పూర్వం ధర్మపురి రాజ్యాన్ని దయానిధి అనే రాజు పరిపాలించే వాడు. రాజు తన పేరుకు తగ్గట్టుగానే ఎవరైనా తప్పు చేస్తే శిక్షించకుండా దయతో క్షమాభిక్ష పెట్టేవాడు. తప్పు చేయడానికి గల కారణాన్ని తెలుసుకొని.. అవసరమైతే ధనసాయం చేసే వాడు. ఇకముందు అలాంటి తప్పు చేయకుండా మసలుకొమ్మని హితవు చెప్పే వాడు. మొదటిసారి తప్పు కనుక క్షమిస్తున్నానని.. మరో సారి తప్పు చేస్తే.. కఠినంగా శిక్షిస్తానని భయపెట్టేవాడు. కాని ఎప్పుడూ మొదటి సారిగా నేరం చేసిన వాడు తిరిగి నేరం చేసి రాజసభకు రానూలేదు. శిక్ష విధించిన సందర్భాలూ లేవు.
నేరం చేస్తే శిక్షించాల్సిందేనని.. అలా వదిలేయడం రాజధర్మం కాదని మంత్రి మదనుడు ఎంతగానో చెప్పి చూసాడు. కాని దయానిధిలో మార్పు రాలేదు. తప్పు చేసిన వారిలో మానసికంగా మార్పు తీసుకురావాలే తప్ప శిక్షించడం ఒక్కటే పరిష్కారం కాదని దయానిధి నమ్మకం. అతని నమ్మకం నిజమే అన్నట్టుగా రాజ్యంలో నేరాలు ఎక్కువగా జరిగేవి కావు.
అంత దయ కలిగిన మహారాజుకు సంతానం కలుగడం లేదని ప్రజలు బాధ పడేవారు. రాజ్యానికి వారసుని కోసం పూజలు చేసే వారు. కొన్నాళ్ళకు వారి పూజలు ఫలించాయి. ఒక శుభముహూర్తాన రాజదంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది.
రాజదంపతులు వేదపండితులతో తమ కుమారునికి విజయుడు అని నామకరణం చేయించారు. విజయుని భవిష్యత్తు బాగుంటుందని జ్యోష్యులు చెప్పారు. ఎందుకు బాగుండదు.. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు శాపాలవుతాయి. కాని తాము ఏపాపమూ ఎరగకుండా ప్రజల సేవలో తరిస్తున్న వాళ్ళం. తమ మంచి తనమే తనయుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని వారి విశ్వాసం.
విజయుడు తడబడకుండా అడుగులతో నడుస్తూ ఉంటే రాజదంపతులు ఎంతగానో మురిసి పోయారు. కాని ఆ మురిపెం ఎంతో కాలం నిలువలేదు. విజయుని విద్యాభ్యాసాల అనంతరం ఆరోగ్యం క్రమమేణా క్షీణించ సాగింది. పట్టాభిషిక్తుడవుతాడనుకున్న సమయంలో విజయుడు మంచానికి అతుక్కు పోవడం రాజదంపతుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. రాజవైద్యులు పెదవి విరిచారు.
అయినా దయానిధి ధైర్యం వీడలేదు. మారు వేషంతో రాజ్యంలో తిరుగుతూ విజయుడు అలా కావడానికి కారణాలను ఆరాతీయసాగాడు. చివరికి అసలు రహస్యం తెలుసుకోగలిగాడు. దానిని రాజసభలో ప్రకటించాలను కున్నాడు. అదే విషయాన్ని రాజ్యమంతా చాటింపు వేయించాడు.
ఆమరునాడు రాజసభ రాజప్రతినిధులతో, ప్రజాప్రతినిధులతో కిక్కిరిసి పోయింది. అంతా రాజు ప్రకటన కోసం ఆతృతగా ఎదురి చూడసాగారు. దయానిధి సభలో అడుగు పెట్టగానే కొద్ది సేపు జయ, జయ ధ్వనులు మిన్నంటాయి. ఆ తరువాత అంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు. దయానిధి గొంతు సవరించుకొని..
“ప్రియమైన ప్రజలారా.. ముందుగా ఒక శుభవార్త చెబుతాను” అనగానే సభయావత్తు ఆహ్లాదమయ మయ్యింది. దయానిధి సభ నలువైపులా కలియ జూసి.. “యువరాకు విజయునికి ప్రాణాపాయం తప్పింది. త్వరలో పూర్తిగా కోలుకొని రాజ్యాధికార చేబడతాడు” సభలోని వారంతా లేచి నిలబడి యువరాజుకు జేజేలు పలికారు. కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తపర్చారు.
“అయితే యువరాజు అలా శుష్కించి పోవడానికి కారణం ఏమిటని ఆరాతీసాను. యువరాజు విద్య అభ్యసించిన చోటనే ఈఘోరానికి బీజం పడిందని.. ఆప్రాంతం లోని ఒక మహాముని ద్వారా తెలిసింది. నా పరిపాలనా దక్షత తెలిసిన ఆమునివర్యుడే తరుణోపాయం చెప్పి వనమూలికలతో ఔషధం తయారు చేసిచ్చాడు. యువరాజును గూడా నామార్గంలో నడిపించమని హితబోధ చేసాడు. ఆఘాతుకానికి పాల్పడింది ఎవరో ఈ సభలోనే ఉన్నాడు. నేను ప్రకటించక ముందే వచ్చి సభకు తెలుపాలని ఆదేశిస్తున్నాను”
సభ సాంతం విస్మయానికి గురయ్యింది. ఎవరా పాపాత్ముడని అందరి తలలూ.. ఊగిసలాడాయి.
మహామంత్రి మదనుడు రెండు చేతులు జోడించి నిలబడగానే సభ యావత్తు నిర్ఘాంత పోయింది. దయానిధి చిరునవ్వు నవ్వుతూ.. “ఆమాత్యా.. మీరెందుకు దోషిలా నిలబడుతారు. అసలు దోషిని ముందుకు రమ్మనండి” అనగానే సభ మరింత ఆశ్చర్యానికి లోనయ్యింది. అసలు దోషి ఎవరు? వస్తున్నాడా! అన్నట్టుగా సభలోని వారంతా అటూ ఇటూ చూడసాగారు.
“మహారాజా.. మన్నించండి. నాపెంపకం, ఆలోచనా సరళివల్ల నాకుమారున్ని నేడు దోషిగా మీ ముందు నిలబెడుతున్నాను” అంటూ ఉండగా మంత్రి కుమారుడు కుశాలుడు తలదించుకొని సభ ముందుకు వచ్చాడు.
“మంత్రివర్యా.. కుశాలుడు అంటే నాకు చాలా ఇష్టం. విజయునికి మంత్రిగా నియమిద్దామనుకున్నాను. కాని కుశాలుడు మన పొరుగు రాజు కుయుక్తులకులోనై ఈరాజ్యానికే రాజు కావాలని పథకం వేశాడు. విజయునిపై గురుకుల ఆశ్రమంలో విషప్రయోగం చేశాడు. రాజధర్మంలో పర, తమ భేదాలు ఉండొద్దని.. నేరం చేస్తే కన్నకొడుకైనా శిక్షించాల్సిందేనని మీరే అంటారు. ఇంత ఘోరానికి ఒడిగట్టిన కుశాలున్ని ఏంచేయాలో చెప్పు” అంటూండగా కుశాలుడు మొదటిసారిగా తప్పు చేశాను. ఇకముందు బుద్ధిగా మసలుకుంటాను క్షమించమన్నట్టుగా.. రాజు పాదాలపై తల ఆన్చి భోరుమని ఏడ్వసాగాడు. కుముదుడు సందిగ్ధంలో పడిపోయాడు.
ఏదైనా తనదాకా వస్తే గాని తెలియదని.. కుముదుని వంక ప్రశ్నార్ధకంగా చూడసాగాడు దయానిధి. *