తొలిపలుకు : నా సహావిద్యార్థియే కాక సహోద్యోగి చిరకాల మిత్రుడైన 'శ్రీనూ’ దంపతుల యదార్ధ అలౌకిక ఆధ్యాత్మిక
ఆనందానుభవం ఈ మధ్యన తెలుసుకున్న నేను – కించిత్ కల్పన జోడించి చేసిన ప్రయత్నమే ఈ రచన.
పండరీపురంలో వెలసిన రుక్మిణీ సహిత పండరీనాథుని దర్శించడానికి వచ్చే లక్షలాది భక్త సముదాయాన్ని టీవీలో చూస్తేనే చాలు మన మనసు అంతా ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడుతుంది. పైగా, ఆ క్షణాలలో మనం కూడా మానసికంగా వారందరిలో ఒకరుగా కలిసి పోతాము.
పండరీపురంలో వెలసిన రుక్మిణీ సహిత పండరీనాథుని దర్శించాలన్న గాఢమైన కాంక్షతో శ్రీను దంపతులు కొన్ని ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలో చేసేరు. కానీ, ప్రతీసారీ ఏదో ఒక అవాంతరం వచ్చి వారి కోరిక తీరడం లేదు.
గుడ్డిలో మెల్ల అన్నట్టుగా –
వారు ఉండే ఊళ్ళోనే పండరీనాథుని గుడి ఒకటి ఉంది. ఆ గుడి యాజమాన్యం అక్కడ కూడా నిత్య పూజలు తదితర కార్యక్రమాలు పండరీపురంలో జరిగేటట్టుగానే భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుతూ ఉంటారు.
‘గంగానదిలో స్నానం చేయాలని ఉండి వెళ్ళలేని వారు తాము స్నానం చేసే నీరు గంగానదిలో ఉన్న పవిత్ర జలాలని 'మనసా' భావిస్తూ పవిత్రముగా స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేస్తే వచ్చేపుణ్యఫలితం వస్తుంది’ - అని గురువుగారు శ్రీ చాగంటిగారు వారి ప్రవచనాలలో చెప్తుంటారు.
గురువుగారి ప్రవచనాలు క్రమం తప్పకుండా వినే శ్రీను దంపతులు –
వారి ఊళ్ళోనే ఉన్న పండరీనాథుని గుడిలో ఉండే దైవాన్ని చూస్తూ, పండరీపురంలో ఉన్న పాండురంగడునే చూస్తున్న అనుభూతి మానసికంగా అనుభవిస్తూ, త్వరలో పండరీపురం గుడిలో స్వామి దర్శనం లభించేలా ఆశీర్వదించమని ఇక్కడ గుడిలో ఉన్న పాండురంగడిని మనసా వేడుకుంటూనే ఉన్నారు.
ఇక్కడి గుడిలో పండరినాధునికి జరిపే సేవలలో వారంకి ఒకసారి మాత్రమే జరిగే 'పంచామృత అభిషేకం' కన్నులారా చూసినవారి జీవితమే భాగ్యం అనిపించేటంత ఘనంగా జరుగుతుంది.
గుడి యాజమాన్యం నిర్ణయించిన రుసుము చెల్లించిన ఒక దంపతులకు మాత్రమే ఆ సేవలో పాల్గొనడానికి ప్రవేశం ఉంటుంది.
-2-
ఆ సేవా భాగ్యం కోరే దంపతులు గుడి యాజమాన్యం దగ్గర వారం ముందుగా గోత్ర నామాలు నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్న దంపతుల పేర్లు లాటరీ ద్వారా నిర్ణియించగా వచ్చిన ఒక దంపతులను మాత్రమే గుడి యాజమాన్యం నిర్ణయించిన రుసుము చెల్లించిన తదుపరి ఆ సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారు.
'భగవంతుడిని నమ్మినవారిని ఆ దేవదేవుడు తప్పకుండా వారి కోరిక తీరుస్తాడు' అన్న గురువుగారు శ్రీ చాగంటి గారి మాటల మీద విశ్వాసంతో శ్రీను దంపతులు కొన్నాళ్లుగా క్రమం తప్పకుండా వారి పేర్లు ఆ సేవకై నమోదు చేసుకుంటూనే ఉన్నారు. కానీ, ఎప్పుడూ వారికి ఆ అవకాశం దొరకక, నిరాశే మిగిలేది.
ఒకరోజు - శ్రీను తన భార్యతో –
"ఇప్పటికి ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా పండరీపురంలో వెలసిన రుక్మిణీ సహిత పండరీనాథుని దర్శనం కలగడం లేదు. కనీసం, ఇక్కడే ఉండే గుడిలో స్వామి 'అభిషేక సేవ' లో పాల్గొనే అవకాశం కూడా మనకి దొరకడం లేదు. ఎందుకంటావు"
“పండరీపురంలో వెలసిన రుక్మిణీ సహిత పండరీనాథుని దర్శనం ఎందుకు కలగడం లేదో నేను చెప్పలేను. ఇక్కడ గుడిలో మన పేర్లు నమోదు చేసుకున్నప్పుడు మీరు స్వామిని ఏమని వేడుకుంటున్నారు"
"ఈసారి నీ అభిషేక సేవలో పాల్గొనే భాగ్యం మాకే కలగచేయి - అని ప్రతీసారి వేడుకుంటున్నాను"
"అలా వేడుకుంటూ మీకు తెలియకుండానే మీరొక పెద్ద తప్పు చేస్తున్నారు"
"నేను పెద్ద తప్పు చేస్తున్నానా, ఏమిటది"
"మాకే ఆ భాగ్యం కలగచేయి అంటే ‘మరెవరికీ కాకుండా మాకే ఆ భాగ్యం కలగచేయి’ అన్న అర్ధం వస్తోంది కదా"
"అలా అంటావా, అయితే మరెలా కోరుకోవాలంటావు"
"ఈసారైనా మాకు ఆ భాగ్యం కలగచేయి స్వామీ - అని వేడుకోండి. మీరు అలా వేడుకొంటే తప్పక మనకు ఆ సేవా భాగ్యం స్వా మి కలగచేస్తాడు అని నాకెందుకో నమ్మకంగా ఉంది"
-3-
మరునాడు గుడికి వెళ్లిన శ్రీను భార్య చెప్పిన విధంగా మనసులో స్వామిని వేడుకుంటూ తమ గోత్ర నామాలను నమోదు చేసుకొని వచ్చేడు. ఆ వారం తీసిన లాటరీలో శ్రీను దంపతుల భాగ్యం పండింది.
ఆ ఆనందంలో పరవశించిపోయిన శ్రీను తన భార్యతో - "నువ్వు ‘కరణేషు మంత్రి’ అని నిరూపించుకొన్నావు. నీకు ఇవే నా అభినందనలుతో కూడిన ధన్యవాదాలు" అని ఆమెని ఆప్యాయంగా తన కౌగిలిలోకి తీసుకున్నాడు"
"నా సలహాతో మీకు నేను ఉపయోగపడడంకంటే నాకు ఇంకేమి కావాలి. పైగా నా ఆ సలహా మీతో పాటూ నాకూ లాభించింది కదా" అంటూ భర్త కౌగిలిలో ఒద్దికగా ఒదిగిపోయింది ఆమె.
ఆ విధంగా శ్రీను దంపతులు వారి స్వహస్తాలతో పండరీనాధునికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ స్వామిని చేతులతో స్పృశిస్తూ తనువు మనసు పులకించేటంతగా అనిర్వచనీయమైన దివ్యానుభూతి పొందేరు.
వారు స్వామికి స్వయంగా చేసిన అభిషేక దృశ్యం ఆ రోజంతా వారి కళ్ళ ముందర కదలాడుతూ ఉంటే ఆకలిదప్పుల ధ్యాస కూడా లేకుండా, అదే దివ్యానుభూతి మనసులో నింపుకొని రాత్రి నిద్రకి ఉపక్రిమించేరు.
ఆరాత్రి గడిచి తెలవారుతున్న సమయాన శ్రీనుకి ఎదురుగా నిలబడిన పండరీనాధుడు –
"అబ్బాయీ, మీ దంపతులు భక్తి శ్రద్ధలతో మీ చేతులతో నాకు చేసిన అభిషేకానికి నేను చాలా ఆనందించేను. అందుకే, మీ దంపతులు ఈరోజే బయలుదేరి పండరీపురం వచ్చి రేపు శుచిగా నన్ను దర్శించుకొని తరించండి" అని ఆనతిచ్చి మాయమైపోయేడు.
"అలాగే స్వామీ తప్పకుండా మీ ఆనతి మాకు శిరోధార్యం" అంటూ కనులు మూసుకొనే గట్టిగా మాట్లాడుతూన్న శ్రీనుని ఆయన భార్య తట్టి లేపి –
"ఏమిటి గట్టిగా ‘అలాగే స్వామీ తప్పకుండా మీ ఆనతి మాకు శిరోధార్యం’ అని అరుస్తున్నారు, కల కన్నారా" అని అడిగింది.
భార్య తట్టి లేపి అలా అడగడంతో పండరీనాధుని దర్శనం కలగడం ఆయన మాటలు వినడం అంతా తనకి వచ్చిన కల అని తెలుసుకున్న శ్రీను తన భార్యతో –
-4-
“నీకు తెలుసుకదా -- ’అరుణాచలంలోనికి ప్రవేశించాలంటే అరుణాచలేశ్వరుడు అనుమతి ఉంటేగానీ అరుణాచలంలోనికి ప్రవేశించలేరు. అలాగే, కాశీలోనికి ప్రవేశించాలంటే కాశీవిశ్వేశ్వరుని అనుమతి ఉంటేగానీ కాశీలోనికి ప్రవేశించలేరు’ -- అని గురువుగారు వారి ప్రవచనాలలో చెప్తుంటారు”
"తెలుసు. అయితే"
"ఇప్పుడు ఆ స్వామి నాకు కలలో కనిపించి మనల్ని ఈరోజే పండరీపురం వచ్చి రేపు స్వామిని ఆ దివ్య ధామంలో దర్శించి తరించమని అనుమతి లాంటి ఆనతి ఇచ్చి మాయమైపోయేరు"
"స్వామి స్వయంగా మీకు కలలో ఆయన దర్శనం ఇచ్చేరంటే - ఎంత అదృష్టవంతులండీ మీరు. నాకు ఆ భాగ్యం లేకపోయింది"
"అలా విచారించకు. స్వామి నా కలలోనే కనిపించినా, నిన్ను మరచిపోకుండా 'మీ దంపతులు రండి' అని ఆనతి ఇచ్చేరు. పైగా నువ్వు నా భాగస్వామివి కదా. అందుకే, నాకంటూ ఏమేనా భాగ్యం ఉంటే అందులో సగం నీదే"
శ్రీను అనునయంతో స్వాంతన లభించిన ఆమె "ఇంత హఠాత్తుగా మనకి ట్రైన్ కి కానీ బస్సుకి కానీ టిక్కెట్లు ఎలా దొరుకుతాయి"
"మన ప్రయత్నం మనం చేసి చూద్దాం. స్వామియే మనల్ని రమ్మన్నప్పుడు మనం ఆయన దగ్గరకు వెళ్లేందుకు ఆయనే ఏదో ఏర్పాటు చేస్తాడులే"
దంపతులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకొని స్నానపానాలు కానిచ్చి పూజ పూర్తిచేసుకొని ఫలహారం చేస్తూంటే –
శ్రీను మొబైల్ లో ఆయన ఏర్పాటు చేసుకున్న రింగ్ టోన్ ‘పాండురంగ నామం’ అన్న పాట వినిపించి –
"హలో మూర్తీ ఏమిటి ఇంత ఉదయమే ఫోన్ చేసేవు, మీరంతా కుశలమేనా" అనగానే –
"మేమంతా కుశలమే శ్రీనూ. నా కారులో మా దంపతులం పండరీపురం బయలుదేరుతున్నాము. మీరొస్తారేమో కనుక్కుందామని ఫోన్ చేసేను"
-5-
"ఎప్పుడు బయలుదేరుతున్నారు మీరు"
"ఎప్పుడో ఏమిటి, మీరు వస్తారంటే ఒక గంటలో మీ దగ్గర ఉంటాము. వెంటనే బయలుదేరితే సాయంత్రం సరికి పండరీపురం చేరిపోవొచ్చు. వస్తారా"
"తప్పకుండా వస్తామురా"
"ఓ సారి మీ ఆవిడని కూడా కనుక్కో"
"మా ఆవిడ నా పక్కనే ఉండి మన మాటలు వింటోందిలే. మీరు వచ్చేసరికి మేము తయారుగా ఉంటాము"
"సరే అయితే. మరో గంటలో మేము మీ ఇంటికి చేరుకుంటాము" అని మూర్తి ఫోన్ ఉంచేసేడు.
"నేను చెప్పలేదూ. మనం ఈరోజే పండరీపురం వెళ్లేందుకు స్వామి ఏదో ఏర్పాటు చేస్తాడని"
"నిజమే. 'భగవంతుడిని మనసా నమ్మినవారికి ఆయన ఎప్పుడూ చేయూత అందిస్తూనే ఉంటాడు' అని గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదండీ" అని శ్రీను భార్య తనకి భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని కూడా వెలిబుచ్చి - పండరీపురం ప్రయాణం కోసం తయారు అవడానికి లోపలి వెళ్ళింది.
'ఘనా ఘన సుందరా' అన్న పాట మధురాతి మధురంగా అసంకల్పితంగా శ్రీను గళం నుంచి బయటకు వచ్చి - ఒక్కసారిగా అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఆవరింప చేసింది.
(నా స్నేహితుడు శ్రీను మంచి గాయకుడు కూడాను).
---గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతాంజలులతో---
*****