
హరి, కృష్ణ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ కలసి చదువుకున్నా, స్నేహితులుగా మసలుకున్నా –
నిలబడి నీళ్లు త్రాగుదాం అన్న మనస్తత్వం హరిది అయితే, పరిగెత్తి పాలే త్రాగుదాం అనే మనస్తత్వం కృష్ణది.
ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు దొరికేయి.
అన్నిచోట్ల ఉండేటట్టుగానే, హరి పనిచేసే చోట కూడా –
“జీతంతో ఎలా గడుపుతావయ్యా, మేమిచ్చే 'గీతం' తీసుకొని హాయిగా దర్జాగా ఉండు” అని పనులు చేయించుకుందుకి వచ్చి డబ్బాశ చూపే జనం కోకొల్లలు.
వారందరికీ హరి -"బాబూ మీకో నమస్కారం, మీరిచ్చే లంచాలకు మరో నమస్కారం. అవి తీసుకుందికి సిద్ధంగా ఉండే జనం దగ్గరకి మీరు వెళ్ళండి. నాకు వచ్చే జీతంతో నేను నా కుటుంబం హాయిగా సంతోషంగా ఉన్నాం" –
అని వినయంగానే ఎవరినీ నొప్పించకుండా జవాబిచ్చేవాడు.
వచ్చిన జనానికి కావలసిన పనులు చేసి పెట్టి, తనకు కావలసినంత 'గీతం' వారి ముక్కు పిండి వసూలు చేసి తన కుటుంబంతో చాలా దర్జాగా ఉంటున్నాడు, కృష్ణ.
ఎక్కడేనా, ఎప్పుడేనా, ఎవరికైనా ఎటువంటి సహాయం కావలిస్తే, వారు తనకు తెలిసినవారా కాదా అని చూడకుండా చేయగలిగిన సహాయం చేసేందుకు పరిగెత్తే వాడు హరి.
అందుకు పూర్తిగా విరుద్ధం కృష్ణ.
కృష్ణ మనస్తత్వంకి భిన్నంగా –
హరి అందరితో స్నేహంగా మసులుకోవడం అలవాటు చేసుకున్నాడు.
హరికి లంచం పుచ్చుకొవడం ఎలా ఇష్టపడదో, తనకు కావాల్సిన పని చేయించుకుందుకి లంచం ఇవ్వడం కూడా ఇష్టపడదు.
కృష్ణకి లంచం తీసుకోవడం ఎంత బాగా చేతనవునో, తనకు కావాల్సిన పని చేయించుకుందుకి లంచం ఇవ్వడం కూడా వచ్చును.
హరికి దొరికిన అదృష్టం అతని జీవిత భాగస్వామి. ఎటువంటి గొంతెమ్మ కోరికలు కోరకుండా భర్త సంపాదించిన దాంట్లోనే గుట్టుగా తృప్తిగా సంసారం నడుపుతూ చేదోడు వాదోడుగా ఉంటుంది.
కృష్ణ భార్యకి బోలెడన్ని ఆశలు ఆకాశాన్నంటే కోరికలు. అందుకు అనుగుణంగా కృష్ణ తన సంపాదన పెంచుకుంటూ వస్తున్నాడు.
-2-
ఎప్పుడేనా ప్రయాణం చేయవలసివస్తే - హరి రైలు లేదా బస్సులో టికెట్ తీసుకొని ప్రయాణం చేసేవాడు.
కానీ, కృష్ణ అలా కాదు. తాను ప్రయాణం చేయవలసిన దారికి రైలు సదుపాయం ఉంటే, టికెట్ కొనకుండా TTE ని ఆర్ధికంగా సంతృప్తిపరచి దర్జాగా ప్రయాణం చేసేవాడు.
ఒకసారి ఇద్దరు స్నేహితులూ వారి వారి కుటుంబాలతో మరొక స్నేహితుడింట్లో పెళ్లికి బయలుదేరేరు.
హరి తన అలవాటు ప్రకారం, పెళ్లిరోజుకి రెండురోజుల ముందర రెండో తరగతి పెట్టెలో తనకు తన కుటుంబానికి టిక్కెట్లు రిజర్వు చేయించుకొని సాధారణమైన రైలులో ప్రయాణంకి సిద్ధపడ్డాడు.
కృష్ణ తన అలవాటు ప్రకారం, టికెట్ కొనకుండా ఒక TTE సహాయంతో కుటుంబంతో సహా రెండో తరగతి AC పెట్టెలో అతివేగంతో ప్రయాణించే మరో రైల్లో అదే రోజు ప్రయాణం పెట్టుకున్నాడు.
పెళ్ళిలో గొప్పగా ఉంటుందని, కృష్ణభార్య బ్యాంకులాకర్లలో ఉన్న బంగారం అంతా తీసి తనదగ్గరే ఉంచుకొని ప్రయాణం చేస్తూంది.
హరి కుటుంబంతో ప్రయాణించే రైలు బయలుదేరిన రెండు గంటలకు కృష్ణ కుటుంబంతో ప్రయాణించే రైలు బయలుదేరి, హరి బయలుదేరిన రైలుని దాటి ముందుకు అమిత వేగంతో ప్రయాణిస్తోంది.
ఒక స్టేషన్ లో ఎంతకీ బయల్డేరకుండా తమ రైలు ఆగిపోతే వాకబు చేసిన హరికి – కుటుంబంతో కృష్ణ ప్రయాణిస్తున్న రైలు తమను దాటి అమిత వేగంతో వెళ్లి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది అని తెలిసింది.
వెంటనే, హరి తన భార్య పిల్లలని రైలు నించి క్రిందకు దింపి ఒక టాక్సీ తీసుకొని బయలుదేరేడు, దారంతా చూసుకుంటూ.
కొంత దూరం వెళ్లిన తరువాత దూరంగా పొలాల్లో పడి ఉన్న రైలు పెట్టెలు చుట్టూ మూగి ఉన్న జనం కనబడ్డారు.
హరి టాక్సీ ఆపించి, భార్య పిల్లలని అక్కడే ఉండమని, కృష్ణ అతని కుటుంబం గురించిన ఆరాటంతో రైలు ప్రమాదం జరిగిన స్థలానికి జాగ్రత్తగా చేరుకున్నాడు.
అందరితో కలిసి వెతకగా - పొలాలలోకి అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు విసిరేసినట్టు పడి ఉన్న ప్రయాణికుల మధ్యలో - ఒక్కొక్కరూ ఒక్కొక్క చోట విగత జీవులుగా పడి ఉన్న కృష్ణని, అతని కుటుంబంలో అందరినీ, చూసిన హరికి దుఃఖం ఆగలేదు.
రైలు ప్రమాదంలో చనిపోయినవారిని ఉద్దేశించి ప్రభుత్వం భారీగా ప్రకటించిన నష్టపరిహారం కృష్ణ బంధువులకి దొరకలేదు. కారణం - కృష్ణ కుటుంబంలో ఎవరి పేరుతో కూడా రైలు టికెట్ కొని రిజర్వేషన్ చేయించుకున్నట్టుగా రైల్వే వారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు.
అంతేకాక, కృష్ణ భార్య తనతో పట్టుకొని ప్రయాణించిన బంగారం ఏమైందో కూడా ఎవరికీ తెలిసి రాలేదు.
*****