సిరిపురం అనే గ్రామంలో వరహాలు శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు కనకరాజు రెండోవాడు పైడి రాజు. వరహాలు శెట్టికి వయసు పైబడటంతో వ్యాపారాన్ని కొడుకులకు అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. ఓ రోజు ఇద్దరు కొడుకులను పిలిచి " కాశీ విశ్వేశ్వరుని దర్శించాలన్నది నా చిరకాలవాంఛ. నాకు వెళ్ళే ఓపిక లేదు. మీరు వెళ్లి విశ్వనాధుని దర్శించుకుని రండి. అక్కడి వింతలు విశేషాలు నాకు చెప్పండి." అన్నాడు తండ్రి. తండ్రి కోరికమేరకు ఇద్దరు అన్నదమ్ములు మూటముల్లె సర్దుకుని కాలినడకన కాశీకి బయలుదేరారు. కొంతదూరం ప్రయాణించేసరికి మరికొందరు యాత్రీకులు కలిశారు వారితో పిచ్చాపాటి మాట్లాడుతూ నడకసాగించారు. సాయంత్రానికి పూట కూళ్ళవ్వ పేదరాసి పెద్దమ్మ ఇంటికి చేరుకున్నారు. కాశీకి వెళ్లే యాత్రీకులతోను, కాశీనుంచి వచ్చే యాత్రీకులతోనూ పేదరాసి పెద్దమ్మ చావడి సందడిగా ఉంది. అలుపెరగకుండా ఆకలితో ఉన్నవారికి వండి వడ్ఢిస్తోంది పెద్దమ్మ. కాశీకి వెళ్లడమంటే మాటలా. కాశీకి వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడు ఒకటే అనేవారు. రవాణా సౌకర్యాలు లేని ఆరోజుల్లో చీకటిపడేవరకు నడిచి రాత్రికి పూట కూళ్ళ ఇళ్లల్లో బసచేసి మర్నాడు ప్రయాణం కొనసాగించే వారు. కాశీ నుంచి వచ్చినవాళ్ళు అక్కడి వింతలు విశేషాలతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా చెప్పారు. అవన్నీ శ్రద్ధగా విన్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఇంతలో పని ముగించుకుని వచ్చింది పెద్దమ్మ. "ఈ వయసులో మీరు కష్టపడి సంపాదించడం మానుకుని తీర్థయాత్రలు చేస్తున్నారు ఏమిటని" అడిగింది పెద్దమ్మ ఇద్దరు అన్నదమ్ములకేసి చూస్తూ. "మా నాన్న దైవభక్తి పరాయణుడు. ఎప్పటినుంచో కాశీ యాత్ర చేయాలన్నది అతని కోరిక. వయసు పైబడటం తో వెళ్లలేక అక్కడి విశేషాలు తెలుసుకోవడం కోసం మమ్మల్ని పంపించారు" అని జవాబిచ్చారు ఇద్దరూ. " రాబోయే వారం లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు ఎక్కువమంది వచ్చే అవకాశం ఉంది మీలో ఎవరైనా నాకు సహకరించగలరా?" అని అడిగింది. "మా తమ్ముడు పైడిరాజు యాత్రకు వెళతాడు. నేను నీకు సాయంగా ఉంటాను"అన్నాడు కనకరాజు. మర్నాడు ఉదయమే తోటి యాత్రీకులతో బయలుదేరి కాశీకి చేరుకున్నాడు. స్నానానికి వెళ్తూ తోటి యాత్రీకుల నుంచి తప్పిపోయాడు పైడిరాజు. అతడికి తెలుగు తప్ప వేరొక భాష రాదు. అందరూ వెతికి వెతికి పైడిరాజు కనిపించక పోవడంతో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. తోటి యాత్రీకుల కోసం పొద్దల్లా తిరిగి అన్నపూర్ణ సత్రం లో భోజనం చేసి దశాశ్వమేధా ఘాట్ దగ్గర గంగ ఒడ్డునే నిద్రపోయాడు పైడిరాజు. అలా రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత యాత్ర పూర్తిచేసుకుని అందరూ పెద్దమ్మ ఇంటికి వచ్చారు. పైడిరాజు తప్పిపోయాడని చెప్పడం తో కనకరాజు ఎంతో బాధపడ్డాడు. పెద్దమ్మ కి చెప్పి తమ్ముడిని వెతుక్కుంటూ కాశీకి బయలుదేరాడు కనకరాజు. పెద్దమ్మ ఇంటికి వచ్చిపోయే యాత్రికులతో మాట్లాడుతూ ఉంటంవల్ల ఇతర భాషలపై పట్టుసాధించడమే కాక ఎలాంటి మోసానికి గురికాకుండా కాశీకి చేరుకున్నాడు. గంగానదిలో స్నానం చేసి విశ్వనాధుని దర్శించుకున్నాడు, అనంతరం అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, కాల భైరవాలయం,గవ్వలమ్మ మందిరం, వారాహిదేవినీ దర్శించుకున్నాడు. అదేసమయంలో అక్కడ ఉన్న పైడి రాజు కనకరాజు ని గుర్తించి "అన్నయ్యా" అని పిలిచాడు. "ఎవరు పిలిచారా?" అని వెనక్కి తిరిగి చూశాడు కనకరాజు. చిరిగిన బట్టలు జడలుకట్టిన జుట్టుతో పోల్చుకోలేకుండా ఉన్న పైడిరాజుని చూసేసరికి కనకరాజు మనసు స్థిమితపడింది. ఇద్దరూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిరోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు అన్నదమ్ములిద్దరూ. జరిగినదంతా తండ్రికి పూసగుచ్చినట్లు వివరించారు. తండ్రి ఎంతగానో సంతోషించి "నా వయసు మీద పడింది నేను ఇక వ్యాపారం చెయ్యలేను ఆ బాధ్యతను నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. నీ ఉద్దేశ్యం చెప్పు" అన్నాడు కనకరాజు వైపు చూస్తూ. "మీ నమ్మకాన్ని వమ్ముచేయను నాన్నా." అని చెప్పి కొంత కాలం తరువాత కాశీలో ఉచిత అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశాడు. దానికి అనుబంధంగా యాత్రీకులకోసం గదులను నిర్మించి బాడుగకు ఇచ్చేవాడు. అన్నదానం వల్ల పుణ్యం, గదులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం వచ్చేది. అనతి కాలంలోనే అతని వ్యాపారం మూడుపువ్వులు అరుకాయలయ్యింది. కనకరాజు తెలివితేటలకు మురిసిపోయాడు వరహాలుశెట్టి.