వంశీమోహనం - నాగమంజరి గుమ్మా

Vamshi mohanam

"మోహనా" గుసగుసగా పిలిచాడు వంశీ. "ఊఁ" పలికింది మోహన "ఇటు చూడు" కాటుక దిద్దిన వాల్చిన కనురెప్పలు పైకెత్తి సిగ్గుగా చూసింది మోహన. "అందాల వదనమ్ము అలివేణి అధరమ్ము నల్లని కనుదోయి నాకుముద్దు" ఆ మూడింటికి మూడు ముద్దులు అంటూ మోహన ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా చుంబించాడు వంశీ. "నునుపైన చెక్కిళ్ళు నువ్వు పూ నాసిక చిట్టి చుబుకముల చేతు ముద్దు" మళ్ళీ మరో మూడు ముద్దులు ఉహు నాలుగు… "లెక్క తప్పారే" "చెక్కిళ్ళు రెండు కదా" "శ్రీకారమును బోలు చెవులు రెండింటికి ముంగుర్ల కిత్తును మరొక మూడు" "ఊఁ" "కంఠ సీమ కొక్కటి కటి సీమ కొక్కటి కరములు పదములు కాచె నాల్గు" "కనుల కనిపించు అందాల కాంచినాను ముద్దు ముద్దుగా మురిపాల ముద్దులిస్తి భాను గాంచని పరువాల బయలు పరచు సఖియ దాసుడౌదు నిజము జన్మవరకు" కురులను తప్పించి మెడ వెనుక ముద్దు పెట్టాడు. మోహన అరచేతులు తన చేతులతో పట్టుకొని కనులపై ఉంచుకున్నాడు వంశీ. వంశీ ఒక్కొక్క చేష్ట ఒక్కో మెట్టుగా పరవశింపజేయగా అదిరే తన అధరాలతో వంశీ పెదవులు అందుకుంది. తేనెలూరే అధరాలు అందగానే అరచేతులు విడిచి చిక్కిన నడుమును చేత చిక్కించుకున్నాడు. "వదలరా బాబూ… ఒక్కడివే కూర్చుని నిద్రపోతున్నావని జిలేబి నోటికి పెట్టి నిద్రలేపుదామనుకుంటే నన్ను నీ దగ్గరకు లాక్కుంటావేం?" నెత్తి మీద తట్టాడు వంశీ స్నేహితుడు విశ్వం. గబుక్కున కళ్ళు తెరిచి విశ్వాన్ని వదిలేసాడు వంశీ. "మామూలుగా లేపొచ్చు కదరా… జిలేబి నోటికి ఇస్తే మోహనే అనుకున్నాను" సర్దుకుంటూ చెప్పాడు వంశీ. "సర్లే.. సంగీతం మాష్టారి అమ్మాయికి, సాహిత్యం చదువుకున్న నీ మోహనకి, రాత్రంతా పద్యాలు చెప్తూ కూర్చుంటావా ఏమిటి? ఇక్కడే వదిలేస్తే నీ బుర్రలో యతులు, ప్రాసలు, గణాలు తిరుగుతాయి కానీ అలా ఊరు చూసి వద్దాం పద. పల్లెటూరు చాలా బాగుంటుందట. నేను సాయంత్రం వెళ్లిపోతాను." బలవంతంగా వంశీని బయలుదేరదీసాడు విశ్వం. ******** మోహనను తొలిసారి నన్నయ విశ్వవిద్యాలయం లో ఒక కార్యక్రమంలో పత్ర సమర్పణకు వెళ్ళినపుడు చూసాడు వంశీ. అప్పుడు తను "నన్నయ నుండి నేటి వరకు పద్యం ప్రయాణం" అనే అంశంపై పత్రసమర్పణ కోసం వచ్చాడు. మోహన "శ్రీనాధుని కవిత్వంలో సీసపద్యం" అనే అంశంపై పత్రసమర్పణ చేసింది. మోహన తర్వాత పేరు తనది. కానీ మోహన రూపమే తప్ప, ఆమె చెప్పినదేదీ తలకు లెక్కలేదు వంశీకి. తన పత్ర సమర్పణ ఎలా చేసాడో కూడా జ్ఞాపకం లేదు. అందరివి అయ్యేవరకు అక్కడే కూర్చుని శ్రద్ధగా వింటూ, అవసరమైన విషయాలు రాసుకుంటోంది మోహన. కార్యక్రమంలో చివరి వ్యక్తి మాట్లాడడం పూర్తి కాగానే, లేచి తనవైపుకు రావడం గమనించి ఆశ్చర్యపోయాడు వంశీ. "నమస్తే అండీ, నా పేరు మోహన. ఇందాక మీరు 'నన్నయ నుంచి నేటివరకు…' పత్ర సమర్పణ చేసారు కదా, నేను మొదటి రెండు నిమిషాల విషయం సరిగా వినలేదు. మీ దగ్గర మరొక ప్రతి ఉందా? ఉంటే ఇవ్వగలరా?" పత్ర సమర్పణ అవగానే అది అక్కడి వారికి ఇచ్చేస్తారు… అందుకే మోహన "మరొక ప్రతి ఉందా?" అని అడిగింది. "అలా బయటకు వెళదాం రండి" అని చెప్పి, దారి తీసాడు వంశీ. బయట చెట్టు కింద ఉన్న బెంచీ వైపు వెళ్లి కూర్చున్నారు "నా పేరు వంశీ. నా దగ్గర వేరొక ప్రతి ఇక్కడ లేదు. నేను రాసిన విషయం ప్రతి ఒక్క అక్షరం నాకు గుర్తుంది. మీరు ఎక్కడ నుండి మొదలు పెట్టేరో చెప్పండి, నేను ఆ ముందరి ఖాళీ పూర్తిచేస్తాను" అన్నాడు వంశీ. మోహన తను రాసింది చూపించింది. ముందు వినలేకపోయిన అంశాలను వివరించాడు వంశీ. ఆకుపచ్చని లంగా జాకెట్టు, మిరపపండు రంగు వోణి, చెవులకు లోలాకులు, పొడుగాటి జడ.. మోహన… పేరుకు తగ్గట్టు మోహనంగా ఉంది. యధాలాపంగా అడిగినట్లు సాయంత్రం ఏ రైలుకు వెళ్తోందో కనుక్కున్నాడు. తాను వెళ్లే రైలే. కానీ బోగీలు వేరు. ఏదైతే ఏం? స్టేషన్ వరకు కలిసే వెళ్లారు. 'చదువు ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎం. ఏ తెలుగు మొదటి సంవత్సరం. విశాఖపట్నం పక్కనే ఉన్న పల్లెటూరులో నివాసం. తండ్రి సంగీత విద్వాంసుడు. అందుకే కూతురి పేరు మోహన. తండ్రి కీర్తనలు పాడటమే కాకుండా భావగీతాలు కూడా రచిస్తారు. ఆసక్తి గల కొద్దిమంది పిల్లలకు, పెద్దలకు ఇంట్లోనే తరగతులు నిర్వహిస్తూ ఉంటారు.' అదీ ఆ సాయంత్రం రైలు వచ్చేలోపల మోహన నుంచి సేకరించిన వివరాలు. వంశీ ప్రభుత్వ కళాశాల లో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు పద్యాలు, కథలు లాంటి సాహిత్య ప్రక్రియలు కూడా చేయడం, అవి పత్రికలకు పంపితే అచ్చుకావడం కూడా జరిగింది. మోహన రూపం, చదువు, కుటుంబ నేపధ్యం బాగా నచ్చాయి వంశీకి. ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు మోహన విషయం చెప్పాడు. వాళ్ళు కూడా మరేమీ ఆలోచించకుండా వెంటనే మోహన తల్లిదండ్రులను సంప్రదించడం ఇరువర్గాలకు అంగీకారం కుదరడంతో నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడం జరిగిపోయాయి. మోహన చదువు అయ్యేవరకు పెళ్లి వద్దని వంశీ చెప్పడంతో ఆగేరు. అప్పుడప్పుడు కళాశాల గ్రంథాలయంలో కలుస్తూ ఉంటారు మోహన, వంశీ. లేదా వంశీ వాళ్ళింటికి మోహన, మోహన ఇంటికి వంశీ వచ్చిపోతూ ఉంటారు. అభిప్రాయాలు తెలుసుకోకుండా, అపరిచితుల్లా పెళ్లి చేసుకోవడం నచ్చలేదు వంశీకి. అందుకే పెద్దలచే కుదర్చబడిన ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దవారి అనుమతి తోనే సినిమాలకు, షికార్లకు వెళ్లేవారు. మొత్తానికి మోహన చదువుకు ఆటంకం లేకుండా మంచి మార్కులతో పాసయింది. ఆ నెలలోనే పెళ్లి ముహూర్తం కుదిరింది. మోహన అందం ఎంత కవ్విస్తున్నా, మనసును అదుపులో పెట్టుకొని, ఆ రోజు కోసమే ఎదురు చూసాడు వంశీ. ముందు రోజు రాత్రి ఏడు గంటలకు వంశీ మోహనులకు పెళ్లి అయ్యింది. ఈ రాత్రికే శుభకార్యం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అటు ఇటు తిరిగి అలసిపోయిన కొత్త జంట భోజనాలయ్యాక ఎవరింట్లో వారు హాయిగా సాయంత్రం వరకు నిద్రపోయారు. ఇంతలో పెళ్లికి వచ్చిన స్నేహితుడు విశ్వం వచ్చి వంశీని నిద్రలేపేసాడు. అనుకున్న సమయానికి పెద్దలందరూ చేరి, మోహన, వంశీలతో పూబంతులాట ఆడించారు. కొన్ని నాణాలు వంశీ చేతిలో పోసి, గుప్పెట నిండా తియ్యమని అవి సరి సంఖ్యలో ఉన్నాయో, బేసి సంఖ్యలో ఉన్నాయో మోహనతో చెప్పించారు. మోహన కొంగులో పువ్వులు, ద్రాక్షపళ్ళు పోసి, మోహన దోసిటిలో తీసుకున్నది పండో పువ్వో వంశీతో చెప్పించారు. ఇంకా ఏవో అనేక ఆటలు ఆడించి, దంపతులకు తాంబూలాలిప్పించి, వారిలో బెరుకు పోగొట్టి, గదిలో పాలు, పళ్ళు పెట్టి బయటకు వచ్చి తలుపేశారు. తనుకూడా లోపల గడియ పెట్టి, మోహన వైపు చూసాడు వంశీ. పాలకడలిలో నుంచి వచ్చిన లక్ష్మీదేవి లా ఉంది మోహన. తెల్లని చీరలో మెరిసిపోతోంది. మెడలో పచ్చగా తాళిబొట్టు, నల్లపూసలు, ఒక హారం. చెవులకు లోలాకులు, చేతులకు పెళ్లిగాజులు, తలనిండా పూలు. పెళ్లిలో వేసిన నగలు, అలంకారాలు లేవు. నిత్యం పలకరించుకునేవారే అయినా ఎందుకో మూగబోతున్నట్లుగా ఉంది. చల్లని వాతావరణం వేడెక్కిస్తోంది వంశీని. "మోహనా" పిలిచాడు వంశీ. "ఊఁ" ఆ పలకడంలో తానాశించిన మాధుర్యమో, నిత్యమూ వినే స్వరమో లేదు… సంకోచం, బిడియం కనబడుతున్నాయి. తొలిరేయి సిగ్గు అనుకున్నాడు. మోహన చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. ఎన్నోసార్లు సినిమాకి వెళ్ళినపుడు, గ్రంథాలయంలో మాట్లాడుకునేటపుడు కూడా అలా మోహన చేయి తన చేతిలోకి తీసుకునేవాడు వంశీ. కానీ ఇప్పుడు మోహన చేయి కంపిస్తోంది. అంత శీతల వాతావరణం లో కూడా చిరు చెమటలు పట్టాయి మోహన నుదుటిపైన. "మోహనా, కూర్చో.. ఇదిగో పాలు తాగు" గోరువెచ్చని పాలు మోహన నోటికి అందించాడు. కొంచెం తాగి పక్కన పెట్టేసింది మోహన. "మోహనా! ఏమైనా ఇబ్బందిగా ఉందా? మీ అమ్మగారిని పిలవనా?" అడిగాడు వంశీ. తల అడ్డంగా ఊపింది. "మరి? తలనొప్పిగా ఉందా?" "ఉహూ… భయంగా ఉంది" చెప్పింది మోహన. ఆశ్చర్యపోయాడు వంశీ. "నా దగ్గర భయంగా ఉందా?" "ఉహు.." "రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నాం కదా… ఇప్పుడెందుకు భయం?" "ఏమో" "సరే! పడుకుంటావా?" "ఊఁ" "నిన్ను ముట్టుకోవచ్చా? దానికి కూడా భయమేస్తుందా?" గుసగుసగా అడిగాడు వంశీ. తల వంచుకునే తలూపింది మోహన. దగ్గరగా పొదువుకున్నట్లు పట్టుకొని మంచం దగ్గరకు తీసుకువచ్చి, ఒక్క ఉదుటన నడుం కింద ఒక చేయి పెట్టి, పైకి లేపి మంచంపై పడుకోపెట్టేసాడు. ఎగిరిపడి గుండెల మీద చేయి వేసుకుంది మోహన. నవ్వేసాడు వంశీ. "పిచ్చీ … పడుకో" అన్నాడు. పక్కనే పడుకుని ముంగురులు సవరించాడు. పెదవులపై మీటాడు. పెదవులు వణుకుతున్నాయి. గోరింటతో ఎర్రగా పండిన వేళ్ళను ముద్దాడాడు. ఎటువంటి స్పందనా కనిపించలేదు మోహనలో. వంశీవైపు తిరిగి కళ్ళుమూసుకుని ఉంది. లేచి పారాణి పాదాల వైపు చూసాడు. పచ్చగా పసుపు రాసిన పాదాలు, అంచులకు పారాణి పైన సన్నని పట్టీలు, ఆపై పూల అంచు గల తెల్లని చీర… తమకం ఆపుకోలేక పాదాలపై ముద్దు పెట్టాడు. పాదాలు వెనక్కు తీసుకుంది మోహన… చిన్నగా నిట్టూర్చి, మళ్ళీ మోహన పక్కన మేను వాల్చాడు. నడుంపై చేయివేసి దగ్గరకు లాక్కుని హత్తుకుని పడుకున్నాడు. అడ్డుచెప్పలేదు మోహన. మర్నాడు అందరూ కలిసి విశాఖపట్నం వెళ్లిపోయారు. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నారు. ఆ రాత్రి కూడా అలాగే గడిచిపోయింది. మూడవనాడు మళ్ళీ అందరూ యానాళ్లకు మోహన పుట్టింటికి వచ్చారు. సాయంత్రం ఏదో పని ఉందని మోహన, వంశీ ఇద్దరూ విశాఖపట్నం వచ్చారు. హఠాత్తుగా మబ్బులు పట్టి వేసవికాల వర్షం మొదలైంది. వంశీ కుటుంబం అంతా పల్లె లోనూ, వీరిద్దరూ ఇక్కడ ఉండిపోయారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వర్షం కారణంగా రాలేకపోతున్నామని, వారందరినీ మర్నాడు ఉదయం రమ్మని, కంగారు పడవద్దని, ఇంటికి చేరుకున్నామని చెప్పాడు వంశీ. వరండాలో వర్షాన్ని చూస్తూ కూర్చున్నాడు వంశీ. మోహన వంటింట్లోకి వెళ్లింది. వంశీ వెనకాలే వచ్చి, నడుంపట్టుకుని, ఒక చేత్తో నోరు మూసి, గోడకి అదిమిపెట్టాడు. మోహన తోసేయబోతూ ఉంటే, తన పాదాలతో మోహన పాదాలు నొక్కిపెట్టాడు. ఆధారాలు అందుకోబోతూ ఉండగా ఎలాగో చేయి తప్పించి వంశీని ఒక్క ఉదుటన తోసేసింది. స్టౌ అరుగు మీద ఉన్న నీళ్ల గిన్నె కిందపడి పెద్దగా చప్పుడయ్యింది. "ఏమిటయ్యింది మోహనా?" అంటూ లోపలికి వచ్చాడు వంశీ. "అబ్బే ఏమి లేదు. చేయి తగిలి గిన్నె కిందపడింది. అంది మోహన. తెప్పరిల్లి, ఇంకా ఆలస్యం చేయకూడదని, ఊహలు నిజమయ్యే ప్రమాదం ఉందని గ్రహించింది మోహన. గబగబా బజ్జీలు వేసి వేడిగా తీసుకువచ్చి వంశీకి అందించింది. "పాటలు వింటూ, బజ్జీలు తింటూ, వర్షాన్ని చూస్తుంటే బావుంది కదూ" అన్నాడు వంశీ. వర్షం వలన తొందరగా చీకటైపోయినట్లు అనిపించింది. లోపలకి వెళ్లి, వంట చేసి వంశీని పిలిచింది మోహన. వంశీ, మోహన కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వంట చాలా బాగా చేసింది మోహన. కాసేపు మళ్ళీ వర్షాన్ని చూస్తూ కూర్చున్నారు. దాదాపు నాలుగు గంటలు కురిసింది.. ఇప్పుడు జల్లుగా మారింది. ఏవేవో మాటలు… మధ్యలో మౌనాలు… బాగా తిన్నాడేమో వంశీకి ఆవలింతలు వస్తున్నాయి. లేచి గదిలోకి నడిచాడు. పక్కపై వాలబోతుంటే మోహన స్నానాల గది వైపు చూపించింది. "ఇప్పుడా" అన్నాడు వంశీ… "తప్పదు" అంది మోహన. తువ్వాలు భుజంపై వేసి, స్నానాలగదిలోకి నెట్టింది. "బట్టలు బయటే పెట్టాను. వచ్చి కట్టుకోండి" అని చెప్పి, గదిలో గబగబా సర్ది, వేరే గదిలోని స్నానాల గదిలోకి స్నానానికి వెళ్ళింది మోహన. స్నానం చేసి వచ్చి గదిలో చూసి ఆశ్చర్యపోయాడు వంశీ. మంచంపై తెల్ల దుప్పటి. పక్కనే బల్లమీద తమలపాకు చిలకలు, పళ్ళు, పాలు… "అబ్బో!" అనుకున్నాడు. ఇంతలో మోహన తెల్లచీరలో వచ్చింది. "ఏయ్ ఏమిటిది?" అన్నాడు ఉత్సుకతగా…. "భయం పోయిందా?" "ఊఁ, కానీ భయం కాదు… అప్పుడు అందరిలో సిగ్గు… అలా చెప్తే మీరు వదలరు. అందుకే భయం అన్నాను" "అమ్మదొంగా" "ఊఁ" అరచేతులతో ముఖం కప్పుకుంది మోహన. "నాకు వేడిగా ఉంది" అన్నాడు వంశీ. "అదేంటి ఏసీ ఇంకా చాలలేదా?" గబుక్కున చేతులు ముఖం మీద నుండి తీస్తూ అడిగింది మోహన. "గదిలో వేడి కాదు, గుండెల్లో వేడి" మోహన చేయి పట్టుకుని, తన గుండెల మీద ఉంచుకొని చెప్పాడు. ఇద్దరూ కలిసి మంచంవైపు నడిచారు. పాలు పంచుకున్నారు. పండు కొరికి ఇచ్చాడు వంశీ. తానో ముక్క కొరికింది మోహన. తమలపాకు చిలక చిటికెన వేలితో అందించింది. నగుమోము చూడ ముద్దౌ మగనికి తమలపు చిలుకలు మడువగ ముద్దౌ సొగసులు పరువగ ముద్దౌ మగటిమి చూడ తొలిరేయి మగువకు ముద్దౌ గుసగుసగా వంశీ చెవిలో చెప్పింది మోహన.. "అమ్మో గడుసు పిల్లా… నన్నే మించిపోయావే" అలాగే మోము పట్టుకుని పెదవులు అందుకున్నాడు. తమకపు టధరాలు ఒక్కటయ్యాయి. వంశీ వేళ్ళు మోహన జుట్టు కుదుళ్లను పట్టుకున్నాయి… మోహన గోళ్లు వంశీ వీపుపై నెలవంకలు చిత్రించాయి. వంశీ లాల్చీ, మోహన చీర ఎలా వేరుపడ్డాయో తెలీదు. వంశీ మోహన అధరాలు వదలి నుదురు, నాసిక, చెక్కిళ్ళు ఇలా వరుసగా ముద్రలు వేస్తూ వస్తున్నాడు. పరువాలు బిగుసుకుంటున్నాయి. మోహన తనువు సుమధనువు అయ్యింది. వంశీ వేళ్ళు మోహన నడుం పై నాట్యం చేసాయి. మోహన కళ్ళు అరమోడ్పులయ్యాయి. నాభిలో మాణిక్యాన్ని నాలుకతో అందుకున్నాడు వంశీ. ఒళ్ళంతా వయ్యారి కోట అయ్యింది. మరి కొంచెం కిందకి జరిగాడు వంశీ… మోహన గొంతులో కలకూజితాలకు బయటి నుంచి కోకిల బదులుగా కూసింది. వంశీ శిఖరాగ్రాలకు, పాతాళానికి ఒకేసారి ముప్పేట దాడి జరిపాడు. కాసేపటికి ముందు వెనుకలుగా ఇద్దరినీ విజయం వరించింది. పానుపుకు వసంతాభిషేకం జరిగింది. రాత్రి వానకి తడిసిన మొక్కలు ఉదయాన్నే తాజాగా సుమబాలల నందిస్తే, తుమ్మెదలు మోహనరాగంలో వంశీరవాన్ని ఆలపిస్తూ పదే పదే తేనెలు గ్రోలుతూ పూల చుట్టూ తిరుగుతున్నాయి. ****

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు