"త్వరగా రెడీ అవు పద్మా!..అక్కడ పెళ్ళి చూపులు కాస్త అయిపోతాయి. ఇంకా లేట్ చేస్తే, పెళ్ళి కుడా అయిపోతుంది. ఏమిటో ఆడవారి అలంకరణ..ఉదయం అనగా వెళ్లావు గదిలోకి..ఇప్పటికి మూడు గంటలైంది..ఏం చేస్తున్నావు? అసలే అన్నయ్య ముందు రమ్మని మరీ చెప్పాడు. ఎంత అన్న కూతురు కే పెళ్ళిచూపులైనా, మరీ ఇంత లేట్ గా వెళ్తే బాగోదే!"
"అయిపోయిందండి!..ఇంకా నెక్లెస్, వడ్డాణం పెట్టేసుకుంటే, అయిపోయినట్టే..."
"ఆ వడ్డాణం ఎందుకు? చూసి కట్నం ఎక్కువ అడిగినా అడుగుతారు. అంతగా కావాలంటే, ఆ నెక్లెస్ ఒకటి పెట్టుకో చాలు.."
"అంటే... ఉదయం నుంచి స్నానం చేసి, చీర కట్టుకున్నావా? అంతేనా? నేను చూడు..ప్యాంటు, చొక్కా వేసుకుని, అలా ఫోన్ పట్టుకుని రెడీ గా ఉన్నాను.."
"మా ఆడవారు అలంకారం లేకుండా బయటకు రారు. స్లో గా చేసినా, పర్ఫెక్ట్ గా చేస్తాం.."
మొత్తానికి ఇంటికి తాళం వేసి బయట పడ్డారు. వీధి లో అటుగా వెళ్తున్న ఆటో ను పిలిచి..ఎక్కారు. ఆటో గేర్ లో ఇబ్బంది చేత, స్లో గా వెళ్తున్నాడు. మొత్తానికి పెళ్ళి వారి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మగ పెళ్ళివారు వచ్చి ఉన్నారు. ఇద్దరు మెల్లగా వచ్చి కూర్చున్నారు. అన్నగారు ఇద్దరినీ పరిచయం చేసారు..మగ పెళ్ళివారికి.
"మీ తమ్ముడు గారు ఇంత లేట్ గా ఎందుకు వచ్చారో? అసలే మా ఆయన టైం అంటే పడి చస్తారు. టైం కు రాక పొతే, ఆయనకు మహా చిరాకు..ఆర్మీ లో పని చేసిన ఆఫీసర్ కదా మరి!" అని అందుకుంది పెళ్ళి కొడుకు తల్లి.
పెళ్ళి కూతురు కుడా అంతే..పిలిచిన చాలా సేపటికి వచ్చింది. పెళ్ళి కూతురు తల్లి కుడా అంతే! మొత్తం ఫ్యామిలీలో అందరికీ టైం సెన్స్ లేదు. ఈ సంబంధం మాకు వద్దు. పదండి.. అని కొడుకుని లేవగోట్టాడు పెళ్ళి కొడుకు తండ్రి ..గుమ్మం వైపుకు దారి చూపిస్తూ..
"అయ్యో పద్మా!..ఎంత పని జరిగింది..మంచి సంబంధం పోయిందే!"
"పోనిలే అక్కా! పెళ్ళి కొడుకు చూడు...కోతి లాగ ఉన్నాడు..ఇంకో మంచి సంబంధం వస్తుంది లే!"
అప్పుడే న్యూస్ కోసం టీవీ ఆన్ చేసారు. టీవీ లో బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు చూడు..వాడికి ఇది వరకే పెళ్ళి అయ్యిందంట.."
"ఎంత గండం తప్పింది..నువ్వు లేట్ గా వచ్చి మంచి పని చేసావు పద్మ!"
"మరీ పొగడకు అక్కా! అంతా మీ అమ్మాయి అదృష్టం అక్కా!"
****