నా స్నేహితుడు - మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

Naa snehitudu

నా స్నేహితుడు నాన్న అలా కాదు ఈ సైడ్ బటన్ నొక్కాలి ఇక్కడ ఆన్ చేయాలి. చార్జర్ ఇలా పెట్టాలి మళ్లీ రీస్టార్ట్ చేయాలి. నెట్వర్క్ పనిచేయట్లేదు ఏమో మొబైల్ నెట్వర్క్ వాడుకో. ఫేస్బుక్ క్రియేట్ చేసాం వాట్సాప్ నెంబర్ ఇదే. యూట్యూబ్ ఉండనే ఉంది. సాంసంగ్ నోట్స్ డౌన్లోడ్ చేసాం. ఏమిటో కొత్త కొత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నారు పిల్లలు నాన్న నీ మొబైల్ నెంబర్ మొదటి నెంబరు చివరి నెంబరు కూడానీలక్కీనంబరే.Youareluckyఅంటూఆనందపడిపోయారు ఇలా చకా చకా నాకు చెబుతూ నా పుట్టినరోజుకి ఆ బుల్లి ముండని నా చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. నేను అక్షరాల నేర్పిన పిల్లల దగ్గర శిష్యుడిలా మారిపోయి మొత్తానికి బ్రహ్మవిద్య నేర్చేసుకున్న. చుట్టాలు పక్కాలు పార్కులో స్నేహితులు, మార్కెట్లో కూరగాయల షాపులు , కిరాణా షాపులు , పాలవాళ్లు ,మెడికల్ షాపులు, డాక్టర్లు, రక్త పరీక్ష కేంద్రాలు పనిమనిషి ,చాకలి, మంగలి నంబర్లన్నీ డైరీ తీసి కాల్ లిస్టులో పెట్టేసుకున్న. ఆ లిస్టు చూస్తే పెళ్లి సామాన్లు లిస్టులా ఉంది కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఆస్తమాను దాన్ని చూస్తూ చేతిలో అటు ఇటు తిప్పుకుంటూ జేబులో పెట్టుకుంటూ ఎవరి దగ్గర నుంచైనా ఫోన్ వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ అయినా నా మొబైల్ నెంబర్ ఎవరికి తెలియదు. అనుకుని సంతృప్తిపడి ఎందుకు నేనే చేస్తే పోలే అనుకుంటూ ముందుగా కాల్ వంటింట్లో ఉన్న మా శ్రీమతికి చేశా. ఫోన్ రింగ్ అవుతుంది. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమిటో అని వంటింట్లోకి తొంగి చూసా. అబ్బో ఆవిడ బాబాగారి పూజలో ఉంది. అరే మొదట కాలే ఫెయిల్ అయింది అనుకుంటూ సెంటిమెంట్ ఫీలయ్యా. మర్నాడు పొద్దున్నే call వచ్చింది .హలో అనగానే అవతల వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. నాకు హిందీ రాదు. చూసి చూసి ఏమీ అర్థం కాక ఫోన్ పెట్టేసా. తెల్లారి లేచింది మొదలు ఫోను వదిలిపెడితే ఒట్టు. పని ఉన్న లేకపోయినా ఫోన్ లే . ఇల్లు కదిలితే ఒట్టు. ఫోన్ లోనే పనులన్నీ. బజార్ కి వెళ్లి కూరగాయలు,పళ్లు తెచ్చి ఎన్ని రోజులైందో .ఫోన్ చేస్తే బాస్కెట్ నిండా కూరగాయాలు తెచ్చిపడేస్తున్నాడు బిగ్ బాస్కెట్ వాడు.వాటితో పాటు కిరాణా కూడా .మందులన్నీ హోం డెలివరీ. ఫోను మొహం తప్పితే వీధి మొహం చూసి ఎన్ని రోజులు అయిందో. మొబైల్లో వచ్చిన కొత్తలో ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి నెంబర్ చెప్పాను. ఏ ఒక్కళ్ళు ఫోన్ చేయడం లేదు. కొంతమంది అయితే మిస్డ్ కాల్ ఇచ్చేస్తున్నారు. ఫోను సరదా కొద్ది మళ్లీ నేను కాల్ చేసి మాట్లాడేవాడిని. ఇంతకీ ముఖ్య విషయం ఏమీ లేదు. పిచ్చాపాటి. ఊరి విషయాలు. ఏమి తోచక నాకు చేసినట్లు అనిపించింది. పిల్లలు వారానికి ఒకసారి ఫోన్ చేసే వారు. ఇప్పుడు నేనే రోజు నిద్ర లేపుతున్నాను. మనవలు అమెరికాలో ఉన్న ఊర్లోనే ఉన్నట్టుంది. రోజు వీడియో కాల్స్. ఎక్కడో ఉన్నారని బెంగ లేదు. నెలాఖరికి పోస్ట్ పెయిడ్ బిల్ నాలుగు అంకెలు దాటింది. కాల్ లిస్ట్ చూసి గుండె గుబేలు మంది. ఈ వయసులో ఇంత ఖర్చు అవసరమా అని అంతరాత్మ ప్రశ్నించినట్లుగా తోచింది. ఈమధ్య ఫోన్ వచ్చిన తర్వాత మీరు నాతో మాట్లాడటం లేదు. ఎప్పుడు ఫోను పట్టుకుని కూర్చుంటున్నారు. ఆ మాయ లోకంలోనే ఉంటున్నారు. అంటూ శ్రీమతి రోజూ దెప్పి పొడుస్తోంది. మనం భూ గోళానికి ఈ పక్కన ఉన్నాము. పిల్లల ఆ పక్కన ఉన్నారు. ఉత్తర దక్షిణ ధ్రువాలు. వాళ్ళది ఎదిగే వయసు. మాది పొద్దు వాలిన వయసు. ఎప్పుడూ గూట్లోనే ఉండేవాళ్ళం మేము. వాళ్లు ఎప్పుడు గూడు చేరుతారో తెలియదు. వాళ్లకు సమయం దొరికినప్పుడు అమ్మానాన్న గుర్తుకొస్తారు. మాకు ఎప్పటికీ వాళ్ళు గుండెల్లోనే ఉంటారు. ఒక్కొక్కసారి సమయం సందర్భం లేకుండా కూడా మాట్లాడాలనిపిస్తుంది. అదే కదా పిల్లల మీద ప్రేమంటే. ఒకరోజు టైం చూసుకోకుండా మధ్యాహ్నం తోచక పిల్లలకు ఫోన్ చేశాను. అవతల నుంచి ఆడగొంతు ఈ టైంలో ఫోన్ చేశారు ఏమిటి. మేము ఇప్పుడే పార్టీ నుంచి వచ్చి మంచి నిద్రలో ఉన్నాము. అక్కడ తప్పులేదు అక్కడ ఆడ మగ కూడా . మొదటిసారిగా వాళ్ల పరిస్థితి నాకు అర్థమైంది.మీ అబ్బాయి ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేడు. అయినా ఉదయమే కదా చాలాసేపు మాట్లాడారు అంటూ ఫోన్ పెట్టేసింది. మనసు బాధగా మూలిగింది. తప్పు నాదే. మొదటిసారిగా ఆ బుల్లి ముండ మీద కోపం వచ్చింది. దీని మూలంగానే ఇంత ఖర్చు. అనవసరంగా సుఖాన్ని ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం ఎందుకు మాటలు పడడo ఎందుకు. విరక్తి కలిగి అలమారాలో పెట్టేసాను. మళ్లీ మా శ్రీమతితోనే రోజు కాలక్షేపం. రోజులు గడుస్తున్నాయి. శ్రీమతికి వంటలో సహాయం చేయడం బజారుకు తీసుకెళ్లడం అలవాటు చేసుకున్న. మా శ్రీమతి మొహం లో ఆనందం చాలా రోజులుకి చూశాను. ఒకరోజు ఉన్నట్టుండి గుండె నొప్పితో నా శ్రీమతి పుణ్యస్త్రీగా వెళ్ళిపోయింది. ఎవరో పక్కింటి వాళ్ళు పిల్లలకు ఫోన్ చేసి చెప్పారు. పిల్లలు అంతా వచ్చారు. కార్యక్రమం చివరి రోజు అమెరికాలో పెద్దవాళ్ళకి ఏమి తోచదండి. మేము ఇద్దరం ఉద్యోగాలు చేస్తే గాని మాకు గడవదు. అందుకనే మా మామయ్య గారిని మీ మావయ్య గారి లాగా అంటూ పక్కింటి ఆవిడతో పెద్ద కోడలుతో గట్టిగా చెబుతున్న మాటలు వినబడ్డాయి. పరిస్థితి నాకు అర్థమైంది. రేపటి నుంచి ఒంటరిగా ఆ శరణాలయంలో నా గదిలో నేను. ఏమిటి కాలక్షేపం. బయట ప్రపంచం తెలియదు.కాలం గడవదు. మరునాడు ఉదయమే మా పెద్దబ్బాయి పదండి నాన్న అంటూ బ్యాగు చేత పట్టుకుని నా గుమ్మం ముందు నుంచున్నాడు. ఎక్కడికి ఏమిటి అని ప్రశ్నించలేదు. మౌనoగా లేచి అలమార్లో దాచిన ఫోను మళ్లీ జేబులో పెట్టుకున్నాను. కారులో ప్రయాణిస్తూ ఫోన్ ఆన్ చేసి మిస్డ్ కాల్ చూశా. ఈ నెల రోజుల నుంచి కొడుకుల దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా లేదు. ఆలోచిస్తే నా ఆఖరి దశలో ధైర్యంగా ఉండి తోడుగా ఉండేది ఈ బుజ్జిముండే.మంచం మీద నుంచి కదలి లేకపోయినా కబుర్లన్నీ మోసుకొస్తుంది. కాలక్షేపం చేస్తుంది. నాలాంటి ఎంతోమంది వృద్ధులు ఈ కాలంలో బాధపడేది మాట్లాడే మనిషి లేకపోవడమే. మా బోటి వాళ్లకు ఇది ఆపద్బాంధవుడు అనుకొని ముద్దు పెట్టుకున్నాను.కానీ అవసరానికి వాడుకుని అందంగా టేబుల్ మీద పెట్టుకుంటే అందరికీ మంచిదే.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు