అతీతశక్తి - టి. వి. యెల్. గాయత్రి.

Ateeta shakthi

"భద్రా!రేపు కాస్త సెలవు పెట్టి ఇంట్లో వుండు!రుద్రాభిషేకం అనుకున్నాము. పురోహితుల వారు వచ్చి చేయిస్తారు." తల్లి శాంత మాటలకు ఇంతెత్తున ఎగిరి పడ్డాడు భద్ర. "అబ్బబ్బా!ఎప్పుడు చూడు పూజలు, వ్రతాలు. ఈ చాదస్తం వదులుకోమ్మా!దేవుడేమన్నా కనిపిస్తున్నాడా!రేపు నేను ఆఫీసుకు కచ్ఛితంగా వెళ్ళాలి. ఆ అభిషేకాలేమిటో నువ్వే చూసుకో!" భద్ర చికాకు చూసి "వీడికి చెప్పటం నాదే బుద్ధి తక్కువ. పనికి మాలిన నాస్తిక సిద్ధాంతాలు ఎక్కువయ్యాయి. వీడిని ఆ పరమేశ్వరుడే మార్చాలి." శాంత గొణుక్కోవటం మొదలు పెట్టింది. "నావి పనికి మాలిన సిద్ధాంతాలు కావు . మీ నమ్మకాలు సరి అయినవి కావు.దేవుడు దేవుడు అంటావు. ఏది చూపించు!ఎక్కడుంటాడో!నేను హేతువాదిని. కళ్ళకు కనిపించే వాటిని మాత్రమే నమ్ముతాను. మీరంతా చేసే పూజలు, అభిషేకాలు శుద్ధ దండగ." కొడుకు వితండవాదానికి శాంత ఏదో చెప్పబోతుంటే అటుగా వచ్చిన రాఘవ భార్యను కళ్ళతోనే వారించాడు. "నీ సిద్ధాంతం నీది. మా నమ్మకం మాది. ఘర్షణ ఎందుకు? నీ యిష్టం. రేపు అభిషేకం అని చెప్తున్నాము. నీకు యిష్టం అయితే వుండు. లేకపోతే లేదు. " అన్న తండ్రితో ఏమీ చెప్పలేక బయటికి నడిచాడు భద్ర. "వీడు ఎప్పుడు మారతాడండీ!" అంది శాంత దిగులుగా. "అన్నీ ఆ పరమాత్మ చూసుకుంటాడు. నువ్వేమీ బాధపడకు. వీడిని ఎప్పుడు ఎలా మార్చుకోవాలో అంతా అయనకే వదిలిపెట్టు." భర్త మాట విని శాంత మౌనంగా వంటింట్లోకి నడిచింది. వారం తర్వాత ఫ్రెండ్స్ తో టూర్ కని బయలుదేరాడు భద్ర. "గోదావరి జిల్లా వైపు నాన్నా!గోదావరి, పాపికొండలు అన్నీ చూసి వస్తాము." అన్నాడు భద్ర ఉత్సాహంగా. "జాగ్రత్తగా వెళ్లిరండి!మీరు డ్రైవ్ చెయ్యొద్దు. మీరైతే రాష్ గా డ్రైవ్ చేస్తారు. డ్రైవర్ ని పెట్టుకొండి!" అన్నాడు రాఘవ. తండ్రి మాటలకు నవ్వుతూ "నలుగురం వున్నాము కదా నాన్నా!మధ్య మధ్యలో ఫోన్ చేస్తాను. సెల్ ఫోన్ ఉంటే భయం లేదుగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడతాను. మీరేమీ కంగారు పడకండి!"అన్నాడు భద్ర. "నాన్నా!నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట చెప్తాను విను!నీకు భయం వేసిన క్షణంలో ఆ పరమశివుడిని తలుచుకొని శివ శివా!అనుకో చాలు. పిలిస్తే పలుకుతాడు శంకరుడు." అనునయంగా చెప్పింది శాంత. తల్లి మాటలకు ఫెడేల్ మని ఏదో ఒకటి అందామనుకున్నాడు గానీ ఊరికి వెళ్తూ గొడవ ఎందుకని ఊరుకున్నాడు. కార్ లో పాటలు వింటూ ఫ్రెండ్స్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ చుట్టూ కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ అనందిస్తున్నారు. కార్ జోరుగా పరిగెడుతోంది. ఆకాశం లో కొద్దిగా మబ్బులు పడుతున్నాయి. "వాన వస్తుందంటావా!"అన్నాడు చంద్రం. "అంత రాదులే "న్నాడు రాకేష్. ఒక గంట గడిచింది. ఇంతలో డబడబా వాన మొదలయింది. కారుని జాగ్రత్తగా పోనిస్తున్నాడు భద్ర. "కారు ఎక్కడైనా ఆపుదామా!ఈ వానలో వెళ్లడం కొంచెం రిస్కేమో!"వెంకట్ మాటలకు తలూపాడు భద్ర. వానకు తోడు గాలి కూడా ఉధృతంగా వీస్తూవుంది. మెరుపులు, ఉరుములతో వాతావరణం కొద్దిగా భయాన్ని కలిగిస్తున్నది. కార్ ఎక్కడ ఆపాలో తెలియటం లేదు భద్రకి. ఇంతలో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. పెద్ద ఉరుము ఏమైందో తెలిసికొనే లోపల ఫెళఫెళ మంటూ రోడ్డు ప్రక్కన ఉన్న పెద్ద చెట్టు విరిగిపడింది. ఒక్క ఉదుటున సడెన్ బ్రేక్ వేశాడు భద్ర. భద్ర నోటి నుండి అప్రయత్నంగా" శివ శివా!" అనే మాట వచ్చింది. కొమ్మలు కార్ కు తగిలాయి.కారు కొంచెం ముందు గీచుకుపోయింది కానీ పెద్దగా డామేజ్ అవలేదు. నలుగురికీ చాలా భయం వేసింది. కారు మీద చెట్టు పడితే... ఊహ కూడా భయం గానే వుంది. నలుగురూ కారు బయటికి వచ్చారు. జోరువాన. ఏం చెయ్యాలి అనుకుంటూ చుట్టూ చూస్తే దూరంగా చిన్న కొండ, దాని మీద దేవాలయం కనిపించాయి. అప్పటికే సమయం సాయంత్రం ఆరు దాటింది. "అక్కడికి వెళ్దాం!ఎమన్నా సహాయం దొరుకుతుందేమో!"వెంకట్ మాటలకు నలుగురూ బ్యాగులు తీసికొని కొండమీదికి వెళ్లారు. వీళ్ళను చూచి గుడిలో పూజారి గణపతి శాస్త్రి విషయం కనుక్కున్నాడు. "ఈ వానలో ఏమీ చేయలేము. రాత్రికి మీరు ఇక్కడే పడుకోండి. మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను. రేపు వాన తగ్గాక క్రింద గ్రామం వాళ్లకు కబురు పెడతాను. రాత్రి పూట చెట్టు అడ్డం తీయటానికి ఎవరూ రారు. మీరు బట్టలు మార్చుకోండి!" అంటూ వాళ్లకు భోజనం ఏర్పాట్లు చెయ్యమని తన వాళ్ళకు పురమాయించాడు గణపతి శాస్త్రి. "హమ్మయ్య!"అనుకుంటూ మంటపంలో కూలబడ్డారు నలుగురు మిత్రులు. ఎదురుగ్గా శివలింగం. బయట వాన, గాలి వున్నా కూడా శివుని సన్నిధిలో భయం కొద్దిగా తగ్గుతూ వుంది. అదేమిటో తెలియని నిశ్చింత మనసుని ఆవరించింది. ఆ వాతావరణ ప్రభావం ఏమిటో కానీ భద్ర మదిలో ఆలోచన మొదలయింది. 'ఒక్క నిమిషం కారు ముందుకు వెళ్లి ఉంటే తమ ప్రాణాలు పోయుండేవి. అంత పెద్ద చెట్టుకింద పడి నుజ్జు నుజ్జు అయ్యేవాళ్ళం. ఎంత గండం గడిచింది. అమ్మ చెప్పినట్లు దేవుడే కాపాడాడేమో!అయినా తన నోటి నుండి' శివ శివ 'అనే మాట రావటం ఏమిటి? ఏదో దైవశక్తి ఉందేమో నిజంగా..." భద్ర శివలింగాన్ని చూస్తూ అలాగే కూర్చున్నాడు. ఏవో శక్తి తరంగాలు తనని ప్రేమగా స్పృశి స్తున్నట్లు, తన భద్రతకోసం అమ్మలాగా ఆప్యాయంగా చుట్టూ కమ్ముకొన్నట్లు..అనిపించింది.మానసంతా ఏదో తెలియని అవ్యక్తమైన భావన నిండిపోయింది. 'దేవుడు 'అంటే ఏమిటి? మనల్ని ఆ శక్తే కాపాడుతోందా? కంటికి కనిపించనిది, మనసుకు మాత్రమే అనుభవానికి వచ్చే దివ్యమైన భావనా!ఈ శివాలయంలో ఇంత ప్రశాంతత ఎలా కలుగుతోంది? భద్ర అలోచిస్తున్నాడు కానీ ఏదీ తర్కానికి అందటం లేదు. అదృష్టం కొద్దీ ఎవ్వరికీ ప్రాణాపాయం కలగలేదు.వున్నాడా దేవుడు?...ఎదురుగ్గా శివలింగం, ఆ ప్రక్కన వెలుగుతున్న దీపం... తనలోని 'నేను' అహంకారాన్ని తొలగించి 'వెఱ్ఱివాడా!అంతా నేనే!'అంటున్నట్లుగా తోచింది. ఆ రాత్రి శివ సాన్నిధ్యంలో నిద్రపోయారు నలుగురు మిత్రులు. తెల్ల వారింది వాన తగ్గింది. రెండో రోజు గణపతి శాస్త్రి ఫలహారం చేసి పెట్టాడు. వీళ్ళు డబ్బు ఇస్తామన్నా పుచ్చుకోలేదు. వీళ్ళు క్రిందకు వెళ్లే సరికి చెట్టుని తొలగిస్తున్నారు గ్రామస్తులు. ఓ రెండు గంటల తర్వాత మళ్ళీ కారులో బయల్దేరారు అందరు. "ముందు ద్రాక్షారామం భీమేశ్వరుడిని చూసుకొని వెళ్దామా!" అన్నాడు భద్ర అనే వీరభద్రుడు. ఫ్రెండ్స్ అతని వైపు చిత్రంగా చూసారు. 'వీర నాస్తికుడు ఇలా మారాడేమిటా' అని. "కొన్ని విషయాలు లాజిక్ కు అందవు. ఇప్పుడే ఏమీ చెప్పలేను.దేవుడు వున్నాడా లేడా!ఏమిటో ఏమీ తెలియదు. కానీ నిన్న జరిగిన సంఘటన తల్చుకుంటే భయం వేస్తుంది. ఏదో శక్తి మనల్ని కాపాడింది. నేను ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను... నిన్న ఆ గుడిలో ప్రశాంతత చాలా ధైర్యాన్నిచ్చింది. అదే దేవుడేమో..." మెల్లిగా పలికి కారు ముందుకు పోనిచ్చాడు. అతడు ఆలోచిస్తున్నాడు. మనసులో "శివ శివ 'అనుకున్నాడు. *****************

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు