గీతాంజలి.. - విద్యాధర్ మునిపల్లె

Geetanjali

తన ఇంటిని ఒక్కసారి తనివితీరా చూసు కుంది. గోడకి తగిలించిన ఫోటోలను, ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది.. తను తన పుట్టింటినుంచి అపురూపంగా తెచ్చుకున్న తను సేకరించిన స్టాంపు కలెక్షన్ పుస్తకాన్ని తనివి తీరా చూసుకుంది. ఈ డెబ్బై సంవత్సరాల వయసులో తనెంతో అపురూపంగా చూసుకున్నవేవీ కూడా తను వెళ్ళిపోతున్నప్పుడెందుకో అక్కర లేదనిపిస్తుంది. తను చిన్నతనంలో మారాం చేసి మరీ సాధించుకున్న వస్తువులన్నీ కూడా ఇప్పుడు.. ఈ క్షణంలో ఆమెకెందుకో బరువుగా అనిపిస్తున్నాయి. తన జీవితం మొత్తం తన కళ్ళముందు కదలాడుతోంది..
పదిహేనేళ్ళ ప్రాయంలో తనవారు తనకి పెళ్ళి చేస్తున్నారంటే అదేదో వింతగానూ, కొత్తగానూ, తెలియని భయం, ఆనందం, పెద్దదాన్నయ్యాననే ఒకరకమైన వింత భావన అన్నీ కలగలిసి ఆమె ఒప్పుకుంది. అప్పటి వరకూ క్లాసులో ఫస్టు మార్కులతో వచ్చిన గీతాంజలి పెళ్ళి చేసుకుంటుంటే తోటి స్నేహి తురాళ్ళు అప్పుడే నీకు పెళ్ళేంటే అంటే పెద్దగా పట్టించుకోలేదు.
‘‘ కాబోయే వాడు లెక్చరర్. పెళ్ళయ్యాక నన్ను చదివిస్తాడు.. ఏం కావాలంటే అవన్నీ నాముందుకు తీసుకొస్తాడు. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్ళయ్యాకైనా పెళ్ళి చేసుకోవాలి కదా.. అదేదో ముందే చేసుకుంటున్నాను’’ అంటూ తన స్నేహితురాళ్ళతో చాలా గర్వంగా చెప్పింది.
ఆ రోజు ఆమె ఊహించలేదు.. ఈ ఒక్క పెళ్ళితో తన జీవితంలో ఎన్నో సంఘటనలు వెంటనే వెంటనే జరిగిపోతాయని.. తన జీవితం పరుగు అందుకుంటుందనీ.. కొత్త సుఖాలు మాత్రమేకాదు.. ఊహించని బాధ్యతలూ, అప్పటి వరకూ ఎరుగని కష్టాలూ, వేదనలూ తన జీవితంలోకి ముందే పొంచి వున్నాయనీ..
రామకోటేశ్వరరావు అనే హిస్టరీ మాస్టారితో ఆమెకి పెళ్ళి జరిగిపోయింది. స్టాంపు కలెక్షన్ ఆమె హాబీ. పెళ్ళయ్యాక గీతాంజలి తల్లిదండ్రులు ఎంత వద్దంటున్నా వినకుండా స్టాంపుకలెక్షన్ బుక్ తనతో అత్తారింటికి తీసుకు పోతానంది. రాము కూడా కాదనలేదు. దీంతో గీతాంజలికి తన భర్త చాలా మంచివాడనిపించింది.
అత్తారింట్లో కొత్తకాపురం మొదలైంది గీతాంజలికి. రోజూ కాలేజీ నుండి ఇంటికి వస్తూనే రాము మల్లెపూలు తెచ్చేవాడు. ఏదో ఒకటి తింటానికి బయటి నుండి తీసుకొచ్చేవాడు. భార్యని అపురూపంగా చూసుకునేవాడు. అత్తమామల పోరు అసలేలేదు. రాము పెళ్ళికి ముందే వాళ్ళు పోయారు. అంతంత మాత్రంగానే గీతాంజలికి వంట వచ్చు. అయినా సరే రాము నోరెత్తకుండా తినేసేవాడు. అవికావాలి ఇవికావాలని ఏరోజూ అడిగేవాడే కాదు.
గీతాంజలిని కూడా నీకేం కావాలని అడగడు. ఏమైనా తనకి కావాలంటే గీతాంజలే నోరు తెరిచి అడగాలి. భర్త ప్రవర్తన అర్ధం చేసుకునే వయసు కాదు. అతని ప్రవర్తనని అర్థం చేసుకోటానికి నాలుగేళ్ళు పట్టింది. ఈలోగానే తనకి ఇద్దరు మగ పిల్లలు కూడా పుట్టేశారు. బాధ్యతలు పెరిగిపోయాయి. పిల్లల ఆలనా పాలనా, భర్తకి ఏమేం కావాలో అవన్నీ తనే అర్ధం చేసుకొని చేసేది. ఏరోజూ కూడా రాము నోరెత్తి భార్యతో వంట బాగుందని కానీ, బాగాలేదని కానీ, పద్దతి నచ్చలేదని ఏదీ చెప్పేవాడు కాదు. పలకరిస్తే పలికేవాడు..లేకపోతే తన పని తను చేసుకొని వెళ్ళిపోయేవాడు. కొన్నాళ్ళకి గీతాంజలి స్నేహితురాలు వెంకటలక్ష్మి వెతుక్కుంటూ వీరింటికి వచ్చింది. తను అమెరికాలో డాక్టర్ ని పెళ్ళి చేసుకున్నాననీ.. తను కూడా ఎంబిబిఎస్ పూర్తిచేసుకున్నాననీ.. అమెరికాలో ఎం.ఎస్. పూర్తి చేసుకోబోతున్నాననీ చెప్పిం ది. లెక్చరర్ భార్యవైవుండి పదవ తరగతితోనే ఆపేస్తే ఎలా అంటూ తనకి గీతోపదేశం చేసింది. దీంతో గీతాంజలి తన జీవితంలో ఏం కోల్పోయిందో అర్థమైంది. చదువు.. అవును చదువే కోల్పోయింది. తనేం అడిగినా కదనని భర్తతో తన మనసులోని కోరిక చెప్పాల నుకుంది. ఆ రోజు రాత్రి తన భర్త రాగానే ఏరోజూ లేనిది అతని వద్ద ఆమెకి తెలియని కొత్త వాసన వచ్చింది. వాసన అనేకంటే కంపు అనటం సమంజసమేమే.. మనిషి ఊగిపోతున్నాడు. మాట తేడాగా వుంది. ఎప్పుడూ పలకరిస్తేకానీ పలకని వ్యక్తి పలకరించకుండానే ఎవరినో ఇష్టమొచ్చినట్లు తిడుతు న్నాడు. రాము నోటి నుండి ఎన్నడూ విననటువంటి తిట్లు..
‘‘ పిల్లలు నిద్రపోతున్నారు.. ఏమైందీ రోజు ’’ అని అడిగింది.
అప్పటిదాకా లేచిన నోరు ఒక్కసారిగా మూతపడింది. భార్య ని చూస్తూనే ఏమీలేదన్నట్లుతలూపుతూ తన గదిలోకి వెళ్ళి తలుపేసు కున్నాడు. భోరు.. భోరున ఏడు స్తున్నాడు. గీతాంజలికి భయం వేసింది. ఏమైందని పదే పదే అడుగుతూ తలుపు దగ్గరే కూర్చుండి పోయింది. కాసేపటికి గదిలోంచి వాంతులు చేసుకున్న శబ్దం.. భయంకరమైన వాసన.. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. రామ కోటేశ్వరరావు తల వంచుకొని గీతాంజలి దగ్గరికి వచ్చాడు. ఆమె పాదాలు పట్టుకున్నాడు.. ఇంకెప్పుడూ జీవితంలో తాగను అన్నాడు.. అప్పుడు అర్థమైంది గీతకి అతను తాగొచ్చాడని. గీతాంజలి మౌనంగా లేచి నిలబడ్డది.. అతను బయటికి వచ్చేశాడు.. గదంతా ఫినాయిల్ తో శుబ్రంగా కడిగింది. రామకోటేశ్వరరావు సోఫాలోపడుకొని నిద్రపోయాడు.. తల్లారు ఝామునే నిద్రలేచాడు. రోజూలాగే భార్యతో ఏం మాట్లాడకుండా తన దైనందిన కార్యక్రమాల్లో మమేకమయ్యాడు. పిల్లలు ఇంకా నిద్రలేవలేదు.. గీతాంజలి అతన్ని రాత్రి జరిగిన దానిమీద నిలదీసింది. రామకోటేశ్వరరావు తల వంచుకున్నాడు. తనకి వస్తుందనుకున్న ప్రమోషన్ వేరే అసమర్ధుడికి వచ్చిందనీ, ఆ బాధ పోగొట్టుకోవాలంటే తాగితో తగ్గిపోతుందని ఒక స్నేహితుడు చెప్తే బలవంతంగా తాగాననీ రాత్రి జరిగిందేదీ గుర్తులేదనీచెప్పి భోరుమన్నాడు. గీతాంజలి సరేలెమ్మంది. ఆ రోజు నుంచి రామకోటేశ్వరరావు భార్యతో నవ్వు తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆరోజు నుంచీ వారి జీవితంలో ప్రతి క్షణం ఆనంద కెరటాలలో ఓలలాడుతున్నాయి.
ఒక మంచి రోజు చూసుకొని గీత తన మనసులో మాట.. అదే చదువుకోవాలని వుందని చెప్పింది. రామకోటేశ్వరరావు అందుకు ఒప్పుకున్నాడు. చదివించాడు కూడా.. హిస్టరీలో డాక్టరేట్ చేయించాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెద్దోడు ఆస్ట్రేలియాలో, చిన్నోడు అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకీ పిల్లలు.. ఎప్పుడైనా ఈ వృద్ధదంపతులు అమెరికాకీ, ఆస్ట్రేలియాకీ వెళ్ళిరావటమే తప్ప పిల్లలు తిరిగి ఇండియా వచ్చే ఆలోచనలేదు. వారికోసం రూపాయి.. రూపాయి కూడబెట్టి పోగుచేసిన ఆస్తులన్నీ ఏం చేసుకోటానికో వీరికే అర్ధంకాని పరిస్థితి..
రోజూలాగే ఆ రోజు కూడా గీతాంజలి నిద్రలేచింది.. తను లేచేప్పటికే వాకింగ్ కి బయల్దేరే భర్త నిద్రలేవలేదు.. అతన్ని తట్టిలేపింది. అతను చనిపోయాడని ఆమెకి అర్థమైంది. పెద్దోడికీ, చిన్నోడికీ ఫోన్లు చేసింది.. వాళ్ళు రాలేమన్నారు.. కార్యక్రమాలు జరిపించమనీ డబ్బులు అవసరమైతే పంపిస్తామన్నారు. అక్కర్లేదని తేల్చి చెప్పేసింది. ఇక తను కూడా అమెరికాకానీ, ఆస్ట్రేలియాకి కానీ రానని చెప్పేసింది.. తనదగ్గరున్న డబ్బులతో భర్తకి అంత్యక్రియలు చేయించింది.
ఆతర్వాత కూడా చాలాకాలం తన భర్త చనిపోయిన ఆ ఇంట్లోనే వుంది. కానీ ఎందుకో... గీతాంజలికి ఆ ఇంట్లో వుండాలని లేదు. వున్నట్లుండి ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. ఏడుపదుల వయసు రావటం వల్లనో ఏమో... తను కావాలనుకున్న ప్రతీదీ తనకిప్పుడు వద్దనిపిస్తోంది.. దేనికోసమైతే తన జీవితంలో ఎన్నోసార్లు గొడవ పడిందో అది తనకిప్పుడు తృణప్రాయమైంది.
సామాన్లన్నీ సర్దేసింది.. తనకి కావాల్సినవి మాత్రమే... కేవ లం రెండు జతల బట్టల సంచీ, ఎంతగానో ప్రేమించే ఠాగూర్ రాసిన గీతాంజలి పుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం, ఎటిఎం కార్డు.. అదెందుకంటే తను బ్రతికినంతకాలం తింటానికి కావాలికదా... ఎక్కడికైనా వెళ్ళాలంటే కావాలి కదా... అని తన ఆలోచన.. తన మనసులో పదే అనుకుంటోంది...
‘‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను… నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కునేందుకు వెళుతున్నాను… వెళ్లకతప్పదు… తమ పిల్లల బాగోగుల గురించి నా పి0ల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… రిటైర్‌మెంట్ హోంకి వెల్తే ఎలా వుంటుంది. అక్కడ మాత్రం ఏముంటాయి.. డబ్బులు కడుతున్నాను కనుక సింగిల్ రూం… ఎసీ.. టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు… ఫుడ్.. ఆయన పోయింతర్వాత నాకొస్తున్న ఆయన పెన్షన్ ఈ అవసరాలకు బొటా బొటిగా సరిపోవచ్చు.. ఈ ఇల్లు.. పిల్లలకోసం కొన్న ఆస్తులు అన్నీ ఇప్పుడు రేట్లు పెరిగాయి.. వీటిని అమ్మేసుకుంటే చాలా డబ్బులొస్తాయి.. ఈ ఆలోచనే పిల్లలతో అంటే.. దేశాన్నే కాదనుకున్నాం.. అక్కడ ఆస్తులు మాత్రం మాకెందుకు.. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అన్నారు.
‘‘ వెళ్లిపోవడానికి సిద్ధమైపో తున్నాను… నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… అన్నీ నేను వాడుకున్నాను, అంతే… అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే… నావి ఎలా అవుతాయి..? నా తరువాత ఎవరివో… రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో… నిజానికి ప్రపంచ సంపద కదా… మనతోపాటు వచ్చేదేముంది..? వెళ్లి పోయేది ఒక్క దేహమే కదా… అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… బుక్స్ అమ్మేస్తారు… నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… వాళ్లకేం పని..? మరి నేనేం ఉంచుకోవాలి..? తరచూ పలకరించే ఈ గీతాంజలి పుస్తకం.. ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… చాలు… అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… ’’ అనుకున్నది.
కానీ అంతలోనే ఆమె మనసులో మరో ఆలోచన వచ్చింది. ఎక్కడో తన ఆకరిరోజులు గడపటానికి వున్నవన్నీ ఎవరికో అమ్మేసి అక్కడ దొరికే తాత్కాలిక సౌకర్యాల కోసం అనుబంధం ఏర్పడిన ఇంటిని వదులుకోవటమా? ఇన్నాళ్ళూ తను అపురూపంగా చూసుకున్న, తన భర్తతో గడిపిన మధురానుభూతుల్ని వదులుకొని వెళ్ళిపోవటమా? లేదు... లేదు.. దీనికి పరిష్కారం తను రిటైర్మెంట్ హోం కి వెళ్ళటంకాదు.. ఈ ఇంటిని సద్వినియోగ పరచాలి.. దీనికేదో ఒకటి చెయ్యాలి.. అనుకుంది. తను ఇంటికి వచ్చినప్పటి నుంచీ తన ఇంటినే నమ్ముకొని వుంటున్న నౌకరు కొడుకు రంగన్న గుర్తుకొచ్చాడు. వాడి చదువు కూడా పూర్తయింది. ఉద్యోగం రాలేదు. వాడిని నేను దత్తత తీసుకుంటే.. రంగన్న తండ్రి రాములు చనిపోయినప్పటి నుండి రంగన్న అనాధగానే వున్నాడు. కష్టపడి స్కాలర్ షిప్పులమీద చదువుకున్నాడు. అప్పుడప్పుడు రామకోటేశ్వరరావు కూడా రంగ న్నకి సాయం చేసేవాడు.. అలా ఆలోచిస్తూ రంగన్నకి కబురు చేసింది. రంగన్న రావటంతో తన మనసులో మాట చెప్పేసింది. తన యావదాస్తులు రంగన్న పేరుతో రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.
రంగన్న‘‘ అమ్మగారూ.. మి మ్మల్నీ అయ్యగార్నీ నా సొంత అమ్మ, నాన్నల్లాగే చూసుకున్నాను. నాకీ ఆస్తులు, పాస్తులు ఏమీ వద్దు.. మీరు నిశ్చింతగా వుండండి.. మిమ్మల్ని నా కంటికి రెప్పలా చూసుకుంటానని’’ భరోసా ఇచ్చాడు.
కానీ గీతాంజలి తను చేయదలచుకున్న పనిమాత్రం చె య్యకుండా వుండలేదు. రంగన్నతో వ్యాపారం పెట్టించింది. రంగన్న పేరుమీద తనకున్న ఐదుకోట్ల రూపాయల ఆస్తిని రాసేసింది. తనే దగ్గరుండి రంగన్నకి పెళ్ళికూడా చేసింది.
గీతాంజలికి ఒక అర్ధరాత్రిపూట అర్ధమైంది... హంగులూ, ఆర్భాటాలు, కోరికలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమేననీ, బ్రతకటానికి కా వాల్సింది బంధాలు మాత్రమేననీ, సాగనంపేందుకు ఆ బంధాల అ వసరమే వుందనీ, అందుకే ఒక్కో బంధాన్నీ వదిలించుకొని పరాత్మతో ఏర్పడే శాశ్వత బంధమే నిజమైన బంధమనీ అర్థమంది. ఆమె శ్వాస అనంతవిశ్వంలో అంతర్లీనమయ్యే క్షణాలు ఆసన్నమయ్యాయనీ.. తన కిప్పుడు ఇల్లుగురించి ఆలోచ నలేదు, కొత్తగా ఏర్పడిన రంగన్నకానీ, అతని భార్యకానీ, వారి పిల్లలతోకానీ ఆక రికి తను కట్టుకున్న చీరె, తను పడుకున్న మంచం ఏదీ కూడా ఆమెకి సంబంధంలేదని అర్థమైంది. అన్నిటినీ విడిచి అనంత లోకాల్లోకి పయనమైంది.. విశ్వకవి రవీంద్రుని గీతాంజలి ఎన్నోసార్లు చదివిన ఆమెకి ఆ గీతాంజలి సారం అప్పటికి అర్థమైంది.. ఆనందంగా ఆమె ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది.
శుభం

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు