ఆదివారం. ఉదయం పదకొండు గంటలు. బెల్లు మోగింది. టి. వి. లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న రఘురామ్ విసుగ్గా సోఫాలోంచి లేవకుండా "పద్మినీ!చూడు!"అన్నాడు. పద్మిని లోపల ఎక్కడో ఉంది కాబోలు తలుపు తీయటానికి రాలేదు. క్రికెట్ మ్యాచ్ మధ్యలో బ్రహ్మరుద్రాదులు వచ్చినా కదలడు రఘురామ్. అసలే వరల్డ్ మ్యాచ్ అది.పైగా ఇండియా ఆడుతోంది మరి! బెల్లు మళ్ళీ మోగింది. విసుక్కుంటూ తలుపు తీశాడు. కొరియర్ బాయ్. "రఘురామ్ సర్!"అంటూ కవర్ అందించాడు. ఒకవైపు మ్యాచ్ చూస్తూనే సంతకం పెట్టి కవర్ తీసికొని సోఫాలో పడేసి మళ్ళీ మ్యాచ్ లో మునిగిపోయాడు. పద్మిని కథలు, కవితలు వ్రాస్తూ ఉంటుంది. కొన్ని అప్పుడప్పుడూ తిరిగిస్తాయి. లేదా పుస్తకాలేవో వస్తుంటాయి. రఘురామ్ కు సెల్ ఫోన్ లో చాట్స్ తప్ప పోస్ట్ లో వచ్చే ఉత్తరాలు కానీ, పార్శిళ్ళు కానీ ఉండవు.'పద్మినికి సంబంధించిందే 'అని కవర్ మీద పేరు కూడా చూడలేదు రఘురామ్. కాసేపటికి పద్మిని హాల్లోకి వచ్చింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. మధ్యాహ్నం అయింది. ఏదో భోజనం అయిందనిపించాడు. మళ్ళీ మ్యాచ్. ఈసారి ఇంకా టెన్షన్. ఆఖరికి మ్యాచ్ లో ఇండియా గెలిచింది. ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వరల్డ్ కప్పులో మన దేశానికి ఎన్ని పాయింట్లు, ఏ ఏ దేశం వాళ్ళు ఎన్నెన్ని పాయింట్లతో ఉన్నారు ఇలా కాసేపు చర్చించాడు. రాత్రి భోజనం కూడా అయ్యింది. మరో ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యబోతుంటే పద్మిని వచ్చి "మధ్యాహ్నం కొరియర్ లో ఏదో కవర్ వచ్చింది.చూడలేదా?"అంది. "నాకా? నాకేం వస్తుంది?నీకే అయ్యుంటుంది."అన్నాడు రఘురామ్ ఒకింత విస్మయంగా. "నాక్కాదు!" అంటూ కవర్ చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి పడుకొంది పద్మిని. మ్యాచ్ గొడవలో సరిగ్గా చూడలేదు. కవర్ మీద తన పేరే ఉంది. వెనుక ఫ్రమ్ అడ్రెస్స్ లేదు.'ఎవరు వ్రాసి ఉంటారబ్బా!'అనుకుంటూ హాల్లో సోఫాలో కూర్చుని కవర్ తెరిచాడు. "ప్రియమైన రఘూ!....." ముత్యాలాంటి అక్షరాలు. మూడు పేజీల ఉత్తరం. గబగబా చివర చూశాడు. "ప్రేమతో నీ...."అని మాత్రం ఉంది అంతే. పేరు లేదు. ఇంకా ఆసక్తి కలిగిందతడికి. గబగబా చదవటం మొదలు పెట్టాడు. "ప్రియమైన రఘూ! నువ్వు మర్చిపోయిన నీ స్నేహితురాలిని. గుర్తుపట్టావా? లేదు కదూ!చాలా ఏళ్ల క్రితం నువ్వు, నేను చెట్ల నీడలో నడుస్తున్నాం!అప్పుడు నేనొక పాట పాడాను. నువ్వొక కథ చెప్పావు!గుర్తుందా!సరిగ్గా ఈ రోజే. ఇప్పటికైనా గుర్తుకు రావాలే!....మనం మొదటిసారి చూసుకున్న రోజును సెలబ్రేట్ చేసుకునే వాళ్లం కదా!పాటలు పాడుకునే వాళ్ళం!మన మధ్య బోలెడు కబుర్లు.... అబ్బో నువ్వు అప్పుడెలా ఉండే వాడివి?.... నీ మాటలు వింటూ నేను ప్రపంచాన్ని గెలిచినట్లు గర్వంగా ఫీలయ్యేదాన్ని.. అసలు మన చుట్టూ ప్రపంచం ఒకటి ఉందని అనుకున్నమా? .. అప్పుడు చలికాలంలో కూడా 'అరుణ్ ఐస్ క్రీమ్స్ 'లో ఐస్ క్రీమ్ తినే వాళ్ళం కదూ!..ఒకటే కబుర్లు. చివరికి ఆ షాప్ వాడు కొరకొరా చూస్తుంటే బయటికి వచ్చే వాళ్ళం కదూ!.. మన ఆఫీసులు వేరైనా సాయంత్రం అయ్యే సరికి ఇద్దరం చేరి ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం కదూ!.. ఏమిటి? ఎన్ని సార్లు 'కదూ! 'అంటూ నిన్ను కమిట్ చేయిస్తున్నాను అనుకుంటున్నావా? నేనొక సారి ఆలివ్ గ్రీన్ చీర కట్టుకున్నాను. ఆ రోజు నీ కళ్ళల్లో మెరుపు ఇన్నేళ్లయ్యాక కూడా నా హృదయంలో వెలుగుతోంది... ఆ చీర ఇంకా నా దగ్గర ఉంది తెలుసా!.. ఇంకా తర్వాత నాకు జాజిపూలు ఇష్టమని టాంక్ బండ్ దగ్గర ముసలమ్మ దగ్గర మొత్తం బుట్ట కొన్న కొన్నావు.. మర్చిపోయుంటావులే.. మన ఇద్దరి మధ్య ఎన్ని జ్ఞాపకాలు.. ఎన్ని మధుర స్మృతులు.. నేను నిన్ను తల్చుకోని క్షణం ఉండదేమో! రఘూ!నువ్వు నన్ను నా జ్ఞాపకాలలో వదిలేసి నిర్దయగా ఎలా ఉంటావు?.. నేను నీ గురించే ఆలోచిస్తూ వుంటుంటే నువ్వు మాత్రం నా ఊసెత్తటం లేదు. అవును!నీకు నీ బాధ్యతలు, ఉద్యోగంలో టెన్షన్లు, గోల్స్, అచీవుమెంట్లు... గొప్పవాడు అయిపోయాడు నా రఘు!కదూ!... చూశావా!ఈ ఉత్తరం చివర నేను వ్రాసిన "కదూ "లన్నీ లెక్కపెట్టు! నీతో మాట్లాడాలని ఉంది!ఎలా కుదురుతుంది? మళ్ళీ మనం ఒకరికొకరం కొత్తగా పరిచయమవుదామా!నీకు కుదురుతుందా? మళ్ళీ ఒకసారి అరుణ్ ఐస్ క్రీమ్స్ కు వస్తావా? లేకపోతే ట్యాంక్ బండ్.. అదీ కాకపోతే పెద్దమ్మ గుడి.... ఛాయస్ నీది కాదు. నాదే!రేపు సాయంత్రం సరిగ్గా ఐదింటికి పెద్దమ్మ గుడి దగ్గరికి వస్తావా? ఎన్నేళ్ల క్రిందటి నా ప్రేమికుడిని చూద్దామని ఉంది... అయినా నా పిచ్చికానీ!నువ్వు అప్పటిలా ఉంటావని అనుకోవటం నా తెలివితక్కువతనం అవుంతుంది కదూ!... అసలు నిన్ను రమ్మంటున్నాను. కానీ నేను రాలేనేమో!.. నాకు మాత్రం కుదురుతుందా? నన్ను మర్చిపోయినవాడి వెంట పడటానికి నాకేం అభిమానం లేదా? నీ ముందు అవన్నీ ఎందుకు?.. నీతో మాట్లాడాలని ఉంది." ప్రేమతో నీ. ఉత్తరం మడిచి కవర్లో పెట్టాడు. హృదయం అంతా భారంగా అనిపించింది రఘురాముకు. ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశాడు. "రేపు మాట్లాడుకుందాం!"అన్నాడు. గదిలోకి వచ్చాడు. పద్మిని పక్కకు తిరిగి పడుకొని నిద్రపోతోంది. గిల్టీగా ఉంది రఘురాముకు. బాత్రూంలోకి వచ్చాడు. అద్దంలో చూసుకుంటే చెంపల దగ్గర తెల్లవెంట్రుకలు. తలమీద అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు. బాల్కనీలోకి వచ్చాడు. కుండీలో నైట్ క్వీన్ పరిమళం వెదజల్లుతోంది. ఆకాశంలో చందమామ కనిపించాడు. మనసంతా బెంగగా అనిపించింది. వెనక్కు గదిలోకి వచ్చాడు. పద్మినికి నిద్రాభంగం కలిగించకుండా దుప్పటి మీదకు లాక్కొని పడుకున్నాడు.నిద్ర పట్టలేదు. ఏవేవో జ్ఞాపకాలు.అతడిలో అలజడి రేపుతున్నాయి. ఆలోచిస్తూ నిద్రపోయాడు. ** ** ** ** ** ** ** రెండోరోజు సోమవారం. తెల్లవారి లేటుగా లేచాడు.టైమ్ ఎనిమిదిన్నర. వంటిట్లో చప్పుడు లేదు.చూస్తే పద్మిని లేదు.బయటకు వెళ్ళింది కాబోలు. టిఫిన్, భోజనం చేసిపెట్టి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద కంచంలో చీటీ ఉంది. "గోధుమ రవ్వ ఉప్మా. విసుక్కోవద్దు!సులోచన చేత ఇస్త్రీ బట్టలు లాండ్రీ వాడికి ఇవ్వాలి.సోఫాలో మూట కట్టి పెట్టాను.లాండ్రీ వాడికి ఇస్తుంది. పదిరోజుల నుండి వాడు వూళ్ళో లేడు. బట్టలు పేరుకుపోయాయి.మొక్కలకు నీళ్లు పోయటం మర్చిపోవద్దు!" టిఫిన్ తిన్నాడు. ఈ రోజు ఇండియా మ్యాచ్ లేదు. ఆఫీసుకు బయల్దేరాడు. పని చెయ్యాలని లేదు. ఒక్కోగంట భారంగా గడుస్తోంది. మధ్యాహ్నం మూడున్నర. స్టెనోని పిల్చి చెయ్యాల్సిన పనులు చెప్పి బయటకు వచ్చాడు. కారు తీసికొని పెద్దమ్మ గుడివైపు వచ్చాడు. మధ్యలో పూలకొట్టు కనిపిస్తే ఆగి జాజిపూలు కొన్నాడు. టైమ్ చూశాడు. ట్రాఫిక్ లో పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి ఐదు దాటింది. కంగారుగా ఉంది రఘురాముకు. అటూ ఇటూ చూశాడు. "థాంక్ గాడ్!"ఆలివ్ కలర్ చీర కనిపించింది. ఆమె. ఆమే.. గబగబా ఆమెను సమీపించాడు. ఆమె చూసింది. అతడినే చూస్తూ ఉంది. "సారీ!... సారీ!..." అతడు తడబడుతున్నాడు. ఆమె మాట్లాడలేదు. "నాకు తెలుసు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. క్షమిస్తావా!.." అయినా ఆమె మాట్లాడలేదు. "నేను అంతా మర్చిపోయావనుకుంటున్నావు కదూ! నేను ఎలా మర్చిపోతాను? అయినా... అప్పుడప్పుడూ కొంచెం బిజీ అంతే!.... నేను నీ రఘుని!.. అసలు నిన్ను మర్చిపోవటమేమిటి?..... . నేను ప్రామిస్ చేస్తున్నాను.ఈ ప్రపంచంలో నీ కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు!నమ్ముతావా!నేను మారలేదని చెప్పను!మారిపోయాను.కానీ!... నేను అప్పటి రఘునే!నాకు సర్వస్వం నువ్వే!చూడు!నువ్వు చెప్పినట్లు వచ్చాను చూశావా!" అతడు చిన్న పిల్లవాడిగా ప్రాధేయపడుతున్నాడు. ఆమె ముఖంలోకి ప్రసన్నత వచ్చింది. "అది చాలు!"అనుకున్నాడతడు. ఆమె అతడి ముఖంలోకి చూస్తూ ఉంది. అతడిలో నిజాయితీ కనిపిస్తోంది. ఆమె అతడి చేయి పట్టుకొంది. ఆ స్పర్శలోని ఆత్మీయతకు అతడు కదిలిపోయాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కారు దగ్గరికి వచ్చారు. అతడి ప్రక్కన కూర్చుంది. అప్పుడు ఆమె అడిగింది. "సులోచన ఇస్త్రీ వాడికి బట్టలు తీసికెళ్ళిఇచ్చిందా?" అని. "పంపించాను!ఇచ్చింది!ఈ రోజు నుండి చూడు!నేను బుద్ధిమంతుడనైన నీ రఘుని మాత్రమే!సెల్లు ఫోన్, చాట్స్, ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్స్, షేర్లు ఆఖరికి ఆ దిక్కుమాలిన క్రికెట్టు అన్నీ వదిలేస్తాను. కొద్దిగానే క్రికెట్ లో బెట్టింగ్ పెట్టాను. ఇంకెప్పుడూ పెట్టను!ప్లీజ్!నన్ను నమ్ము!పద్మినీ!నీతో టైమ్ స్పెండ్ చేస్తాను!పక్కా! రాత్రి నువ్వు త్వరగా నిద్రపోయావు!....నేను మెకానికల్ గా అయ్యననుకుంటున్నావు కదా!సారీ!ఆఫీసుకు సెలవు పెడతాను. ఎటైనా ప్లాన్ చెయ్యి!కాస్త రిఫ్రెష్ అయ్యి వద్దాము!..."అతడు ఇంకా చెప్పబోతుంటే ఆమె ఆపమన్నట్లు చెయ్యి అడ్డం పెట్టింది. అతడు జాజిపూల పొట్లం ఆమె చేతిలో పెట్టాడు. ఆమె అలక తగ్గిందా లేదా అన్నట్లు చూశాడు. కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు. "కోపం లేదు కదా నా మీద!" లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది రఘురామ్ ధర్మపత్ని పద్మిని. అతడు ఒక చేత్తో భార్య భుజం మీద చెయ్యి వేశాడు. కారు కదిలింది. అప్పుడప్పుడూ అంతే!భార్యలు అలిగితే భర్తలు బ్రతిమిలాడుకుంటూ ఉంటారు. కొద్దిరోజులు బుద్ధిమంతుల్లా ఉంటారు. తర్వాత అంతా మామూలే! ** ** ** ** ** ** ** సమాప్తం.