలూ పెద్దలూ ఎక్కువగా వచ్చేవారు.

అవి నేను తొమ్మిదో తరగతి చదువుకునే రోజులు.

ఆ సంవత్సరం ఉత్సవాలలో ఒకరోజు సత్యహరిశ్చంద్రుని కథ ఆధారంగా శ్రీమతి హరిప్రియ చెప్పిన హరికథ బహు రమ్యంగా ప్రేక్షక రంజకంగా సాగింది. .

నాన్నగారు మరునాడు ఆ అంశం మీద ప్రశ్నలు వేస్తూ –

"ఒరే, రాత్రి హరికథ ఎంతవరకూ విన్నావు"

"హరిశ్చంద్రుడు భార్యా పిల్లాడితో రాజ్యం వదలి అడవుల వెంట వారణాసికి వెళ్లే దారి పట్టేడు అన్నంతవరకూ మాత్రమే విన్నాను. తరువాత కథ ఏమిటి నాన్నగారూ"

"హరిశ్చంద్రుడు ఆరు నెలలో ఇస్తానన్న సొమ్ము పట్టుకొని రమ్మని విశ్వామిత్ర మహాముని అతని శిష్యుడైన నక్షత్రకుడిని కూడా వారితో పాటూ పంపేడు. విశ్వామిత్ర మహాముని నక్షత్రకుడిని పంపుతూ –

దారిలో హరిశ్చంద్రుడిని నానా అల్లరి పెడుతూ, అతని సహనాన్ని పరీక్షిస్తూ, ఎలాగైనా

అతను అసత్యం పలికేందుకు సిద్ధపడేటట్టుగా శతవిధాలా ప్రయత్నం చేయమని సూచించేడు"

"ఎందుకలాగా”

"హరిశ్చంద్రుడు సహనం కోల్పోయి –

‘ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వను అనో లేకపోతే నేను సొమ్ము ఇస్తానని అనలేదు’

అనో అసత్యం పలికేందుకు సిద్ధపడతాడేమో తెలుసుకునేందుకు"

"హరిశ్చంద్రుడు చేత అసత్యం పలికించాలని విశ్వామిత్ర మహాముని ఎందుకు సిద్ధపడ్డారు"

“హరిశ్చంద్రుడు ఎటువంటి పరిస్థితిలోనూ అసత్యం పలకడు అని వసిష్ఠ మహాముని అంటే –

‘నరమానవుడు అన్నవాడు అలా ఉండలేడు

అతను అసత్యం పలికేటట్టు నేను చేస్తాను’

అని విశ్వామిత్ర మహాముని వసిష్ఠ మహామునితో పందెం కట్టినందుకు"

"హరిశ్చంద్రుడు కూడా సత్యమే పలుకుతూ కష్టాలు పడే బదులుగా అసత్యం ఆడి సుఖ పడవచ్చు కదా"

-3-

"అసత్యం పలకడం భగవంతుని ఆదేశమైన 'సత్యమేవ ఉవాచ' అన్నదానికి విరుద్ధం, పైగా పాపహేతువు. కాబట్టి, హరిశ్చంద్రుడు సత్యమే పలుకుతానన్న వ్రతనిష్టలో ఉన్నాడు"

"నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని ఏమని అల్లర పెట్టేవాడు"

"ఆకలేస్తూంది దాహమేస్తూంది తినడానికి తాగడానికి ఏదైనా త్వరగా తెమ్మని, తెచ్చినవి అందరూ కలిసి ఆరగించేందుకు కూర్చుంటే తనకే ఎక్కువ కావాలని, నడవలేకున్నాను ఎత్తుకోమని అల్లరి పెట్టేవాడు"

"ఆ అల్లరి భరించలేక హరిశ్చంద్రుడు అసత్యం ఆడేడా మరి"

"ఆ మాత్రం అల్లరి కే హరిశ్చంద్రుడు అసత్యం ఆడితే అతని కథ మనం ఈరోజూకి ఎందుకు చెప్పుకుంటాము”

"మరి ఏమి చేసేడు"

"నడవలేను అన్న నక్షత్రకుడిని తన భుజాల మీద మోసేవాడు. తినడానికి తనకే ఎక్కువ కావాలంటే తనకని ఉంచుకున్నది నక్షత్రకుడికి ఇచ్చి, అతని ఆకలి తీరింది అన్న తరువాతే, తనకోసం మరలా వెళ్లి వెదికి తెచ్చుకున్న పళ్ళు తినేవాడు"

"అడవిలో అలా ఎన్ని రోజులు ఉన్నారు"

"సుమారుగా నాలుగు నెలలు అడవుల్లోనే నడచి చిట్టచివరకి వారు నలుగురూ వారణాసి నగరం చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న దగ్గరనుంచి ‘ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలింది’ అని సొమ్ము కోసం నక్షత్రకుడి వేధింపు ఎక్కువైంది"

"అప్పుడు హరిశ్చంద్రుడు ఏమి చేసేడు"

"ఎంత ప్రయతించినా హరిశ్చంద్రుడికి సొమ్ము దొరకలేదు. ఆ ప్రయత్నంలో మరో నెల కూడా గడచిపోయి నక్షత్రకుడి వేధింపులు ఎక్కువైపోయేయి"

"అంటే ఇంకా ఒక్క నెల మాత్రమే ఉందన్నమాట హరిశ్చంద్రుడు సొమ్ము ఇవ్వడానికి"

"అవును. అందుకే ఒకరోజు భార్యతో సంప్రదించి, ఆమె అనుమతి తీసుకొన్న హరిశ్చంద్రుడు –

వారణాసి నడివీధిలో ఆమెను అమ్మకానికి పెట్టేడు.

అలా కొన్ని రోజులు ప్రయత్నించగా ఒకరోజు డబ్బుగల ఆసామి ఒకతను ఆమెను కొనుక్కొని ఆమెతో బాటూ వారి అబ్బాయిని కూడా తీసుకొనిపోయేడు”

"దాంతో హరిశ్చంద్రుడి కష్టాలు గట్టెక్కేయా"

"లేదు. భార్యని అమ్మగా వచ్చిన సొమ్ముతో విశ్వామిత్ర మహామునికి ఇవ్వవలసిన సొమ్ములో సగం మాత్రమే ఇవ్వగలిగేడు. అప్పటికి గడువు ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగిలింది"

"మరేమి చేసేడు అప్పుడు"

"అప్పుడు హరిశ్చంద్రుడు వారణాసి వీధుల్లో నిలబడి –

తనని తానే అమ్ముకుందుకి సిద్ధపడ్డాడు"

"ఎవరేనా అతన్ని కొనుక్కున్నారా"

-4-

"వారణాసిలో ఉండే కాటికాపరి మాత్రమే అందుకు ముందుకు వచ్చేడు"

"కాటికాపరి అంటే"

"స్మశానంలోకి దహనానికి పూడ్చేందుకు వచ్చే శవాలను కాల్చడం పూడ్చడం చేసే వ్యక్తి"

"ఆ కాటికాపరి హరిశ్చంద్రుడిని కొనుక్కొన్నాడా"

"కాటికాపరి హరిశ్చంద్రుడిని కొనుక్కొని ఇచ్చిన సొమ్ము నక్షత్రకుడికి ఇస్తే, ఆరోజుతో విశ్వామిత్ర మహామునికి ఇవ్వవలసినదంతా ఇవ్వడమైంది. ఆ సొమ్ము తీసుకొని నక్షత్రకుడు విశ్వామిత్ర మహాముని దగ్గరకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్ళిపోయేడు. ఆ విధంగా హరిశ్చంద్రుడు ఋణవిముక్తుడయ్యేడు"

"దాంతో హరిశ్చంద్రుడి కష్టాలు తీరిపోయేయన్నమాట"

"లేదు. కొత్త కష్టాలు ఆరంభం అయేయి"

"ఎందుకు"

"హరిశ్చంద్రుడిని కొనుక్కున్న కాటికాపరి స్మశానంలో పనులు చేయడానికి తనకు బదులుగా హరిశ్చంద్రుడిని నియోగించేడు"

“ఆ పనులు వింటేనే నాకు భయంగా ఉంది, మరి చేయడానికి హరిశ్చంద్రుడికి భయం వెయ్యలేదా”

"అతను రాజు కదా, అతనికి భయం వెయ్యదు. పైగా, తనను కొనుక్కున్న కాటికాపరి ఏ పని చెప్తే ఆ పని చేయవలసిందే కదా. అంతే కాదు. కాటికాపరి చెప్పిన పని ఇంకోటుంది"

"ఇంకా ఏ పని"

"స్మశానానికి వచ్చే శవం ఎవరిదైనా సుంకం చెల్లించనిదే కాల్చడానికి పూడ్చడానికి పనికి రాదు, అలా వసూలు చేసిన సుంకం తెచ్చి మొత్తం తనకే ఇవ్వాలి తప్పితే హరిశ్చంద్రుడు ఏమీ ఉంచుకోకూడదు"

"అలా చేసేవాడా హరిశ్చంద్రుడు"

"అలాగే చేసేవాడు. ఒకరోజు పాము కాటుతో చనిపోయిన బాలుడి శవాన్ని ఒకామె తీసుకొని వస్తే –

వచ్చినది తన భార్యే మరియు

చనిపోయినది తన పుత్రుడే అని గుర్తు పట్టినా –

ఆవిడ దగ్గర కూడా సుంకం అడిగేడు"

"ఆవిడకి తెలుసా అలా అడిగేది హరిశ్చంద్రుడే అని"

"ముందు తెలియదు. కానీ, తరువాత తెలుసుకుంది"

"మరి సుంకం చెల్లించిందా ఆవిడ"

"సుంకం చెల్లించడానికి ఆవిడ దగ్గర ఏమీ లేకపోతే, ఆమె మేడలో ఉన్న మంగళ సూత్రం అమ్మి సుంకం చెల్లించమని సలహా ఇచ్చేడు హరిశ్చంద్రుడు.

తప్పని పరిస్థితిలో అందుకు ఆమె సిద్ధపడి వెళ్ళబోయింది.

ఇంతలో హఠాత్తుగా ---

-5-

వసిష్ఠ మహాముని, విశ్వామిత్ర మహాముని, ఇంద్రుడు, తదితర దేవతలతో సహా వారి దగ్గర విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై –

'అప్పటివరకూ జరిగినవన్నీ హరిశ్చంద్రుని సత్యవ్రతనిష్ఠను పరీక్షించేందుకు జరిగినవే

అని తెలియచేసి, అతని పుతృడిని బ్రతికించి, అతని రాజ్యం అతనికి లభించేటట్టు చేసి,

భార్యా పుత్రుడితో సుఖంగా ఉంటూ భోగభాగ్యాలతో రాజ్యపాలన చేసుకోమని ఆశీర్వదిస్తూ,

ఆరోజునుంచీ అతనిని 'సత్యహరిశ్చంద్రుడు' అని అందరూ సంభోదిస్తారని –

వరం ఇచ్చేడు"

"ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు కథ పూర్తిగా వింటే నీకు తెలిసిందేమిటి"

"ఎల్లప్పుడూ సత్యమే పలకాలి, అసత్యం పలకకూడదు”

"అంతే కాదు, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా సత్యమే పలకాలి. ఎటువంటి ప్రలోభాలకు ప్రబోధాలకు కూడా తల ఒగ్గకుండా సత్యవాక్య పరిపాలన చేస్తూ ఉండాలి"

"ప్రలోభాలు ప్రబోధాలు అంటే ఏమిటి”

"అబద్ధం చెప్పు, నీకు ఏమీ కాదు, పైగా నీ కష్టాలు నుంచి కూడా గట్టెక్కుతావు అని మనకు ఎదురైనవారు చెప్పే మాటలకే ప్రబోధాలు ప్రలోభాలు అంటారు. ఈ కథలోనే --

సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇస్తానన్న సొమ్ము ఇవ్వలేక,

ఆ సొమ్ము ఆర్జించడానికి ప్రయత్నం చేస్తూ కష్టాలు పడుతూంటే –

'ఓయి రాజా నీ కష్టాలు చూస్తూ ఉంటే నాకు చాలా విచారంగా ఉంది. మా గురువుగారికి

ఇస్తానన్న సొమ్ము మరి ఇవ్వలేను అనో లేకపోతే మీకు ఇస్తానని నేను చెప్పలేదు అనో చెప్పు.

నేను వెంటనే మా గురువుగారి దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పినది ఆయనకు చెప్పి, నువ్వు

ఆయనకు ఆ సొమ్ము ఇక ఇచ్చే అవసరం లేకుండా నిన్ను కష్టాలనుంచి తప్పిస్తాను.

నువ్వు నీ భార్య పుత్రుడితో సుఖంగా ఉండొచ్చు'

అని చెప్పడమే నక్షత్రకుడు హరిశ్చంద్రుడికి ప్రబోధం చేయడం అతన్ని ప్రలోభం పెట్టడం"

"నక్షత్రకుడు చెప్పినట్టు చేస్తే హరిశ్చంద్రునికి కష్టాలు తగ్గేవి కదా"

"హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలనకు నిలబడి, నక్షత్రకుడి ప్రబోధాలకు ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే, ఈరోజుకి కూడా అతన్ని జనం సత్యహరిశ్చంద్రుడు అని మెచ్చుకుంటున్నారు”

"ఏమండీ వడ్డించేను భోజనం చేద్దురుగానీ రండి" --- అన్న భార్య పిలుపుతో --

నా జ్ఞాపకాల దొంతరలోంచి బయట పడ్డాను.

*****

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి