అవంతి రాజ్యాన్ని గుణ శేఖరుడు పరిపాలిస్తున్నాడు. అతని మంత్రి పేరు సుబుధ్ధి. ఒకరోజు గుణ శేఖరుడు " మంత్రి వర్యా మన రాజ్య ప్రజానీకానికి పొదుపు గురించి తెలియజేయిలి అనుకుంటున్నాను. తమరు వెంటనే రాజధానిలో పొదుపు విభాగం ఏర్పటు చేసి దాన్నిసమర్ధవంతంగా నిర్వహించే అధికారిని నియమించండి .అనంతరం ఆసంస్ధ అన్నినగరాల లోనూ ఉండేలా దాని శాఖలు ఏర్పాటు చేయించండి " అన్నాడు.
" నిజమే ప్రభు పిల్లల విద్యా, వివాహ అవసరాలకు, వృధాప్యంలోనూ, వ్యాధుల నివారణకు అన్ని అవసరాలకు ధనం మూలం అని,రేపటి అవసరాలకు నేడు దాచుకోవడమే పొదుపు అని ప్రజలకు తెలియజేయాలి. అవసరాలు,ఆపదలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు చెతిలో ధనంలేక ఇబ్బంది పడకుండా ఎటువంటి ఆర్ధిక సమస్యనైనా సునాయాసంగా తట్టుకోవాలి అంటే పొదుపు తప్పనీ సరి అని మన ప్రజలకు తెలియజేద్ధాం రేపే ఆ ప్రయత్నం ప్రారంభిస్తాను " అన్నాడు సుబుధ్ధి.
రాజ్యం అంతటా దండోరా వేయించగా ,పలువురు యువకులు వచ్చారు. వారందరిని పరిక్షించి ఇరువురు యువకులను ఎంపిక చేసిన అనంతరం మంత్రి ' నాయనా ఇది మీకు చివరి పరిక్ష ఇందులో నెగ్గిన వారే ఈ పొదుపు నిర్వాహణ విభాగానికి అధికారిగా ఉంటారు. ముందు భోజనం చేయండి ఇక్కడ మీకు ఎవరు భోజనం వడ్డించరు, అక్కడ అన్ని రకాల పదార్ధాలతో కూడిన రాజ భోజనం ఉంది మీకు కావలసిన పదార్ధాలు మీరే వడ్డించుకు తినాలి , అదిగో అక్కడ నీళ్ళు ఉన్నాయి చేతులు శుభ్రపరుచుకొండి ' అన్నాడు. ఇరువురు యువకులు అక్కడ ఉన్న అరటి ఆకులు శుభ్రపరచుకుని తమకు కావలసిన పదార్ధాలు వడ్డించుకు తిన్న మొదటి యువకుడు అరటి ఆకు అక్కడే వదలి వెళ్ళి చేయి శుభ్రపరుచుకు వచ్చాడు. రెండొ యువకుడు అరటి ఆకు తీసుకువెళ్ళి కొంత దూరంలో ఉన్న బుట్టలోవేసి చేయి శుభ్రపరచుకు వచ్చాడు. అదిచూసిన మంత్రి రెండొ యువకునిచూస్తూ " నాయనా నవకాయ కూరలు, పలు ,చిత్రాన్నాలతోపాటు,భక్ష్యాలు,భోజ్యాలు,లేహ్యాలు,ఛోష్యాలు,మధుర పానియాలు, పలురకాల పిండివంటలతో మొదటి యువకుడు భోజనం తృప్తిగా చేసాడు. నువ్వు మాత్రం అన్నంలోనికి పప్పుకూర,పెరుగుతో భోజనం ముగించావు ఎందుకు అలా చేసావు రాజభోజనం నీకు ఇష్టం కాలేదా,పైగా భోజనం చేసిన అరటి ఆకు నువ్వే తీసావు తప్పుకదా " అన్నాడు. " మంత్రివర్యా ఏవిషయమైనా ఎదటి వారికి చెప్పాలి అంటే ముందుగా ఆవిషయాన్ని మనం పాటించాలి .రేపు పొదుపు గురించి వివరణ ఇవ్వబోయే నేను ఇంత విలాస వంతమైన రాజభోజనం తినడం తప్పు. పైగా నేను భోజనం చేసిన ఆకు నేను తీయడం నాపని నేనే చేసుకోవడం అవుతుంది.మనం బ్రతకడానికి ఆహరం తీసుకోవాలి కానీ ఆహరం కోసం బ్రతుక కూడదు ,విలాసాలకు అలవాటు పడితే పతనం తప్పదు ఇదే పొదుపు మంత్రం " అన్నాడు .
" భళా పొదుపు విభాగ పదవికి నీవే అర్హుడవు " అన్నాడు మంత్రి.