శ్రీకృష్ణుడు గోకులాన్ని, ఆలమందలను, రాధను వదలి మధురకు వెళ్ళిపోయాడు. అక్కడ కువలయాపీడ మర్ధనం, చాణూర ముష్టిక సంహారం, కంసవధ తరువాత దేవకి వసుదేవులను చెర విడిపించి వారితోనే ఉండిపోయాడు. ఇక్కడ గోకులంలో కృష్ణుడు లేనప్పుడు రాధ విరహంతో బాధపడుతోంది. కన్నయ్యకై ఎదురుచూస్తోంది. యమునా ఒడ్డున, పొగడ తరువుల మాటున రాసవిహరి కై వెతుకుతోంది… Scene 01 దర్శనమేదిరా కృష్ణా... ఎదురు చూచెనిట రాధికా... వేయికన్నుల కోటి ఆశల... రావేలరా.... కృష్ణా.... కృష్ణా.... దర్శనమేదిరా కృష్ణా... నీ పెదవులపై చిరునగవైనా నీ కరములలో వేణువునైనా నీచెంత నిలిచే భాగ్యము చిక్కునే నిరతము నిన్నే అంటియుందునే కృష్ణా.... దర్శనమేదిరా..... నీ శిఖిపింఛము పీతాంబరము ఎంతటి పున్నెము చేసెనో... కలికి నైతినే కన్నయ్యా... నిను కొలిచే భాగ్యము దూరమయ్యెరా.... దర్శనమేదిరా కృష్ణా... మోహన మురళీ గానముతో పశువుల తరువుల మోహింతువయా ఒక్కమారు ఇటు తొంగిచూడగా ఆనందమునే పొంగిపోదుగా... కృష్ణా... దర్శనమేదిరా... Scene 02 కృష్ణుడు రాలేదు. రాధ యమునానది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. కృష్ణుడు కనిపించాడు. యమునా తీరం. కృష్ణపక్ష విదియ. చంద్రునికి అందకుండా తారలు సయ్యటలాడుతున్నాయి. సైకత వేదికపై కాసేపు కూర్చుని ఎదురు చూసింది రాధ. పొన్న మాటున వెదికి చూసింది. యమున నల్లని నీళ్లలో కూడి ఉన్నాడేమోనని అనుమానిస్తూ నీటిలోకి చూసింది. వేణురవము వీనుల సోకింది. చప్పున వెనుదిరిగింది. “మాధవా… ఇంతసేపా ఎదురుచూసేది? నీ పిలుపుకై, చూపుకై ఎంత వేచేది?” చెప్పాలనుకున్న మాటలు గొంతుదాటి రావడం లేదు. ఆ సుందర వదనారవిందం చూస్తూ మైమరచిపోతోంది. “రాధా” “ఊఁ” “వచ్చేవరకు రాలేదని ఎదురుచూపు… తీరా వచ్చాక ఏమిటీ మైమరపు..” “మాధవా.. అందరూ నిన్ను కృష్ణా అని, కన్నయ్యా అని పిలుస్తారు కదా… నాకు మాత్రం నిన్ను మా.. ధవా అనే పిలవాలని ఉంటుంది” “నేనిప్పుడు కాదన్నానా రాధా” “మాధవా… ఈ గోకులం అంతా ఏకమై పోనీ… నేను నీకంటే పెద్దదాన్నని, మేనత్త వరుస అని, నీతో ఈ సరసాలేమని, ఈ యమునా విహారాలు, వెన్నెల రాత్రుల సమాలోచనలు, పొన్న నీడలో బువ్వంబంతులు ఏంటని అధిక్షేపించనీ… లెక్కచెయ్యను” “రాధా… నీ మనసులో నేనే నిండి ఉన్నాను. నా మనసంతా నీవే ఉన్నావు. అలాంటప్పుడు ఈ సంకోచాలు, దూరాలు ఇంకా ఎందుకు?” “ఎందుకా మాధవా… నా మనసునిండా నీవే… కానీ నీ మనసే పుష్పకవిమానం. నా ఒక్కరికే సొంతం అనుకుంటేఅది నా వెర్రితనం” “రాధా…” “అవును మాధవా… మొన్నటికి మొన్న దేవదేవుని ఇంటి గోపిక కొంగుపట్టి ఆపావా లేదా?” “ఓహ్… కమలిని… దాహం వేస్తోంది… మజ్జిగ కావాలి, నెత్తిమీద కుండలను రెండు చేతులతోను పట్టుకుంది. మరెలా ఆపి అడగాలి నువ్వే చెప్పు?” అన్నాడు హాస్యంగా కొంటె కృష్ణుడు… రాధ ముంగురులు సవరిస్తూ… “పో, మాయలమారీ, నీ చేతలతో నన్ను మరిపించకు. నిన్నటికి నిన్న నీలాటిరేవులో నీలవేణి నడుము మీటలేదూ…, పక్కనే ఆమె అత్తగారు ఉంటుండగానే…” “ఇది మరీ బావుంది. నీలవేణిని నేనా మొలబంటి నీటిలో దిగమన్నాను… నేనా గండు చేపను ఆమె జఘనభాగాన్ని చుంబించమన్నాను. ఆ సరసం మోటుగా అనిపించిందేమో… నీలవేణి కెవ్వుమనడం, దగ్గరలోనే ఉన్న నేను ఆ మీనాన్ని మందలించి, తీసి నీటిలో వేసాను… అంత మాత్రానికే నీలవేణి మెలికలుతిరిగి మైమరచి పోవడమే” ఈసారి వెన్నదొంగ వేళ్ళు రాధ ఆధారాలను మీటాయి.. అలవోకగా కనురెప్పలు వాల్చి, అంతలోనే తెప్పరిల్లి, “ఓయ్ శకటారి… చాలించు అల్లరి” “నేటి ఉదయం కాటుక కన్నుల కోమలి, పూదోటలో, కాత్యాయని దేవి పూజకు పువ్వులు కోస్తుంటే, నీ చేతి పూబంతితో ఆ ఇంతి మొత్తలను తాకలేదూ” ఉక్రోషంగా నీళ్లు నిండిన కళ్ళతో నిలదీసింది రాధ “ఓ మరుదంతి… నేను పూదోటకు వెళ్ళింది నిజమే, ఆ పొలతిని పూబంతితో పలకరించింది నిజమే…” “నే చెప్పలేదూ” “అలగకే అలివేణి… విషయం వినకుండా తొందర పడడమేనా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవా?” “ఇంకేమిటి జరిగేది? తనువును తాకిన పూబంతి ఊరికే ఉంటుందా… పడతిని నీ సందిట పడనీకుంటుందా?” “ఆగవే విరిబోణి… పూల వనంలోనే కాదు, ప్రకృతిలో ఏ అంశమైనా నాకు రాధ పోలికే కనిపిస్తుంది నమ్ము పూబోణి… అందుకే ఆ బాల, ఈ బేలగా కనిపించి, కనిపించినా పలుకరించలేదని కినిసి, అంతలో నేనే కదిలిస్తే ఏమని తలచి ఆ బంతి విసిరాను. కానీ ఆ బాల బంతి తాడనానికి, నా పిలుపుకు బెంబేలెత్తి, ఒకటే పరుగుతీసేదాకా నాకు తెలియలేదే ప్రేయసి… ఈ మాధవుని కనులకు రాధ తప్ప ఇంకేది గోచరించదు లలనామణి” “మాధవా” “రాధా” గువ్వలా ఒదిగిపోయింది మాధవుని బాహువులలో…. రాధ ముఖకమలాన్ని చుంబించబోయాడు మాధవుడు. చుర్రుమంది రాధ మోవి. మెలకువ వచ్చింది రాధకు… వెన్నెలలో నీటిలో తన ప్రతిబింబం బదులు కృష్ణుని ప్రతిబింబం గోచరించింది. “మాధవా! నా ప్రతిబింబం కూడా నీలాగే అనిపిస్తోందే! నన్ను విడిచి ఎలా వెళ్ళావయ్యా? నీ చేత ఉన్న ఈ మురళిని నాకు కానుకగా ఇచ్చి మధురకు వెళ్లిపోయావు, మాసమయ్యిందే… గుర్తుకు రాలేదా నేను? నీ జ్ఞాపకాలతో, మధురోహలతో మైమరవాల్సిందేనా?” “ఏమే మురళీ ఏం మత్తు చల్లావే నా మాధవునికి? నిన్ను అనుక్షణము చేతిలో ధరించే ఉంటాడు. ఎంత పుణ్యం చేసావే, అందుకే నిన్ను తన చేతినుండి వేరు చేసాను. నా దగ్గర ఉంచుకున్నాను” తనచేతిలోని వేణువును చూస్తూ అక్కసుగా పలికింది రాధ. కిలకిలా నవ్వింది మోహన వేణువు. “ఎంత అమాయకురాలవు రాధా! ఒక్కసారి నాలోకి చూడు” “చూసా… ఏముంది… పైన రంధ్రాలు… లోపల బోలు…” “అదేమరి. నాదంటూ ఏదీ లేదు రాధా… సర్వం శ్రీకృష్ణార్పణం… అందుకే నన్ను శ్రీకృష్ణుడు సదా ధరిస్తాడు” “మరి నేను… తనకు నా ప్రేమను పూర్తిగా పంచాను కదా..” అమాయకంగా ప్రశ్నించింది రాధ. “నువ్వు కృష్ణుడు నీకు మాత్రమే సొంతం కావాలనుకున్నావు. మాధవా అనే నీ పిలుపులోనే అందరికి ప్రియమైనవాడు అనే భావన మర్చిపోతున్నావు. నీ మాధవుడు అందరివాడు. ప్రేమించిన అందరిని అక్కున చేర్చుకునేవాడు. అందరిచేత ప్రేమించబడేవాడు. అందరికి ప్రేమను పంచేవాడు. ఏ కోశానా ఎవ్వరిమీదా రాగద్వేషాలు లేనివాడు. నీవే అంతా అని అర్పిస్తే నీవాడై నిన్ను లాలిస్తాడు” తత్వోపదేశం చేసింది మురళి నీటిలో కనబడే మాధవుని ప్రతిరుపాన్నే చూస్తూ మైమరచింది రాధ. మాధవుని కన్నుల్లో రాధ చిత్రం రాధకు అగుపడి చిరునవ్వులు చిందించింది. మోహనమురళి ఆలాపన వినిపించింది. రాధామాధవుడు వేణుధరుడై వెన్నెలలు కురిపించాడు… యమున పులకించింది. నీ వేణువు మోహనమాలపిస్తే నా వీణ కళ్యాణి పలుకుతుంది నీ పెదవి భూపాలమాలపిస్తే నాపేరు ఉదయించే తూరుపవుతుంది నీ చూపుల హిందోళానికి నా తనువు చిగురాకుల అనుపల్లవి అవుతుంది నీ రాక కళ్యాణి రాగమైతే నా ఎద నీ స్వరార్చన వేదిక అవుతుంది నేనుగ మారినదే నీకోసం రాగ విపంచినై వేచిఉన్నా.. అనురాగాల రాగాన్ని మీటే విరంచివై రా ప్రియతమా.. నీదైపోయిన నా ప్రాణ తీవెలపై మలయమారుతాన్ని పలికించు ఆనందభైరవి నాలపించు ఉదయరవిచంద్రికలను కురిపించు... కురిపిస్తావు కదూ.. ఆనంద డోలికనూగిస్తావు కదూ.. ఎదురు చూస్తున్న విరహిణికి వరాల మేఘ మల్హరి ఆలాపన వినిపిస్తావు కదూ... రసఝరిలో ఓలలాడిస్తావు కదూ... Scene 03 (తెరవెనుక వేణునాదం వినిపిస్తుంది. ఆశగా రాధ చేతిలో పూల సజ్జతో నలుదిక్కుల వెతుకుతోంది) ఎక్కడిదో వేణుగానం ఇక్కడ మది తాకింది గాలి అలలపై తేలివచ్చి పూలబాలలను చేరింది పూజచేయ బోవగా పూవులేర నేపోవ వేలికొసలను తాకింది గుండెఝల్లుమని పొంగింది కృష్ణా... కన్నియ మనసూగింది తేనెలూరు పెదవులపైన లేత వెదురు నైనా కానీ పుట్టి ఉంటె నాదు బ్రతుకు నీ మ్రోలనె నిలిచేది... కృష్ణా... నీ చేతిలో పాడేది... బృందావని గడపల దాటి.. యమున అలల నీది వచ్చి.. ఇసుక తిన్నెల వాలు జారి... నా మదిలో చేరిందీ... కృష్ణా... ఎద లోతుల దాగింది... ఎక్కడిదో వేణుగానం... ఇంత మాయ చేసింది... కృష్ణా... ఇంతి మనసు దోచింది... Scene 04 (కృష్ణుడు వస్తాడు. తాను కృష్ణుని కై ఎంత ఎదురు చూస్తున్నదో వివరిస్తోంది రాధ) మధురమైన గొంతులోన మాట పాటగా మారే విన్న గుండె చప్పుడేమో వేణు నాదమై పోయే... మధురమైన గొంతులోన మాట పాట గా మారే... కృష్ణా.... నీవు నడచు దారులన్ని నాకు రాజమార్గమే... నీవు పిలచు పిలుపులన్ని నాకు తేనె మధురమే... నీవుగాక ఎవరు నాకు... నీకు గాక ఎవరికిత్తు... కృష్ణా... మధురమైన గొంతులోన మాట పాటగా మారే.... నీ ఉనికే బృందావని నీ తలపే యమునా నది నీ చూపే చల్లని పున్నమిహాయి నీ ఊహే మై మరపించునోయి... కృష్ణా... మధురమైన గొంతులోన మాట పాటగా మారే.... వేణువూదు పెదవుల తరి వేలికొసల మృదు రస ఝరి నా మనికే మాధవు మది.. మరి.. రావేమని వేచెను ఈ పూమంజరి... రావేమని... వేచెను ... ఈ పూమంజరి.... 😔 Scene 05 కృష్ణుని మురళీ రవానికి రాధ మైమరచి ఆడుతోంది *మానస చోర మురళీ ధర* ఆలపించరా మురళీ యమునాతీరాన ... వెన్నెల రేయిన... ఆలమందలు కాలసర్పములు మైమరచేవిధమున పొన్నలు పొగడలు మురిసి విరిసే విధమున వెన్న దొంగవు... కన్నెల వన్నెల దొంగవు... కోకలు దాచి... కోరికలు మాపి... కొలువై ఉన్నావు... ఎదకోవెలలో... శారద రాత్రుల... యమున తిన్నెలా... పూపొద మాటున.. వెదురువనమునా... నిలిచి... పిలిచీ... వలచి.. చూచి.. అలసిన కన్నెల వెతుకులాటలు... మోముల మెరసిన చిరు ముత్తెపు చెమటలు... తీరేలా... ఆరేలా.. మానస చోర... మురళీధర... పీతాంబరధర... శిఖిపించధర... ఆలపించరా మురళీ.... Scene 06 రాధామాధవుల ప్రణయం రసజగత్తులో మునిగింది… యమున తటిని చేర యాముకుంకె నపుడు* రాధ చేరవచ్చె మాధవుణ్ణి* మురళి పాటకేమొ మోగెను మువ్వలు* రాధ కృష్ణ లీల రమ్యహేల* మురళి గానమింక మోదమలర సాగ* పాట విన్న యమున పరవశించె రాధ యందె రవళి నాద స్వరము కాగ* పడగలెత్తి యాడె పన్నగములు* చెరకు విలుతుడొచ్చె చేత పొగడ పట్టి* మలయపవనమేమొ మరులు రేపె* ఆడిపాడి రాధ అలసిపోయెనపుడు* ఇసుక తిన్నె చేరె నింపుమీర* అల్లన మగువను చేరియు* మెల్లగ నిచ్చకములాడి మేలుగ కేలన్* చల్లగ నిమరగ పడతికి* నుల్లము ఝల్లుమన కన్నులొకపరి మూసెన్* సిగ్గు మోము దాచ శిరము వాల్చి సుదతి* చీరకొంగు చివర చేతపట్టె* చెక్కిలెరుపు జూచి చెలుడు చుబుకమెత్తి* కలువ కనుల మీద కమ్మ వ్రాసె* మోహభారమింక మోయలేని యువిద* సోయగాడి సేత సోలిపోయె* చెలియ నడుము పట్టి చేత చెక్కిలి మీటి* యదురు చున్న బింబ మధువు గ్రోలె* మోహమిపుడు నిండె మోహనాంగి కిలను* కృష్ణుడేమొ పట్టె కృష్ణ. ప్రియను* రాసలీల సాగ రాధ, మాధవులలో* మధుర రాగ భావ సుధలు చిలికె* ముద్దు కడ్డువచ్చె ముక్కెరనుచు తీసె* సొమ్ములెంత బరువు సొగసుదాన* నగలు వొలిచి పెడుతు నంద కిశోరుడు* అందె సడిని సేయుననుచు తీసె* తాపమోపలేని తరుణి తా సిగ్గిల్లె* వెన్న దొంగ తాను వెన్ను నిమిరె* ఆలసింపకింక హత్తుకొనె విభుడు* గోపకాంత మేను కోమలించె* రమ్య శారద నిశి రాజీవనేత్రుడు* రాధ కేలపట్ట రాగమొప్పె* ప్రణయ జగతి నేలె పారవశ్యమునను* ప్రాప్య శ్రమల చేత ప్రాయమలరె* రాధే మాధవుడై, మాధవుడే రాధా హృదయమై రసజగమేలే ప్రణయంలో…ఒకరికి ఒకరు… తనువులు రెండైనా ఒకే ఆత్మ, ఒకే ప్రాణం గా కలకాలం నిలిచి ఉండే ప్రేమికులు… వేరైన దేహాలలో ఒకే ప్రాణమైన స్వాప్నికులు…ప్రేమకు మరో రూపాలు ఈ రాధాకృష్ణులు *