సోల్ మేట్ కాదు... నా లైఫ్ మేట్ - బొబ్బు హేమావతి

Soulmate kaadu.. naa lifemate

అరకు లోయలో ట్రెక్కింగ్ లో ఆ రోజు అతనిని నేను చూడగానే...నాకు ఇతనిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. మేమిద్దరం అపరిచితుల నుంచి పరిచితులుగా మారిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.నాలుగు వారాలుగా తెమలని ప్రాజెక్ట్ ముగించి, మా మేనేజర్ తో చెప్పేశాను...నాకు వారం సెలవు కావాలి అని.గురుడు గునుస్తూ నా వైపు చూసి సరే పొమ్మన్నాడు.

చల్ మోహన రంగా అనుకుంటూ అప్పటికప్పుడు బయలు దేరి అరకు వైపు నా కారు ని మళ్ళించాను.అమ్మ రెండేళ్లుగా నన్ను పోరుతూనే ఉంది..."ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి...ఇకనైనా పెళ్లి చేసుకో"...అంటూ...నేనేమో...నాకు నచ్చిన వాడు దొరకాలి కదా !...అంటూ వాయిదాలు వేస్తూనే ఉన్నాను.
ఊహల్లో...నా రాజకుమారుడు!...నన్ను మురిపిస్తూ... మైమరిపిస్తూ....నా ఎదురు చూపులు నా సోల్ మేట్ కోసం ...నా మనస్సుకు నచ్చాలి.... అప్పుడే పెళ్లి. చిన్నగా సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడు. చీకటి పడే లోగా అరకు చేరాలి అనుకున్నాను. అనుకున్నట్లే చేరిపోయాను.
టూరిజం హోటల్ చేరి...ముందే బుక్ చేసుకున్న నా గదిలో దూరిపోయాను. వేడి నీళ్ళ స్నానం చేసి హోటల్ సిబ్బంది ద్వారా టిఫిన్ తెప్పించుకుని తిని త్వరగా లేవాలి అనుకుంటూ రాత్రి తొమ్మిది కే నిద్ర పోయాను.పొద్దు పొద్దున్నే పిచ్చుకల కువ కువలు వినిపిస్తుంటే నిద్రాదేవిని పక్కకు తోసి ట్రెక్కింగ్ కు బయలు దేరాను.
అక్కడ చూసాను అతనిని... బ్యాక్ ప్యాక్ తో స్కూల్ కుర్రాడిలా!!! ఎటో చూస్తూ ...ఏదో ఆలోచించుకుంటూ నెమ్మదస్తుడిలా....అప్పుడే ప్రేమలో పడిపోయాను.నాలాంటి యువతులు యువకులు ఓ ఇరవై మంది...వారిలో మేమిద్దరం స్పెషల్. ఆర్గనైజర్ మురళీ నాకెంతో పరిచయం. అతను నాతో మాట్లాడుతూ పక్కనే ఉన్న గురుడి ని పరిచయం చేశాడు."మీట్ మై ఫ్రెండ్ పద్మిని"..అంటూ...నా వైపు చూసి ఇతను ..."కృష్ణ....ఫ్రమ్ డెట్రాయిట్" అన్నాడు.నేను అతని తో హెల్లో అంటుండగానే అతను చిరునవ్వుతో నా వైపు చూస్తూ చేతులు రెండు పైకి ఎత్తి నమస్కారం చేశాడు. నేను ప్రతి నమస్కారం చేశాను.
నా మనస్సు ఎందుకో ఊహల్లో ఊగిసలాడడం మొదలు అయ్యింది. అతనితో స్నేహం చేయమని అంటున్నది. ముందుకు వెళ్ళమంటున్నది. అంతలోనే వెనకకు లాగుతున్నది.నేను అందరితో కలిసి నడుస్తూ ముందుకు వెళ్లడం ప్రారంభించాను.చుట్టూ అందమైన ప్రకృతి...పచ్చని చెట్లు....గాలికి సుతారంగా ఊగుతూ...
ఇంతలో ఎక్కడి నుండో ఒక కుక్క గభాలున నా వైపు దూరింది. నేను భయం తో పక్కకి దూకాను.అది ఉగ్రంగా నా వైపు చూస్తూ. నా వెనుక నడుస్తున్న కృష్ణ...కుక్క వైపు తన చేతిలోని వాటర్ బాటిల్ విసిరాడు. అది వెంటనే కుయ్ మంటూ పక్కకు మళ్లింది.నేను గుండెల్ని అరచేతిలో పెట్టుకుని అతని వైపు చూసి... థాంక్స్ అన్నాను. ప్రతి గా చిరునవ్వు అతని దగ్గర నుండి.ఇద్దరం కలిసి నడవడం ప్ర్రారంభించాము. నా ముందున్న జంటలు కేరింతలతో నవ్వుతూ తుళ్ళుతూ నడుస్తున్నారు.
నేను అతను కలిసి నడుస్తున్నంత లో...నా వేళ్ళు అతని వేళ్ళకు తగలగానే....నాలో ఏదో స్పార్క్..జివ్వుమని...అది నా స్రీ హృదయాన్ని తట్టి లేపింది..నా కళ్ళల్లో తటిల్లుమని మెరుపు...అతని వైపు చూడగానే అతను నా వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ....
సిగ్గుపడి తలవంచి చిరునవ్వు నవ్వాను. నాలో నేనే ఆశ్చర్యపోయా...ఒక వ్యక్తి ముందు ఇలా సిగ్గు పడడం ఇదే మొదటిసారి...
అతను కెమెరా తో దగ్గర కనిపించే మొక్కలు గమనిస్తూ ఫొటోస్ తీస్తూ .... ప్రతి చెట్టు బొటానికల్ నేమ్ చెప్తుంటే....నేను అతని తో అన్నాను..."నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. మా ఇంటి లో పది రకాల రోజాలు, చామంతులు, సన్నజాజి, మల్లె అంటు...ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి" అంటూ అతనితో అన్నాను..."మీరు బోటనిస్ట్ కదా".
నవ్వుతూ అతను అన్నాడు..."సలీం అలీ ఆర్నితాలజిస్ట్ ...... నాకు మొక్కల పైన ఉన్న ఇష్టం తో ఏవో కొన్ని మొక్కల పేర్లు చెప్తున్నాను అంతే కానీ నేను బోటనిస్ట్ ని కాను".రెండింటికీ తేడా ఏమిటో అన్నది నా కోడింగ్ బుర్రకు అర్థం కాలేదు..అడిగితే అది కూడా తెలియదా అంటాడేమో అనుకున్నాను. కానీ మా ఇద్దరికీ మొక్కలు అంటే ఇష్టం అని అర్థమైంది.ఎందుకో ఇద్దరికీ బాగా పరిచయం ఉంది ఎప్పటినుండో అనిపించింది నాకు. అతని వైపు చూడగానే...అతను నా వైపు చూస్తూ. నేను చిన్న చిరునవ్వు నవ్వాను.
చిన్నగా "తుం హి హో ...అబ్ తుం హి హో" అంటూ అర్జున్ సింగ్ సాంగ్ నేను హమ్ చేయగానే...వెంటనే అతను "జిందగీ అబ్ తుమ్ హి హో" అంటూ నా వైపు చూసాడు. ఇద్దరం ఇంకా గట్టిగా పాడటం మొదలు పెట్టాము. మాతో మిగిలిన వారు కూడా కలిసి పాడటం మొదలు పెట్టారు. మాకు ఇద్దరికీ ఎమోషనల్ బాండ్ మొదలు అయ్యింది. అదే యవ్వనుల భాషలో ప్రేమ. ఆ ఆలోచన రాగానే నవ్వుకున్నాను ..."పరిచయం అయ్యింది ఈ రోజు...ఒక్క రోజు లో ప్రేమ... నమ్మదగినదేనా?"
చీకటి పడింది. అక్కడే అడవి లో టెంట్ వేశారు...కొండ పైన....చుట్టూ చీకటి.... కాగడాలు వెలిగించారు. వంట చేయడం మొదలు పెట్టారు. మేమంతా నెగడు చుట్టూ కూర్చుని...... అంత్యాక్షరి ఆడాము...పోటాపోటీగా...పాడాము. ట్రూత్ ఆర్ డేర్ ఆడాము. అలసి సొలసి అక్కడ ఒకరి మీద ఒకరు పడి నిద్ర పోయాము.
మేము అక్కడ గడిపిన రెండు రోజులలోనే కృష్ణ కు నాకు బాండింగ్ పెరిగింది . కృష్ణ బెంగళూరులో "విజిల్" స్టార్టప్ లీడ్ చేస్తున్నట్లు చెప్పాడు. నేను హైదరాబాద్ కి బయలు దేరాను...కృష్ణ బెంగళూరు కి వెళ్ళిపోయాడు. తరువాత వారం నేను బెంగళూరు వెళ్ళాను...తను నాతో మాట్లాడుతూ తన కంపెనీ లో చేరమని అనగానే మరో ఆలోచన లేకుండా చేరిపోయాను తన కంపెనీ లో.
పొద్దునే తన కాల్ తో నిద్ర లేచి ఇద్దరం జాగింగ్ కి వెళ్ళే వాళ్ళం. దారిలో అయ్యంగార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి...మా షేర్డ్ ఫ్లాట్ లో ఫ్రెష్ అప్ అయ్యి....కంపెనీ కి వెళ్ళేవాళ్ళం. గురుడు అక్కడ చాలా బిజీ...తన పని తనది...నా పని నాది.
నేను ...నా కో కోడర్ శ్రీరామ్...తో వర్క్ గురించి మాట్లాడుతున్నాను....కృష్ణ కోపంగా అక్కడకు వచ్చి ఏమి చేస్తున్నావు...అంటూ పేపర్లు అటు ఇటు విసిరేశాడు ఆ రోజు. తన బిహేవియర్ అర్థం కాలేదు నాకు. అతనిలో జెలసి... చాలా ఎక్కువగా... నన్ను ఒక వస్తువు లా చూస్తూ...
ఇంకొక రోజు...ఇద్దరం షాపింగ్ చేస్తున్నాము....అంతలో...నా కాలేజ్ మేట్...వాసవి కనిపించగానే.... నవ్వుతూ కృష్ణ నీ వదిలి తన దగ్గరకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చేలోపల...కృష్ణ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు...నన్ను అక్కడే వదిలి. నేను తన కోసం జీవించాలి అన్నట్లు మానిప్యులేషన్.ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుని రాగానే....కృష్ణ ను నేను ప్రశ్నించక ముందే... అతను నా వైపు చూసి...రాచకార్యాలు అయ్యాయా...?. ఆ మాట చర్నాకోలు నా పై విసిరినట్లు హృదయం లో నుండి రక్తం చిమ్మింది.
కళ్ళల్లో నీరు రాలేదు...కానీ మనస్సు విరిగిపోయింది. మా మధ్య దూరం ప్రారంభం అయ్యింది. నేను కలిసి పోదాం అని ప్రయత్నించినా అతను నన్ను దూరం పెట్టడం ప్రారంభించాడు.ఒక వారం...రెండు వారాలు చూసాను. సైలెంట్ ట్రీట్మెంట్ తట్టుకోలేక పోయాను.
ఆ రోజు...అతనికి నా రాజీనామా ఇవ్వగానే.....ఒకే చేశాడు!!! నా మీద ఏదో రివెంజ్ అతనిలో. తల కూడా పైకి ఎత్తి చూడలేదు. నేను అతను నన్ను పిలుస్తాడు అనుకుని ఆశగా రిసెప్షన్ లో కూర్చున్నాను. ప్చ... నో యూజ్. దిగులుతో హైదరాబాద్ తిరిగి వచ్చేసాను...కానీ అతను మొదట్లో ఉన్నట్లు ఉంటే బాగుండేది కదా...ఎందుకు మారిపోయాడు??? అనుకున్నాను. అమ్మ చెప్పినట్లు విని ....మనసును స్వాంతన పరచుకుని....వేరే కంపెనీ లో చేరడానికి ఆరు నెలలు పట్టింది.
నా పని నేను చేసుకుంటూ...బిజీ అయ్యాను. రెండేళ్లు గడిచిపోయాయి. కృష్ణ మీద క్రానికల్ ఆఫ్ ఇండియా లో ఆర్టికల్ వచ్చింది..."యంగ్ ఎంటర్ప్రెన్యుర్ " అంటూ పొగడ్తల్లో.... కెరీర్ ఓరియెంటెడ్ అనుకున్నాను.
ఒక సాహిత్య సభ కు వెళ్ళినప్పుడు నా స్నేహితుడికి స్నేహితుడు వైష్ణవ్ పరిచయం అయ్యాడు. నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుని తను ఏర్పోట్ లో ఇంజనీర్ అంటూ ..."మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీకు ఇష్టమైతే ... మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను" అనగానే ఏమనాలో తెలియక తల ఊపాను. మాకు పెళ్లి అయ్యి ఏడాది అయ్యింది. ప్రశాంతంగా ఉంది. మా ఇద్దరికీ హాబీస్ కలవక పోయినా మనసులు కలిశాయి. అతను నా సోల్ మేట్ కాదు కానీ నా లైఫ్ మేట్.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు