ఆఖరి స్నేహితుడు - తిరువాయపాటి రాజగోపాల్

Aakhari snehitudu

ఇరవై ఐదేళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగం చేసి విసుగేసి వీ ఆర్ ఎస్ తీసుకున్నాకే ఇష్టమైన వ్యాపకాలు కొనసాగించడానికి సాధ్యమౌతూంది చక్రపాణి కి. సాయంకాలం నాలుగింటికి వాళ్ళావిడ చేతి కాఫీ తాగి ప్రతీ రోజూ భాగీరధీ గానసభ కు వెళ్ళడం అలవాటైంది. నిత్యమూ ఏదో ఒక ప్రోగ్రాం ఉండనే ఉంటుంది అక్కడ. దాదాపు ఐదింటికి మొదలవుతుంది కార్యక్రమం. కచేరీలు ఎన్ని చూశాడో లెక్కే లేదు. కర్ణాటక, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, తెలుగు, హిందీ సినిమా పాటలు ఎన్నెన్నో. యూ ట్యూబు వంటి మాధ్యమాల్లో నచ్చిన ఎన్ని పాటలు చూడగలిగినా 'లైవ్' కచేరీ లుచూడ్డంలో చెప్పలేని మనోల్లాసమూ, తన్మయతా ఉంటాయి. ఆలకించిన ప్రతీ గొప్ప కచేరీ దేనికదే ఒక సుసంపన్న అనుభవమే. గుండెను తడిపిన సంగీతపు వాన జల్లు ఎన్నో సార్లు కంటి కొసల నుండి జారే నీటి చుక్కలుగా బైటపడుతుంది. గాయకుడికీ, శ్రోతలకీ నడుమ నడిచే ఆ సజీవ పాకాన్ని మాటలు వివరించలేవు. అనుభవేకవేద్యమది.

ప్రియా సిస్టర్స్ శాస్త్రీయ సంగీతం నడుస్తూంది ఆవేళ. 'తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము' అంటూ రేవతిలో ప్రతిధ్వనిస్తున్నరాగ విస్తృతి శ్రోతల్నిమైమరపింపజేస్తూంది. వందల మంది మహా మహుల నోటివెంట జాలువారి లక్షల మంది శ్రోతల్లో జీవితపు సారాన్నీ, నిస్సారాన్నీ అవగతపరచిన అన్నమయ్య బాణీ అది.

ఎనభైఏళ్ళ ముసలావిడని ఒక మధ్యవయస్కుడు జాగ్రత్తగా, నడుస్తున్న కచేరీ ఉద్విగ్న క్షణాలకు భంగం కలగకూడదన్నట్టు, నడిపించుకొచ్చి మొదటి వరసలో కూచోబెట్టి ఆమె కూచున్న సీటు పక్కన ఖాళీ ఉన్నా సరే తాను వెనక వరసలోకూచున్నాడు.

గత పది రోజులుగా గమనిస్తున్నాడు చక్రపాణి వాళ్ళిద్దర్నీ.

బాగా బలహీనంగా కనిపిస్తున్న ఆ మహిళ ఇస్త్రీ పెట్టిన కాషాయ రంగు చీర, నుదుట ఒక విభూది బొట్టు తో శుభ్రంగా ఉంది. ఎక్కడో చూసిన ముఖం ఆమెది. గుర్తు రావడం లేదు. జరుగుతున్న కచేరీ ని మమైకమై ఆస్వాదిస్తున్న ఆమెను చూస్తే ఏ అమర కాంతో తప్పిపోయి మానవ సమూహంలో కూచుని ఉన్నట్టనిపించింది చక్రపాణికి. ఎవరో ఆ వృద్ధ నారి ?

రెండో వరసలోంచి లేచి ఆ నడివయస్కుడు లేచి బైటకి దారి తీయడం చూసి చక్రపాణి నాలుగో వరస లోంచి లేచి వెంబడించాడు. ఆడిటోరియం కాంపౌండ్ లోనే ఉన్న క్యాంటీన్ లో కూచుని టీ ఆర్డర్ చేసిన అతడి యెదురుగా కూర్చుని స్వీయ పరిచయం చేసుకున్నాడు:

"నా పేరు చక్రపాణి. రైల్వే ఉద్యోగం లోంచి ఈ మధ్యే వీ ఆర్ ఎస్ తీసుకున్నాను".

"ఐ యాం శ్రీ వత్స ", పలకరింపుగా నవ్వి బదులిచ్చానలభైల్లో ఉన్న స్ఫురద్రూపి.

"మీరు కచేరీ కి తీసుకొచ్చిన మేడం గారు...?" ఎవరు, అని నేరుగా అడక్కుండా ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాడు చక్రపాణి.

"మా అమ్మ. ప్రొఫెసర్ అఖిల. యూనివర్శిటీ లో పని చేసి రిటైరయారు."

వెంటనే పోలికలు తెలిసి వచ్చాయి చక్రపాణికి. ఎం ఏ క్లాసు లో రెండేళ్ళు ఆమె చెప్పిన పాఠాలు గుర్తొచ్చాయి. తనబోటి వాళ్ళెందరో ఆరాధించే ఉత్తమ శ్రేణి అధ్యాపకురాలు అఖిల మేడం. హార్డీ నవల 'టెస్ ఆఫ్ ది డీ అర్బర్వెలిస్' క్లాసులో బోధిస్తూ అందులోని విషాదానికి ఉద్వేగపడి కన్నీరు పెట్టుకున్న సున్నిత సంస్కారి అఖిల మేడం.

"చాలా ఏళ్ళయింది మేడం ని చూసి...నేను ఆమె స్టూడెంట్ ని. లోపలికి వెళ్ళాక పలకరించి నమస్కారం చెబుతాను"

"ఐదారేళ్ళుగా 'డెమెన్షియా' ఉంది అమ్మకు. కొన్ని ఘటనలూ, కొంత మంది మనుషులూ మాత్రమే గుర్తుంటారు. చాలా గుర్తుండవు. ఎన్నోఏళ్ళయిందిగా..అమ్మ మిమ్మల్నిగుర్తు పట్టదేమో" వారిస్తున్నట్టు అన్నాడు శ్రీ వత్స .

"ఎంతకాలంగా ఇలా ఉంది మేడం గారికి ?"

"ఎనిమిదేళ్ళ కిందట మొదలైంది. ఆమె రెండో కొడుకు... మా తమ్ముడు అమెరికా లో ఉద్యోగం చేసేవాడు. ఒక కారు ప్రమాదం లో పోయాడు. తట్టుకోలేక అమ్మ డిప్రెషన్ కి గురైంది. అదే కారణం అంటారు డాక్టర్లు."

"మీరూ మీ ఫ్యామిలీ మేడం తో నే ఉంటున్నారా?"

"లేదు. నా భార్యా బిడ్డా నార్వే లో ఉంటారు. మా ఆవిడ అక్కడ ఇంజనీరు. నేనూ అక్కడే పని చేసేవాడిని. ఎనిమిది నెలలైంది ఇండియా వచ్చి అమ్మదగ్గర ఉంటున్నాను."

"అక్కడి మీ ఉద్యోగం?"

"వదిలేశాను. తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోటి వెదుక్కోవాలి. "

"మీరొచ్చేస్తే మీ ఆవిడ, బిడ్డ ఇబ్బంది పడరా? "

"ఇన్నేళ్ళూ అమ్మ పడ్డ ఇబ్బందిమాటేమిటి? " చిరునవ్వుతో అన్నాడు శ్రీవత్స.

"మీకు అభ్యంతరం లేకపోతే, నన్ను గుర్తుపట్టకపోయినా సరే మేడం ని ఒక సారి పలకరిస్తాను"

"నాకు అభ్యంతరం దేనికి సర్, ఆమె మిమ్మల్ని గుర్తుపట్టకపోతే మీరే నొచ్చుకుంటారని"

"గుర్తు పట్టదంటారా”? "

"ఆమె కు నేనే గుర్తులేను ; ఎవరో వేరే మనిషి తన కొడుకు పంపితే తనకి సాయంగా ఉంటున్నాడని అనుకుంటూంది".

"నిజమా ?"

"ముందువరసలో అమ్మ కూచుని ఉంటే వెనక వరసలో నేను పరాయివాడిలా కూచున్నంత నిజం. ఎనిమిదేళ్ళ క్రితం అమెరికాలో కారు ప్రమాదం లో చనిపోయిన నా తమ్ముడు ఇంకా అమెరికా లోనే ఉంటున్నాడనీ తన పెద్దకొడుకు శ్రీవత్స నార్వే లో స్థిరపడ్డాడనీ నాకే చెబుతుంది. మాతో తీసుకెళతాం అంటే ఎక్కడో ఏదో దేశంలో పరాయి దాని లా బతకడం నాకు బావుండదురా.. ఇలా ఉండిపోనీండి నన్ను. ఇంకెప్పుడూ వత్తిడి చెయ్యకండి మీతోపాటి రమ్మని అని హుకుం జారీ చేసింది అమ్మ"

చక్రపాణికి మాట పెగల్లేదు.

"నమస్తే మేడం..ఇక్కడ కూర్చోవచ్చా?" తిరిగి లోపలికి నడిచాక ఖాళీ గా ఉన్న కుర్చీలో తన ఉపాధ్యాయిని పక్కన కూచుంటూ అడిగాడు చక్రపాణి.

"ఆడిటోరియం లో ఖాళీగా ఉన్న కుర్చీ లో కూర్చోవడానికి నా అనుమతి దేనికి సర్, కూచోండి. "

ఎంత హాస్యం మేళవించిన మాట అది ! 'ఈమె డెమెన్షియా బారిన పడ్డ మనిషా' అని ఆశ్చర్య

పడ్డాడు లోలోన చక్రపాణి.

"నేను అఖిల. ప్రొఫెసర్ అఖిల. యూనివర్సిటీ లో రిటైర్ అయాను." మాట కలిపింది మేడం.

"తెలుసు మేడం"

"ఎలా?"

"నేను మీ స్టూడెంట్ మేడం...రెండేళ్ళు పీజీ లో మీ పాఠాలు విన్నాను."

"నిజం.... ? నాకు గుర్తు రావట్లేదు. ఏ బ్యాచ్? "

చెప్పాడు చక్రపాణి.

"నేను ఆ రోజుల్లో మీకు బాగా ప్రీతిపాత్రమైన స్టూడెంట్ మేడం...మాది పెనుగొండ. 'ఆంధ్ర భోజ' అని పిలిచేవారు నన్ను మీరు."

"చక్రపాణి...గుర్తొస్తూంది... మిమిక్రీ బాగా చేసే వాడివి కదా . క్లాసు లో పాఠం నేను ఎలా చెబుతానో నా ఎదురుగానే ఒక సారి అనుకరించి చూపావు. పాటలూ పాడేవాడివి. ఫైనల్ ఇయర్ ఆఖర్లో ఆర్ట్స్ బ్లాక్ ఆడిటొరియం లో చిన్నసైజు కచేరీచేశావు నువ్వు ..అవునా?"

ఆశ్చర్యం వేసిందిచక్రపాణికి. 'ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన విషయాలు నిన్న జరిగినంత

వివరంగా చెబుతూంది. మతిమరుపేమిటి ఈవిడకు' అనుకున్నాడు.

టైం ఎనిమిదవుతుండగా శ్రీవత్స వచ్చి ఆమె చెవిలో 'బయల్దేరుదామా' అన్నాడు. బదులివ్వకుండా లేచి నిల్చుంది మేడం. మెల్లగా కారు దగ్గరకు నడిచారు ముగ్గురూ.

" రండి..పక్కనే ఉన్న హోటల్ లో ఏదైనా కాస్త తిందాం" అన్నాడు శ్రీవత్స చక్రపాణితో జాగ్రత్తగా తల్లిని కారు వెనక సీట్లో కి చేర్చి.

ముందు సీట్లో కి చేరాడు చక్రపాణి.

"రసం ఇడ్లీ బావుంటుంది ఇక్కడ ..రుచి చూడండి. అమ్మకి ఇష్టం ఆ డిష్" రెస్టారెంట్ చేరాక అన్నాడు శ్రీవత్స.

రెండు స్పూన్లతో రసం ఇడ్లీ తినడానికి తికమక పడుతున్న తల్లి పక్కకు చేరి ఎదో పసి బిడ్డకు తినిపించినట్టు తినిపించాడు. ఆపై చిన్న పాటి టిష్యూ పేపర్ తో పెదవుల చుట్టూ తుడిచాడు. చూస్తున్న చక్రపాణి మనసు ఆర్ద్రమైంది.

"ఇంటికి రాకూడదా రేపు...కలిసి భోంచేద్దాం." శ్రీవత్స తో కలిసి కారెక్కబోతూ ఆహ్వానం పలికింది అఖిల మేడం.

"తన స్టూడెంట్ల ను ఇంటికి ఆదివారాలు లంచ్ కి పిలిచేది అమ్మ." డ్రైవింగ్ సీట్లో కూచోబోతూ తనకే వినిపించేట్టు చెప్పాడు శ్రీవత్స.

'ఈ మాట తనతో చెబితే ఎలా...కనీసం పది పన్నెండు ఆది వారాలు అఖిల మేడం ఇంట్లో అన్నం తిన్నవాడు తను..' లోలోపల ఆప్యాయంగా గుర్తు చేసుకున్నాడు చక్రపాణి. ఎప్పటిదో అపురూపమైన సౌహార్ద్రత మళ్ళీ తలుపుతట్టి పలకరించింది చక్రపాణిని.

జేబు లోంచి విజిటింగ్ కార్డు తీసి శ్రీవత్సకు అందించాడు చక్రపాణి. కారు కదిలింది.

మౌనంగా కారు నడుపుతున్న శ్రీవత్స కి నార్వే లో ఉన్న కుటుంబం మదిలో మెదిలింది. మనోహరమైన పర్వతాలూ, హిమశృంగాలూ వీటన్నిటినీ మించి ఉత్తమోత్తమ శ్రేణి ప్రజా రక్షణ వ్యవస్థ ఉన్న సంపన్న దేశం దేశం నార్వే. గత పదమూడేళ్ళుగా శ్రీవత్స కుటుంబం నివాసముంటున్నది ప్రపంచం లోని సుందరమైన ప్రదేశాల్లో ఒకటి గా పేరొందిన బెర్గెన్ పట్టణంలో. దేశానికి నైఋతి దిక్కులో సముద్రతీరాన పర్వతశ్రేణుల నడుమ ఉన్న నగరం అది. కలప తో నిర్మితమైన ముచ్చట గొలిపే నివాస భవనాలు. ఇప్పటికీ భద్రంగా పరిరక్షింపబడుతూఎన్నో చారిత్రక కట్టడాలు పురాతన కాలపు రాజసం ఒలకబోస్తూ సముద్రం కేసి చూస్తున్నట్టుంటాయి.

ఎలా ఉందో కూతురు అనన్య ? బెర్గెన్ కమ్యూనిటీ కాలేజ్ లో ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూంది. రేవతి కీ తనకీ తాను ఇండియా వచ్చే ముందు జరిగిన వాగ్వాదం గుర్తొచ్చింది.

'మనం కొంత కాలం ఇండియా వెళ్ళాలి.'

'అత్తయ్యని చూడ్డానికేనా..వెళ్ళొద్దాం..ప్లాన్ చెయ్యండి.'

'అమ్మ ఆరోగ్యం బావున్నట్టు లేదు. చూసి వెంటనే రాలేం.'

'నెల రోజులు ఉందాం లెండి. అనన్య కి వెకేషన్ ఉంది గా ఎలానూ.'

'కనీసం ఏడాది అయినా పట్టొచ్చు అమ్మ కి ఆరోగ్యం మెరుగవడానికి.'

'మన ఉద్యోగాల్లో అంత సెలవు పెట్టడం ఎలా కుదురుతుంది.. ?'

'జాబ్స్ మానేద్దాం ఇద్దరం'

'ఆర్ యూ క్రేజీ ? ఇంత మంచి ఉద్యోగాలు మానేసి ఇండియా వెళ్ళిపోదామంటున్నావా? ఇక్కడొచ్చే జీతం లో పాతిక వంతు జీతమొస్తుందా అక్కడ?'

'కానీ అమ్మ ? తెలుసుగా.. ఎనిమిదేళ్ళుగా డెమెన్షియా. ఈ మధ్య డాక్టరు చెప్పాడు.. లివర్ ప్రాబ్లం యేదో ఉందని.'

'చెయ్యల్సిందంతా ఇక్కడి నుంచే చేస్తున్నాం గా.. ఒక ఫుల్ టైం నర్సు, పని మనిషి, హాస్పిటల్ వాళ్ళతో నిత్యం మానిటరింగ్..'

ఒకే ఒక్క పద్యం జీవితం పట్ల తన దృక్పథం లో అంత మార్పు తెస్తుందని శ్రీవత్స ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడో తమ వూళ్ళో తోపుడుబండి వాడి దగ్గర కొన్న వేమన శతకం పుస్తకాల బీరువాలోంచి బైటకి తీసి ఒక అర్ధరాత్రి గంట సేపు తిరగేస్తుండగా తారస పడ్డ అమృత గుళికల్లాంటి పలుకులవి.

'తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా

విశ్వదాభిరామ వినుర వేమ'

ఏనాడో వేమన మనిషికి పెట్టిన చెంపపెట్టు శ్రీవత్స ని కార్యోన్ముఖుడిని చేసింది. వేమన చెప్పిన దయ అనే మాట కు దీటుగా వేల మైళ్ళ దూరం లోనిస్సహాయంగా ఉన్న తల్లికి తానేమైనా చేస్తున్నాడా అన్న మీమాంస, దోషభావన ఆ కొడుకుని నిద్ర కు దూరం చేశాయి.

' సరఫరా చేస్తున్న సౌకర్యాలు కాదు రేవతీ తల్లికి నేను చెయ్యాల్సింది. ఇంకా చాలా ఉంది. నా తమ్ముడు హర్ష అమెరికా లో ప్రమాదం బారిన పడి చనిపోయినప్పుడు మొదలైంది ఆమెకు మరపు...వాట్ దే కాల్ డెమెన్షియా ఇన్ మెడికల్ టర్మ్ స్.. రెండో కొడుకుని పోగొట్టుకున్న మనోవ్యధకు ఆమె కు బహుశా ప్రకృతి చేసిన చికిత్స అది. జన్మనిచ్చి పెంచిన ఆ తల్లికి నేనేం చేస్తున్నట్టు? నేను ఇండియా వెళ్ళాలి ; తప్పదు.ఎంత కాలం అవసరమో అంత కాలమూ అక్కడే ఉంటాను.'

***

తెల్లారి ఆరున్నరకి శ్రీవత్స నుంచి ఫోన్. "అమ్మ రాత్రి నిద్రలోనే చనిపోయింది సర్.... ఇవాళ మధ్యాహ్నమే అంత్యక్రియలు."

నిశ్చేష్టుడయ్యాడు చక్రపాణి.

"రాత్రి నిశ్చింతగా పడుకుని నిద్రపోయింది. తెల్లారి చూస్తే......" ఆపై ఇక చెప్పలేకపోయాడు ఆ కొడుకు తల్లి మరణం గురించి.

ఒక ఇరవై మంది పోగయ్యారు మరణించిన అఖిల మేడం కి నివాళి అర్పించడానికి. పార్థివ దేహం తల దగ్గర ల్యామినేట్ చేయించిన చిన్న పాటి చేతి రాత :

'అదో ఇదో గుర్తుంచుకొమ్మని నాకు చెప్పొద్దు ;

చెబుతున్నది నేను అర్థం చేసుకోవాలని శ్రమ పడొద్దు .

గుర్తున్నది చాలు -

విశ్రాంతిగా పడుకుని కళ్ళు మూసుకున్నపుడు ముంజేతిమీద నీ మెత్తటి స్పర్శ కావాలి నాకు !

ఊహకు కూడా అందనంత గజిబిజి నా మాట, నా నడత; ఒప్పుకుంటాను !

నాకు నేనే దూరమైనపుడు కావాలి నాకు నీ హస్తం నా ఆసరా !

విసుక్కోకు, తిట్టకు, ఆగ్రహించకు ;

ఇంతకు మించి చాత కాదని యత్నించి విఫలమైన నాకు బాగా తెలుసు

జారిపోయి మిగిలిన నాతో కడదాకా నిలుస్తావుగా?'

"ఎనిమిదేళ్ళ కిందటి అమ్మ డైరీల్లోని మాటలివి. అందంగా ఫోటో ఎడిట్ చేయించి ఫ్రేం కట్టించి నేనే తగిలించాను గోడకి ఎనిమిదినెలల క్రితం ఇండియా తిరిగొచ్చినప్పుడు" చదువుతున్న చక్రపాణి దగ్గరగా వచ్చి సన్నటి నీటిపొర కంటి పాపల్లో తొంగి చూస్తుండగా గద్గద స్వరం తో చెప్పాడు శ్రీ వత్స.

అంత్యక్రియలు ముగిసిన పదిరోజులకు జరగాల్సిన కార్యక్రమమూ శ్రద్ధగా నిర్వహించాడు శ్రీవత్స.

అతడి భార్య బిడ్డా కూడా విదేశం నుంచి వచ్చారు.

మరో ఐదు రోజులకి....

విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన చక్రపాణితో అన్నాడు శ్రీవత్స:

"నిస్సహాయ స్థితి లోని తల్లికి సేవ చెయ్యగలగడం నాకు బతుకులో దొరికిన వరం అనిపిస్తూంది సర్. ఇవాళ నా వ్యక్తిత్వం లోని మంచి కి యవత్తూ అమ్మే కారణం. దౌర్బల్యాలన్నీ నేను అతికించుకున్నవే. ఆమెకు చేసిన సేవ నాకు ఎప్పుడూ బరువనిపించలేదు. అమ్మ నన్ను అపరిచితుడిగా చూడడం మాత్రం నరకం అనిపించింది. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి ఙాపకాలను కప్పి ఉంచిన కంచు పరదా మాత్రం తొలగదు. అంతేనేమో డెమెన్షియా."

"ఒక కొడుకు చెయ్యాల్సిందంతా నిజాయితీగా చేశారు మీరు", మనస్ఫూర్తిగా అన్నాడు చక్రపాణి.

" ఇష్టంగా ఒక చిరునవ్వు, ప్రియంగా ఒక పలకరింపు , ఆమె మాట్లాడిన మాటను శ్రద్ధగా ఆలకించే ఒక చెవి, ఇవే నేను అమ్మకిచ్చిన చిన్న కానుకలు ....అంతకు మించి నేనేమీ చెయ్యలేదు ... నాకు మొట్టమొదటి స్నేహితురాలు మా అమ్మే. ఆమెకు చిట్టచివరి స్నేహితుడిని నేనే అవ్వాలన్న స్వార్థం నాది".

" తల్లికి చేసిన సేవకు స్వార్థం అని పేరు పెట్టుకునే మీ లాంటి వాళ్ళు ఎక్కడోగానీ తారసపడరు శ్రీవత్స గారూ".

"థ్యాంక్ యూ..వెళ్తాను సర్. 'వెళ్ళొస్తాను' అనడం లేదు ! మళ్ళీ రానేమో...! అంతా వదిలేసి వట్టి చేతుల్తో వెళ్తున్నట్టుంది " , నవ్వడానికి యత్నిస్తూకదిలి వెళ్ళిపోయాడు శ్రీవత్స.

'అవును. చాలానే వదిలిపెట్టి వెళ్తున్నావు. ప్రతీ తల్లికీ ఒక నమ్మకం, ప్రతి మనిషికీ ఒక పాఠం వదిలేసి వెళ్తున్నావు. అద్దంలో ఆకాశానివి !'

చాలా సేపు అక్కడే నిల్చుండిపోయి లోలోపలే గొణుక్కున్నాడు చక్రపాణి.

***

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు