నైట్ అవుట్ - టి. వి. యెల్. గాయత్రి.

Night out

ఇంజనీరింగ్ ఫస్టియర్ పరీక్షలు అయిపోయాయి. ఈ రోజే ఆఖరి పరీక్ష. రేపటినుండి దాదాపు నెలన్నర సెలవలు. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ గోలగోలగా అరుస్తూ బయట చెట్ల క్రింద సందడి చేస్తున్నారు. అనుష్క, రాగ, సుజిత, సింధు, నదియా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. "ఈ సెలవల్లో ఎక్కడికైనా ప్లాన్ చెయ్యాలి. సరదాగా వెళ్ళొద్దాం!"అంది అనుష్క. "అవును. ఏదైనా హిల్ స్టేషనుకు అయితే బాగుంటుంది. "అంది రాగ. హేయ్!గర్ల్స్!మేము మదనపల్లి ప్లాన్ చేస్తున్నాము. వస్తారా?"అంటూ సుదీప్, చైతు వీళ్ళ వైపుకు వచ్చారు. "మేము అరకులోయ అనుకుంటున్నాము. మీరు వస్తారా?" అంది సుజిత. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్దామనుకుంటున్నారో తర్జన భర్జనల్లో పడ్డారు స్టూడెంట్స్ అందరూ. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సింధు నవ్వుతూ ఉంది కానీ మనసులో ఆలోచిస్తూ ఉంది. స్నేహితులతో టూర్ అంటే ఇంట్లో అమ్మా, నాన్న ఒప్పుకోరు. సేఫ్టీ కాదు అంటూ అమ్మ ఎక్కడికీ పంపించదు. "హేయ్!సింధూ!అందరం అరకులోయ అనుకుంటున్నాము. నువ్వూ వస్తావా?" సుజిత కేకతో సందిగ్ధంగా మొహం పెట్టింది సింధు. "నాన్నగారిని అడిగి చెప్తాను."మెల్లగా అంది సింధు. "చూడు!తప్పకుండా రావాలి!అందరం వెళ్తున్నాము. సరదాగా ఉంటుంది. నువ్వు మిస్ అవకుండా రావాలి!మీ నాన్నగారితో గట్టిగా చెప్పి వచ్చెయ్యి !"రాగ ఆజ్ఞ జారీచేసింది. "సరే!సరే!"అంటూ స్నేహితుల దగ్గర సెలవు తీసికొని ఇంటికి వచ్చింది సింధు. తల్లితండ్రులతో టూర్ గురించి చెప్పింది సింధు. "కళ్యాణి పెళ్లి కుదిరింది.మనం ఒక పదిరోజుల ముందైనా వెళ్ళకపొతే ఎలా? పెళ్లి నుండి వచ్చాక ఒక వారం మనం తిరుమల వెళ్ళి రావాలి. అటు వెళ్ళినప్పుడు మదనపల్లి చూసొద్దాం!"అంది తల్లి పద్మజ. అత్త కూతురు కళ్యాణి పెళ్లి అనగానే చెల్లెలు రావి గంతులు వేస్తూ ఉంది. దానికి ఎవరింట్లో అన్నా పెళ్లి అంటే చాలు బోలెడు సరదా. "ముందు మీరు వెళ్ళండి!నేను పెళ్ళికి ముందు రోజు వస్తాను."అన్నాడు తండ్రి సుధాకర్. స్నేహితులతో టూరుకు వెళ్ళలేకపోయినందుకు కొంత నిరుత్సాహం కలిగినా అత్త కూతురు పెళ్లి కాబట్టి" సరే!"అంది సింధు. ** ** ** ** ** ** ** ** ** ** ** నెలరోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాగ సింధుకు ఫోన్ చేసింది. "మా ఇంట్లో రేపు నైట్ అవుట్ పెట్టుకున్నాము. సుజిత, అనుష్క,నదియా కూడా వస్తున్నారు. అందరం కలుద్దాము. సాయంత్రం వచ్చెయ్యి!నువ్వు మాతోపాటు టూరుకు కూడా రాలేదు. దీనికి మాత్రం రానని చెప్పకు!రేపు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుండి రెండోరోజు మధ్యాహ్నం దాకా మా ఇంట్లోనే. సరదాగా గడుపుదాం!" రాగ చెప్పింది వినగానే ఉత్సాహంగా అనిపించింది సింధుకు. ఎగురుకుంటూ వెళ్లి తల్లిని పర్మిషన్ అడిగింది. "నైట్ అవుటే కదా!వెళ్ళిరా! కానీ జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి!పంజాబీ డ్రెస్స్ వేసుకో!వేరే వాళ్ళింట్లో నైటీ వేసుకొని తిరిగితే బాగుండదు!"అంది పద్మజ. "అలాగే అమ్మా!" అంటూ చటుక్కున తల్లిని ముద్దు పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళింది. సుధాకర్ కూడా ఒప్పకున్నాడు. రెండోరోజు సాయంత్రం కారులో సింధుని రాగ వాళ్ళ ఇంటిదగ్గర దించాడు సుధాకర్. "చూడు!బంగారూ!నిద్రపోయేముందు నాకు ఫోన్ చెయ్యి!నీకు గుడ్ నైట్ చెప్పంది నాకు నిద్రరాదు. నీకు తెలుసుగా!" అన్నాడు సుధాకర్. "ఒకే నాన్నా!మర్చిపోకుండా ఫోన్ చేస్తాను!"అంటూ ఛంగున దూకి ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళింది సింధు. అప్పటికే అనుష్క, సుజిత, నదియా వచ్చి ఉన్నారు. రాగ వాళ్ళ అమ్మగారు అందరికీ బర్గర్లు, పిజ్జాలు పెట్టింది. కబుర్లలో పడ్డారు ఫ్రెండ్స్ అందరూ. మిగిలిన వాళ్ళు వెళ్లిన టూర్ విశేషాలు చెప్తుంటే సింధు అత్త కూతురి పెళ్లి సందడి చెప్పుకొచ్చింది. సాయంత్రం ఏడున్నరకు " కారులో అలా కాసేపు తిరిగొద్దాము!"అంటూ ఫ్రెండ్స్ ని లేవదీసింది రాగ. రాగకు పుట్టినరోజు కానుకగా వాళ్ళ నాన్నగారు కారు కొనిపెట్టారు. రాగ అప్పుడప్పుడూ తన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి వస్తూ ఉంటుంది. అనుష్క, సుజిత, రాగ బాగా ధనవంతుల బిడ్డలు. సింధు, నదియా మాత్రం మధ్యతరగతికి చెందిన అమ్మాయిలు. స్నేహితురాళ్ళ దగ్గర కొంచెం రిజర్వుడుగా ఉంటుంది సింధు. అయితే స్నేహితురాళ్లు ఏమి చెప్పినా వింటుంది కానీ గబుక్కున తొందరగా మాట్లాడటం, ఎక్కువ చనువు తీసికోవటం జరగదు. వాళ్ల స్థాయి ఎక్కువ, తను కొంచెం క్రింద తరగతి అనే స్పృహ ఎప్పుడూ ఆమెలో ఉంటుంది. నదియా మాత్రం గలగలా మాట్లాడుతూ ఉంటుంది.ఆమెకు ధనవంతులయిన స్నేహితులతో గడపటం ఇష్టంగా ఉంటుంది. వాళ్ళ లాగా వుండాలని ఎప్పుడూ తాపత్రయ పడుతూ ఉంటుంది. రాగ ఇల్లు పెద్ద బంగళా. దానికి తగ్గట్లు నౌకర్లు,చాకర్లు ఉండనే వుంటారు. ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్. వాళ్ళ కుక్కపిల్లకు పెట్టే ఖర్చుతో తన ఇంటికి నెలకు సరిపడా సరుకులు కొనుక్కోవచ్చు అనుకుంటుంది సింధు. ఎప్పుడూ సింధు జీన్స్ లాటివి వేసుకోదు. పంజాబీ డ్రెస్సులే ధరిస్తుంది. మధ్యతరగతి తల్లి తండ్రుల పెంపకంలోని క్రమశిక్షణ ఆ అమ్మాయిలో కనిపిస్తూ ఉంటుంది. రాగ తల్లి తండ్రులు పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ముఖ్యం అనుకుంటారు. అందుకని ఆ టైంలో బయటికి వెళ్తామంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. స్నేహితురాళ్ళందరు కలిసి కారులో బయలుదేరారు. అందరూ కారులో అంత్యాక్షరి పాటలు పాడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. అరగంట తర్వాత తలతిప్పి బయటికి చూసింది సింధు. కారు ఎయిర్పోర్ట్ రోడ్డులోకి వెళ్తూ ఉంది. "ఎక్కడికి వెళ్తున్నాం?" సింధూ ప్రశ్నకు రాగ నవ్వింది. "నీకు సర్ప్రైజ్!చూద్దువుగాని!" పదినిమిషాల్లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారాపింది రాగ. కారును చూడంగానే గేట్ తీశాడు వాచ్ మాన్. లోపల పార్కింగులో కారు పెట్టింది రాగ. అందరినీ తీసికొని బిల్డింగ్ లోపలికి దారితీసింది. మొదట ఒక హాలులాగా ఉంది.అక్కడ డెస్క్ దగ్గర ఉన్న యువకుడు వీళ్ళ పేర్లు రిజిస్టరులో వ్రాసుకొని అందరి చేతుల మీద స్టాంప్ వేసాడు. 'ఇది పబ్ కాదు కదా!'అనుకుంటూ "రాగా!ఇది పబ్ కదా!"అనుమానంగా అడిగింది సింధు. "ప్చ్!నువ్వేమీ కంగారు పడకు!చాలా సరదాగా ఉంటుంది. మేము ఎప్పుడూ వస్తూ ఉంటాము... నదియా కూడా చాలా సార్లు వచ్చింది." "వద్దు!వద్దు!మా నాన్నగారు కోప్పడతారు. వెనక్కు వెళదాం!" కంగారుగా ఉంది సింధుకు. "ఏం భయం లేదు సింధూ!నేను చాలా సార్లు వచ్చాను. అందరూ సరదాగా వుంటారు.. కాసేపు ఉండి వెళదాం!"అంటూ సింధు చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది నదియా. లోపల ఎప్పుడూ చూడని వాతావరణం. కోలాహలంగా బాయిస్, గర్ల్స్ గోలగోలగా డాన్స్ చేస్తున్నారు. చాలామంది చేతుల్లో డ్రింక్స్ గ్లాసులు ఉన్నాయి. కొంతమంది పూనకం వచ్చినట్లు వూగుతున్నారు. సింధూకు నీరసం వచ్చింది. "కొద్దిగా టేస్ట్ చెయ్యి!"అంటూ అనుష్క డ్రింక్ గ్లాసు పట్టుకొచ్చింది. "వద్దు!వద్దు!"అంటూ దూరంగా జరిగింది సింధు. నదియా, సుజిత ఎవరో కుర్రవాళ్ళతో డాన్స్ చేస్తున్నారు. రాగ హుక్కా లాంటిది పీలుస్తూ వుంది. అనుష్క మళ్ళీ డ్రింక్ తెచ్చుకోవటానికి వెళ్ళింది. అలాగే ఒక మూల నిల్చుంది సింధు.టైమ్ ఎంత అయిందో తెలియలేదు. "అర్యూ న్యూ కమ్మర్?"అంటూ వినిపించింది. వెనకాలే ఒక కుర్రవాడు. సింధు జవాబు చెప్పలేదు. "కమాన్!లెటస్ డాన్స్!"అంటూ సింధు చెయ్యి పట్టుకున్నాడు. "నో!నో!" అంటూ చెయ్యి విదిలించుకొంది సింధు. అతడు బిగ్గరగా నవ్వేసి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని చేత్తో రమ్మని పిలిచాడు. "సీ!న్యూ కమ్మర్!"అంటూ సింధూని చూపించాడు. "హాయ్!బేబీ!మొదటిసారా!నీకు నేను డాన్స్ నేర్పించనా?"అంటూ చనువుగా సింధు నడుము పట్టుకొని గిర్రున తిప్పాడొక కుర్రవాడు . ఘాటైన వాసన. కంపరంతో వదిలించుకోబోయింది. అతడి పట్టు గట్టిగా ఉండటంతో సాధ్యం కాలేదు. వెంటనే చాచి అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. ఒక్కసారి చెంప పట్టుకొని సింధూని వదిలేసాడతడు. అక్కడి నుండి పరుగెత్తింది. "ఎక్కడికి పోతావ్?" అంటూ వెంటపడ్డాడు ఆ కుర్రవాడు. డాన్స్ చేస్తున్న వాళ్ళ మధ్య తప్పించుకుంటూ ఎటు వెళ్ళాలో అర్థంకాక ఆ హాలు దాటింది సింధు. నలుగురు కుర్రవాళ్ళు ఆమె వెనకాల వస్తున్నారు. అసలే తాగి ఉన్న వాళ్ళల్లో విచక్షణాజ్ఞానం లోపించింది. ప్రతీకార వాంఛతో, కోపంగా సింధు వెనకాలే పరుగెత్తుకొని వస్తున్నారు. గబుక్కున మరో హాలులోకి పరిగెత్తింది. అక్కడ ఐదారు రూముల్లాగా కనిపించాయి. వెనకాల నలుగురు కుర్రవాళ్ళు. తలుపు తెరిచి ఉన్న రూములోకి పరిగెత్తింది. ఆ నలుగురూ తలుపు దగ్గరికి వచ్చే లోపల తలుపు మూసింది. లోపల చీకటి...... ఆ నలుగురు కుర్రవాళ్ళు బైట తలుపు మీద దబదబ బాదుతున్నారు. సింధు లోపల తలుపు పైన తడిమింది. చిన్న గడియ తగిలింది. పైన గడియ పెట్టి గోడ దగ్గర స్విచ్ బోర్డు కోసం ఫోన్ లైట్ తో వెతికింది. గోడ పక్కన స్విచ్ బోర్డు వుంది. అన్ని స్విచ్చులూ వేసింది. లైట్ వెలిగింది.ఫ్యాన్ కూడా తిరుగుతోంది.అదొక బెడ్ రూమ్. బెడ్స్, అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్నాయి. రూములో చిన్న టేబుల్, రెండు కుర్చీలు ఉన్నాయి. బైట తలుపులు బాదటం ఆపేశారు. టైం చూసింది. తొమ్మిది పది. 'ఆ నలుగురు కుర్రవాళ్ళు తలుపులు బద్దలు కొడతారేమో!ఏమవుతుందో?'అనుకుంటూ తండ్రికి ఫోన్ చేసింది. "భోజనం చేసావా?" తండ్రి గొంతు వినిపించగానే "నాన్నా!..."అంది ఒక్కసారి. కూతురి కంఠంలో వణుకు విని "ఏమిటి తల్లీ!"అన్నాడు సుధాకర్. "నాన్నా!ఐ యామ్ ఇన్ డేంజర్!"అంటూ మొత్తం గబగబా చెప్పింది. "నాన్నా!వాళ్ళు తలుపు బయట ఉన్నారు... ఎలాగా? భయంగా వుంది.." "నువ్వేమీ కంగారు పడకు!కూల్ గా ఉండు!ఏ లొకేషనులో ఉన్నావో ఫోనులో చెక్ చేస్తాను. నేను, అమ్మా బయలుదేరుతున్నాము. అక్కడకు దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ కు ఫోన్ చేస్తాను. నా కంటే ముందు వాళ్ళే వస్తారు. భయపడకు!తలుపుకు మంచం కానీ, టేబుల్ కానీ అడ్డం పెట్టు!" తండ్రితో మాట్లాడాక సింధుకు ధైర్యం వచ్చింది. బెడ్ ని కదపటానికి ప్రయత్నించింది. శక్తినంతా ఉపయోగించింది. ఊహు!మంచం కదలటం లేదు. టేబుల్ జరిపింది. అది కొంచెం కదులుతోంది. టేబుల్ని జరుపుకుంటూ తెచ్చి తలుపుకు అడ్డం పెట్టింది. బయట మళ్ళీ తలుపు చప్పుడయ్యింది.భయం వేసింది సింధుకు. కిటికీలోంచి బయటకు చూసింది. కార్ పార్కింగ్ ఏరియా కనిపించింది. కిటికీలోంచి దూకటానికి లేదు. కిటికీకి కమ్మీలు ఉన్నాయి. కార్ పార్కింగ్ లోకి వెళ్తే బిల్డింగ్ బయటికి వెళ్ళవచ్చు. ఎలాగా?... బాత్ రూములోకి వెళ్ళింది. చిన్న బాత్ రూము అది. ఒక వాష్ బేసిన్, కమౌట్ ఉన్నాయి. కమౌట్ పైన గ్లాస్ పలకలతో చిన్న కిటికీ ఉంది. గ్లాస్ పలకల వెనకాల కమ్మీలు లేవు. గ్లాస్ పలకలు మెల్లగా తీసి కింద పెట్టింది. తను పట్టేంత కిటికీ అది కానీ కొంచెం ఎత్తులో ఉంది... ఎక్కటం ఎలాగా?... రూములోనించి కుర్చీ తీసికొని వచ్చింది. కమౌట్ మీద పెట్టింది. ఫర్వాలేదు. ఎక్కితే బయటికి దూకొచ్చు.. ఈ లోపల ఫోన్ మోగింది. తండ్రి కాల్ చేస్తున్నాడు. "నాన్నా!.." "పోలీసు ఇన్స్పెక్టర్ పేరు హరనాథ్. నీ లొకేషన్ ట్రేస్ చేసారు. ఇరవై నిమిషాల్లో నీ దగ్గరికి వస్తారు. కేశవ్ బాబాయి కూడా వస్తున్నాడు. నీకు దగ్గరలోనే ఉన్నాడు. టెన్షన్ పడొద్దు!వస్తున్నాము!...." "నాన్నా!నేను తప్పించుకోవటానికి ట్రై చేస్తున్నాను. కార్ పార్కింగ్ లోకి వస్తే భయం ఉండదనిపిస్తోంది..." "రూము బయట ఇంకా తలుపులు బాదుతున్నారా?.." "కొంచెం ఆగి ఆగి కొడుతున్నారు. తలుపు పైన గడియ చాలా చిన్నది. గట్టిగా కొడితే ఊడిపోతుంది. తలుపు గడియ ఊడితే టేబుల్ నెట్టటం పెద్ద కష్టం కాదు.." ఏం చెప్పాలో తెలియలేదు సుధాకర్ కు. గొంతు పూడుకు పోతోంది. "ధైర్యంగా ఉండు చిన్నా!.."కంఠంలో జీర.. " నాన్నా!నేను మళ్ళీ చేస్తాను!" అంటూ ఫోన్ పెట్టేసి కుర్చీ ఎక్కి కిటికీలోకి దూరింది . కానీ ముందు వైపు నుంచి ఎలా దూకుతుంది? ఇలా కాదు.. సెల్ ఫోన్ లైట్ వేసి బయట గోడకు అటువైపు, ఇటువైపు చూస్తే ఎడమ వైపు పివిసి పైప్ కనిపించింది. ఫోన్ బ్యాగ్ లో పెట్టి సగం శరీరం కిటికీలోంచి బయటకు తెచ్చి తన చున్నీని పైపుకు కట్టింది. రెండు చేతులతో చున్నీని బలంగా పట్టుకొంది. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా కిటికీ ఎత్తు పది అడుగులు ఉంది. చున్నీని పట్టుకొని కిందకు జంప్ చేసింది.సింధు బరువుకు చున్నీ జర్రున పైపులైను కిందకు జారింది. కింద భూమి కాళ్లకు తగిలింది. ఊపుగా దూకటంతో కింద దబ్బున పడింది. కొద్దిగా చేతుల దగ్గర గీచుకు పోయింది. ఎగుడు దిగుడు రాళ్లు ఉన్నాయి అక్కడ. మోకాళ్ళ దగ్గర రాళ్లు గీచుకున్నాయి. మంట పుడుతోంది. 'ఫర్వాలేదు 'అనుకుంటూ ఫోన్ తీసి ముందు మ్యూట్ లో పెట్టింది. "నేను సేఫ్ గా కిందకు దిగాను "అంటూ తండ్రికి మెసేజ్ పెట్టింది. పార్కింగ్ ప్లేస్ కొంచెం దూరంలో ఉంది. అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. బిల్డింగ్ చుట్టూ గుబురుగా మొక్కల పొదలు ఉన్నాయి. పొదల వెనకాల ఒంగి ఒంగి నడుస్తూ వచ్చింది సింధు. బిల్డింగ్ ప్రక్క భాగంలో గుబురుగా ఉన్న పొదల మధ్య ముడుచుకొని కూర్చుంది. అక్కడ లైట్ పడటం లేదు. పోలీసులు వచ్చేదాకా అక్కడే కూర్చుంటే సేఫ్ గా ఉంటుందని సింధు భావన. తండ్రి దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది. "ఇన్ స్పెక్టర్ రఘురామ్ నీ లొకేషనుకు దగ్గర్లో ఉన్నాడు. అతని ఫోన్ నెంబరుకు బిల్డింగ్ కలర్ ఏమిటో పెట్టు!" తండ్రి పంపించిన నెంబరుకు "బిల్డింగ్ కలర్ రిచ్ పింక్. బ్లూ గేట్. నేను కింద పొదల మధ్య దాక్కొని వున్నాను "అని మెసేజ్ పెట్టింది. "ఒకే ఓకే! డోంట్ వర్రీ!"అని రిప్లై వచ్చింది. మళ్ళీ తండ్రి దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది. "కేశవ్ బాబాయి నీకు దగ్గర్లోనే ఉన్నాడు..డోంట్ వర్రీ చిన్నా!" "హమ్మయ్య!అనుకొంది సింధు. ఇక పైన నలుగురు కుర్రవాళ్ళు సింధు రూము తలుపు వేసుకోగానే తలుపులు బాదటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకడు స్థానిక ఎమ్. ఎల్. ఎ. కొడుకు. అతని పేరు వినీత్. అతడి చెంప మీదే గట్టిగా కొట్టింది సింధు. "వదిలెయ్యరా!తలుపు గట్టిగా వేసుకుంది."అన్నారు మిగిలిన వాళ్ళు. "ఊహు!ఎంత గట్టిగా కొట్టింది. ఈ రోజు దాన్ని వదిలిపెట్టకూడదు!"అం టూ మేనేజర్ దగ్గరికి వచ్చాడు. "ఒక అమ్మాయి మా ఫ్రెండ్ లోపల తలుపు వేసుకొంది. బాగా తాగి వుంది. స్పృహలో వుందో లేదో!తలుపు తీస్తే రావటం లేదు. అర్జంట్!.." మేనేజర్ గబుక్కున ఇద్దరు సర్వెంట్స్ ని తీసికొచ్చాడు 'బాగా తాగి ఉన్న పిల్లలకు ఒళ్ళు పై తెలీదు.ఏదో ఒక గడబిడ చేస్తారు' అని గొణుక్కుంటూ తలుపులు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు సర్వెంట్స్. అందరూ కలిసి తలుపును గట్టిగా కొడితే పైన గడియ ఊడి వచ్చింది. కానీ తలుపు తెరుచుకోలేదు. తలుపుకేదో అడ్డం ఉంది అనుకుంటూ అందరూ కలిసి బలంగా నెట్టారు. అడ్డుగా పెట్టిన బల్ల కొద్దిగా కదిలింది. ఇంకా బలంగా నెట్టారు. బల్లకు, తలుపుకు మధ్య గ్యాప్ వచ్చింది. మొత్తానికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లిన సర్వెంట్స్ బల్లను తొలిగించారు. లోపల అమ్మాయి లేదు.మేనేజరకు అర్థం కాలేదు. అయోమయంగా చూస్తున్నాడు. 'ఎటు పోయిందో!'అనుకుంటూ బాత్ రూంలో చూసాడు వినీత్. బాత్రూంలో కుర్చీ చూడగానే సింధు కిటికీలోంచి పారిపోయిందని అర్థం అయ్యింది. "షిట్!"అంటూ పిడికిలి బిగించి బయటకు పరిగెత్తాడు.అతడిని అనుసరించారు మిత్రగణం. పార్కింగ్ ప్లేసులో చూసారు. ఎవ్వరూ కనిపించలేదు. గేట్ దగ్గరికి వచ్చారు. "ఇప్పుడే ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్సు వేసుకున్న అమ్మాయి బయటికి వెళ్లిందా?"అంటూ వాచ్ మాన్ ని అడిగాడు వినీత్. "లేదు!లేదు!ఏమైంది?"అడిగాడు వాచ్ మాన్. "మా ఫ్రెండ్ వెళ్లిందేమోనని " "ఎవ్వరూ వెళ్ళలేదు "అన్నాడు వాచ్ మాన్. ఆ టైంకి అందరూ వచ్చేవాళ్ళే కానీ వెళ్ళే వాళ్ళు ఉండరు. ఏ అర్థరాత్రికో, అపరాత్రికో ఇళ్లకు వెళ్తూ ఉంటారు. "ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెదుకుదాం!పదండి!" అంటూ బిల్డింగ్ వెనక్కు వెళ్ళాడు వినీత్. బిల్డింగ్ చుట్టూ వెదికినా వాళ్లకు సింధు జాడ తెలియలేదు. సింధు ఉన్న చెట్ల గుబుర్లకు కొద్ది దూరంలో నిలబడ్డ ఆ నలుగురిని చూస్తే భయం వేసింది సింధుకు. ఊపిరి బిగబట్టి కూర్చుంది సింధు. "ఎప్పుడో వెళ్ళిపోయింటుందిరా!టైం వెస్ట్. లోపలికి వెళదాం పద!అన్నాడు వినీత్ ఫ్రెండ్. "చూద్దాం!"అంటూ గుబుర్ల వంక చూసాడు వినీత్. అతడి దృష్టికి చెట్ల గుబుర్ల మధ్య ఏదో ఉన్నట్లు అనిపించింది. సెల్ ఫోన్ లైట్ వేసాడు. అతడితోపాటు ఫ్రెండ్స్ కూడా ఫ్లాష్ లైట్స్ వేశారు. ఎల్లో కలర్ డ్రెస్ కనిపించింది. గుబుర్ల వెనకాల సింధు. "ఇప్పుడు ఎక్కడికి పోతావ్?"అంటూ చెయ్యి పట్టి ఇవతలికి లాగాడు వినీత్. వణికిపోతూ గింజుకోసాగింది సింధు. నలుగురు కుర్రవాళ్ళు సింధుని ఒడిసి పట్టుకున్నారు. అంతలో "ఆ అమ్మాయిని వదిలెయ్యండి!"లేకపొతే కాల్చి పారేస్తాను!" గంభీరమైన కంఠం వినబడింది. వెనక్కు తిరిగారు ఆ నలుగురు. ఇన్ స్పెక్టర్ రఘురామ్ రౌద్రంగా ఫిస్టల్ తో నిలబడి ఉన్నాడు. అప్రయత్నంగా సింధుని వదిలివేశారు వినీత్ వాళ్ళు.వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళను పట్టుకొన్నారు. తేరుకున్న సింధు ఇన్ స్పెక్టర్ దగ్గరికి వచ్చింది. ఇంతలో "సింధూ!"అంటూ కేశవ్ గొంతు వినిపించింది. "బాబాయ్!"అంటూ కేశవ్ చెయ్యి పట్టుకొంది. సింధూ భుజం చుట్టూ చెయ్యి వేసాడు కేశవ్. "కార్లో కూర్చుందాం!రా!నాన్న వాళ్ళు దగ్గరే ఉన్నారు."అంటూ కార్ దగ్గరికి సింధుని నడిపించాడు కేశవ్. "మీరు అమ్మాయిని తీసికొని వెళ్ళండి!మేము వీళ్ళ విషయం చూసుకొంటాము."అన్నాడు ఇన్ స్పెక్టర్ రఘురామ్. కారులో కూర్చుని వాటర్ బాటిల్ లో నీళ్లు తాగింది సింధు.కొద్దిగా ప్రాణం కుదుటపడింది. కాసేపటికి సుధాకర్, పద్మజ, రావి వచ్చారు. అమ్మా, నాన్నలను చూడగానే భోరుమంది సింధు. సింధుని గుండెలకు హత్తుకున్నాడు సుధాకర్. "అన్నయ్యా!మీరు ఇంటికెళ్లండి!నేను ఇక్కడే ఉండి ఇన్ స్పెక్టర్ తో మాట్లాడి వస్తాను."అన్నాడు కేశవ్. కారు స్టార్ట్ చేసాడు సుధాకర్. కారు కిటికీలోంచి చల్లని పిల్ల తెమ్మర భయం లేదన్నట్లు సింధు మేనును తాకింది. కారు సిటీ వైపు పరుగెత్తింది. ** ** ** ** ** ** ** ** ** రెండో రోజు పొద్దున ఆలస్యంగా నిద్రలేచింది సింధు. "నిన్న పబ్ గురించి పేపర్లో వచ్చింది చూడు!" తండ్రి చేతిలో పేపర్ తీసి చూసింది. "నగర శివార్లలో పబ్ పైన పోలీసుల దాడి. భారీగా మాదకద్రవ్యాల పట్టివేత. అందరూ ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు.వారిలో స్థానికి ఎమ్. ఎల్. ఎ. కుమారుడు కూడా ఉండటం విశేషం. ఈ పబ్ లో అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందరినీ అదుపులోకి తీసికొని విచారిస్తున్న పోలీసులు." నిన్నటి సంఘటన తాలూకు భయం మనసును కుదిపేస్తుంటే తండ్రి ఒడిలో తలపెట్టుకొని కూర్చుంది సింధు. ' సింధు కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది' అనుకుంటూ మెల్లగా కూతురు తల నిమురుతూ ఉన్నాడు సుధాకర్. ** ** ** ** ** ** ** ** ** ** ** **

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు