నీ పాల పడ్డానే నారాయణమ్మా - మద్దూరి నరసింహమూర్తి

Nee paala paddane narayanamma

నీ పాల పడ్డానే నారాయణమ్మా

"ఈ నారాయణమ్మకి ఏమైందండీ వారం అవుతూంది రావడం లేదు"

- కరుణాకరాన్ని ఇప్పటికి పది సార్లు అడిగుంటుంది కావేరి.

“నాకెలా తెలుస్తుంది చెప్పు" అన్న సమాధానం కావేరి అలా అడిగిన ప్రతీసారీ చెప్తూనే ఉన్నాడు నారాయణమ్మ ఎవరో తెలియని కరుణాకరం.

"రానప్పుడు రాలేకపోయినప్పుడు చెప్పి చావొచ్చుకదా"

"నిజమే"

ఇలా భర్తతో మాట్లాడుతూనే స్కూటర్ శబ్దం వినిపించినప్పుడల్లా బాల్కనీలోకి పరుగున వెళ్లి క్రిందకి చూసి నిరాశగా వెనక్కి వస్తున్న కావేరిని చూసి - ఉండబట్టలేని కరుణాకరం –

"వారం రోజులనుంచీ చూస్తున్నాను, స్కూటర్ శబ్దం రాగానే ఎందుకలా బాల్కనీలోకి పరిగెడుతున్నావు"

"ఎందుకేమిటి నారాయణమ్మ వచ్చిందేమో చూడడానికి"

"అసలు ఈ నారాయణమ్మ ఎవరు"

"మీలాంటి వాడే ఎవడో రామాయణం అంతా విని, రాముడికి సీత ఏమవుతుంది అని అడిగేడట"

" ఇప్పుడు నీకు ఆ సామెత ఎందుకు గుర్తుకొచ్చింది"

"మన ఇంట్లో పనిమనిషి పేరు మీకు తెలియకపోవడంతో ఆ సామెత గుర్తుకు వచ్చింది"

"మరి స్కూటర్ శబ్దానికి పనిమనిషికి సంబంధమేమిటి"

"అయ్యో రామా, నారాయణమ్మ స్కూటర్ మీదనే వస్తుంది కనుక"

"స్కూటర్ ఉన్న నారాయణమ్మ పనిమనిషా" అని ఆశ్చర్యంతో వెళ్లబెట్టిన భర్త నోరుని చూస్తూ--

"ముందు ఆ నోరు మూసుకోండి ఈగలో దోమలో దూరిపోగలవు. నారాయణమ్మకి స్వంతంగా 2BHK ఇల్లు కూడా ఉంది తెలుసా"

ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేడు -- 2BHK ఇంట్లో అద్దెకుంటున్న కరుణాకరం.

"ఈ పనిమనిషులకు ఎన్ని సదుపాయాలూ చేసినా, ఎంత బాగా చూసుకుంటున్నా విశ్వాసం లేదండీ"

"అలాగా, నాకు తెలియదు"

"మీకేమి తెలుసని ఇది తెలియడానికి"

"అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు నామీద నీకు కోపమెందుకు"

"పనిమనిషి రాక నాకు బీపీ పెరిగిపోతోంది. ఆ చికాకులో ఏదో అన్నాను లెండి"

"నువ్వు చికాకు తెచ్చుకొని రంకెలు వేసినంత మాత్రాన ఆ పనిమనిషి వెంటనే వచ్చేయదు కదా. అనవసరంగా నీ బీపీ పెరిగి అనారోగ్యాన్ని తెచ్చుకోవడం తప్ప"

"అయ్యా బాబూ పొరపాటైపోయి మిమ్మల్ని ఏదో అన్నాను. క్షమించి నాకో సలహా ఇచ్చి ఏడవకూడదూ"

"ఇప్పుడు నేను ఏడవడం ఎందుకు కానీ, పనిమనిషికి - అదే నారాయణమ్మకి ఫోన్ చేసేవా"

-2-

"దాని ఫోన్ ‘స్విచ్ ఆఫ్ లో ఉంది’ అని జవాబు వస్తోంది"

"పోనీ పనిమనిషి ఇంటి అడ్రస్ చెప్పు, నే వెళ్లి కనుక్కుంటాను"

"ఆయనే ఉంటే మంగలెందుకు"

"నిజమే నేనుండగా నీకు మంగలెందుకు"

" నే చెప్పింది సామెత. మన సంగతి కాదు. పనిమనిషి అడ్రస్ ఉంటే ఈ పాటికి నేనే వెళ్లి వచ్చేదాన్ని"

"అదేమిటి, పనిలో పెట్టుకున్నప్పుడు పనిమనిషి అడ్రస్ వ్రాసుకొని ఉంచుకోవడమో, ఆధార్ కాపీ ఉంచుకోవడమో చేయలేదా”

"ఆధార్ చూసి తిరిగి ఇచ్చేసేను, తొందరలో కాపీ ఉంచుకోలేదు, కనీసం అడ్రస్ కూడా నోట్ చేసి ఉంచుకోలేదు"

"తక్కిన ఫ్లాట్ వాళ్ళ పనిమనిషులతో మాట్లాడితే తెలిసేదేమో"

"అదీ అయింది, అందరి పనిమనిషులు కట్ట కట్టుకొని గంగలో కలిసినట్టు, ఎవరింటి పనిమనిషి రావడం లేదట"

"అందరూ కలిసి ఏదేనా తిరుగుబాటు చేసే ప్లాన్ లో ఉన్నారేమో"

"ఏమి ప్లానో కానీ, అంటు గిన్నెలన్నీ అలాగే పడున్నాయి. ఉతకవలసిన బట్టలు కుప్ప పెరిగిపోతోంది, ఈ అమ్మగారు ఎప్పుడు తగలడుతుందో"

"సబర్ కా ఫల్ మీఠా హోతాహై - అని హిందీలో ఒక సామెత ఉంది. అంటే, పనిమనిషి వచ్చిన రోజున నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని అర్ధం"

"నారాయణమ్మ ఎప్పటికి వస్తుందన్నది తెలియడంలేదు. ఈ పనిమనిషి రాకపోవడంతో అనవసరంగా నా సెలవలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి"

"అంటే నువ్వు ఆఫీస్ కి వెళ్లడం లేదా, నేనింకా నువ్వు త్వరగా ఇంటికి వచ్చేస్తున్నావు కాబోలు అనుకుంటున్నాను"

"పెళ్ళాం సుఖపడుతుందో కష్టపడుతుందో, ఆఫీస్ కి వెళ్లిందో లేదో కూడా తెలియకుండా ఉన్న మిమ్మల్ని చూస్తూంటే మీ మగజాతి అంటే కోపంతో నా ఒళ్ళు మండిపోతుంది"

"సారీ. నేనేమేనా హెల్ప్ చేసేదా"

"ఈ పూటకి నేను మరి వండి వార్చలేను. మీరు కూడా సెలవు పెట్టండి. ఇద్దరం హాయిగా గుడికి వెళ్లి, లాల్ బాగ్ లో కాసేపు తిరిగి MTR హోటల్ లో లంచ్ చేసి వద్దాం"

"నేను సెలవు పెట్టడం, లంచ్ కోసం హోటల్ కి వెళ్లడం ఎందుకు. ఆర్డర్ పెడితే తిండి ఇంటికే వస్తుంది కదా"

"నాకు కంపెనీ ఇవ్వడానికేనా కనీసం ఒకరోజు సెలవు పెట్టలేరా"

"సరేలే, సెలవు పెడతాను, బాధ పడకు. నువ్వన్నట్టే అలా వెళ్లి వద్దాం”

"వద్దులెండి, మనం అలా హోటల్ కి వెళ్తే, నారాయణమ్మ కానీ వస్తే మన ఇల్లు తాళం వేసి ఉండడం చూసి వెళ్ళిపోయి, రేపు కూడా రాదు"

వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే - నారాయణమ్మ దిగబడింది.

-3-

ఒక్కసారిగా కావేరి మొఖం వెయ్యి వోల్ట్ల బల్బ్ లాగ వెలిగిపోయింది.

వారిద్దరి మధ్యలో నేనెందుకనుకున్న కరుణాకరం మెల్లిగా పడకగదిలోకి వెళ్ళిపోయేడు.

"ఏమిటి నారాయణమ్మా ఏమిటైపోయేవు, మీ ఇంట్లో ఎవరికైనా ప్రమాదమేమేనా జరిగిందా, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావేమిటి " - అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కావేరి వాక్ ప్రవాహహానికి అడ్డుకట్ట వేస్తూ –

"నాకు మాఇంట్లో ఎవళ్ళకి ఏమీ పెమాదం జరగలేదు అమ్మగోరూ. ముందు ఈ పెసాదాలు తీసుకోండి. ఇది ధర్మస్థల మంజునాథసామి పెసాదం, ఇది కుక్కి సుబ్రహ్మణ్యసామి పెసాదం, ఇది ఉడిపి కిష్ణసామి పెసాదం, ఇది మూకాంబికా అమ్మోరి పెసాదం, ఇది మురుడేశ్వరసామి పెసాదం, ఇది గోకర్ణేశ్వరసామి పెసాదం" –

అంటూ ప్రసాదాలు టేబుల్ మీద పెట్టిన నారాయణమ్మని చూసి –

"ఏమిటి ఇన్ని ప్రసాదాలు తెచ్చేవు, ఎవరు తెచ్చేరు, నువ్వు ఇన్ని రోజులై రాకపోవడానికి కారణం ఏమిటో చెప్పేవు కావు"

"ఈ పెసాదాలు ఎవరో తెచ్చినవి కావు, నేనే తెచ్చేను"

"ఎలా తెచ్చేవు"

"ఇన్ని రోజులై నేను ఎందుకు రాలేదనుకున్నోరు - ఈదేవుళ్ళన్నీ సూసొస్తున్నాను"

"నువ్వు ఒక్కర్తివే వెళ్ళావా లేక మీ ఇంట్లో అందరూ వెళ్లేరా"

"మా పనిమనిషుల గుంపంతా కలిసి వెళ్ళేము"

"ఒక్కొక్కరికీ ఎంత ఖర్చయిందేమిటి"

"మన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు దయతో బస్సులో వెళ్లిన ఆడోరికి ఫ్రీ కదా. మరి అన్ని గుళ్ళలో అన్న పెసాదం కూడా ఫ్రీయే కదా. అందరం కలిసి ఏడ ఈలయితే ఆడ తొంగోని, హాయిగా అన్నీ సూసొచ్చేము"

"మీతో మీ మగవాళ్ళెవరూ రాలేదా"

" మగాళ్లు ఒస్తే బస్సుల్లో డబ్బు పెట్టి టిక్కెట్లు కొనాలి, పైగా బస్సులలో ఫ్రీగా తిరిగే ఆడవారితో ఇప్పుడు మగవాళ్ళకి జాగా కూడా ఉండడంలేదు"

"బాగానే ఉంది. ఈరోజు పని చేస్తావా లేక నీకు ఇంకో రోజు రెస్ట్ కావాలా" అంది కావేరి నవ్వుతూ.

"ఒక్క నిమి సం” అంటూ గిన్నెలు కడిగే జాగా దగ్గరకి వెళ్లి వచ్చిన నారాయణమ్మ –

“ఈ ఓరమంతా మీరు వోటెల్ లేదా జొమాటో తిండితో లాగించేసుంటారనుకున్నాను. కానీ, కడగొలసిన గిన్నెలు సూస్తూంటే మీరే ఒంట సేసుకున్నట్టున్నారే"

"ఎప్పుడో హోటల్ తిండి అంటే సరే కానీ రోజూ హోటల్ తిండి తినలేము కదే "

"టైముకి బ్యాంకుకి ఎళ్తూ ఒంటపనెలా సేసుకున్నారమ్మా"

"ఈ వారం రోజులూ నేను బ్యాంకుకి వెళ్లలేదే" అంది కావేరి విచారంగా.

"అంటే రేపు మీరు బ్యాంకుకి ఎళ్తే ఈ ఓరం పనంతా సేసుకోవాలి కదండీ పాపం"

-4-

"అక్కరలేదు, బ్యాంకు పని ఏరోజుది ఆరోజుకి అయిపోవాలి, పెండింగ్ ఉంచడానికి వీల్లేదు. అక్కడున్నవాళ్ళు సర్దుకొని చేసి ఉంటారులే"

"మరి - మీరిప్పుడు నాసేత ఈఓరం అంతా ఉన్న పాచి గిన్నెలు నేను వస్తే కడగడానికి ఉంచేయడం ఏమేనా నాయంగా ఉందా. అంతే కాదమ్మగోరూ, ఈఓరం అంతా ఉన్న పాచి గిన్నెలు ఇప్పుడు కస్టమో నష్టమో నేనెలాగో కడిగేసేననుకోండి -- ‘ఆ కావేరమ్మేటి ఆళ్ళ పనిమనిషి నారాయణమ్మ సేత ఓరం అంతా ఉన్న పాచి గిన్నెలు ఒకేసారి కడిగించింది' -- అని ఆ యమ్మా ఈ యమ్మా మీ మీద సెడ్డగా మాట్లాడుతూంటే, ఇనడానికి నాకు మా సెడ్డ కస్టంగా ఉంటుందమ్మగోరూ”

"అయితే ఇప్పుడేమంటావు"

“ఈ గిన్నెలన్నీ మీరే ఇయ్యాల రేపులో కడిగేసుకోని నాకో పోను కొట్టండి. అప్పుడు నేను ఎంటనే పనిలోకొచ్చేస్తాను. మరి నేనొస్తానమ్మగోరూ. పెసాదాలు తినడం మరచిపోకండేం. ఇంకో మాట, ఇంకెప్పుడేనా నేను ఉండిపోతే, మీరు ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగేసుకోడం మరిసిపోకండేం. నేనిలా సెప్పేనని ఏమీ అనుకోకండి" అంటూ –

భవిష్యత్తు గురించి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చి -- నారాయణమ్మ మెల్లిగా జారుకుంది.

అలా వెళ్లిపోతున్న నారాయణమ్మని చూస్తూ – 'నీ పాల పడ్డానే నారాయణమ్మా' – అని అనుకోకుండా ఉండలేకపోయింది కావేరి.

పడకగదిలోంచి అంతా వింటున్న కరుణాకరానికి –

భార్య కావేరి మీద జాలి, పనిమనిషి తెలివికి నవ్వు ఒక్కసారిగా వచ్చినా --

నవ్వితే ఇల్లాలితో ఏమి ప్రమాదం వాటిల్లుతుందో అని –

ఏమీ ఎరగనట్టు పడకగదిలోనే ఉండిపోయేడు.

*****

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు