ఓ రైతు వద్ద పెద్ద నెమలి వుండేది. అది రోజూ నాట్యం చేసేది. దాన్ని చూసి మనుషులు, జంతువులు ఆనందించేవారు. చుట్టుపక్కల వాళ్లు నెమలి నాట్యం చూసి మెచ్చుకునేవారు.
ప్రతి రోజూ దీన్ని చూస్తున్న ఈగకు ఈర్ష్య పుట్టింది. ‘‘ దాని కన్నా నేను నాట్యం బాగాచేస్తాను..అందరూ నెమలినే పొగుడుతున్నారు. నన్ను గమనించి మెచ్చుకోలేదు..’’ అని లోలోన బాధపడసాగింది.
నెమలి వద్దకు వెళ్లి ఈగ ‘‘ నీ కన్నా నేను నాట్యం బాగా చేస్తాను.. కాని నా ప్రతిభను ఎవరూ గుర్తించలేదు..చూసుకో కొద్ది రోజుల్లో నిన్ను మించి పోతాను..!’’ అని హెచ్చరించింది.
ఈగ మాటలకు నెమలి నవ్వి ‘‘ నాట్యంలో నేనే గొప్ప..నా కన్నా ఎవరూ సాటి రారు.. నీ వద్ద ప్రతిభ వుందని ప్రదర్శించి అవమానం కొని తెచ్చుకోకు..!’’ అంది నెమలి.
ఆ మాటలతో ఈగకు ఇంకా అసూయ పెరిగింది. నెమలి పరాభవం చవి చూడాలి అనుకుంది.
వెంటనే తను కూడా నెమలి వేషం వేసుకుంది. రైతు వద్దకువెళ్లి నెమలిలా నాట్యం చేసింది. అయితే వింతగా వున్న దాని నాట్యాన్ని ప్రజలు చూశారు. ‘‘ఇది నెమలి నాట్యంలా లేదే..’’ సందేహంతో ఆలోచిస్తూ వెళుతున్న మనుషుల్ని చూసి ఈగ అసహ్యించుకుంది.
ఈ సారి నెమలి నాట్యంని క్షుణ్ణంగా పరిశీలించి అభినయించింది. మరుసటి రోజు నుంచి అచ్చం నెమలిలా నాట్యం ప్రదర్శించ సాగింది ఈగ.
దాని నాట్యం చూసేందుకు మనుషులు తరలి రాసాగారు. ఇప్పుడు ఈగ ‘‘ చూశావా.. నీ కన్నా ఏను నాట్యం బాగా చెయ్యగలను..మనుషులే గమనిస్తున్నారు కదా..! నువ్వు గుర్తిస్తావా లేదా? ’’ నెమలిని నిలదీసింది ఈగ.
నెమలి నోరు తెరిచి ‘‘ చూడు నాట్యంలో నాకు మించి వారు లేరు..నా వేషంలో నా ప్రదర్శనను అభినయిస్తూ చూపే నీ ప్రతిభ పెద్ద గొప్పేం కాదు..నీ సొంతంగా నాట్యం చెయ్యి.. అప్పుడు ఎవరు గొప్పో చూద్దాం.. తెలుస్తుంది..’’ అంది నెమలి.
ఈగకు మరింత కోపం పెరిగింది. నెమలి నాట్యం ఆడుతున్నప్పుడు ఈగకూడా నాట్యం ఆడిgది. నెమలి ఆనందంతో రెక్కలు పురి విప్పి నాట్యం చేసింది. ఈగ దానిని అభినయిస్తూ తన రెక్కలు విప్పడానికి ప్రయత్నించింది. రెక్కలు తెరుచుకోలేదు. పైన కప్పుకున్న నెమలి ఆకారపు విగ్గు జారి కింద పడిరది. అయినా నెమలిలా నాట్యం చేసేందుకు గాల్లోకి పైకి ఎగిరి కింద పడి నడుం విరిగింది. అది చూస్తున్న మనుషులు నెమలి నాట్యాన్ని మెచ్చుకుని ‘ నాట్య మయూరి’ అని కరతాళ ధ్వనులు చేశారు. నెమలి ఎంతో ఆనందించింది. తనను అనుకరించి ఈగ పరాభవం చూపాలని నాట్యం ప్రదర్శించి ప్రమాదం కొని తెచ్చుకున్నందుకు లోలోన నవ్వుకుంది నాట్య మయూరి.