నాకీ నరజన్మ వద్దు - మద్దూరి నరసింహమూర్తి

Naakee narajanma vaddu

తల్లి బిడ్డని కలిపి ఉంచే నాడీబంధం (బొడ్డుతాడు) వేరుచేయడానికి మంత్రసాని నర్సి ప్రయత్నం చేసే లోపల—

ఒకామె పరిగెత్తుకుని వచ్చి ---"ఒలే నర్సి, లగెత్తుకొనిరా. పక్క ఈదిలో పయిత్రమ్మకి బిడ్డ అడ్డం తిరిగిందేమో అని అనుమానంగా ఉంది" అని చెప్పేసరికి --

నర్సి "సాయిత్రమ్మా, పయిత్రమ్మ ఇసయం సూసొచ్చి, మీ బుడ్డోడికి బొడ్డు తెంపుతాను. మీఅమ్మికి గంటవరకూ తెలివిరాదు. ఆమెకాళ్ళ మధ్యన బిడ్డని పడుకోబెట్టేను. జర చూస్తూండండి." అని చెప్పి పక్కవీధిలోని పవిత్రమ్మ దగ్గరకి పరిగెత్తింది.

(నాడీబంధం తెగినవరకూ పూర్వజన్మ వాసనలు జ్ఞప్తికి ఉండి,

పరమాత్ముడితో మాట్లాడే సౌలభ్యం ఉంటుంది అని ఒక నమ్మకం)

ఇదే అదను అనుకున్న పసిపాపడు భగవంతుడితో -- "దేముడా, మళ్ళా నాకీ నరజన్మ ఎందుకిచ్చేవయ్యా."

పసిపాపడు చిన్నబుచ్చుకుంటాడని, వస్తున్న నవ్వు ఆపుకొన్న పరమాత్ముడు –

"84లక్షల జీవరాసులలో నరజన్మ ఉత్కృష్టమైనది కదా, అలా అంటావేమిటి"

"కిందటి జన్మలో నా కలలో ‘ముక్తి’ ఇస్తున్నానని వరం ఇచ్చి, మళ్ళా నాకు ఈజన్మ ప్రసాదించడంలో నీ ఆంతర్యమేమిటి"

"నీకు ‘ముక్తి’ ఇస్తున్నాను, మరో రెండు జన్మల తరువాత అని నేను నీ కలలో చెప్తుంటే, ఆద్యంతం వినకుండా మధ్యలో నిద్రలోంచి మేల్కొని, నన్నంటావేమిటి”

"అయ్యో, ఎంతపని జరిగింది.”

"ఏం, నీకొచ్చే కష్టాలేమిటి"

"ఒకటా రెండా, ఎన్నని చెప్పను"

"ఓపికగా వింటానులే, చెప్పు"

"ఆ చదువు ఈ చదువు అని, అపురూపమైన బాల్యాన్ని అనుభవించనివ్వరు. పెద్దయిన తరువాత, నచ్చినది చదవనివ్వరు. నచ్చకపోయినా తల్లితండ్రులు కోరినదే చదవాలి. నేను కోరుకున్నట్లుగా ఉండలేక, ఇతరులు కోరినట్టు ఉండడం ఇష్టంలేక, రెంటికీ చెందిన రేవడిలాంటి జీవితంతో సంఘర్షణ సాగించాలి."

"మంచి ఉద్యోగం సంపాదించుకొని సంతోషంగా ఉండొచ్చుకదా"

-2-

"అంతటి భాగ్యమా స్వామీ. ఏ ఉద్యోగంలో చూసినా అవినీతి తాండివిస్తోంది. తాను తీసుకుందికి ఇష్టం లేకపోయినా, పైవాడికి లంచం విధిగా ఇప్పించాలి. పైగా, ‘మీరెలా సంపాదిస్తారో మాకు తెలీదు. పక్కవారింట్లో అదుంది ఇదుంది, మనకికూడా ఉండాలి’ అని దారాసుతుల పోరు. దాంతో తప్పనిసరిగా అన్యాయార్జిత జీవనంలో పడి, ఎప్పుడు ఏవిధమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటానో అన్న అశాంతితో రోజువారీ జీవనం గడపాలి"

"పోనీ స్వయం సమృద్హి జీవనం సాగించవచ్చుగా"

"అవన్నీ ఎండమావులు భగవాన్. సమాజంకోసం, చిరుగులు చొక్కా కప్పుకునేందుకు మీద వేసుకునే పాత కోటు బ్రతుకులు. ఆదివారం పండుగరోజు అనికూడా చూడకుండా, ఇటు కుటుంబానికి అటు సమాజజీవనానికి దూరంగా, రోజంతా కష్టపడినా అరకొర సంపాదనే."

"పోనీ రాజకీయనాయకుడిగా జీవనం సాగించు"

"అది మురికికూపం ప్రభూ. ఆ ఊబిలో కూరుకుపోతూ సుడిగుండంలోలాగ తిరుగుతూ ఉండవలసిందే. అందులో ఒకసారి దిగితే వెలుపలికి రాలేం. ధైర్యంచేసి తప్పుకుందామనుకుంటే, ఆపార్టీ రహస్యాలు ఎవరికి చెప్పేస్తామో అని, ఏదో ఒక తప్పుడు కేసు బనాయించి నీ జన్మస్థానంలో పడేస్తారు, లేదా శాల్తీనే గల్లంతు చేసేస్తారు."

"నాజన్మస్థానంలోనే ఆధ్యాత్మిక చింతలతో ప్రపంచంతో పనిలేకుండా ప్రశాంతంగా జీవనం సాగించు"

"అబ్బే అలాంటి ఆశలు ఊహలలో కూడా లాభం లేదు ప్రభూ."

"ఏం ఎందుకని"

"అక్కడ కరడుకట్టిన ఖైదీల్లో ఒకరిద్దరు నాయకుల్లా వ్యవహరిస్తూంటారు. మిగతా ఖైదీలు, జైలు అధికారులు ఆ నాయకులు చెప్పినట్టు నడుచుకోవలసిందే. లేకపోతే, ఎవరితోనూ కలవని శాల్తీని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేస్తారు. జైలు అధికారులు దాన్నిఆత్మహత్యగా నమోదు చేసేస్తారు"

"ఇంతకీ, ఇప్పుడు నీకు ఏమి కావాలి. ఆ మంత్రసాని ఎప్పుడేనా వచ్చేస్తుంది. త్వరపడు."

"నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో స్వామీ"

"నీకు రెండు జన్మలు ఇంకా గడవాలి అని కిందటి జన్మలోనే చెప్పేను కదా"

"ఈ నరజన్మ ఇప్పటితో ముగించేసి, వెంటనే మరో జన్మ ప్రసాదించు భగవాన్. ఆజన్మతో నాకు ముక్తి లభిస్తుంది కదా"

-3-

"అలాటి పక్షంలో, నేను ఆలోచించి నిర్ణయం తీసుకొనేందుకు నాకు సహకరిస్తూ, సూచన చేయి"

"దయచేసి నీ పూజకు పనికొచ్చే ఒక మందారపూవుగా పుట్టించు. నీ పూజకి నోచుకొని, నీ పాదాల పడిన రోజున ఆరోజంతా నీ పాదాల దగ్గరే పడి ఉండి, ఆ రాత్రికి నీలో ఐక్యమైపోయి, మరునాడు నా విగత దేహాన్ని ఎవరో బలవంతంగా వేరు చేసేవరకూ నీ పాదాలని గట్టిగా చుట్టుకొని పడి ఉండే భాగ్యం ప్రసాదించు భగవన్. అలా నీ సేవాభాగ్యం కలిగే అదృష్టాన్ని కలగచేస్తే, దానిద్వారా ముక్తి పొంది నీలో ఐక్యం అవగలనని ఆశ."

"నీ విశ్లేషణాత్మక అభిమతానికి సంతసించి, నీకోరిక నెరవేర్చ తలచుకున్నాను."

"తథాస్తు అనేయక, ఒక నిమిషం ఆగండి ప్రభూ"

"ఇంకా నీవు విన్నవించుకోవలసినదేమైనా ఉన్నదా"

"అవును ప్రభూ. ఈ నా కన్నతల్లికి తెలివి రాగానే, చనిపోయిన నన్ను చూసి గర్భశోకంతో బాధపడుతుంది కదా. ఆమెకి ఆ బాధ పోయే మార్గమేదేనా ఆలోచించి, అప్పుడు నాకోరిక తీర్చండి ప్రభూ. ఎంతేనా నన్ను నవమాసాలు మోసిన మాతృమూర్తి కదా, ఈ విధంగానేనైనా మాతృఋణం కొంత తీర్చుకొనే వెసులుబాటు దయచేసి కల్పించండి స్వామీ"

మందస్మితవదనంతో, మాధవుడు "నేను సకలము తెలిసినవాడినని నమ్ముతావు కదా"

"ఎంతమాట స్వామీ, సర్వము మీకు కాక ఇంకెవ్వరికి తెలుస్తుంది"

"నీవు ఈ భువి మీద కాలిడిక మునుపే నీ మనోభావములు ఎరిగిన నేను, నీ మాతృగర్భంలో నీ కవల సోదరుడిని పెరగనిచ్చేను. కొద్దిసేపట్లో ఆప్రాణి నీ మాతృగర్భంలోంచి ఈవలకు వచ్చి, నీ మరణశోకాన్ని మరచిపోయే అవకాశం నీ మాతృమూర్తికి ప్రసాదిస్తాడులే. ఇంక నీవు అన్ని చింతలు వదలి, నీకోరిక తీర్చుకుందికి సన్నధుడివి కమ్ము."

"మహాప్రసాదం స్వామీ" అని ఆప్రాణి మూసిన కళ్ళు -- మరి తెరవలేదు.

*****

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు