దొందూ దొందే - మద్దూరి నరసింహమూర్తి

Dondoo donde

సీతామహాలక్ష్మీ రామారావు ఒకరికోసం ఒకరు పుట్టేరని, పెద్దైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని వారి తల్లితండ్రులు నిశ్చయించేరు.

కానీ, వయసు మీద పడుతున్న కొద్దీ –

"నేను సీతను పెళ్లిచేసుకోను" అని రామారావు

"నేను రామూని పెళ్లిచేసుకోను" అని సీతామహాలక్ష్మీ

---భీష్మించుకొని కూర్చున్నారు. ఎంత అడిగినా కారణం చెప్పరు.

ఇద్దరూ -- "నాకు ఇష్టం లేదు, బలవంతం చేయకండి. ఎక్కువగా బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను కానీ ఈ పెళ్లి చేసుకోను" – అని ఒకటే మాటమీద నిలబడి ఉన్నారు.

"ఎడ్డెమ్ అంటే తెడ్డెమ్ అన్న వారిని మెడలు వంచి పెళ్లి చేస్తే మాత్రం వాళ్ళేమి సుఖంగా ఉంటారు" అని ఇరుపక్షాల పెద్దవారు వారిద్దరి పెళ్లికి తాత్కాలికంగా తెర వేసేరు.

పెళ్ళైతే వాయిదా వేసేరు కానీ, ఇటు సీత ఇంట్లో కానీ అటు రామూ ఇంట్లో కానీ వీళ్ళిద్దరూ పెళ్లి ఎందుకు కాదన్నారో కారణం తెలిసిరాలేదు.

అందుకే, సీతని వేరుగా తీసుకొనివెళ్ళి వాళ్ళ అమ్మ –

“రాముని కాదనడానికి నీకు ఏదో కారణం ఉండాలి కదా. అదేమిటో నా ఒక్కర్తికీ చెప్పవే మా అమ్మ కదూ" అని బుజ్జగించి అడిగితే – సీత వాళ్ళ అమ్మ చెవిలో కారణం చెప్పింది.

"ఓస్ ఇంతేనా, రామూ అంటే ఇష్టం లేదని కాదు కదా"

"రామూ అంటే నాకు ప్రాణం. కానీ నేను అతన్ని నా సమస్యతో అల్లర పెట్టలేను కదా, అందుకే అతనితో పెళ్లి వద్దన్నది"

"నీ సమస్యకి రామూకి ఎటువంటి అభ్యంతరం లేదంటే, అతన్ని పెళ్లి చేసుకుంటావా"

"ఎగిరి గెంతి చేసుకుంటానమ్మా. కానీ, అతనితో ఈ సమస్య గురించి మాట్లాడడానికి నాకు సిగ్గుగా ఉంది. అందుకే రామూని వదులుకుందికే సిద్ధపడ్డాను"

“చిన్నప్పటి నుంచి తెలిసినవాడు దగ్గర సిగ్గు పడి నీ సమస్యని దాచి, ఎవరో ముక్కూ మొహం తెలీనివాడిని చేసుకుంటే, నీ సమస్య తెలిసిన తరువాత వాడు నీతో కాపరం చేయనంటే ఏం చేయగలం"

"మరైతే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావమ్మా"

"నువ్వు ఇప్పుడు ఏమీ చేయక్కరలేదు. నీ సమస్య నాకు చెప్పేవు కదా, నేను ఏదో అలోచించి నీకు రామూతోనే పెళ్లి జరిగేటట్టు చూస్తాను. ఈ సంగతి మరెవరితో చెప్పకు"

-2-

అక్కడ రామూ అతని అమ్మగారి మధ్య ఇదే మాదిరి సంభాషణ జరిగింది.

సీతా రాముల తల్లులు ఇద్దరే ప్రత్యేకంగా మాట్లాడుకున్న తరువాత సీతా రాముల పెళ్లి నాలుగు నెలల తరువాత ఘనంగా జరిగిపోయింది.

కానీ, సీతా రాములిద్దరూ శోభనంకి విముఖతగానే ఉన్నారు. మళ్ళా వారిద్దరి తల్లులు నడుం బిగించి ఇద్దరికీ బోధపరిచి శోభనం గదిలోకి నెట్టేరు.

శోభనం గదిలోకి చేరుకున్న సీతా రాములు ముందునుంచి ఉన్న పరిచయంతో పాలు పళ్ళు పంచుకొని కొంత సేపు మౌనంగా ఉన్నారు.

సీత "రామూ, సారీ ఏమండీ మీరు " అనగానే --

రాము నవ్వుతూ "ఫరవాలేదు, నువ్వు నన్ను ‘రామూ నువ్వూ’ అనే పిలూ. ‘ఏమండీ’ అంటే నా పక్కన ఎవరో కొత్త అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది"

ప్రతినవ్వుతో సీత "మరేంలేదు రామూ. నేను తప్పకుండా నీకాళ్లు పట్టాలట ఈరోజు, మా అమ్మ చెప్పింది. అందుకే, నేను నీకాళ్ళు పడుతుంటాను, నిద్రవస్తే నువ్వు పడుకో. తరువాత నేను పడుకుంటానులే"

"ఛీ అదేం పని. నాకవేవీ ఇష్టం లేదు. రేప్పొద్దున్న మీఅమ్మ అడిగితే ఫట్టేనని చెప్పేయి. నన్ను అడిగితే 'అవును చాలా బాగా పట్టింది' అని చెప్తానులే. నాకు లేటుగా పడుకోవడం అలవాటే. పెళ్ళిలో అలసిపోయి ఉంటావు. నువ్వు పడుకో. నేను ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటానులే"

'నువ్వు ముందు పడుకో నువ్వు ముందు' అంటూ ఇద్దరూ సుతి మెత్తగా వాదులాడుకొని ఎవరికీ వారే నిద్ర ఆపుకోలేక ఒకటి రెండు నిమిషాల తేడాలో నిద్రాదేవతకి దాసులయేరు.

సీతా రాముల సరస సంభాషణలతో చేష్టలతో పరవశించి తుళ్ళి పడవలసిన శోభనంగది -- ఐదు నిమిషాలలో వారిద్దరూ పెడుతున్న మహా గురకతో దద్దరిల్లసాగింది.

వారి సమస్య తెలిసిన వాళ్ళ తల్లులు -- ఈ పరిస్థితి ఊహించి శోభనం గదికి దగ్గరగా ఎవరూ ఉండకుండా జాగ్రత్తపడ్డారు.

*****

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు