ఆ ఊళ్ళో ఉన్న ఆసుపత్రులన్నిటిలోకి, ‘వజ్ర ఆసుపత్రి’ చాలా పేరుపడింది. అందుకు కారణం అక్కడున్న వైద్యుల అకుంఠిత సేవాగుణం మాత్రమే కాక, ఆ ఆసుపత్రి ఆంబులెన్సు డ్రైవర్ అర్జున్ కూడా.
ఆ ఆసుపత్రికి మరొక ఆంబులెన్సు ఉన్నా, ఏ రోగినేనా తేవడానికి ఆంబులెన్సు ఆ ఆసుపత్రి నుంచి వెళ్ళవలసి వస్తే రోగికి సంబంధించినవారు వీలయితే అర్జున్ నడిపే ఆంబులెన్సు పంపండి అని వేడుకుంటారు.
రోగిని ఆంబులెన్సులో ఎక్కించిన క్షణం నుంచి అర్జున్ ఆంబులెన్సు నడిపే విధానమే అలా అతనికి అంతగా పిలుపులు రావడానికి కారణం. అర్జున్ కి ఆ ఊరిలోని అన్ని రోడ్డులు అన్ని దారులు కొట్టిన పిండి. అందుకే, ప్రధాన దారులలో సాధారణంగా ఉండే ట్రాఫిక్ జాం వలన రోగిని ఆసుపత్రికి చేర్చడం ఆలస్యం అవుతుంది అని తెలిసిన అర్జున్, తదితరమైన ఏదో ఒక దగ్గర దారిలో పద్మవ్యూహంలోనికి చొరపడే అర్జున్ లాగ ఆంబులెన్సుని అతి వేగంతో నడిపి రోగిని త్వరగా ఆసుపత్రికి చేరుస్తాడు. అందువలన రోగికి అందవలసిన చికిత్స సకాలంలో అంది ఆరోగి బతుకుతాడు.
అలా అతను రోగిని చేర్చినప్పుడు రోగి బంధువులు అతనికి ఉదారంగా ఎంతో కొంత సొమ్ము ఇవ్వ చూపినా అతను “నా బాధ్యత నేను నెర వేర్చేను అంతకంటే నేనేమీ ఎక్కువ చేయలేదు” అని చెప్తూ, వారిచ్చే సొమ్ముని మృదువుగా తిరస్కరిస్తూ - మరింతగా ఆ రోగి బంధువుల ఆదరణ సంపాదించుకుంటూ ఉంటాడు.
అర్జున్ ఉదయం ఆరో గంటకే ఆసుపత్రికి వస్తూండడంతో ఆసుపత్రి కాంటీన్ లో నే అతనకి కావలసినది ఎప్పుడేనా ఉచితంగా తినే సదుపాయం కల్పించింది ఆసుపత్రి యాజమాన్యం.
అలా వచ్చిన అర్జున్ రాత్రి పదిగంటల వరకూ ఆసుపత్రిలోనే ఉండి ఆ తరువాతే ఇంటికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు.
ఆసుపత్రివారి అనుమతితో ఆయన ఇంటికి వెళ్లడం ఇంటినుంచి ఆసుపత్రికి రావడం అతను నడిపే ఆంబులెన్సులోనే.
అర్జున్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆసుపత్రి వారు కోరితే, ఆంబులెన్సు తీసుకొని ఇంటినుంచి బయలుదేరి రోగిని
తిన్నగా ఆసుపత్రికి చేర్చడానికి వెనకడుగు వేసేవాడు కాదెప్పుడూ.
-2-
ఆసుపత్రి యాజమాన్యం అర్జున్ వలన తమ ఆసుపత్రికి వస్తున్న మంచి పేరుకు ప్రతిఫలంగా నెల జీతంతో బాటూ రోగిని తేవడానికి వెళ్లి వచ్చే ప్రతీసారీ అదనంగా కొంత పైకం ముట్టచెప్తున్నారు.
ఒకరోజు రాత్రి ఇంటికి చేరుకున్న అర్జున్ కి అర్ధరాత్రి గుండెలో చిన్న నొప్పి ప్రారంభమై ఎక్కువ అవడం ఆరంభమైంది. అతని ఇంటికి వజ్ర ఆసుపత్రి సుమారుగా 15 కిలోమీటర్ల దూరం ఉంది. అతను ఆసుపత్రికి చేరుకోవాలంటే అతని దగ్గర ఉన్న ఆంబులెన్సు ఒక్కటే ఆధారం, పైగా అది నడపవలసినది కూడా తానే అవడంతో, ఆసుపత్రి సూపరింటెండెంట్ తో అర్జున్ భార్య మాట్లాడి పరిస్థితి వివరించింది. ఆయన ఆమెను విచారించవద్దని తాను ఏదో ఏర్పాటు చేస్తానని చెప్పేరు.
వెంటనే సూపరింటెండెంట్ గారు అర్జున్ ఇంటికి దగ్గరగా ఉన్న తనకు పరిచయమున్న వేరొక ఆసుపత్రివారితో మాట్లాడి, ఆ ఆసుపత్రిలో అర్జున్ ని చేర్పించి, అతనికి కావలసిన ప్రథమ చికిత్స చేయించి, పూర్తి వైద్యం కోసం అర్జున్ ని తమ ఆసుపత్రికి చేర్చే ఏర్పాటు చేసేరు.
ఆ విధంగా ఒక గంటలోనే ఆ ఆసుపత్రివారు అర్జున్ ని తీసుకొని వజ్ర ఆసుపత్రివారికి అప్పగించేరు. అక్కడనుంచి సూపరింటెండెంట్ గారే అర్జున్ కి జరగవలసిన పూర్తి వైద్యం చేయించి అతనంతట అతనికి ‘నేను బాగానే ఉన్నాను, నా దైనందిన పనులు చక్కగా చేసుకోగలను’ అని ధైర్యం వచ్చిన తరువాత రమ్మని ఇంటికి పంపించేరు. అంతేకాక, అతని సేవలను గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం అతనికి చేసిన వైద్యం కూడా ఉచితంగా చేసినట్టే పరిగణించి, అతను మరలా పనిలో చేరేవరకూ జీతం అతని ఇంటికి పంపిస్తామని హామీ ఇచ్చేరు.
ఇంటికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్న అర్జున్ చెవిలో అతని పిల్లడు చదువుతున్నది వినిపిస్తోంది ఇలా --
"నీ పని నువ్వు సక్రమంగా చేస్తూ, ‘మానవ సేవే మాధవ సేవ’ అనే భావనతో పరులకి
సహాయం అవసరమైనప్పుడు వెనకడుగు వేయక సహాయం చేస్తూంటే –
నీకు సహాయం అవసరం పడినప్పుడు భగవంతుడు ఏదో రూపంలో వచ్చి –
నీకు కావలసిన సహాయం తప్పకుండా సమకూరుస్తాడు"
*****